మనిషిగా పుట్టడానికి చనిపోవడానికి నడుమ మనిషిగా బ్రతకడం చాలా కష్టం. కట్టుబాట్లతో మనసుకి సంకెళ్లు తొడుక్కొని మనిషిగా బతకలేని అనేక మంది జీవితాలనీ, వాళ్ల కష్టాలనీ చూసి చలించిపోయి తన సాహిత్యంలో అనేక పాత్రలతో ఎందరికో స్వేచ్ఛా రెక్కలు తొడిగిన రచయితగా చలంగారు తెలుగు సాహితీవనంలో ఎప్పటికీ గుర్తుండిపోతారు.
చలంగారి జీవితమూ, సాహిత్యమూ అంటూ వేరు వేరుగా లేదు. ఏ దాపరికం లేని జీవితం చలంగారిది. కాలానుగుణంగా ఆయన వయసుతో, అనుభవాలతో జీవితంలో లాగే, ఆయన రచనల్లో కూడా ఎంతో పరిణతి, మార్పులు వచ్చాయి. ఎటు తిరిగి సమాజంతో రాజీ పడలేని జీవితంలో కలిగే ఆలోచనలు, ఆశయాలతో పాటు స్త్రీలు బయటికి చెప్పుకోలేని ఎన్నో సున్నితమైన భావాలకీ, భావోద్వేగాలకీ అన్నిటికీ అక్షరరూపం ఇస్తే చలం సాహిత్యం. ఇంతేనా ఇంకేం లేదా…. ఉంది.
రంగనాయకమ్మ గారితో ఆయన వైవాహిక జీవితం. రవి, సౌరిస్, వసంత్, నిర్మలతో పాటు చిత్ర, నర్తకి పట్ల ఆయన అనురాగం, ఉపాధ్యాయుడిగా బదిలీలతో అనేక ఊర్లు తిరిగిన ఆయన ఉద్యోగం, సహ ఉద్యోగి చింతా దీక్షితులు గారితో ఆయన అనుబంధం, మొక్కపాటి రామ్మూర్తితో 10 ఏళ్ల పాటు సాగిన స్నేహం, ఆయనకి పిల్లలు, ప్రకృతి, పక్షులతో ఉన్న మమేకం, ఎవరూ అర్థం చేసుకోలేని ఆయన సున్నితమైన మనస్సు, ఎవరికీ చెప్పుకోలేని ఆయన మనోవేదన. అన్నిటినీ మించి ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రేయసులు.. రత్తమ్మ, అబ్బాయమ్మతో ఆయనకి ఉన్న సంబంధం. సమాజం విధించిన ఆంక్షలు పట్ల ఆయనకి కలిగిన విరక్తి. ఆస్తికం నుంచి నాస్తికత్వం , నాస్తికత్వం నుంచి విముక్తి. ఆఖరిగా శివుడు యందు ఉన్న ఏ మూఢత్వం లేని భక్తి. మనిషి నుంచి మహర్షిగా ఆయన ప్రయాణం ఇవన్నీ కలిపితే చలం జీవితం.
మొదట స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్రాల కోసం అనేక రచనలతో సంఘంలోని ద్వంద్వత్వాన్ని, మూఢత్వాన్ని ప్రశ్నించారు చలం గారు. బ్రహ్మసమాజంలో చేరాక, ఒక సందర్భంలో చలం గారు యజ్ఞోపవీతం, రంగనాయకమ్మ గారు తాళిబొట్టు తీసేసి కులం లేని వారిగా బతకడం వల్ల, వారు సమాజం నుంచి వెలివేయబడి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలా ఎన్నో మలుపులతో 1921 నుంచి 50వరకు నిరంతరం జ్వలించిన సంచలనాత్మక రచయిత. ఆయన భావాలను అర్ధం చేసుకోలేని ఎంతో మంది విమర్శించినా, సమాజాన్ని నగ్నంగా నిలబెట్టిన వ్యక్తిగా ఆయన (ఆయన రచనలు కూడా)దేనికి చలించలేదు. శ్రీశ్రీ గారు అన్నట్టు ‘చలం చర్చించింది సెక్స్ సమస్య కాదు స్వతంత్ర సమస్య’.
చలంగారి జీవితంలో పెద్ద కొడుకు రవి మరణం ఆయన్ని మానసికంగా బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత చింతా దీక్షితులు గారితో రమణాశ్రమ ప్రయాణం మొదటిసారి సాగింది. అక్కడ భగవాన్ ఆకర్షణకు, నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధాన అన్వేషణలో శాంతి దొరుకుతుందేమో అనే ఆలోచనతో సాధన మొదలు పెట్టారు. శాంతి కోసం అన్వేషణ లో పూర్తిగా భగవాన్ని విశ్వసించారు. శాశ్వతంగా తిరువణ్ణామలై వెళ్ళే 10 ఏళ్ల ముందు భగవాన్ పాదాల ముందు దివాన్ అనే పుస్తకాన్ని రచించారు.
నా దృష్టిలో, చలంగారి పుస్తకాలు బుద్ధిని సంస్కరించడం కంటే ఆత్మని సంస్కరించడానికి ఎక్కువ ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా మైదానం, స్త్రీ, చదివి చెడిపోయిన వారు ఉన్నారు అనే నానుడి ఎన్నో దశాబ్దాలుగా వస్తుంది కానీ, అలాంటి వ్యక్తులు ఇప్పటివరకూ ఎవరి కంట పడలేదు. బహుశా చలంగారి కంట కూడా పడి ఉండరు. సిద్ధాంతాల కంటే స్వీయ అన్వేషణే ఆయన ప్రధాన లక్షణం. ఒకవేళ చెడిపోయినవారు కంటపడి ఉంటే ఎప్పుడో ఆయన రచనలు చేయడం ఆపేసి ఉండేవారేమో.
ఆయన రచనల్లో ‘మ్యూజింగ్స్’ అనే ప్రక్రియ చాలా ప్రత్యేకం. ఆ రచన అరుణాచలం వెళ్ళక ముందు ప్రారంభించి, అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి చేసి, వాటిని పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. ‘బుజ్జిగాడు‘ అనే గోరింక దినచర్య కూడా ఎంతో ఆసక్తికరంగా రాశారు. ‘ప్రేమలేఖల్లో’ ఆయన శైలి, నాటికలు, నవలలు, కథలు, వ్యాసాలు ఇలా తదితర ప్రక్రియల్లో ఆయన తీవ్రతని వ్యక్తపరిచారు. ఎన్నో వ్యతిరేక విబేధాల జీవితంలో ఎవరితోనూ పంచుకోలేని ఆయన మనోవేదనే ఇన్ని రచనలకి పునాది వేసింది.
రంగనాయకమ్మ గారి జీవితం అంతా విషాదాల వలయం. స్త్రీ తరపున ఇంత పోరాడిన చలం గారి భార్య, చివరి రోజుల్లో ఎంత క్షోభ భరించారో! పాపం మతిస్థిమితం కోల్పోయి కొన్నాళ్లు భగవాన్ రమణాశ్రమానికి వెళ్లిపోయారు.
‘స్త్రీ పురుషులకి రక్తము మాంసము హృదయము ఉన్నంత కాలం చలం గారి పుస్తకాలు ఉంటాయి.’ అని రామ్మూర్తి గారి ప్రగాఢ నమ్మకం. కానీ ఇప్పుడు ఏదైనా ఒక్క రచన చదివి లేదా ఒక్క జీవిత సంఘటన గురించి విని, చలం గారి మీద ఒక అభిప్రాయం ఏర్పర్చుకుంటున్న పాఠకులని చూసి చలం గారు రాసుకున్న మాటలు గుర్తొస్తున్నాయి,
“కళ అనేది తన ఆత్మ ఔన్నత్యానికై తపించే సాధనంగా కాక ప్రజలకి ఆహ్లాదకరమైన వినోదం అయిపోయింది.”
అనుభవాలే జీవితంగా బతికిన చలం గారు 1950లో ఇన్నాళ్లు దేనికోసం ఇంత పోరాడారో, అదంతా వదిలేసి అరుణాచలం వెళ్ళిపోయి, ఈశ్వర అన్వేషణలో ఆయన్ని ఆయన వెతుక్కుంటూ, 1979లో జీవితాన్ని అరుణాచలంలో పరమపదించారు.
మనసుకి ముసుగు వేసుకొని… నీతి నిజాయితీ గురించి మాట్లాడుతూ, గౌరవంగా బతుకుతున్నాను… అనుకునే వారి మధ్య, నిక్కచ్చిగా ఇలాగే బతికాను అని ఒప్పుకోవడానికి ఎంతో ఉన్నతమైన స్థితి కావాలి. అందులోనూ శాశ్వతమైన తన రచన ద్వారా ఆయన జీవితాన్ని తెలియజేసిన చలం గారితో ఎవరు ఏకీభవించినా, లేకపోయినా ఆయన రచనలూ, ఆయన జీవితమూ తెలుగు సాహితీ ప్రపంచంలో నిలిచిపోయాయి. వంద ఏళ్ళైనా ఇప్పటికీ ఎక్కడో ఎవరో ఒకరు చలం రచనలని చదువుతూ, ఆయన ఆలోచనలని పలకరిస్తూనే ఉన్నారు. చిరంజీవిగా అదే చలం గారికి ఘనమైన నివాళి.
అభిమానంతో,
ప్రమీల









May i know who wrote this ? I am working on a project regarding chalam , looking for teammates
ఈ వ్యాసం ప్రమీల గారు రాసారు అండి. ఆవిడ, సోషల్ మీడియాలో పెద్దగా అందుబాటులో ఉండటం లేదు.
“ఒక స్త్రీ మనస్సును చలం గారు అర్థం చేసుకున్నంతగా మరెవరూ అర్థం చేసుకోలేరేమో”…
చలం గారి రచనలు చదువుతుంటే నాకు ఇలానే అనిపిస్తుందండి.
పైన మీ మాటలు చలం గారి గొప్పతనాన్ని, ఆయన పై మీకున్న ప్రేమను చాలా అందంగా తెలియజేస్తున్నాయి.