నవ్యాక్షరం: ‘రెక్కల బండి’ కథ

రెక్కల బండి

                                             -పద్మిని లత

కారు ఎయిర్‌పోర్ట్ ముందు ఆగింది. నానమ్మ వాళ్లు దిగారు. రాము కాబ్ చార్జెస్ పే చేస్తున్నప్పుడు, నానమ్మ చుట్టూ జరుగుతున్న హడావిడి చూస్తున్నారు.  

“ఇదేమిటిరా? రైల్వే స్టేషన్‌లా కనిపించట్లేదు. ఇదేదో పెద్ద పెద్దవాళ్లు వచ్చే భవనంలా ఉంది. మన ఊరి సితారా హాలుకి పదింతలు ఎక్కువ!”  
“ఇది ఎయిర్‌పోర్ట్ నానమ్మ… విమానాశ్రయం!” అన్నాడు రాము.  
“తమాషా గాని చేస్తున్నావాట్రా. నా ఆఖరి దశలో తీర్థయాత్రకి షిరిడీకి తీసుకొని వెళ్ళమంటే, ‘నాన్నకు టైం లేదు నేను తీసుకెళ్తా నానమ్మ’ అని నాకు కబుర్లు చెప్పి, ఇక్కడికి తీసుకొచ్చావు. నీకు అసలు సరదాకి, సీరియస్ విషయాలకి తేడా తెలియదు రా?” అని ఎంతో తిట్టిపోసింది.  
“నానమ్మ, కాసేపు నీ తిట్ల సుప్రభాతం ఆపితే మనం లోపలికి వెళ్లొచ్చు. అవతల బోర్డింగ్ ఆలస్యం అవుతుంది!” అన్నాడు రాము.  
“నన్ను ఇప్పుడు ఎక్కడికో బోడుంగు తీసుకెళ్తాడట! నీ మాట నమ్మి ఇంత దూరం రాకుండా ఇంట్లోనే ఉండిపోయినా బాగుండేది!” అని నానమ్మ తిట్టింది.  
అంతే, ఆ పక్కనుంచి వెళ్తున్న కొత్తగా పెళ్లైన జంట అది విని ఫక్కున నవ్వారు.  
“నానమ్మ, నా పరువు తీస్తున్నావ్ కదే!” అంటూ తలబాదుకున్నాడు రాము.  
నానమ్మ బ్యాగ్, తన లగేజ్ తీసుకొని మరో చేతితో బామ్మ చేయి పట్టుకుని, “మాట్లాడటం చాలు! ముందు లోపలికే పదా!” అని ఈడ్చుకెళ్లాడు.  
లోపలికి వెళ్లే ముందు మిలిటరీ డ్రెస్ వేసుకున్న ఇద్దరు గార్డులు టికెట్ చెక్ చేశారు. ఆ తర్వాత లగేజ్ చెకింగ్ వద్ద ఆగారు.  
లగేజ్ వాళ్లకు ఇస్తుంటే నానమ్మ లబోదిబోమని అరిచింది.  
“ఒరేయ్ రాముడు! నీకేమైనా బుద్ధి ఉందా? మన సామాను వాళ్లకి ఇచ్చేస్తున్నావు!”  
రాముకి అందరి ముందు తలకొట్టేసినట్టు అయింది. “నానమ్మ, అలా అన్నిటికీ గాబరా పడి అరవకే! వాళ్లకి మన సామాను మీద ఎటువంటి ఆసక్తి లేదు.విమానం దిగాక మన సామాన్లు మనకే అందిస్తారు. నేనున్నానుగా! ఎందుకు అన్నిటికీ భయపడతావు?” అని రాము నచ్చజెప్పాడు.  
“ఏంటో నీ వెర్రి మాటలు! విమానం… విమానం… అప్పటినుంచి చెప్తున్నావు. ఇక్కడ చూస్తే మాత్రం జనాల హడావిడి తప్ప ఒక్క విమానం కూడా కనపడట్లేదు! ఎక్కడికి తీసుకెళ్తున్నావో ఏంటో!”  
“నానమ్మ, ఇంకా కాసేపట్లో చూస్తావులే! నువ్వు నీ అనుమానాలు ఆపి కాసేపు ఓపిక పట్టు!”
బోర్డింగ్ పాస్ తీసుకుని వెయిటింగ్ హాల్‌లో కూర్చొన్నారు. నానమ్మ చుట్టూ ఉన్న జనాన్ని గమనిస్తూ, “ఇదేమిట్రా ఇక్కడ సంత జరుగుతున్నట్టు ఇంత మంది జనం. వీళ్ళ మొహాలు చూస్తే గుళ్ళు, గోపురాలు తిరిగే వాళ్ళలా అనిపించట్లేదు. వీళ్లంతా మనతో పాటు నిజంగా షిరిడీకి వస్తున్నారంటే నమ్మలేకపోతున్నా. ఇప్పటికైనా నిజం చెప్పరా పుణ్యం ఉంటుంది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు?”  
“నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్మేయనులే నానమ్మ!! నువ్వు నీ అనుమానాలు! కాసేపు ఓపిక పట్టు, విమానాన్ని చూద్దువు గాని!” అన్నాడు రాము.

అంతలో బోర్డింగ్‌కు రెడీ అవ్వమని అనౌన్స్మెంట్ వచ్చింది. రన్­వే పై విమానాలు కనిపించాయి. బామ్మకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు.  
నానమ్మని షాక్ నుంచీ బయటకు పడేస్తున్నట్టు రాము బామ్మతో “అదే మనం ప్రయాణం చేయబోయే విమానం” అన్నాడు.  
బామ్మ గారికి ఒక క్షణం ఆనందభాష్పాలు వచ్చాయి.  
“ఒరేయ్ రాముడు! ఇదంతా నిజమేనట్రా!? ఏదో నాతో తమాషా చేస్తున్నావు అనుకున్నా!. ఇది నిజంగానే టీవీలో కనిపించే విమానం లాగానే ఉంది!”

విమానం ఎక్కేటప్పుడు “ఒరేయ్!, ఏంట్రా విమానానికి మెట్లు ఉన్నాయి!? నేను చూసినప్పుడు ఎప్పుడూ మెట్లు కనపడలేదు. ఇవి ఉండగా విమానం ఎలా ఎగురుతుందిరా?”  
“నానమ్మ, ఇవి లోపలకి ఎక్కడానికి మాత్రమే! అందరూ ఎక్కిన తర్వాత వీటిని పక్కకి జరిపేస్తారు.”  
ఎట్టకేలకు రాము, నానమ్మను తన సీట్లో కూర్చోబెట్టాడు.

ఎయిర్ హోస్టెస్ సూచనలు చెప్తూ భద్రతా విధానాలు వివరించడం మొదలుపెట్టింది.  
“ఏంట్రా!, ఈ అమ్మాయిలు అప్పటినుంచి తెగ సైగలు చేస్తున్నారు!? వీళ్ల చేతులు ఊపడం చూస్తుంటే, ఎవరినైనా బలవంతంగా పంపించే పనిలో ఉన్నట్టుంది! ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోగలవా?”  
“నానమ్మ, ఇవన్నీ భద్రతా సూచనలు! అత్యవసర పరిస్థితుల్లో ఏం చేయాలో చెప్తున్నారు!”  
“అయ్యో దేవుడా! అంటే మమ్మల్ని తీసుకెళ్తూ మధ్యలో అగాధంలో పడేస్తారా?”  
“అరేయ్!, అలా కాదు. ఇవన్నీ ప్రయాణికులకు అవగాహన కల్పించడానికే!”  
“ఏమో రా! దేవుణ్ణి చూడ్డానికి బయలుదేరాం. సరాసరి దేవుడి దగ్గరికే వెళ్లిపోతామేమో!”  
“దీన్ని ఫ్లయింగ్ సిగ్నల్స్ అంటారు. నీకు ఇది మొదటిసారి కాబట్టి ఇలా ఉంది. నేనున్నానుగా భయం ఎందుకు?” అని ధైర్యం చెప్పాడు.  
విమానానికి టేకాఫ్ స్టార్ట్ అయింది! నానమ్మకు గబాలిపడింది.  

కొంత సేపటి తర్వాత ఎయిర్ హోస్టెస్ ప్రయాణికుల అవసరాలు చూసుకుంటున్నారు.  
“ఒరేయ్ రాముడు! అంతా బాగానే ఉంది కానీ, మరి దాని పరిస్థితి ఏంట్రా?” అని నానమ్మ గుసగుసలాడింది.  
ఆ గుసగుసల్ని అర్థంచేసుకుని, “ఆ ఫెసిలిటీ ఇక్కడే ఉంటుంది బామ్మ. నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు చెప్పు లావరేటరీకి తీసుకెళ్తా!” అన్నాడు.  
“ఇప్పుడు మళ్లీ ఎక్కడికి తీసుకెళ్తావ్? నీతో ఇంకోసారి బయటకు వస్తే అడుగు! నా మానాన నేను ఇంట్లో కూర్చుని హాయిగా టీవీ సీరియల్స్ చూస్తూ ఉండే!”  
“నానమ్మ, లావరేటరీ అంటే బాత్రూమ్!”  
“ఓహ్…!! అలా చెప్పు మరి గాడిద.”  

‘ఈ ప్రయాణం నానమ్మకు కొత్త అనుభవమే కాకుండా, తన చిన్నతనాన్ని మరోసారి గుర్తు తెచ్చిన స్వప్నం అయింది.’ అని అనుకుంటూ రాము చిన్నగా నవ్వుకున్నాడు.

“నానమ్మ, చిన్నప్పుడు మేడ మీద నుంచి విమానాలు చూస్తూ, ‘రెక్కల బండి పోతుంది’ అని నువ్వే చెప్పే దానివి. ఇప్పుడు నిజంగానే విమానం ఎక్కించాను  కదా?”  
కొన్ని క్షణాల తర్వాత, రాము చేతిని గట్టిగా పట్టుకున్న నానమ్మ మెల్లగా వీధి కబుర్లు, చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ చెబుతూ, “అవునురా! కింద నుంచి చూస్తే చీమలలాగే కనిపించే విమానం, ఇంత పెద్దదిగా ఉంటుందని ఊహించలేదు. ఇప్పుడు మన ఊరికి వెళ్లి, రెక్కల బండి ఎక్కాను అని అందరికీ చెప్తా!”  
“అప్పట్లో మన ఊర్లోనూ ఇలాంటి ప్రయాణాలు ఉండేవా?”
“ఈ తరహా ప్రయాణాలు ఊహించడానికి కూడా సాధ్యం కాదు! కానీ నీ చిన్నతనంలో బండ్లు, ఊరేగింపులు, ఎద్దుల బండ్లు ఉండేవి కదా.అప్పట్లో మా నాయనమ్మ కూడా మా ఊరి ఊరేగింపుల్లో నన్ను తీసుకెళ్లేది! కానీ ఇంత వేగంగా ఎక్కడికీ వెళ్లలేం… అందుకే నాన్న ఊరికి వెళ్ళాలంటే మూడ్రోజుల ప్రయాణం అయ్యేది!”  
రాము నవ్వుకుంటూ, “ఇప్పుడు 2 గంటల్లోనే మనం షిరిడీకి చేరిపోతాం!” అని చెప్పాడు.  
“అదే నా ముచ్చట రాము, ఒకప్పుడు చెట్లు, మైదానాలు చూసుకుంటూ ప్రయాణం చేసేవాళ్లం. ఇప్పుడు మేఘాలు దాటుకుంటూ వెళ్తున్నాం!.”

నానమ్మ అమాయకత్వానికి రాము నవ్వుకున్నాడు. చిన్నపుడు వేసవి సెలవుల్లో రాము తన నానమ్మ ఇంటికి వెళ్లాడు. టెర్రస్ మీద పడుకొని, ఆమె చెప్పే కథలను ఆసక్తిగా విన్నేవాడు. ఆకాశంలో విమానం వెళ్లినప్పుడు, నానమ్మ ఆ విమానాన్ని చూపిస్తూ, “అదిగో రెక్కల బండి!” అంటూ కథలను చెబుతూ ఉండేది.
పెద్దవాడయ్యాక, నిజంగా నానమ్మతో కలిసి రెక్కల బండిలో ప్రయాణం చేయాలని రాముకు అనిపించేది.ఇప్పుడు తాను నానమ్మను మొదటిసారి విమానం ఎక్కించాననే తృప్తి అతనికి కలిగింది.

మొత్తానికి షిరిడీ ఎయిర్‌పోర్ట్ కి చేరుకున్నారు.ఈసారి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న నానమ్మ ఆరంభంలో ఉన్న భయం లేకుండా హుందాగా నడుచుకుంది.  
ఆ ప్రయాణ జ్ఞాపకాలను నానమ్మ మనవాళ్లు ఎన్నో ఫోటోల్లో బంధించుకున్నారు. 

ఇలా,  రాము, నానమ్మల  మొదటి “రెక్కల బండి” ప్రయాణం అమాయకపు అనుమానాలతోనూ, చిన్నప్పుడు జ్ఞాపకాలతోనూ సఫలం అయింది!

*******

 

రచయిత పరిచయం:

నా పేరు పద్మినీ లత. చిన్ననాటి నుంచే కథల పట్ల నాకు గాఢమైన ఆసక్తి ఉండేది. కథ చెప్పే ప్రతి రూపాన్ని — పుస్తకాలు, సినిమాలు, ఆడియోలు, వీడియోలు — నేను ఆస్వాదిస్తూ పెరిగాను. ఈ ఆసక్తే నన్ను రచన వైపు నడిపించింది. కథల ద్వారా నా ఆలోచనలు, భావాలను పాఠకులతో పంచుకోవడం నాకు ఒక ఆత్మతృప్తిని ఇస్తోంది.
ప్రస్తుతం, పాఠకుల మనసులను తాకే విధంగా సానుభూతి, భావోద్వేగంతో కూడిన కథలు రచించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను.

2 thoughts on “నవ్యాక్షరం: ‘రెక్కల బండి’ కథ

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading