పుస్తక పరిచయం : యామం

దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల మీద ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి. భవనాల్లో ఎన్నో కథలు ఉంటాయి. ఆ కథల్లో ఎందరివో జీవితాలు ఉంటాయి. ఆ జీవితాల్లో ఎన్నో మలుపులు కూడా ఉంటాయి. అలాంటి కొన్ని జీవితాల కథల సమూహమే ఎస్. రామకృష్ణన్ తమిళంలో రాసి, జిల్లేళ్ల బాలాజీ తెలుగులోకి అనువాదం చేసిన ‘యామం’ అనే నవల.
టాగోర్ లిటరరీ అవార్డు అందుకున్న ఈ నవలలో, పందొమ్మిదవ శతాబ్దపు మదరాసుపట్టణం ప్రధాన పాత్రగా మనకి కనిపిస్తుంది. ఆంగ్లేయుల పాలనలో రూపుదిద్దుకుంటున్న మదరాసు, బ్లాక్ టౌన్, వైట్ టౌన్ విభజనలు, కలరా మహమ్మారి, నీలగిరి పర్వతాల్లో టీ తోటల ఆవిర్భావం, లండన్ నగరంలోని సామాజిక మార్పులు వంటి అనేక చారిత్రక సంఘటనలను రచయిత ప్రస్తావిస్తూ, మదరాసు గ్రామం కాస్తా నగరంగా ఎలా రూపాంతరం చెందిందో మనం ఈ నవలలో చదవచ్చు. ఇది కేవలం ఈ నవలలో పైకి కనిపించే ఒక చిన్న కథ మాత్రమే.
లోతుగా వెళ్తే…
ముందే చెప్పినట్టు, నగరం అంటే ప్రజలు… వారి జీవితాలు. అలానే ఈ ‘యామం’లో కూడా ఎన్నో పాత్రలు, వాళ్ల జీవితాలు మనకి కనిపిస్తాయి. అబ్దుల్ కరీమ్, భద్రగిరి, తిరుచ్చిత్రంబలం, తయ్యల్‌నాయకి, కృష్ణప్ప, ఎలిజబెత్, సదాశివం వంటి పాత్రలతో మనం చాలా దూరం ప్రయాణం చేస్తాము.
ఈ నవల ప్రత్యేకత దాని కథనంలోనే ఉంది. ఐదు స్వతంత్ర కథలుగా కనిపించే ఈ రచనలో, ప్రతీ కథలోని పాత్రలు మరో కథలో రాకపోయినా, అంతర్లీనంగా ఒక భావం వీళ్లందరినీ కట్టిపడేస్తుంది… అదే యామం.
యామం అంటే ఒక అత్తరు. అది రాత్రి అంతటి లోతైన భావన, రాత్రంతటి గాఢమైన సువాసన కలిగి ఉంటుంది. యామం అన్నది రాత్రికి ఒక మెటాఫర్ (Metaphor) అనుకుంటే, రాత్రి మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, పగటి వెలుగులో దాచిపెట్టబడిన కోరికలు, భయాలు, రహస్యాలు చీకటిలో ఎలా రూపం దాల్చుతాయో ఈ నవల లోతుగా పరిశీలిస్తుంది.
పగలు మనిషి సమాజానికి చెందినవాడైతే, రాత్రి తనకు తాను చెందుతాడు. ఆ సమయంలోనే అతని నిజమైన ఆలోచనలు, బలహీనతలు, ఆకాంక్షలు వెలుగులోకి వస్తాయి. ఈ అంశాలన్నింటినీ ఈ నవలలోని పాత్రల ద్వారా రచయిత ఆవిష్కరించారు.
పుస్తకాన్ని పూర్తిగా చదివిన వాళ్లు కచ్చితంగా రాత్రితో ప్రేమలో పడతారు. రాత్రితో పాటు యామం మత్తులో కూడా తేలుతూ ఉంటారు.
అనువాదం గురించి చెప్పుకుంటే, చదువుతున్నప్పుడు ఎక్కడా కూడా అనువాద నవల చదువుతున్నట్టు అనిపించలేదు. వాక్యం అంత సులువుగా చదివించింది. 300 పేజీలు ఉన్న పుస్తకం చదువుతున్నట్టు ఎక్కడా అనిపించలేదు.
మదరాసు నగరం ఎలా రూపుదిద్దుకుందో, బ్రిటిష్ పాలన దక్షిణానికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకునేవారికి యామం ఒక ఎంపిక. కానీ రాత్రి, మానవ కోరికలు, ఒంటరితనం, చరిత్ర… ఈ నాలుగింటి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్లు ఈ పుస్తకం కచ్చితంగా చదవాలి.
ఈ పుస్తకం balabooks వాళ్ల వెబ్‌సైట్‌లో ఉంది. లేదా అమెజాన్‌లో కూడా ఉంది.
ధర : 375/-
పేజీలు : 328

Leave a Reply

error: Content is protected !!