కథా పరామర్శ- ప్రభాకర్ జైని రాసిన ‘సర్దుకున్నారా’ కథా

అహం పెంకు పగలగొట్టిన కథ

బెర్ట్రండ్ రసెల్ రాసిన ‘సృష్టి’ అని కథ ఉంది. ఒక వేదాంతి కలలో చచ్చి, స్వర్గానికి వెళ్ళాననుకుంటాడు. తనకేదో ఘనస్వాగతం లభిస్తుందనీ, ఈశ్వరానుగ్రహం లభిస్తుందనీ అనుకున్న వేదాంతికి, స్వర్గంలో చుక్కెదురవుతుంది. ‘భూమి’ అనే గ్రహాన్ని తాము ఎప్పుడూ వినలేదంటారు వాళ్ళు. చాన్నాళ్ళు ప్రయత్నించి, కష్టం మీద విశ్వంలో వున్న వేవేల కోట్ల నక్షత్రరాశులలో భూమి అనే ఒక గ్రహం వుందనీ, అది అన్ని నక్షత్రరాశులలో వున్న అన్ని గ్రహాల లాంటిదేనని, దానిలో వేదాంతిలాంటి కొన్ని పరాన్నభుక్కులు వున్నాయని కనుగొంటారు. వేదాంతి అహానికి ఇది మింగుడు పడదు. తనకు ఏ ప్రత్యేకత లేకపోడం వల్ల ఇది సాతాను కల్పించిన మాయ అనుకుంటాడు తప్ప, విశాల విశ్వంలో తానొక ధూళికణంలో వందోవంతు అనే సత్యం జీర్ణం కాదు. 

ప్రతి మనిషి తానొక ప్రత్యేకమైన వాడినని, తన అభిప్రాయాలు గొప్పవని తన చుట్టూ ఒక అహాన్ని నిర్మించుకుంటాడు. తన అభీష్టానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగినప్పుడు, తన అహానికి దెబ్బ తగిలిందని, సమాజంలో తనకున్న విలువ పోయిందని అనుకుంటాడు. కానీ, ఈ అహం పొరలు తొలగించి చూసినప్పుడు నిజంగా తన విలువ ఎక్కడుందో మనిషి తెలుసుకుంటాడు. ఆ పనే చేసింది ప్రభాకర్ జైనీ కథ ‘ సర్దుకున్నారా ?’. 

కథలో నిత్యం ఆనందంగా వుంటూ, అందరితో కలుపుగోలుగా వుండే రమణకు హఠాత్తుగా గుండెకు స్టంట్స్ వేయాల్సిరావడం కథకుడి బృందాన్ని ఆశ్చర్యానికి, బాధకు గురి చేస్తుంది. రమణ కథకుడితో ‘అన్నీ సర్దేసుకున్నాను’అంటాడు.‌ ఈ సర్దేసుకోవడం అంటే ఏమిటో కూడా చెపుతాడు. “ ఈ జీవితం ప్రసాదించిన అందమైన మధురస్మృతులన్నీ మూటకట్టి, మనోమంజూషలో దాచుకుని, మిగిలినవన్నీ వదిలించుకున్నాను. ఆత్మీయులందరినీ కలిసి నా జీవితన్ని ఇంత అందంగా మలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియచేసాను. నా వల్ల కష్టం కలిగిన వాళ్ళందరినీ; తెలిసో తెలియకో, ఉద్యోగ ధర్మం మీరలేకో, నా వల్ల కష్టం కలిగిన వారందరినీ కలిసి సారీ చెప్పాను. మనస్ఫూర్తిగా క్షమాభిక్ష కోరాను. నాకు నష్టం కలిగించిన వారిని, నన్ను నమ్మించి మోసం చేసిన వారిని కూడా కలిసి, వాళ్ళని కూడా క్షమించేసాను. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా వుంది. ఏ కోరికలు లేవు. ఏ అసంతృప్తి, నిరాశ నిస్పృహలు లేవు. ఒక అలౌకిక ఆనందంలో మునిగి తేలుతున్నాను. జీవితాంతం ఆరాటంతో సంపాదించిన వస్తువులన్నింటిని వదిలించుకొని నా భౌతిక జీవితాన్ని శుభ్రపరచుకున్నాను. దీన్నే డెత్ క్లీన్సింగ్ ( Death Cleansing ) అంటారు.” ఆ తర్వాత రమణ చనిపోతాడు.

రమణ చెప్పిన ఈ మాటలకు షాక్ తిన్న కథకుడు తాను కూడా క్లీన్సింగ్ చేసుకోవాల్సిన విషయాలున్నాయని తలపోసి, తన జీవితాన్ని సర్దుకోవడానికి నిర్ణయం తీసుకుంటాడు. తను ఇంత కాలం మోస్తున్న ద్వేషం శిలువల్ని, అహంకారాల బండల్ని భుజాల మీద మోయకుండా కింద పడేసి వదిలించుకుందామనుకుంటాడు. వెంటనే అతనికి తను చేయాలనుకున్న పనికి, చేరుకోవాలనుకున్న మార్గానికి చేరడానికి దారి సుగమం అవుతుంది. పాలో కొయెల్హో రాసిన ‘The Alchemist’ నవల కూడా ‘మనం మనసులో ఏదైన గాఢంగా చేయాలని కోరుకుంటే ఆ పని జరగాలని ప్రపంచం మొత్తం కుట్ర చేస్తుంది’ అని అంటుంది. దానికి తగ్గ శకునాలు ( Symptoms ) మనకు చూపుతూ వుంటుంది. ఆ శకునాలను అనుసరించి పోవడమే మనం చేయవలసింది. అది మన మనోమయ ఇంద్రియాలకు తెలుస్తూనే వుంటుంది. కథకుడు అది గ్రహించి, దానినే అనుసరించి ఢిల్లీ వెళ్ళి తనలో వున్న వేరుభావాన్ని Cleansing చేసుకొని, హృదయ భారం దించుకొని, శేష జీవితంలోకి సంతోషాన్ని ఆహ్వానిస్తాడు. అదేమిటన్నది కథ చదివి తెలుసుకోవాలి. 

సర్దుకున్నారా’ అనే మాటను ఒక ప్రయాణానికి ముందు మనం ఇతరులను అడిగే మాటే గానీ, మన తుది ప్రయాణానికి ముందు మనం మన జీవితంలోకి ఒకసారి తొంగిచూసుకొని, సరిచేసుకోవాల్సిన విషయాలను, తొలగొంచుకోవాల్సిన విద్వేషాలను, విడిచిపెట్టాల్సిన మానసిక లౌల్యాలను మనకు గుర్తు చేసే ఒక ప్రతీకగా కథకుడు ఇక్కడ ఉపయోగించాడు. బంధాలు గట్టిపడాలంటే అహాన్ని విడిచి పెట్టాలని రమణ పాత్ర కథకుడి అహం పెంకును పగులుబారుస్తుంది. వివేకవంతుడైన మనిషి అదే ఒక శకునంగా భావించి, తన జీవిత పథాన్ని నిర్దేశించుకోవడానికి తన అహం పెంకును పెగుల్చుకొని బయటకొచ్చి, నిజమైన జీవనానందాన్ని తనకు, తన కుటుంబానికి కలిగిస్తాడు. ‘అహం బ్రహ్మస్మి’/ ‘అయం ఆత్మ బ్రహ్మ’ అనే సూక్తులు తనను తాను తెలుసుకునే క్రమంలో మనిషి చేసే అన్వేషణే తప్ప అంతా నేనే, నేనే బ్రహ్మను, బ్రహ్మాండాన్ని అనే భావన కాదని తెలుసుకోవడమే ఆత్మ జ్ఞానం.

సర్దుకున్నారా’ కథలో ఎక్కడా ఒక వృథా వాక్యం కూడా లేకుండా కథను సంక్షిప్తంగా ముగించం కూడా చదివే పాఠకుని ఆలోచనకు అవకాశమిచ్చింది. మనిషి ఉన్నతంగా జీవించడానికి అడ్డుపడే అన్ని baggage లను వదిలి, సౌకర్యంగా జీవించడం గురించి మాట్లాడింది. ఏ మత జీవన విధానమైనా చివరికి బోధించే తత్వం ఇదే. ఈ తత్వాన్ని ఈ కథలో రంగరించిన కథకుని కథన సామర్థ్యం మెచ్చదగింది. పాఠకునిలో జిజ్ఞాసను రేకెత్తించడమే మంచికథ లక్షణం కనుక ఇది నేను చదివిన మంచి కథలలో ఒకటి.

A story has no beginning or end: arbitrarily one chooses that moment of experience from which to look back or from which to look ahead.

― Graham Greene

ఈ కథ మనిషి తను చేసిన తప్పులను వెనుతిరిగి చూసుకొని, భవిష్యత్ జీవిత ప్రణాళికకు ఉదాత్తమయిన బాటను పరిచే మార్గం చూపిన కథ అయింది. కాబట్టి ఇది ఆర్ద్రమయిన భాషలో  మనవీయ విలువలు అద్ది చెప్పిన కథ కూడా. మనిషిలో మానవీయ ఉద్వేగాలను రగల్చడమే ఒక మంచి కథ ఉద్దేశం, ప్రయోజనం, పరమార్థమూనూ. మనిషిలో అనేక అహంకారపు కళ్ళపొరలు ఒలిచి, మరచిపోయిన మానవీయ ఉద్వేగాలను, విలువలను మనిషికి మళ్ళీ గుర్తు చేసే పని ఈ కథ నెరవేర్చింది.

-పి.శ్రీనివాస్ గౌడ్ , 9949429449

(ఈ కథ డా. ప్రభాకర్ జైని గారు రాసిన ‘సర్దుకున్నారా కథలు ‘ అనే పుస్తకంలో ఉంది.  ప్రతుల కోసం 7989825420 ను సంప్రదించండి.)

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading