పుస్తక పరిచయం – బర్మాకేంపు కథలు

బాదం చెట్టు నీడలో బాల్య మిత్రుడు చెప్పిన బర్మా కేంపు కథలు.

 

మనం  చేసే పనులలో అత్యంత క్లిష్టమైన పని ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఉన్న వాస్తవాన్ని అంతే సహజంగా చూపించగలగడం.  ఇది అత్యంత సహజంగా చేయగలిగిన వాళ్లే అత్యంత నిష్ణాతులు అవుతారు.

  ఒక వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా  ప్రదర్శించాలంటే  అతను దానిని అనుభవించి పలవరించి అందులో లీనమై ఉండి ఉండాలి. అటువంటివే హరివెంకట రమణ రాసిన ‘బర్మా క్యాంపు కథలు‘. ఇవి  ఆ ప్రాంతంలో  జరిగిన సంఘటనలను, జీవితాన్ని కథా వస్తువులుగా చేసుకొని నిజాయితీగా, ఒకింత పాజిటివ్ గా పందొమ్మిది కథలుగా చెప్పాడు రచయిత.  ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని అక్షరబద్దం చేసి మంచి కథలుగా మలిచేందుకు గట్టి ప్రయత్నమే చేసి అందులో కృతకృత్యుడయ్యాడు.

బ్రిటిష్ పాలకులు తమ వలస దేశాలకు మన దేశం  నుంచి శ్రామికులను తీసుకెళ్లగా వారిలో చాలామంది అక్కడే స్థిరపడిపోయారు. రెండవ ప్రపంచ యుద్దం, ఆ తర్వాత 1962 లో మిలిటరీ ప్రభుత్వం పంపిచేసిన కారణంగా బర్మా నుండి వచ్చేసిన తెలుగువారికి, ఇక్కడి ప్రభుత్వం విశాఖలోని కంచరపాలెం దగ్గర కొంత స్థలంలో రేకుల షెడ్డులు వేసి వారికి ఆశ్రయం కల్పించింది. కానీ అక్కడి నుంచి వచ్చేసిన వాళ్ళు అక్కడ జీవన విధానానికి, ఇక్కడ జీవన విధానంతో కలగలిపిన జీవితాన్ని మనం ఈ కథల్లో చూడవచ్చు. అక్కడ ఒక కులం గాని, ఒక మతం గాని, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు గానీ ఉండరు. ఈ కథల్లో  మనుషులు వారి మధ్య బంధాలే కాదు,  జంతువులు, చెట్లు  ఉంటాయి, ఇంకా  ఏ జీవం లేనటువంటి బోరింగులు,  స్మశానం,  పుట్టలు అన్నీ ఉంటాయి.

 

బోరింగు’ అనే కథను తీసుకుంటే, బర్మా క్యాంపు ప్రజలు నీటిని వెలికి తీసే పరికరంగా బోరింగ్ ఉపయోగించేవారు కానీ ఈ కథలో రచయిత కేవలం బోరింగ్ పరికరాన్ని మాత్రమే వివరించలేదు, దాని చుట్టూ ఉన్న జీవన విధానాన్ని, ప్రజల అనుభవాలను భావోద్వేగాలను సజీవంగా చిత్రీకరించాడు. ఒక కథను చదువుతున్నామనే  భావన కాకుండా మనం నిజంగా ఆ జీవితాన్ని చూస్తున్నామన్న అనుభూతిని ఈ రచయిత కలిగిస్తాడు. ఈ కథల్లో మరో ముఖ్యమైన అంశం డీటైలింగ్. ప్రతి సూక్ష్మమైన అంశాన్ని విసిదీకరించి కథను చదివే పాఠకులకు అది కేవలం ఒక కథ రూపంలో కాకుండా ఒక సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగించేలా రాశాడు.  “భక్తులలో మా ఇంటి పక్కన కమ్మరిల్లు కట్టుకున్న పోలిరాజు వాళ్ళు ఆవిడ కనకా ఉన్నారు. పిల్లలకి ఆరోగ్యం బాగుండాలని పోలిరాజుకి మంచి ఉద్యోగం రావాలని మొక్కుకుని మాల వేసుకున్నారని అమ్మ చెప్పింది.  పూనకాల తర్వాత ప్రసాదం పంచారు, సెనగలు తిన్నన్ని  అక్కడే తినేసాను, చేతికి అంటిన  నూనె పేంటెనక   రాసేసాను”.  మరొక చోట, “బెంచి టికెట్లు కొనుక్కొని  సినిమా చూడమని చెరో రెండేసి రూపాయలు ఇచ్చారు మా దయగల అమ్మ, ఆంటీ.  ఆంటీ తమ్ముడు ఏమీ అనలేదు. ఇద్దరం వెళుతున్న కంపచెట్ల దారిలో ఆ గుంటడో చోట ఆగి అటు ఇటు చూసి ఓ రాయి పక్కకు తీసి, గొయ్యి తీసి అందులోంచి ఒక చిన్న చిల్లర మూట తీశాడు. ఇద్దరం ఆ చిల్లర మూట పట్టుకుని సినిమాకి పోయాం. బాల్కనీలో ఐదు రూపాయలు టికెట్టు  తీసుకుని, చిరుతిళ్లు కొనుక్కుని కంటి నిండా ఏడ్చేసి  వచ్చేసాము”.  పాపం పసివాడు సినిమాకి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనని డబ్బులు ఎక్కడో దాచుకుని తీసిన విధానాన్ని కళ్ళకు  కట్టినట్టుగా చూపిస్తాడు హరి  ‘ఆకాశవాణి సిలోన్  కేంద్రం‘ కథలో.

 

ఈ రచయిత ,తన  తల్లిదండ్రులతో బర్మా క్యాంపులో 1984 నుంచి 1989 వరకు గడిపాడు. ఆ కాలంలో తాను చూసినటువంటి సంఘటనలు తనకు జరిగిన అనుభవాలన్నీ బాల్యం కేంద్రంగా చెప్పిన కథలన్నిటిలో ఒక తన్మయత్వపు  అనుభూతి  కనిపిస్తుంది. ఆ అనుభూతిని తన్మయత్వాన్ని పాఠకుడు  కూడా చదువుతున్నప్పుడు పొందుతాడు. “అప్పటికి కప్పరాడ బడిలో రోజుకో గొడవ. నేనేమో బాదిరెడ్డి  శ్రీనుగాడితోనూ, అవతారంతోను ముసలమ్మ మనవడితోనూ, బ్రహ్మాజీతో ఇలా అందరితో ఫైటింగులు. ఏ ఫైటింగ్ లో మనం గెలిచామో  చెప్పడం కష్టం. ఆఖరున  ఎవడో ఒకడు వచ్చి విడదీస్తాడు మిగిలింది మనం బోరింగ్ కాడ మెడ చుట్టూ కడుక్కున్నాక తెలుస్తుంది, మనకి గోరుగాట్లు పడ్డాయో, ఆడికి పడ్డాయో.  చుట్టూ రోజు దెబ్బలాటలు సీన్లు. స్కూల్లో మన నాయకత్వం పైన క్లాస్ లీడర్షిప్ ని అంగీకరించని నా కొడుకులే  ఎక్కువ”, ఇది చదివిన పాఠకుడికి అతని బాల్యంలో స్నేహితులు, వారితో గొడవలు గుర్తు రాకమానవు.

 “వీడియో లైబ్రరీ నుంచి టీవీ తెచ్చి ఇంటి బయటపెట్టి ఆన్ చేశాడు  బుల్లి మావయ్య. గుంటలు అందరం చూశాము అందులో బ్రూస్లీ అచ్చం బర్మా క్యాంపోడిలాగా ఉన్నాడు బక్కగా ఉన్నాడు, ఎగురుతున్నాడు, ఎగిరి తంతువున్నాడు. నాకు నచ్చేసాడు”, “శ్రీహరిపురం బర్మా కాలనీ నుంచి వచ్చిన నరాల అప్పలరాజు నేను నూకాలమ్మ గుడి ముందు చింతపండు ముద్దలు అమ్ముతున్న బర్మా కాందిశీకురాలైన  ముసలిదాని దగ్గర పావలా పెట్టి ఒక చింతపండు ఉండ కొనుక్కుని దానికి కారం ఉప్పు తగిలించి రెండు ఈనిపుల్లలు  గుచ్చి ,లాలీపాప్లా  చేసుకుని బోరింగ్ పక్కన ఉన్న బాదం చెట్టు దగ్గర కూర్చుని తన్మయత్వంతో తింటుంటే…”, బర్మా క్యాంపులో ‘బ్రూస్ లీ‘,  ‘కొండమీద విమానం‘ ఈ రెండు కథలను చదువుతుంటే అతని యొక్క  చిన్నప్పటి అనుభూతులు, అనుభవాలు చదువుతున్నప్పుడు మన బాల్యంలోకి మనం గడిపిన సంఘటనలోకి తెలియకుండానే ప్రవేశం చేసేస్తాం. కథలు చదువుతున్నప్పుడు మనం కూడా అంతే తన్మయత్వాన్ని పొందుతాం. మొత్తం కథలన్నిటిలో కూడా రచయిత వాడిన భాష సహజంగా సరళంగా ఉంటుంది. జిగ్గులు, కవ్వళ్ళు, గులివిందలు, కానగత్తలు, ఇలా మనం చిన్నప్పుడు విన్న పదాలు గానీ లేదా అసలు మనకు తెలియని పదాలు గానీ మనం చదువుతూ ఉంటే ఒకంత పులకింతకి గురవుతాము. హరి ఈ కథల్లో ఎక్కడ కూడా బేషజాలకి పోలేదు అక్కడ ఎలా ఉందో సహజంగా అలాగే చెప్పాడు, ఒకింత సానుకూలంగా చెప్పాడు.  అక్కడ ఉండే వాడుక భాషని (లోకల్ డయలెక్ట్)    యదాతథంగా,   గౌరవంగా చెబుతాడు.  “వాటా పది రూపాయలే రారా తమ్ముడు”  “తాజా చేపలు ఇప్పుడే తెచ్చినాను నాను, తక్కువకి అమ్మలేని బాబా” “అచ్చీ తాజా చేప, మొప్పలు  చూడొద్దు నువ్వు వండుకున్నాక.. నచ్చినాక డబ్బులు ఇయ్యి ఇక్కడే ఉంటాను నేను” , “ఏటీ ?రెండు వాటాలు  పది రూపాయలకి  కావాలా, ఎప్పుడైనా చేపలు తిన్నావా? ఆ మొఖం చూడు” అని బేరాలు ఆడే ఆడమనిషిని  తిట్టేస్తోంది ఒక పల్లీ లామే.  కంచరపాలెంలో చేపల మార్కెట్కుకు  వెళ్ళినప్పుడు ఆ పల్లె కారులు  అమ్మే చేపలు వాళ్ళు వాడే భాషని సజీవంగా చూపించాడు ఒక కథలో. జిగ్గులు అనే కథలో “మేం గోళీలాడిన నేలంతా, మేం దేకిన నేలంతా, మేం కుంటిన నేలంతా, దొడ్డికెళ్ళి ఉచ్చలు పోసిన నేలంతా” అన్నా ఎక్కడ ఎబ్బెట్టుగా  అనిపించదు సరికదా ఆ పరిస్థితుల మీద, ఆ నేల  మీద, ఆ బాల్యం మీద అవ్యాజమైన ప్రేమ కనిపిస్తుంది.

బర్మా క్యాంపు కథలలో హరి వెంకట రమణ  ప్రకృతి పట్ల ప్రేమ,  మనుషులు పట్ల ప్రేమ కనిపిస్తుంది.  ఆ కొండ మీద నుంచి వచ్చే చల్లటి గాలి పూల వాసన, బాదం చెట్టు నీడ వీటన్నిటిని కూడా రచయిత కాదు మనం కూడా ఆస్వాదిస్తాం. అలాగే బ్రతికున్న మనుషులను ప్రేమించడమే కాదు చనిపోయిన వారిని కూడా  అంతే ప్రేమతో చూస్తాడు రాజు దాస్.  “చావు పాటలు మీద ప్రేమతో ఉద్యోగం కూడా వదిలేశాడు” అని రెండో భార్య ప్రేమగా గొప్పగా చెబుతుంది. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ శవాన్ని రాత్రంతా ఉంచాల్సి వచ్చినప్పుడు  పాటలు పాడుతూ  రాత్రంతా శవజాగారం చేసేవారు.  శవజాగారం పాటలు పాడే స్పెషలిస్ట్ రాజు దాస్ బర్మా క్యాంపులో. రచయిత చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టి రాజు దాస్ శవం పక్కన పాటలు పాడుతుంటే అతని పక్కనే కూర్చుని వినేవాడు. ఆ రాజు దాస్ గురించి ఒక కథలో ఎన్ని వేల మనుషులను సాగనంపాడు ఎంత గౌరవాన్ని శవానికి కల్పించాడు అంటూ చెబుతున్నప్పుడు చనిపోయిన మనిషైనా సరే అతని మీద ఉండేటువంటి ప్రేమ గౌరవం ఈ కథలో మనకి చెబుతాడు.

ఒక సమాజంలో  గాని ఒక సమూహంలో  గానీ ఆర్థిక పరిస్థితులు, విద్యా స్థాయి మెరుగైనప్పుడు ఒక కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అది ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ని హరి తన కొన్ని కథల్లో కూడా ప్రస్తావిస్తాడు. ఇంకెక్కడినుండో చిన్న చితకా జనం చేరి కొండల మీద పాకలేసుకొని పాకుతూనే ఉన్నారు. అసలెక్కడా గోళిలాడుకునేందుకు గజం నేల కూడా లేదు. బర్మా క్యాంప్ లో భూమి బంగారం అయ్యిపోయింది అని ‘జిగ్గులు‘ కథలో చెబుతూ తిండం, పొదుపు చేసుకోవడం, ఆడాళ్ళని ఇంటికే పరిమితం చేయడం పిరికిగా బతకడం, పిల్లల్ని కోళ్ళఫారంలో కోళ్ళు పెంచినట్టు పెంచడం, మెల్లిగా నడవడం, నంగిగా మాట్లాడడం మాత్రమే చేసే ఆ కాలనీ మిడిల్ క్లాస్ జనాలకి బర్మా క్యాంప్లో చైతన్యం ఉద్రేకం ఉండే మనుషులకి తేడా చూపిస్తాడు. మనిషి కింది స్థాయి నుండి ఎదిగాక వ్యక్తిగత స్వార్ధం ఎలా పెరిగిపోతుందో తన కథల్లో చెబుతాడు.

తమ ఇంటిలో పనిచేసిన సత్తెమ్మ, ఆమె పడిన బాధలు ఒక కథగా మలిచి చివరిలో అలాంటి బాధలు పడుతూ బతుకు ఈడుస్తున్న  సత్తెమ్మలు ఈ నగరంలో సుమారు నలభై  వేల మంది ఉంటారని చెబుతాడు. ప్రతి కథ చివరిలో రచయిత  సమాజం పట్ల అవగాహన, సామాజిక స్పృహ కనిపిస్తాయి.

 బర్మా కాందిశీకుల మీద రాసిన అన్నీ కథలు కలిపి ఒక పుస్తకంగా వచ్చిన మొదటి పుస్తకం ఇది అవుతుందేమో.  కథల్లో తన బాల్యంలో జరిగిన పురా జ్ణాపకాలన్నిటిని కథలుగా రాసిన బాలుడు హరి అయితే, ఆ కథలు చదివే   పాఠకుడు కూడా బాలుడుగా మారిపోతాడు.

-బసు పోతన

9440878247

 

ఈ పుస్తకం అమెజాన్ ,లోగిలి వెబ్సైటు లో లభ్యమవుతోంది లేదా రచయిత దగ్గర నుంచి తీసుకోవచ్చు. Ph:9866084124 

 

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading