తెలుగు సాహిత్యంలో ఇప్పుడు ప్రేమ కథలదే కాలం. అన్ని రకాల ప్రేమలను కథల్లో చెబుతున్నారు, చదువుతున్నాము. ప్రేమ సఫలం అవ్వడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, ప్రేమ విఫలం అవ్వడానికి కూడా అన్నే కారణాలు ఉన్నాయి. వ్యక్తుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాల వల్ల విడిపోవడం ఒకటైతే, సామాజిక పరిస్థితులు, కులం, మతం భేదాల వల్ల విఫలమైన ప్రేమ మరో రకం. కానీ, ఆర్థికపరమైన విభేదాలు ఉన్నప్పుడు విచ్ఛిన్నమయ్యే ప్రేమ ప్రస్తావన ఉన్న కథ లేదా నవల నేను చదవలేదు. కానీ, ఈ అంశం మీద 1960ల్లోనే, ధర్మవీర్ భారతి హిందీలో రాస్తే, వేమూరి ఆంజనేయ శర్మ తెలుగులోకి ‘సూర్యుడి ఏడో గుర్రం’ పేరుతో అనువాదం చేశారు.

కథ గురించి స్థూలంగా చెప్పుకుంటే, మాణిక్ ముల్లా అనే వ్యక్తి పంచతంత్రం శైలిలో ఏడు మధ్యాహ్నాలలో తన స్నేహితులకు ఒక కథను వివరిస్తాడు. ఆ కథలో జమున, సతీ మరియు లిల్లీ అనే ముగ్గురు మహిళల గురించి మూడు కథలు చెబుతాడు. ఆ ముగ్గురూ ఎవరు? వాళ్ళకి ముల్లాకి ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగతా కథ.
కేవలం 100 పేజీలు మాత్రమే ఉండే ఈ నవలలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది, ఈ కథను చెప్పిన తీరు. చదువుతున్నప్పుడు మనకి ఈ కథ ఒక ‘మెటా ఫిక్షన్’ (meta fiction) అవ్వడం వల్ల, చదువుతున్నంత సేపు ఒక కొత్త అనుభూతికి లోనవుతాము. శ్యామ్ బెనెగల్ గారు చెప్పినట్టు, ఇది నిజంగానే పోస్ట్ మోడరన్ నవల అనిపించింది.
ప్రేమలో పడి, ఆ బాధను తట్టుకోలేక తన జీవితాన్ని నాశనం చేసుకునే వ్యక్తులను “దేవదాస్” అని పిలవడం మనకు తెలిసిందే. ఈ విధమైన ప్రవర్తనను పరోక్షంగా ‘దేవదాస్ సిండ్రోమ్’ అంటారు. ఈ నవల, ఈ సిండ్రోమ్ మీద విప్లవాత్మక దృక్పథంతో రాసిన రచన అనిపించింది. ప్రేమకథ ద్వారా మనిషిలో ఆశ, భవిష్యత్తు మీద భరోసా కల్పించాలి అన్న రచయిత మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి.
ముందే చెప్పినట్టు, ప్రేమలో ఉండే ఆర్థికపరమైన అంశాన్ని ప్రధానంగా తీసుకొని, నిమ్న తరగతి, మధ్య తరగతి, ఎగువ తరగతి కుటుంబాల్లో ప్రేమ వల్ల పడే ఇబ్బందులు, ముఖ్యంగా స్త్రీల ఆలోచనలను ఈ నవలలో మనం చూడవచ్చు.
దాదాపు 50 ఏళ్ళ క్రితం ఈ నవల రాసినా, ఇప్పటికీ చాలా రిలేటబుల్‌గా అనిపించింది.
ఈ కథకి ‘సూర్యుడి ఏడో గుర్రం’ అని పేరు ఎందుకు పెట్టారు అనేది కథలో భాగంగా మనకి చాలా స్పష్టంగా చెప్పారు.
ఈ కథ ఆధారంగా శ్యామ్ బెనెగల్ గారు హిందీలో ‘ సూరజ్ కా సాత్వ ఘోడా’ అనే సినిమా తీశారు.

ఒక వైవిధ్యమైన కథ చెప్పే విధానాన్ని చదవాలి అనుకుంటున్న వాళ్లు ఈ పుస్తకం కచ్చితంగా చదవాలి.
ఈ పుస్తకం ప్రస్తుతం ఎక్కడా అందుబాటులో లేదు. కానీ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు
ప్రచురించే అవకాశం ఉంది.
పేజీలు: 110








