నవ్యాక్షరం: ‘స్మరణ’ కథ

 

స్మరణ

-రాజు యెదుగిరి

సాయంత్రం ఐదు గంటలైంది. ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి బయలుదేరాను. బండి తీసి గేటు దాటి బయటకు వచ్చాను. అంతే, ఇక కష్టాలన్నీ మొదలయ్యాయి. సిటీలో ఆఫీసు నుండి ఇంటికి వెళ్లాలంటే రోడ్డుపై మినీ యుద్ధమే చేయాలి. భుజానికి బ్యాగు తగిలించుకుని పంజాగుట్ట నుండి ఇంటికి బయలుదేరాను. రోడ్డుపై కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేదు, అంత రద్దీగా ఉంది. బస్సుల నుండి వచ్చే పొగతో నా ముఖం నల్లగా మారిపోయింది. ఎలాగోలా బస్సును దాటి ముందుకు వెళ్లాను. కానీ ఎంత ముందుకెళ్లినా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర సమయం వృథా అయిపోయింది. సిగ్నల్ పడగానే ఇక బండి ఎక్కడా ఆపకూడదని నిర్ణయించుకుని, నేరుగా ఇంటికి చేరుకున్నాను. వెళ్లగానే మా వాచ్‌మెన్ గేటు తీశాడు. బండిని అపార్ట్‌మెంట్ పార్కింగ్ లాట్‌లో పార్క్ చేసి తాళం చెవి తీసుకుని లిఫ్ట్ దగ్గరకు వచ్చాను. ఎంత నొక్కినా లిఫ్ట్ కిందకు రావడం లేదు. పది నిమిషాలు వేచి చూసినా అది కదలలేదు. చేసేదేమీ లేక, బ్యాగును భుజానికి తగిలించుకుని మెట్ల వైపు నడిచాను. మెట్లు ఎక్కుతుండగా, మా ఎదురింటి కృష్ణ కుమార్ ఎదురయ్యాడు.

“ఏమండి మోహన్ రావు గారు, ఆఫీసు నుండి వస్తున్నారా?” అని ఎగతాళిగా అన్నాడు.

“ఏమండి కృష్ణ గారు, దాదాపు ఐదేళ్లుగా ఈ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాను. మీరు పదేళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. రోజు ఈ సమయానికి ఆఫీసు నుండి కాకుండా ఇంకెక్కడి నుండి వస్తానండి? నా భుజానికి ఉన్న బ్యాగు చూసి కూడా అడుగుతారేమిటి!” కాస్త గట్టిగానే అడిగాను.

“అయ్యో, ఎందుకండీ అంత కోపం? నేనేమన్నానని? మీ కోపం నాపై రుద్దుతున్నారు,” అని వికటంగా అన్నాడు కృష్ణ కుమార్.

“కోపం కాదండీ, బాధ. ఉదయం పది గంటల నుండి మా బాసూ, ఆ తర్వాత ఆఫీసులో మా అసిస్టెంట్, ఇప్పుడు మీరు, ఏమిటీ ప్రశ్నలు?”

“సరేలెండి, ఒక సహాయం చేస్తారా?” అని వినయంగా అడిగాడు. వినయంగా అడిగినప్పుడు కాదనడం బాగోదని, “ఏమిటా సహాయం?” అడిగాను.

“ఏమీ లేదండీ, మా ఆవిడ శెనగపప్పు తెమ్మంది, కానీ నేను మర్చిపోయి కందిపప్పు తెచ్చాను. ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎక్కి, అక్కడ సరుకులన్నీ పెట్టి, మళ్లీ కిందకు దిగాలంటే చాలా సమయం పడుతుంది. మీరు ఎలాగూ పైకే వెళ్తున్నారు కదా, ఈ సరుకులు మా ఇంటి ముందు పెట్టేస్తారా?” అని మెల్లగా అన్నాడు. నేను ఇప్పటికే ఆఫీసు నుండి నానా ఇబ్బందులు పడి వచ్చాను. ఇప్పుడు ఈ అదనపు కష్టం వచ్చి పడింది. కానీ చేసేదేమీ లేదు, ఎదురింటివాడు. రేపు ఏ చిన్న పని ఉన్నా ముఖం చాటేస్తాడు అనుకుని, “సరేలెండి, ఇవ్వండి.” అని సరుకుల సంచి తీసుకున్నాను. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సంచి నా చేతికిచ్చి వెళ్లిపోయాడు కృష్ణ కుమార్. నా బ్యాగు భుజానికి వేసుకుని, ఒక చేత్తో సరుకుల సంచి పట్టుకుని, చెమట తుడుచుకుంటూ మెట్లు ఎక్కి చివరికి మా ఐదవ ఫ్లోర్‌కు చేరుకున్నాను. ఆ సరుకుల సంచిని ముప్పై రెండవ నంబర్ డోర్ ముందు పెట్టి కాలింగ్ బెల్ కొట్టాను. ఎవరూ రాలేదు. మళ్లీ కొట్టాను, శబ్దం కూడా లేదు. చిరాకేసి తలుపు గట్టిగా కొట్టాను. అప్పుడు “వస్తున్నా” అన్న అరుపు వినిపించింది. మంగ తాయారు, కృష్ణ కుమార్ గారి భార్య, వచ్చి తలుపు తీసింది.

“ఏమిటండీ ఇలా వచ్చారు?” తలుపు తీసి అడిగింది.

“నాకేం పని పడి రాలేదమ్మా. ఇదిగో, మీ ఆయన ఈ సరుకుల సంచి మీకిమ్మన్నాడు.” చిరకులో ఉండి అన్నాను.

“అయ్యో, మీరే తెచ్చారా? మా వారెక్కడ?” గుమ్మంలోంచి మెట్లవైపు తొంగి చూస్తూ అంది.

“మీరు శెనగపప్పు తెమ్మంటే కందిపప్పు తెచ్చాడంట, మార్చుకురావడానికి వెళ్లాడు. ఇదిగోండి ఈ సంచి తీసుకోండి.” అని ఆ సరుకుల సంచి అక్కడ పెట్టి ఎదురుగా ఉన్న నలభై రెండవ నంబర్ డోర్ కొట్టాను. వెంటనే తలుపు తీసింది విజయలక్ష్మి, నా భార్య. “అక్కడ కాలింగ్ బెల్ స్విచ్ ఉండగా తలుపు బాదడమెందుకు?” అంది. “ఏదో తొందరలో కొట్టానులే.” అని లోపలికి వెళ్లి నా బ్యాగు అక్కడ పెట్టి కూర్చున్నాను. అడగకుండానే విజయ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. తాగేసి, షూలు విప్పాను. కాసేపు అలా కూర్చోగానే ప్రశాంతంగా అనిపించింది.

“అబ్బాయి ఫోన్‌చేసాడా?” అడిగాను.

“లేదండీ, మీరేం భయపడకండి. అంత బానే జరుగుతుంది.” తనకి కూడా మనసులో ఎక్కడో భయం ఉంది. నా టెన్షన్ చూడలేక అలా చెప్పింది.

లేచి స్నానం చేసి ఫ్యాను వేసుకుని కుర్చీలో కూర్చున్నాను. కాసేపయ్యాక విజయ టీ తెచ్చి ఇచ్చింది. అది తాగి వంటగదిలోకి వెళ్లాను. విజయ ఏదో పని చేసుకుంటోంది.

“విజయ, ఏం కూర వండుతున్నావు?” అడిగాను.

“ఏం వండాలో చెప్పండి.” చూడకుండానే అడిగింది.

“బంగాళాదుంప ఫ్రై, కొంచెం చారు చేయి.”

“సరే, ఇంకేమైనా కావాలా? టమాటా ముక్కలు కోశాను, ఈరోజు టమాటా కూర వండుతాను.”

“సరేలే, ఏం చేస్తాం? నీకు కొడుకులు పుట్టిన తర్వాత ఇంట్లో నా మాట ఎవరు వింటారు!” అన్నాను.

“చాల్లే, వెళ్లి కూర్చోండి.” అంది. నేను నవ్వుతూ హాల్‌లోకి వెళ్లాను. టైమ్ ఎనిమిది అయింది. కాసేపు టీవీ చూద్దామని టీవీ ఆన్ చేశాను. జెమినీలో ఏదో సీరియల్ వస్తోంది. వెంటనే ఛానెల్ మార్చాను. న్యూస్ ఛానల్లో ఏదో పనికిరాని రాజకీయాల డిబేట్ నడుస్తోంది. ఆ పనికిరాని సోది వినడం కంటే ఖాళీగా ఉండడం మంచిదని అనుకున్నాను. ఇంతలో “ఏవండీ, ఈటీవీ పెట్టండి, టైమ్ ఎనిమిదిన్నర అవుతోంది. ‘మూగ మనసులు’ సీరియల్ వస్తోంది.” అని వంటగది నుండి అరుస్తూ హాల్‌లోకి వచ్చింది విజయ. “ఆ రిమోట్ ఇటు ఇవ్వండి.” అని నా చేతిలో నుండి రిమోట్ లాక్కుంది. “విజయ, ఇంక తిందామా?” అన్నాను. వెంటనే విజయ అన్నీ తెచ్చి హాల్‌లో పెట్టింది. చేతులు, కాళ్లు కడుక్కుని తినడానికి కూర్చున్నాను. ఇద్దరం కలిసి తిన్నాం. ఈరోజు చాలా అలసిపోయాను. తినగానే నిద్రొచ్చింది, వెళ్లి పడుకున్నాను.

బాగా అలిసిపోయినందుకేమో, అర్థరాత్రి ఒక్కసారి కూడా మెలకువ రేదు. తెలీకుండానే తెల్లారింది, సూర్యుడు మా గదిలోకి రాడు ఆయనకి సిగ్గో, కోపమో తెలీదు. నేనే వెళ్ళి అయన్ని దర్శించుకోవాలి. ఒకటే ఉక్కపోత. దుప్పటి తీసి చూస్తే ఫ్యాన్ తిరగడం లేదు. స్విచ్ వైపు చూస్తే వేసే ఉంది. కరెంటు పోయిందని అర్థమైంది. లేచి బాల్కనీలోకి వెళ్లాను. నల్లటి మబ్బులు తెల్లగా మారుతున్నాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆ వెచ్చటి సూర్య కిరణాలు తాకుతుంటే అక్కడే కూర్చోవాలనిపించింది. కాసేపయ్యాక లేచి ముఖం కడుక్కుని హాల్‌లోని కుర్చీలో కూర్చున్నాను. టీ తాగి బజారుకు వెళ్లొచ్చి స్నానం చేశాను. వరుసగా ఆరు రోజులు ఆఫీసులోనే గడిచిపోతుంది. ఇక ఒకే ఒక్క ఖాళీ రోజు ఆదివారం. ఆ రోజు కూడా నాకు నచ్చింది చేయకపోతే, ఈ ఉరుకుల పరుగుల జీవితానికి కాస్త విశ్రాంతితో పాటు అర్థం కూడా ఉండదు. నాకు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలంటే చాలా ఇష్టం. టైమ్ పదకొండు అవుతోంది. లేచి పైకి వెళ్లాను. ఉదయం బాల్కనీ నుండి వచ్చేటప్పుడు కళ్లజోడు అక్కడే పెట్టినట్లు గుర్తు. కానీ వెళ్లి చూస్తే అక్కడ లేదు. వెంటనే “విజయ, నా కళ్లజోడు చూశావా?” అని అడిగాను. “బాల్కనీలో కుర్చీలో ఉంటే కూలర్ పైన పెట్టాను చూడండి.” అన్న అరుపు వినిపించింది. వెళ్లి చూస్తే అక్కడే ఉన్నాయి. కళ్లజోడు తీసుకున్నాను. ముందు గది వైపు చూశాను. తాళం వేసిన తలుపులు కనిపించాయి. ఆ మూసిన తలుపులు చూడగానే కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ తలుపులు మూసి దాదాపు ఐదు నెలలైంది. అప్పటినుండి ఆ గది వైపు వెళ్లడం మానేశాం. అది మా నాన్నగారి గది, సత్యనారాయణ, మా నాన్న. కృష్ణా జిల్లాలోని వీర్లపాలెం హైస్కూల్లో తెలుగు టీచర్. దాదాపు ముప్పై ఏళ్లు టీచర్‌గా చేసి పదవీ విరమణ తీసుకున్నారు. మా నాన్నకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. అందరిలో నేనే చిన్నవాడిని. అందుకేనేమో నన్ను చాలా గారాబంగా పెంచారు. మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం. నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఒక్కసారి కూడా నాపై చేయి వేయలేదు. డిగ్రీ తరువాత నాకు విజయతో పెళ్లి చేశారు మా నాన్న. ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేశాం. పెద్ద అన్నయ్య మూడేళ్ల క్రితం గుండె జబ్బుతో చనిపోయాడు. చిన్న అన్నయ్య బెంగళూరులో ఉంటున్నారు. నేను హైదరాబాద్‌లో స్థిరపడ్డాను. అమ్మ నాన్న ఇద్దరూ ఊర్లోనే ఉండేవారు. రెండేళ్ల క్రితం మా అమ్మ చనిపోయింది. కళ్ల ముందే కొడుకు, భార్య చనిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. ఇక నాన్న ఒక్కడే ఉండడం నాకే నచ్చలేదు. హైదరాబాద్ తీసుకొచ్చాను.

మా నాన్న తనతోపాటు పాత రాగి చెంబులు, పాత మంచం, పుస్తకాలతో నిండిన అల్మరా తెచ్చుకున్నారు. మా నాన్నకు పుస్తకాలంటే చాలా ఇష్టం. ఒక అల్మరా నిండా పుస్తకాలే ఉండేవి. అరవై దాటాక ఆయన దినచర్య భలే అనిపించేది. పొద్దున్నే ఆరు గంటలకు లేచి పార్కుకు వెళ్లేవారు. వచ్చాక స్నానం చేసి దేవుడికి పూజ చేసేవారు. తిన్నాక ఏదో ఒక పుస్తకం తీసి చదివేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత కాసేపు పడుకుని, సాయంత్రం మా అపార్ట్‌మెంట్ పైకి ఎక్కి ఆకాశాన్ని, పక్షులను చూస్తూ కూర్చునేవారు. మళ్లీ ఎనిమిదింటికి భోజనం చేసి పడుకునేవారు. పిల్లలతో చాలా హుందాగా ఉండేవారు. పక్కింటి వాళ్లతో కూడా ఎంతో మర్యాదగా, ఆప్యాయంగా ఉండేవారు. అలా దాదాపు మూడేళ్లు సంతోషంగా గడిపారు. అరవై ఆరేళ్లు కులాసాగా బతికి, గోలీ మందు వాడకుండా ఆరు నెలల క్రితం చనిపోయారు. చాలా బాధేసింది. నిర్జీవంగా పడుకున్న మా నాన్నను చూసి గుండెల్లో కొండంత బాధ ఉన్నా కళ్లలో నుండి ఒక్క నీటి బొట్టు కూడా రాలేదు. కానీ రేపటి నుండి నాన్న ఉండడు, ఇక కనబడడు అన్న బాధ క్షణక్షణం కృంగదీసింది. నేరుగా వీర్లపాలెం వెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేసి దశదిన కర్మలు పూర్తి చేసుకుని బాధతో హైదరాబాద్ వచ్చేశాం. కానీ రెండు నెలలు నేను మనిషిని కాలేదు. ఎక్కడ చూసినా నాన్నే. అన్నం తింటున్నా, పడుకున్నా, బయటకు వెళ్లినా నాన్నే కనిపించేవారు. అలా చాలా రోజుల తర్వాత బాధను గుండెల్లోనే ఉంచుకుని తేరుకుని మళ్లీ ఉద్యోగం వైపు మనసు మళ్ళించాను.

ఈరోజే మళ్లీ నాన్న గది వైపు చూశాను. అప్పుడు గుండెల్లో బాధ కమ్ముకుని కళ్లలోంచి నీళ్లు మెల్లిగా కిందకి జారాయి. కళ్లజోడు పెట్టుకుని తాళం తీసి మా నాన్న గదిలోకి వెళ్లాను. మంచంపై కూర్చున్నాను. మా నాన్న జ్ఞాపకాలన్నీ కళ్లముందు తిరుగుతున్నట్టు అనిపించింది. మా నాన్న కండువా తీసి భుజంపై వేసుకున్నాను. కాస్త బరువుగా అనిపించింది. మా నాన్న నా భుజం తట్టినట్టు అనిపించింది. ఆయన అల్మరా దగ్గరకు వెళ్లి తెరిచి చూశాను. పుస్తకాలన్నీ దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. తీసి శుభ్రం చేశాను. అందులోంచి ఒక పుస్తకం తీశాను. అది ముట్టుకోగానే మా నాన్న చేయి తాకినట్టే అనిపించింది. ఒక్కో పుస్తకం చదువుతుంటే మా నాన్న నాకు చెప్పిన చదువు, ఉపనిషత్తులు, నడవడిక గుర్తురాసాగాయి. లేచి గది అంతా శుభ్రం చేశాను. మా నాన్న వాచ్ తీసి నా చేతికి పెట్టుకోగానే ఆయన టివి ఒక్కసారిగా నాకు వచ్చినట్టుగా అనిపించింది. ఈరోజు మా నాన్న గదిలోనే పడుకోవాలి అనిపించింది. విజయ, నేను భోజనం చేసి గదిలోకి వచ్చాం. నాన్నను తలుచుకుని ఆయన మంచంపై పడుకున్నాను. ఏదో తెలియని హాయి మనసుకి తాకింది. అక్కడ పడుకోగానే నా చిన్నప్పటి జ్ఞాపకాలు, చదువుకున్న రోజులు, ఉద్యోగం కోసం పడ్డ కష్టాలు, మా నాన్న చెప్పిన మాటలు, ఆయన ఇచ్చిన ధైర్యం గుర్తొచ్చాయి. ఎంతో సంతోషంగా అనిపించింది. అలా పడుకోగానే ఆయన కౌగిలించుకున్నట్టు అనిపించింది. అలాగే కనురెప్ప తెరవకుండా ఆయన జ్ఞాపకాలతో ఉదయం ఆరు గంటల దాకా పడుకుండిపోయాను. లేచేసరికి ఫోన్ మోగుతోంది. తీసి చూస్తే అశోక్, నా కొడుకు. లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ ఉద్యోగమా చేస్తున్నాడు. పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు.

ఫోన్ లిఫ్ట్ చేశాను.

“హలో, నాన్నా! లేచావా?” గొంతులో సంతోషం స్పష్టంగా తెలుస్తోంది.

“ఆ, లేచానురా.” అన్నాను.

“నాన్నా, అబ్బాయి పుట్టాడు. ఇప్పుడే ప్రియా డెలివరీ అయింది.” అనగానే పట్టలేని సంతోషం కలిగింది.

‘నాన్నా’ అని మనసులోనే స్మరించుకుని, గోడ మీద ఉన్న నాన్న ఫోటో చూస్తూ కాసేపు అలానే ఉండిపోయాను. తేరుకుని ఫోన్ పట్టుకుని నవ్వుతూ వంటగదిలోకి వెళ్లి విజయకు విషయం చెప్పాను. విజయ ఆనందానికి అవధులు లేవు.

“ఇంకే, మీ నాన్న ఇకపై మీ కళ్ల ముందే అల్లరి చేస్తాడు.” అంది నావైపు చూస్తూ.

ఆనంద భాష్పాలతో విజయని కౌగిలించుకున్నాను. వీసా, టిక్కెట్లు తీసుకొని పట్టరాని సంతోషంతో ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరాము.

 

రచయిత వివరాలు : 

Email: rajuyedugiri@gmail.com
Instagram: i_rajuyedugiri
Facebook: Raju Yedugiri

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading