పుస్తక పరిచయం – అధోలోకం

నేను సూపర్ హీరోస్ గురించి కథలు చెప్పడం కన్న, నిజ జీవితంలో సాధారణ జీవితం గడుపుతున్న మనుషుల గురించి చెప్పడానికే ఇష్టపడతాను’ అని అంటారు సత్యజిత్ రే గారు. తెలుగులో కూడా కొంత కాలం క్రితం కేవలం ఉన్నత వర్గంగా చెప్పుకునే వ్యక్తుల కథల నుంచి వచ్చినా, గత కొంత కాలంగా తక్కువ చెయ్యబడ్డ జీవితాల గురించి కథలు/నవలలు చాలా విరివిగా వచ్చాయి. బొజ్జ తారకం గారు ‘పంచతంత్రం‘తో, ‘సంచారి‘ అని పెద్దింటి అశోక్ కుమార్ గారు, ‘శికారి‘ అని పాణి గారు,  అణిచివేయబడుతున్న జాతుల గురించి రాసినా, వారి జీవితంలో ఉండే ఇబ్బందులు, వారు పడే వివక్ష గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ రాశారు. కానీ పుట్టడమే అవిటితనంతో పుట్టి, పేదరికంలో పెరుగుతూ, మన చుట్టూ వివిధ ప్రదేశాల్లో భిక్షం అర్జిస్తున్న వారి గురించి తెలుగులో ఇంత వరకు నేను కథ/నవల చదవలేదు. కానీ తమిళంలో జయమోహన్ గారు 2003 లో  ‘Eazhaam Ulagam’ పేరుతో ఒక నవల రాశారు.. అదే కుమార్ ఎస్ గారు, అవినేని భాస్కర్ గారు కలిసి ‘అధోలోకం’ పేరుతో తెలుగులోకి అనువదించారు.

 

ఈ నవల కథా సమయం 1990. నాగర్కోయిల్ ప్రాంతానికి చెందిన వేలు పండారం, ఒక సాధారణ మధ్య తరగతికి చెందిన మనిషి. గుడి ముందు పూలు అమ్ముకునే కులానికి చెందిన ఈ పండారం, మనుషులతో ముఖ్యంగా అవిటితనంతో బాధ పడుతున్న వాళ్లను ‘సరుకు’గా మర్చి వాళ్ళు బిక్ష ద్వారా సంపాదించిన డబ్బుతో వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ అడుక్కోనే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఈ వ్యాపారంలో ఎలా జరుగుతుంది, దీని వల్ల పండారం జీవితం ఏమైంది అనేది ఈ నవలలో మనం చూడచ్చు. 

భారత ఇతిహాసం ప్రకారం మొత్తం పధ్నాలుగు లోకాలు ఉన్నాయి, భూలోకానికి పైన ఏడు లోకాలను ఊర్ధ్వలోకాలుగా, కింద ఉండే లోకాలను అధోలోకాలుగా చెప్పబడ్డాయి. మనం పెద్దగా పట్టించుకోని ఈ అధోలోకంలోనే వికలాంగులు, అవిటితనంతో బాధ పడుతూ భిక్ష యాచిస్తూ, జీవితం గడుపుతున్న వాళ్ళు కూడా మనుషులే, వారికి కూడా సంతోషాలు, దుఃఖాలు, మనస్పర్థలు, ఈర్షలు అన్నీ ఉంటాయి అని చెప్పడమే ఈ నవల యొక్క ముఖ్య ఉద్దేశం. కాఫ్కా రాసిన ‘మెటామార్ఫోసిస్‘ లో ఎలా అయితే, గ్రెగర్ సామ్సా తాను ఉన్న పరిస్థితిని అర్ధం చేసుకున్నాడు. అలానే ఈ నవలలోని పాత్రలు కూడా తమ పరిస్థితులకి కృంగిపోకుండా, వాటిని స్వీకరించి, అలానే బ్రతకాలి అని నిర్ణయించుకుంటారు. 

సాధారణంగా, ఇలాంటి అంశం మీద కథలను చెప్తున్నప్పుడు, కేవలం వారు పడే కష్టం గురించి, వేదన గురించి హృదయవిదారకంగా చెప్పడానికే ప్రయత్నిస్తారు. అందుకు భిన్నంగా, ఈ నవలల్లో వారి జీవితంలోని కష్టాల గురించి చెప్పడమే కాకుండా, వాళ్ళల్లో ఉండే తాత్విక చింతన, తమలో తాము వేసుకొని జోకులు, జీవితాన్ని అర్ధం చేసుకొనే విధానం, ఇలా అన్ని చూపించారు. వాళ్ళ ప్రపంచం యొక్క వాస్తవికతను మాత్రమే కాకుండా  వారి నుండి డబ్బు సంపాదించడం ద్వారా దుర్భరమైన జీవితాన్ని గడిపే ధనవంతుల ప్రపంచాన్ని కూడా చూపించారు. 

ఈ కథలోని అన్ని పాత్రలు మనతో చాలా రోజులు వరకు ప్రయాణం చేస్తాయి. ముఖ్యంగా పిల్లలు కనడానికి మాత్రమే ఉండే ముత్యాలు, మంచి అర్థవంతమైన తాత్విక పాటలు పాడే మాంగాండి స్వామి, ఒక మధ్య తరగతి వ్యక్తి ఆలోచనతో ఉండే వేలు పండారం, ఇలా ప్రతీ పాత్ర మనతో ఎన్నో విషయాల గురించి చెప్తాయి. 

ఈ నవల కేవలం విగత జీవితాల గురించి మాత్రమే చెప్పే కథ కాదు. ఇందులో ఎన్నో కోణాలను ఆవిష్కరించారు జయమోహన్ గారు. వ్యాపార ధోరణిలో మొదట్లో కనిపంచే వేలు పండారం లో ఉండే సున్నిత మనసు, కమ్యూనిజం ముసుగులో జరిగే వ్యాపారం, ఇలా ఎన్నో అంశాల గురించి కూడా ప్రస్తావించారు. 

ఇక్కడ మనం ప్రత్యేకంగా అనువాదం చేసిన పద్ధతి గురించి మాట్లాడుకోవాలి. చదువుతున్నంత సేపు ఎక్కడ కూడా ఇది అనువాదం చేసినట్టు అనిపించలేదు. ప్రాంతం మారినప్పుడు అనువాదంలో కూడా యాసలు చేర్చడం నచ్చింది. అలానే కొన్ని తమిళ పాటలను అనువాదం చేసినా, ఒరిజినల్ పాటను కూడా తెలపడం చాలా బాగా నచ్చింది. ఇంత చక్కటి అనువాదం చేసిన కుమార్ గారికి, అవినేని భాస్కర్ గారికి ధన్యవాదాలు. 

అవిటితనంతో బాధపడే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా మనలానే అన్ని రకాల భావావేశాలు ఉంటాయి అని తెలుసుకోవడమే కాకుండా, మన జీవితం మీద మనకి ఒక కృతజ్ఞత భావం ఈ నవల చదివితే కచ్చితంగా కలుగుతుంది. 

2003 లో తమిళంలో వచ్చిన ఈ నవల దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఇంకా relate అవుతున్నాము అంటే మన ఆలోచనల్లో ఎంతో మార్పు రావాల్సి ఉంది అని తెలుస్తుంది. 

నిజజీవిత వ్యక్తుల గురించి రాసిన ‘నెమ్మినీలం’, మనం పెద్దగా పట్టించుకోని జీవితాల మీద ‘అధోలోకం’ రాసిన జయమోహన్ గారి మిగతా రచనలను కూడా అనువాదం చేస్తారు అని కోరుకుంటూ.. 

ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది.

లింక్ : https://amzn.to/3QZ1g6r

పుస్తకం : అధోలోకం 

పేజీలు : 270

రచయిత : జయమోహన్ 

అనువాదం : కుమార్ ఎస్, అవినేని భాస్కర్

ప్రచురణ : ఛాయా రిసోర్స్ సెంటర్ 

ధర : 350/-

 

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading