సంఘటనలు, అనుభవాలు, అవగాహనలు, వీటి చుట్టూ కల్పితాన్ని అల్లి చాలా నవలలు రచించబడతాయి, రచించబడ్డాయి. నేను రాసిన నా మొదటి నవల ‘వేసవి కూలీ’ ఇందుకు అతీతమేమీ కాదు. కానీ, నవల పుట్టుకకు కారణమైన అవేంటో నా నవలను రచించిన నాకు మాత్రమే తెలుసు.కాబట్టి, వీటి పరిచయమే ఈ నవలా నేపథ్యంగా రాసాను.
సంఘటన:
2023లో మా ఇంటి పక్కన నిర్మాణంలో ఉన్న ఇంటికి రోజూ కొందరు కూలీలు పనికి వచ్చేవారు. అలానే ఆ రోజు కూడా వచ్చారు. పని మొదలుపెట్టే సమయానికి ఇద్దరు ఆడకూలీలు నీళ్ళు మోస్తూ కనిపించారు. ఎక్కడి నుండి మోస్తున్నారు, ఎందుకు మోస్తున్నారు అనే కుతూహలంతో బయటికి చూసాను.
సూమారు పదమూడు నుండి పదిహేను మధ్య వయసు ఉన్న ఒక్క పిల్లోడు, మా ఇంటికి ఇంకోవైపున పల్లం కారణంగా నిలబడిన వర్షపునీరులోకి మురికినీరు కలిసి వాటికి పాచి పట్టి, వాటిల్లో తుంగ పెరిగి, చూస్తేనే జిగుప్స కలిగే విధంగా ఉన్న నీళ్ళల్లోకి దిగి, పైపైనీటిని గోళాలతో తీసి ఇస్తుండటం చూసాను. ఆ నీళ్ళని ఆడవాళ్ళు మోసుకెళ్ళి సిమెంట్ కలిపేందుకు వాడుతున్నారని గ్రహించాను.
కూలీలను పిలిపించుకున్న ఇంటి ఓనరు ట్యాంకిలో నీళ్ళు అయిపోయాయన్న సంగతి మర్చిపోయాడేమో, ట్యాంకర్ కోసం ఫోను చేస్తే ఆలస్యం అవుతుందని చెప్పాడేమో అందుకే సిమెంట్ కలపడానికి నీళ్ళు లేక ఇలా చేస్తున్నారని అనుకున్నాను.
ఆ పిల్లోడిని అలా చూసిన ఆ దృశ్యం చాలా రోజులు నన్ను వెంటాడింది.
ఆ సంఘటన వల్లనే ఒక పిల్లవాడు కూలిపనికి వెళ్ళడం గురించి కథ రాయాలని అనుకున్నాను.
అనుభవాలు:
2019-2020 మధ్య మా సొంత ఇంటి నిర్మాణంలో భాగంగా నేను భవన నిర్మాణ కార్మికులతో రోజూ ముచ్చటించే అవకాశం, వాళ్ళ జీవితాలని దగ్గరగా చూసే అవకాశం దక్కింది. వాళ్ళు మాట్లాడే విధానం, పని చేసే తీరు, ఎలా పని చేస్తారు అనేవి అప్పుడే తెలుసుకున్నాను.
ఆ సంవత్సర కాలంలో, కూలీలు ఉదయం వచ్చినప్పటి నుండి సాయంకాలం తిరిగి వెళ్ళేంత వరకు వాళ్ళు చేసే పనులన్నీ గమనించాను. మనకు అసాధ్యం అనే కొన్ని పనులు వాళ్ళు అవలీలగా చేయడం చూసాను. వాళ్ళలో పిల్లలు కూడా కొన్ని సార్లు వచ్చేవాళ్ళు. అలా కూలీల గురించి కాస్తోకూస్తో తెలిసొచ్చింది.
ఆ అనుభవాలన్నీ అప్పటికి ఎలా ఉపయోగించాలో తెలియక, వాటిని నా మస్తిష్కంలో నిక్షిప్తం చేసి ఉంచాను.
అవగాహనలు:
2024లో మా బాబాయి ద్వారా అన్వీక్షికి నవలల పోటీ గురించి తెలిసింది. పాల్గొనటానికి కథల కోసం వెతుకులాట మొదలుపెట్టాను. అప్పటికే ఎక్కడో బుర్ర అంతరాల లోతుల్లో పడిపోయిన ఆ సంఘటన, ఆ అనుభవాలు చూచాయగా తన ఉనికిని తెలియజేసాయి. కొన్నిరోజులు అవి పట్టుకొని మేదోమధనం చేస్తే ఒక కథాంశం పుట్టింది.
ఆ కథాంశం మా బాబాయితో చెప్పగానే కొన్ని సలహాలు, సూచనలు చెప్పి రాయమని ప్రోత్సాహం ఇచ్చారు. నేను ఎనుకున్న కథాంశంలో నేను నా జీవితంలో చూసిన కొన్ని విషయాలుపై ఏర్పరుచుకున్న అవగాహనలను స్పృశించగలిగే అవకాశం మెండుగా కనిపించింది.
అలా చదువు, ఆర్దిక పరిస్థితులు, వ్యసనాలు, తారతమ్యాలు, పిల్లల ఆలోచనలు వంటి అంశాలను మేళవిస్తూ నవల పూర్తి చేయడం జరిగింది.
ఇలా రాసిన ఈ నవల అన్వీక్షికి నవలల పోటీలో బహుమతి పొందింది.
ఇదంతా మీరు చదివారంటే నేను రాసిన నవల దేని గురించో మీకు కొంచమైనా అర్థమయ్యే ఉంటుంది.
ఒక పధ్నాలుగేళ్ళ పిల్లవాడు ఎన్నో ఆశలతో వేసవి సెలవులను మొదలుపెట్టాలని అనుకుంటాడు. కానీ మొదటి రోజునే తను అనుకోకుండా కూలిపనికి పోవలసి వస్తుంది. ఆ రోజంతా ఆ పిల్లవాడు ఎలా గడిపాడు, ఒక్క రోజుకే కదా అని కూలిపనికి పోయినవాడు వేసవి కూలీగా మారిన వైనమే నా నవల.
నేను రాసిన ఈ పరిచయం మీలో నవలపై కొంచమైన ఆసక్తిని కలిగిస్తే వెంటనే కొని చదవండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అలానే నలుగురికి చెప్పండి. వాళ్ళకీ నచ్చుతుంది.
అమెజాన్ లింక్ : https://amzn.in/d/70xzrmp
(కుమార యశస్వి గారు రాసిన ఈ వేసవి కూలీ అనే నవల అన్వీక్షికి ప్రచురణ సంస్థ , చదువు సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన 2023 ఉగాది నవలల పోటీలలో ‘యంగ్ రైటర్స్’ విభాగంలో మొదటి బహుమతి పొందింది.)








