పుస్తక పరామర్శ : టిట్‌బిట్స్

న్యూ ఏజ్ టిపికల్ యూత్ మ్యూజింగ్స్ – ‘టిట్‌బిట్స్’

– పి.శ్రీనివాస్ గౌడ్, 9949429449

కొత్తగా చెప్పే ప్రేమ కథలకు ఎప్పుడూ ఆదరణ వుంటుంది. అందులో తాజాదనమూ, తన్మయ భావమూ వున్నప్పుడు అది ఇంకా ఆకట్టుకుంటుంది. స్నేహం ప్రేమగా మారే క్షణాల్ని ఒడిసిపట్టుకున్న వాక్యాలు అపురూపమయినవి. అవి గుర్తుపెట్టుకోకపోయినా గుర్తుంటాయి. కొండొకచో మనల్ని వెంటపడి వస్తాయి. అందులోనూ మారుతున్న ఆధునిక జీవనశైలిలో అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో, సామాజిక మాధ్యమాల కాలంలో, ప్రతి విషయమూ సరుకుగా మారకం అవుతున్న సందర్భంలో ఒక ఊరటగా, స్నేహాన్ని స్వచ్ఛంగా, ఒక అరమరికలు లేని మధురభావనగా వచ్చిన నవలిక టిట్‌బిట్స్.

టిట్‌బిట్స్ అంతా కలిపి 15 అధ్యాయాల చిన్న నవలిక. రెండు మూడు పేజీలలో రాసిన, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో కలిసినప్పటి స్వీట్ మ్యూజింగ్స్ ఇవి. క్లుప్త సంభాషణలు, సంక్షిప్త వర్ణనలు, తమాషా ఊహలు, ఉత్సుకత నిండిన శైలితో వున్న ఈ రచనను గంటా గంటన్నరలో చదివేయొచ్చు.

రిషితకు ఇది మొదటి రచన అంటే నమ్మడం కష్టం. తను మనసులో ఫీల్ అయినదాన్ని, చెప్పాలనుకున్న దాన్ని యధాతథంగా చెప్పడం ఆ అమ్మాయి సాధించిన విజయం. న్యూ జెన్ అమ్మాయిల ఆలోచనలు, ధైర్యం, భయాలు, ఆనందాలు, అభిరుచులు, అలవాట్లు, జీవితాన్ని చూసే విధానం ఇందులో తెలుస్తుంది. భవిష్యత్ జీవితం పట్ల తనదైన అవగాహన, తనకు ఏం కావాలో స్పష్టత, అది సాధించుకునే స్థోమత, సున్నితత్వాన్ని కోల్పోని సహనత అడుగడుగునా ఈ నవలికలో ఒక్కొక్క అధ్యాయంలో ఎదురవుతాయి.

నవలికలో వస్తువు వుందా అంటే వుంది. లేదా అంటే లేదు. శైలి పూర్తిగా డామినేట్ చేస్తుంది. కాస్మోపాలిటన్ నగర జీవితాలు మనుషుల సెన్సివిటీలను, విలువలను చంపేస్తున్న ఈ కాలమానంలో ఒక అమ్మాయి ఇంత స్వచ్ఛంగా, ఇంత ధైర్యంగా, మగ మనుషుల మీద నమ్మకంతో, అదీ ఒక ఇన్‌స్టా పరిచయం ఆధారం చేసుకొని, ఒక అబ్బాయితో సహగమనం చేయడం ఆశ్చర్యమే. ఇద్దరి మధ్య జరిగిన పరస్పర ఆరోగ్యకర స్నేహం తర్వాత, ఇంత pure friendship సర్వత్రా వుంటే బాగుండుననిపిస్తుంది. అబ్బాయి మెచ్యూరిటీ లెవల్స్ ఎక్కువేని అమ్మాయి చెపుతూనే వుంటుంది. కొన్ని గిల్లికజ్జాలు, కొన్ని భావుకతలు, కలిసి చేసే వంటలు, పూలను ఇచ్చే పనిష్మెంట్లు, పక్కనున్నా కార్డ్స్ రాసి ఇవ్వటాలు, గిన్నెలు కడిగే నాగార్జున పోలికలు, We are two pieces of puzzle. We complete each other అనుకోవడాలు, ‘ఎప్పుడో ఏదో జరిగిపోతుందని బాధ పడటం కంటే కలిసున్న ఈ కాలాన్ని ఎంబ్రేస్ చేసుకోవటంలోనే అంతా ఉంది.’ అని జెన్ ఫిలాసఫీని ప్రాక్టీస్ చేయడాలు, ‘మా మధ్య జరిగిన మూమెంట్స్ మాత్రం సెలబ్రేట్ చేసుకుంటాను.’ అనే మరలిరాని మధుర భావనలు గుప్పిట పట్టే ప్రయత్నాలు, స్నేహం నుంచి ప్రేమగా మారే క్రమాన ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తాయి.

ఈ కథలో అబ్బాయికి ఈ నవలికను అంకితం ఇవ్వడం బావుంది. మెట్రోలో ప్రతి మనిషికి ఒక కథ వుంటుందని, అది తెలుసుకోవడానికి అమ్మాయి ప్రయత్నించడం, అమ్మాయికి జీవితం పట్ల తనదైన అవగాహన వుందని మనకు తెలియడం బావుంటుంది. ‘హి లివ్స్ అలోన్’ అని అమ్మాయి అనుకుంటుంది గానీ, నిజానికి అతను ‘నాతో నేను వుంటున్నా.’ అంటాడు. అతను ఒంటరిగా లేడు, ఏకాంతంగా వున్నాడు. ఆ ఏకాంతంలోకి ఈ అమ్మాయి ఒక లేత కాంతిలా ప్రవేశిస్తుంది. ‘ఈ కథకి ముగింపు నాక్కూడా తెలీదు.’ అని అమ్మాయి అనడం ఆమె పారదర్శక మనసుకు నిదర్శనం.

అయితే సంభాషణలు అక్కడక్కడా లింక్ తెగి ఎవరి మాటలు ఎవరివో తెలియక కాస్త గందరగోళానికి గురవుతాము. వ్యాకరణ అంశాలు పరిహరించడం కూడా చదువరికి ఇబ్బంది కలిగిస్తుంది. ఆరు నెలల పరిచయం ( పేజి.11) కాస్తా పేజి.13 లో ఎనిమిది నెలల పరిచయం అవుతుంది. అక్కడక్కడ ఖాళీ పేజీలతో నవలికను కష్టంగా వంద పేజీల దాకా లాగారు.

ఒక తాజా ప్రేమపూర్వక చిరుతెమ్మరల పలకరింపు టిట్‌బిట్స్ నవలిక. చదివిన తర్వాత మననొక నవ పరిమళాల చిరు వాక్యదృశ్యాల చిలకరింపులో తడిసిన అనుభవం కలుగుతుంది. యువ రచయిత్రి రిషితకు అభినందనలు. ఆ అమ్మాయి తర్వాత ఏం రాస్తుందా? అని పాఠకుడు అనుకోవడం రిషిత సంపాదించుకున్న ఆస్తి.

ప్రచురణ : రేగు అచ్చులు

వెల : 150/-

లింక్ : https://amzn.to/3ZEdiqy

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading