పుస్తక పరిచయం : రెండు గుండెల చప్పుడు
రెండు గుండెల చప్పుడు – యండమూరి వీరేంద్రనాథ్ స్వేచ్ఛ అంటే ఏమిటి? మనకు నచ్చినట్టు జీవించడమా? మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకునే హక్కు కలిగి ఉండటమా?
రెండు గుండెల చప్పుడు – యండమూరి వీరేంద్రనాథ్
స్వేచ్ఛ అంటే ఏమిటి? మనకు నచ్చినట్టు జీవించడమా? మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకునే హక్కు కలిగి ఉండటమా? లేక మన స్వేచ్ఛకు కూడా సమాజం గీసిన గీతల మధ్యనే అర్థాన్ని వెతుక్కోవాలా?
మనిషి స్వేచ్ఛాజీవి అని అంటాం. కానీ, ఆ స్వేచ్ఛకు ఎన్ని హద్దులు ఉండాలి? సమాజం విధించే కట్టుబాట్లు మనల్ని నియంత్రించడానికా? లేక ఒకరితో ఒకరు కలిసి జీవించడానికి అవసరమైన నియమాలా? సంపూర్ణ స్వేచ్ఛతో కూడిన సమాజం నిజంగా సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే, ఆ సమాజంలో మనిషి ఎదుర్కొనే సవాళ్లేమిటి?
సమాజాన్ని మార్చాలనుకునే వ్యక్తులకు, తాము నిర్మించాలనుకుంటున్న కొత్త సమాజం పట్ల నిజంగా స్పష్టమైన అవగాహన ఉంటుందా? సమాజం సంగతి పక్కన పెడితే, వ్యక్తిగతంగా మనిషికి సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తే, దాన్ని అతను ఎలా ఉపయోగించుకుంటాడు? ముఖ్యంగా, లైంగిక స్వేచ్ఛ విషయంలో వ్యక్తిగత ఇష్టాలకే ప్రాధాన్యత ఇవ్వాలా? లేక కొన్ని పరిమితులు, బాధ్యతలతో కూడిన వివాహ వ్యవస్థే మెరుగైనదా?
ఇలాంటి ప్రశ్నలకు సులభమైన సమాధానాలు వెతకకుండా, వాటి చుట్టూ ఉన్న భిన్నమైన ఆలోచనలను పాఠకుడి ముందుంచే ప్రయత్నమే యండమూరి వీరేంద్రనాథ్ గారి ‘రెండు గుండెల చప్పుడు’ నవల.
ఈ నవలలోని పాత్రలు కేవలం కథను ముందుకు నడిపించే వ్యక్తులు మాత్రమే కాదు. ఒక్కో పాత్ర ఒక్కో ఆలోచనా విధానానికి, ఒక్కో సిద్ధాంతానికి ప్రతినిధిగా కనిపిస్తుంది.
నిశితంగా పరిశీలించే జర్నలిస్టు సుభాషిణి ఒకవైపు ఉంటే, తన వాక్చాతుర్యంతో తాను నమ్మిన వాదనను బలంగా వినిపించే ప్రభాకర్ మరోవైపు ఉంటాడు. వివాహ వ్యవస్థలో స్త్రీకి సంపూర్ణ స్వేచ్ఛ లేదని నమ్ముతూ, తన సిద్ధాంతాన్ని రచనల ద్వారా సమాజం అంగీకరించాలని కోరుకునే రచయిత్రి పద్మిని ఒక పాత్ర అయితే, ఎప్పటికైనా సమసమాజ స్థాపన జరగాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటూనే, ఆ సమాజంలో హాయిగా జీవించడానికి డబ్బు, కీర్తి అవసరమని భావించే విష్ణుమూర్తి మరో పాత్ర.
వీళ్ల ఆలోచనలు, వాదనలు, వ్యక్తిగత ఆకాంక్షలు, సిద్ధాంతాల మధ్య సంఘర్షణల ద్వారా రచయిత అనేక సంక్లిష్టమైన ప్రశ్నలను చర్చకు తీసుకొస్తారు. ముఖ్యంగా, లైంగిక సంబంధాలు, వివాహ వ్యవస్థ, స్త్రీ స్వేచ్ఛ వంటి అంశాలను కేవలం నైతికత అనే ఒక్క గాటిలో పెట్టకుండా, భిన్నమైన దృక్కోణాల నుంచి పరిశీలించే ప్రయత్నం ఈ నవలలో కనిపిస్తుంది.
ఒక రచనలోని అన్ని అభిప్రాయాలతో పాఠకుడు ఏకీభవించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనకు నచ్చని అభిప్రాయాలే మన ఆలోచనలను మరోసారి పరిశీలించుకునేలా చేస్తాయి. ఈ నవల చదువుతున్నప్పుడు నాకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. రచయిత ప్రతిపాదించిన కొన్ని అభిప్రాయాలతో వ్యక్తిగతంగా నేను ఏకీభవించలేకపోయాను.
ఈ నవలలో నాకు బాగా నచ్చిన అంశం రచనా వేగం. పెద్దగా విరామం తీసుకోకుండా, ఒక్క రోజులోనే పుస్తకాన్ని పూర్తి చేయగలిగేలా కథనం సాగుతుంది. ఒక అంశం నుంచి మరో అంశానికి, ఒక పాత్ర ఆలోచన నుంచి మరో పాత్ర వాదనకు మారుతూ సాగే కథనం చదవాలనే ఆసక్తిని నిలబెడుతుంది. అలాగే, కథను ఒకే కోణంలో చెప్పకుండా, విభిన్న పాత్రల ఆలోచనల ద్వారా వివిధ కోణాలను పరిచయం చేసిన విధానం కూడా నచ్చింది.
చివరగా.. 2027 చివరి నాటికి యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి గార్ల రచనలన్నింటినీ పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఆ ప్రయాణంలో నేను చదివిన మొదటి పుస్తకం ‘రెండు గుండెల చప్పుడు’.
పేజీలు: 160
ధర: ₹80
ఈ పుస్తకం అమెజాన్‌తో పాటు పుస్తక దుకాణాల్లోనూ లభిస్తుంది.
లింక్ : https://link.amazon/B0bSq4ceT