ఆరోజు సాయంత్రం ఇంట్లో ఏమీ తోచక అలా ఆర్కే బీచ్ వరకు వెళ్లొద్దామని లేచి, పక్కనే ఉన్న టీ టైంలో ఒక కాఫీ తాగి ఒక్కడినే అనాలోచితంగా నడుస్తున్నా. బీచ్ అంతా కోలాహాలంగా ఉంది. అందరికీ దూరంగా ఒక ప్రశాంతమైన చోటు చూసుకొని కూర్చుందాం అని, బీచ్ లో నడుస్తూ ఒక్కసారిగా ఆగిపోయా. దానికి కారణం దూరంగా నాకు కనపడిన ఒక జంట.
అదేంటో నిన్న పూర్తి చేసిన ‘మరో మహాత్మ’ నవల్లో చదివిన శ్రీధర్ భాను లానే వారు కనిపించారు. ఇంతటి జన సందోహంలో ఎవరబ్బా పాత సినిమాల్లో హీరో హీరోయిన్లలా చక్కగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకుని, వారిని దాటుకుంటూ ముందుకు పోతుంటే ఇంకా ఆశ్చర్యం కలిగింది. నేను చదివినప్పుడు, ఊహించుకున్న శ్రీధర్ భానులే వాళ్ళిద్దరూ. ఇది నిజమా? నా భ్రమా? అని ఆలోచిస్తూనే వాళ్ళను దగ్గరగా చూశా.
ఇంతలో శ్రీధర్ గారు “రావయ్యా రమేష్ ఇలా కూర్చో.” అన్నారు. నేను ఆయనకు బాగా తెలిసినట్టు. నాకేం అర్థం కాలేదు, కానీ ఆయన పిలిచారని ఆశ్చర్యంగా వెళ్లి కూర్చున్నా. అప్పుడే భానుగారు కూడా,”ఏంటయ్యా ఒక్కడివే వచ్చావు అంతా కులాసాయేనా?.” అని పలుకరిస్తున్నారు. నేను అయోమయంలోనే ఉన్నా, ఇంకా ఒకసారి గిచ్చి చూసుకున్నా. అది నిజమే అనిపించింది. కానీ సందేహం ఇంకా తీరలేదు. నేను చదివిన కథలో పాత్రలు నన్ను పలకరించడం ఏమిటో!. అది కూడా బాగా కావాల్సినవాడిలా నాతో మాట్లాడటం ఏమిటో!. తల పటాయిస్తూ అడిగా మీరు నిజమేనా? ఇది ఎలా సాధ్యమని.
అప్పుడు శ్రీధర్ చెప్పడం మొదలుపెట్టారు, “మీకు ఈ ప్రపంచం ఎలానో, మాకు కూడా కథా ప్రపంచం అని సమాంతరంగా ఇంకో ప్రపంచం ఉంది. అక్కడ జనాభా ఈ భూమిని మించి ఉంది. ఇక్కడ రాయబడే పాత్రలన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ కూడా స్వర్గం, నరకం ఉంటాయి. అందులోనూ స్వర్గంలో ఉండగలిగే పాత్రలు, వారితో పాటు ప్రయాణం చేసే పాఠకులను కూడా చూసే అవకాశం ఉంది. వాళ్లకు బాగా నచ్చిన పాఠకుడిని ఒకసారి కలిసే అవకాశం కూడా ఉంటుంది.” అన్నారు. ఇలా చెప్పి నన్ను వాళ్ళిద్దరూ కలవడానికి వచ్చారని చెప్పారు.
ఆ అవకాశం నన్ను కలవడానికి ఉపయోగించుకున్నారని తెలిసి సంతోషం కలిగింది. అయినా ఉత్సుకతతో, “నన్ను మాత్రమే కలవడానికి ఎందుకు ఎంపిక చేసుకున్నారు?” అని.
అప్పుడు శ్రీధర్, “నాతో పాటు మా ఊరు గూడెం నుండి విశాఖపట్నం, ఆంధ్ర విశ్వవిద్యాలయం వరకు నాతోనే వచ్చావుగా, నా జ్ఞాపకాలను నీ మస్తిష్కంలో ఒక ప్రపంచంగా సృష్టించుకున్నావుగా, మరియు నా మిత్రులతో నువ్వు కూడా స్నేహం చేశావుగా, మందసలో జరిగిన అన్యాయాలకు నువ్వు ఏడ్చావుగా ,నా మిత్రులలానే నువ్వు కూడా ఆవేశపడ్డావుగా. నీకు తెలిసీ తెలియని సామాజిక, ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలను, తత్వాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశావుగా. అన్నింటికీ మించి నేను ఆలోచించిన రైటిజం నీకు బాగా అర్థమైందిగా, అదొక్కటే చాలు నేను నిన్ను కలవడానికి. అయినా చెప్తా విను ఇంకా ఉన్నాయి.” అంటూ,
“విశ్వవిద్యాలయంపై నీకూ, నాకూ ఒకే రకమైన అభిప్రాయాలు ఉన్నాయని కళ్ళు ఎగరేసావు చూడు, నేను గమనించా. అవన్నీ అర్థసత్యాలని తెలుసుకున్నప్పుడు బాధపడ్డాం కదా ఇద్దరం. అప్పుడు నన్ను, నీలో చూసుకున్నాను . నువ్వు నిన్ను నాలో చూసుకుంటున్నప్పుడు..”. అని చెప్తుండగానే, ఇంతలో భానుగారు, “నన్ను కొంచెం మాట్లాడనిస్తారా!?. నేను కూడా ఉన్నాను మర్చిపోకండి.” అని శ్రీధర్ గారితో అంటుంటే మళ్ళీ ఆగి వినడం మొదలు పెట్టా .
ఈసారి భాను గారు వంతు, “ఏమయ్యా మాతో పాటు అమ్మాయిలు హాస్టల్‌కి వచ్చేస్తావా?. మా కబుర్లని వినేస్తావా?. భయం లేదూ?” అంటే, నేను నవ్వి ,”మీరు చెన్నారెడ్డి గారిని అడగండి. ఆయనే కదా నన్ను మీ ప్రపంచంలోకి తీసుకువచ్చింది.” అన్నా.
ఆమె నవ్వుతూనే “సరదాగా అంటున్నానులే! విను. నా ప్రస్తావన వచ్చేసరికి ఎందుకు నీకు అంత కుతూహలం. నా ఆలోచనలను అర్ధం చేసుకుంటున్నావు సరే, మేమే చెప్పుకోలేని మా ప్రేమకథ పై నీకెందుకు అంత మక్కువ? ‘ఎందుకు మాట్లాడుకోవట్లేదు ఆ విషయం వీళ్ళు?’ అని ఎందుకయ్యా అంత గింజుకున్నావ్?. అందుకే అనుకుంటా, చెన్నారెడ్డి గారు మామిడి తోటలో మనసులు మాట్లాడే సందర్భం సృష్టించారు. అప్పటికి కానీ మా ఇద్దరికీ ఒక స్పష్టత రాలేదు. అన్నిటికీ మించి, మా కథలో స్వచ్ఛతను అర్ధం చేసుకున్నావ్ చూడూ, అక్కడే ఓ మెట్టెక్కేసావయ్యా!.”
“అది నాకు కాదు, అంత స్వచ్ఛమైన కథను రాసిన చెన్నారెడ్డి గారికి చెప్పండి” అని అన్నాను.
ఇంతలో శ్రీధర్ గారు వాచీ చూసుకుని భాను గారిని ఉద్దేశిస్తూ, “బస్ వచ్చే టైమ్ అయింది భాను.” అని. ఆమెను యూనివర్సిటీ బస్ ఎక్కించారు అచ్చం కథలోలానే. అదేమిటండీ అని అడిగితే అది అంతే అనేశారు ఏమీ పట్టనట్టు. తర్వాత అక్కడే మొక్క జొన్నపొత్తులు రెండు కొనుక్కుని ఇద్దరం తింటూ నడవటం మొదలు పెట్టాం. నడుస్తూ నడుస్తూనే ఒక చోట ఆగాం. ఏమైంది అని అడిగితే నేను భాను ఇక్కడే కూర్చునే వాళ్ళం అని ఆ ప్రదేశాన్ని చూపించారు. ఎన్ని సంభాషణలు ఎన్ని జ్ఞాపకాలు కదా ! అని అంటుంటే ఒక్క క్షణం చెన్నారెడ్డిగారి మీద మళ్ళీ కోపం వచ్చింది, “అలా ఎలా ముగిస్తారండీ వాళ్ళ కథను..?” అని అంటుంటే శ్రీధర్ గారి కళ్ళల్లో చిన్న కన్నీటి ధార మొదలవుతుండగానే ఆయన ముఖం తుడిచేసుకున్నారు.
మళ్ళీ కొంత దూరం నడిచాక మొదలు పెట్టారు, “యూనివర్సిటీలో ఇన్ని కుల రాజకీయాలు, ఇన్ని గొడవలు ఉంటాయా? అని ఆశ్చర్యపోయావు కదూ నేను కూడా ఎప్పుడు అనుకోలేదు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటానని. వాటన్నింటినీ దాటి, చదివిన చదువు ప్రజా శ్రేయస్సు కోసం కొంచెం ఉపయోగించాలని, అలానే తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశా. భాస్కర్ లాంటి స్నేహితుడు పరిస్థితుల రిత్యా, వేరే దారి ఎంచుకున్నప్పుడు ఎంత బాధ పడ్డానో నీకు తెలుసు కదా. సీతక్క విశాఖపట్నం వచ్చినపుడు నువ్వు అనుమానపడ్డట్టే జరిగింది కదా. ‘నువ్వు వద్దు శ్రీధర్’ అని అరిచావు అంటగా. నాకు వినపడలే నీ ఘోష. అంతా భాను కేమవుతుందో అని కంగారు, భయం చూశా నీ కళ్ళల్లో. ఎంత తిట్టుకున్నావు నన్ను, చెన్నారెడ్డి గారిని. ఈ పరిస్థితులను దాటి నా ఆలోచన ‘రైటిజం‘ ఒక కార్యరూపం దాల్చుతుందని ఎంత సంతోష పడ్డావు. మురళి, కార్తీక్‌ని నిజ ప్రపంచంలో ఒక నాయకుడు అనుకుని, ఆయన సాధించిన విజయాన్ని నీ విజయంగా ఎంత సంబరపడ్డావు. నా ఆలోచనలు కొన్ని అసాధ్యంగా అనిపించినా, భారతదేశంలో సమానత్వం ఇలా అయినా కుదిరిందని నువ్వు, నేను కలలుగన్న ప్రపంచం సాకారం అయిందని సంతోషపడితే, మళ్లీ అదే చెన్నారెడ్డిగారు ఇది కల మాత్రమే, నిజం కాదని నన్ను నా కలను అంతం చేసేసారని ఎంత ఆక్రోశం ఆవేదన చెందావు అవన్నీ చూసాం.” అంటూ అతను సంభాషణ కొనసాగిస్తూ, “కనీసం నువ్వైనా అది కల కాదని, నిజమైందని, నా ప్రాణం పోయినా నా కల మాత్రం నెరవేరిందని, నిజ జీవితంలో కూడా ఇది సాధ్యమవుతుందని చెప్తే వినాలని వచ్చాం చెప్తావు కదూ.” అని ఆయన అంటుంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు.
శ్రీధర్ గారిని కూర్చోబెట్టి, ఒక్క క్షణం ఆలోచించి, “రేపు సాయంత్రం మళ్ళీ ఇక్కడే కలుద్దాం అప్పుడు చెప్తా” అని చెప్పి వచ్చేశా. ఇంటికి వస్తూనే అల్మరాలో ముందు ఉన్న “మరో మహాత్మ” పుస్తకాన్ని అందుకొని, చెన్నారెడ్డి గారి ఫోన్ నెంబర్ ఉంటుందేమో అని ఆశగా వెతికా, కానీ దొరకలేదు. ఏం చేయాలో తోచక ఆఖరి పేజీ మళ్లీ చదివా. పూర్తయిన తర్వాత ఆఖరి పేజీని చింపేశా. ఇప్పుడు నేను సరికొత్త ముగింపు రాద్దామని నిర్ణయించుకొని కొత్త పేజీని అంటించి రాయడం మొదలుపెట్టా.
“శ్రీధర్ హాస్పిటల్లో ఉండగా వినబడిన శబ్దాలు తన ‘రైటిజం’ సిద్ధాంతం, దేశం నలుమూలల కార్యరూపం దాల్చిందని చేస్తున్న విజయోత్సవ వేడుకల నుండి వచ్చిన శబ్దాలని, ప్రక్కనే తనను గమనిస్తూ ఉన్న నర్సుల మాటలు విని హాయిగా కళ్ళు మూసుకుని భాను నీకోసం వస్తున్నా.. అంటూ వెళ్లిపోయారు.” ఇలా పుస్తకంలో రాశాను.
సాయంత్రం అవగానే శ్రీధర్ గారిని కలుద్దామని మళ్లీ బీచ్ కి వెళ్ళా. వెళుతూనే కొన్ని సమాధానాలు సిద్ధం చేసుకున్నా.’ రైటిజం’ పూర్తిగా కాకపోయినా, ప్రజలు వాళ్ళ జీవన స్థితిగతులను బట్టి కొంత ప్రయత్నం జరుగుతుందని, సరికొత్త నాయకత్వం ఇప్పుడిప్పుడే మొదలైందని త్వరలో సాధ్యమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుదాం అనుకున్నా. కానీ ఆయన రాలేదు. బీచ్ అంతా వెతికా ఎక్కడా కనబడలేదు. నిరాశగా వెళ్తుంటే అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఎందుకో అని నేనూ తల పైకి ఎత్తి చూసా. దూరంగా ఓ రెండు తోకచుక్కలు జంటగా వెళుతున్నట్టు కనిపించాయి. నాకు శ్రీధర్, భానులే అనిపించారు.
ఎందుకో తెలియదు, హాయిగా అనిపించింది. ఇంటికి వెళ్లి అమ్మ పెట్టిన ముద్దపప్పు అన్నం తినేసి నిద్రకు ఉపక్రమించగానే ,ఈసారి చెన్నారెడ్డి గారు కలలోకి వచ్చారు, “ఏంటయ్యా నీకు, శ్రీధర్‌కు నచ్చినట్లు నా కథ మార్చేస్తారా?” అని అడిగారు. నా దగ్గర సమాధానం లేదు. మళ్లీ ఆయనే “ఏదో సమాధానం చెబుతాను అని సిద్ధం చేసుకున్నావు కదా శ్రీధర్ కోసం, నీకైనా సబబు అనిపించిందా అది?” అంటే మళ్ళీ నా దగ్గర సమాధానం లేదు.“సమాధానం లేదు కదా, అంతటి చైతన్యం తెగువ ఇప్పుడున్న ప్రజానీకానికి లేదు కదా. కనీసం నీకైనా ఉందా?, లేదు కదా, అది అర్థమయ్యే నేను అలా ముగించా ఆ కథను. అర్థమైందా?” అని అడిగారు. నేను కూడా నిజమే కదా అని సమాధానం పడ్డా. ఇంతలో ఆయనే “అధైర్య పడకు, అంతటి చైతన్యం తెగువ ఇక్కడ ప్రపంచంలో జన సమూహానికి కలిగించే ప్రవక్త వస్తాడు ఎదురుచూడు. కుదరకపోతే నువ్వే అంత చైతన్యం కలిగించే వ్యక్తిలా నిన్ను నువ్వు సిద్ధం చేసుకో..” అని చెప్పి మాయమైపోయారు.

నోట్ : పైన జరిగిన సన్నివేశంలో ప్రస్తావించిన ‘మరో మహాత్మా’ పుస్తకాన్ని గుజ్జు చిన్నారెడ్డి గారు రచించారు.
ఆ పుస్తకం లింక్ : https://www.logili.com/novels/maro-mahatma-dr-gujju-chennareddy/p-7488847-34282517018-cat.html








