కలల వేళ
–వెంకట నాగ శ్రావణి మెండా
‘అయినా ఇప్పుడంతా బానే ఉంది కదా. అక్కకి పెళ్ళయి నాలుగేళ్ళయింది. దానికి ఇద్దరు పిల్లలు పుట్టారో లేదో అప్పుడే నాకు పెళ్లి చేసేస్తారా? పైగా నిన్న కాక మొన్నే పద్దెనిమిదేళ్లు వచ్చాయ్.’ ఇలా అనుకుంటూ ఉండగా వీధిలో గట్టిగట్టిగా మాటలు వినపడడంతో అటు వైపు చూశాను నేను.
“మీ రెండోదాన్ని మాత్రం మాకే ఇవ్వాలండీ. మీ ఇంటి ఆడబిడ్డ మా ఇంటి బిడ్డ అవ్వాలి మీరేమన్నా సరే. ” అన్నారు వచ్చినాయన. “తప్పుగా అనుకోకండి బావగారు. పెద్దదాన్ని చదివించినా సరే ఊర్లో సంబంధం అనీ పైగా మంచివారూ అని వ్యాపారం చేస్కునే ఆయనకి ఇచ్చి చేసేశాను. చిన్నదాన్ని పదో తరగతి వరకు చదివించాను. దాన్ని చిన్నదో, పెద్దదో ఏదైనా ఉద్యోగం చేసే వాడికి ఇచ్చి చేయాలని నా ఆలోచన. మీరు మాత్రం ఇదేం మనసులో పెట్టుకోకండి.” అని నాన్నగారు చెప్తూ ఉండగానే, సరే లెండి అంటూ లేచారు వచ్చినాయన.
అవును! మా నాన్నగారికి చదువన్నా, కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళన్నా చాలా ఇష్టం, గౌరవం. నాకేమో చదువు పక్కన పెడితే చిన్నప్పటి నుండి సినిమాలన్నా, నవలలన్నా చాలా ఇష్టం. అప్పటికే ప్రేమపావురాలు, ప్రేమాలయం చెప్పలేనన్ని సార్లు చూశాను . చూసిన ప్రతీ సారీ నాకోసం పుట్టినవాడు, చక్కగా చదువుకున్నవాడు, కళ్ల ముందు కళ్ళు తిప్పుకోలేని అందం ఉన్నా నాకోసం వెతికి చూసేవాడు ఎక్కడో ఉండే ఉంటాడు అని నా ఊహల్లో నేను ఉండేదాన్ని.
ఎప్పటిలాగానే ఒకరోజు టీ.వీలో ఋతురాగలు సీరియల్ చూస్తూ ఉన్నాన్నేను. చాలా ఉత్కంటభరితంగా సాగుతోంది ఇంతలో ఎవరో వచ్చి ఇంట్లో “మీ నాన్నగారు లేరమ్మా?” అనడిగారు. “ఉన్నారండి మీరు కూర్చోండి.” అంటూ ఒక చిన్న పీట ఉంటే వేశాను. మంచినీళ్లు తాగుతారా అనడిగి నాన్నగారిని పిలిచి మంచినీళ్లీచ్చి, సరిగ్గా సీరియల్ సస్పెన్స్‌లో ఉండగా వచ్చింది. ఈవిడెవర్రా బాబు అనుకుంటూ టివి ఆపేసి అటుగా ఆడుకోవడానికి వెళ్తున్న పిల్లల దగ్గర ఏదో కొత్తగా కనిపించేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్లిపోయాన్నేను.
ఆ తర్వాత అప్పుడప్పుడు ఆవిడ మా ఇంటికి వస్తూ ఉండేది. మా నాన్నగారు ఏదో మాట్లాడేవారు. ఒకరోజు సాయంత్రం నాకు స్వాతి బుక్ దొరకలేదు అని మా అన్నయ్యకి చెప్తే, గంట తిరిగే లోపు నా చేతిలో స్వాతి బుక్ పెట్టేసి తను బయటకి వెళ్ళిపోయాడు. ఆరోజు రాత్రి అమ్మ, నాన్నగారికి భోజనం పెడ్తూ ఉంది. నేనేమో హీరోయిన్ల బ్యూటీ సీక్రెట్లు, హిందీ సినిమా హీరోల ప్రేమ వ్యవహారాలు చాలా ఆసక్తిగా చదువుతూ ఉన్నాను. ఇంతలో అమ్మ చిన్నగా నాన్నగారిని అడుగుతూ ఉంది, “ఏంటండీ మరి ఏం ఆలోచించారు? అబ్బాయి మంచోడే అంటారా? అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న, తోడబుట్టినవాళ్ళు అందరూ మంచి వాళ్లేనా?” అని ఆపకుండా అడిగింది అమ్మ. “నేను కనుక్కున్నానే అబ్బాయి చదువుకున్నాడు, రేపో మాపో ఉద్యోగం వచ్చేస్తుందంట. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఎలాంటి వాళ్ళనేది పక్కన పెడితే, అబ్బాయి గురించి అందరూ బానే చెప్తున్నారు. దీని జీవితం సుఖంగా ఉంటుంది అని నాకనిపిస్తుంది” అని అన్నారు నాన్నగారు.
ఇన్నాళ్ళూ మా ఇంట్లో జరిగే మాటలు నాకు పెళ్లి చేయడం కోసమా అని అప్పుడు నాకర్ధం అయింది. అలా కొన్ని రోజులు మా ఇంటికి ఎవరో ఒకరు రావడం నా పెళ్లి కోసం మాట్లాడడం వెళ్ళడం జరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత మా అమ్మ నా దగ్గరకి వచ్చి, “గురువారం నిన్ను చూడ్డానికి వస్తున్నారు. మొఖానికి కొంచెం నలుగు పెట్టుకుంటూ ఉండు. ఎండలో తిరిగి ఎలా చేస్కున్నావో చూడు.!” అని చెప్పేసి వెళ్ళిపోయింది. అమ్మకేం బానే చెప్తుంది. రేపు దిష్టి బొమ్మలా ఎవరో తెలియని వాళ్ళ ముందు కూర్చోవాల్సింది నేను. అయినా ఇప్పుడు నాకు పెళ్లి అంత అవసరమా? అని నాన్నగారిని గట్టిగా అడగాలనిపించింది. పైకి చెప్పరు కానీ, పాపం ఆయన ఎంత ఆలోచించి నిర్ణయం తీస్కున్నారో అని ఆగిపోయాను.
ఆ గురువారం రానే వచ్చింది. ఒక చక్కటి పట్టుచీర నాకు కట్టారు. నా జడ ఎంత పొడవుందో అన్ని కనకాంబరాలు నా తలలో పెట్టారు. ఇంతలో వీధిలో హడావిడి. పెళ్లి వాళ్ళు వచ్చేశారు అంటూ అందరూ వాళ్ళకి ఎదురు వెళ్ళి మరీ స్వాగతం చెప్తున్నారు. ఎక్కువ నవ్వొద్దు , ఎక్కువ మాట్లాడొద్దు , మొఖం నీరసంగా పెట్టొద్దు, అన్నిటికంటే ముఖ్యం మేము రమ్మనే వరకు బయటకి రావొద్దు, అని నా దగ్గరున్న వాళ్ళంతా బయటకి వెళ్లారు. ఒక పక్క నేను వాళ్ళకి నచ్చుతానా అని భయం. ఇంకో పక్క ఎక్కడ నచ్చేస్తే, నాకు పెళ్లి చేసి, ఎప్పుడూ వినని ఊరుకి, తెలియని మనుషుల దగ్గరకి పంపించేస్తారేమోనని మనసులో ఆందోళన.
“అబ్బాయి గురించి ఇప్పటికే మీకు చాలా మంది చాలా విషయాలు చెప్పే ఉంటారు. ఇదిగోండి ఇప్పుడు మీ ఎదురుగానే ఉన్నాడు. ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు.” అని అన్నారు మధ్యవర్తి. “మేమేం అంటాం లెండి !అబ్బాయికి అమ్మాయి నచ్చితే అదే పదివేలు. అమ్మాయిని పిలిపించమంటారా.” అని అన్నారు నాన్నగారు. వాళ్ళు సరే అనడమే ఆలస్యం, వెంటనే నలుగురయిదుగురు నా దగ్గరికి వచ్చి పెళ్లి వాళ్ళ మధ్యలోకి తీసుకెళ్ళి నుంచోబెట్టారు. “తల్లీ .. అబ్బాయిని చూడమ్మా! చూడు.” అని నాన్నగారు నా పక్కకి వచ్చి మెల్లగా అంటున్నారు. ఏం చూడను! అప్పటికే నా పరిస్తితి ఎలా ఉందంటే, భయంతో నా చేతులు వణుకుతున్నాయి. సిగ్గుతో నా పెదవి లోపలికి ముడుచుకుంటుంది. గౌరవంతో నా తల కనీసం పైకి ఎత్తడానికి ఆలోచిస్తుంది. అదిగోమ్మ అబ్బాయి అని నాకు ఒక రెండు అడుగుల దూరం లో ఉన్న ఒక వ్యక్తిని చూపించారు. కళ్ళు చూడడానికి ఆలోచించినా, మనసు చూడమని ఆత్రం చేసేసరికి కొంచెం ముందుకి చూశాను .
ఆయన మొఖం చూసేంత ధైర్యం నాకెలాగో లేదు. కిందకి అలా చూస్తూ ఉన్నా ఆయన కాళ్ళు కనిపించాయి. మా మధ్యలో కాస్త ఖాళీ ఉండడంతో, ఆయన ఎంత పొడవూ అన్నది నాకర్ధం అయింది. పురాణాల్లో, పాత సినిమాల్లో అంటారే ఆజానుబాహుడు అని ఆ పదం నాకు ఎందుకో ఆ నిమిషం తట్టింది. ఇలా ఇంత హడావిడిలో కూడా నా ఊహాలోకంలో నేను తిరుగుతుండగా, నాలో మెదిలిన ఆలోచన ఏంటంటే, ‘నేను కనీసం ఆయన భుజానికి కూడా రాను కదా. నేను అసలు వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా ఆయనకి నచ్చుతానా?’ అనిపించింది. తర్వాత నన్ను లోపలికి వెళ్లిపోమన్నారు. కాసేపటికి పెళ్లివాళ్ళు కూడా వెళ్లిపోయారు.
కొన్ని రోజుల తర్వాత మా ఇంట్లో మళ్ళీ హడావిడి మొదలయింది. అబ్బాయి వాళ్ళకి అమ్మాయి నచ్చింది ఇంక తాంబూలాలు పెళ్ళీ అంటూ వచ్చినాయన తెగ మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి నేను వాళ్ళకి నచ్చానా!. ఇది నిజమేనా అని నాకే అనుమానం వచ్చింది. ఈ నిమిషం ఎందుకో చాలా బావుంది. నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను. ముందెప్పుడూ లేని ఒక లాంటి భావన. ‘వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా..’ టివి లో ప్రతి రోజు వినే పాటే కానీ ఈరోజెందుకో కాస్త కొత్తగా ఉంది.
ఆరు నెలల తర్వాత ఆయనతో పాటు కొత్త ఇంట్లోకి , కొత్త మనుషుల్లోకి , కొత్త లోకంలోకి అడుగు పెట్టాను. కానీ తల నిండా ఆలోచనలే ఎలా ఉండాలీ, ఏం చేయాలీ, ఏం చేస్తే ఏం అనుకుంటారో అని. టైమ్ నాలుగయింది. టివి చూద్దాం అంటే ఇక్కడ టివి లేదు, సరదా సరదాగా ఏదైనా చేసే నేను, సరదా కోసం అసలు వీళ్ళు ఏం చేయరు అని తెలిసాక ఏం చేయాలో అర్ధం కాలేదు. ఆకలిగా ఉన్నా లేకపోయినా వంటగదిలో రకరకాల ప్రయోగాలు చేసేదాన్ని నేను. ఇప్పుడు ఆకలిగా ఉంది అని ఎవరికి చెప్పాలో అర్ధం కాలేదు. ఆయన మంచివారే కానీ అలల లాంటి నా ఆలోచనలను ఏ తీరం సమాధానం ఇవ్వలేకపోతుంది. చాలా కలలే కన్నాను. పెద్దపెద్ద మేడలు, ఒంటి నిండా బంగారం, ఇంటి నిండా వెండి ఇలాంటివి ఎప్పుడూ కోరుకోలేదు. బహుశా నావి ఏ ఆడపిల్లకయినా ఉండే కోరికలే. ఎవరికైనా చెప్తే దీనికేనా ఇంతలా ఆలోచిస్తున్నావ్ అంటారేమో. కానీ ఆడది తన ఆలోచనలతో ఆకాశానికి నిచ్చెన వేయదు కానీ, ఇలలో ఆనంద స్వర్గాన్ని నిర్మించాలి అనుకుంటుంది. చిన్న జీవితం, చింతలేని జీవితం. ఇదే తన కోరిక. మెల్లగా తెలిసింది ఏంటంటే ఆడపిల్ల కలలు పేకమేడల్లాంటివి. పరిస్థితులు,కాలం లాంటి గాలి వీచిందంటే ఒక్క క్షణం పట్టదు. కానీ ఉన్నదాంట్లో ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాన్నేను.
పాతికేళ్ళయింది. ఇద్దరు పిల్లలు. అవ్వడానికి రోజులు యుగాళ్లా గడిచినా ఇప్పుడు తలచుకుంటే మాత్రం ఇంత చూసేశానా అప్పుడే అనిపిస్తుంది. మా నాన్నగారి కల ఉద్యోగం చేసే అల్లుడు కావాలి అన్నది కలగానే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కల మా ఆయనది. వచ్చే అల్లుడయినా ఉద్యోగం చేస్తే బావుంటుంది అని. ఇంక నాలా నా పిల్లలు ఉండకూడదు అని ముందే చెప్పేసా వాళ్ళకి. జీవితంలో ఎన్నో అనుకుంటాం, ‘నేను ఇది చేయాలి, అది చేయాలి, నాకు ఇలాంటి వాళ్ళు రావాలి, అలాంటి వాళ్ళు రావాలి అని.’ వాటి కోసం కష్టపడండి తప్పులేదు కానీ, పరిస్తితులు ఉన్నాయే మనల్ని ఎప్పుడు ఎక్కడకి తీసుకెళ్ళి పడేస్తాయో తెలీదు కాబట్టి, ఏం జరిగినా తట్టుకుని నిలబడగలిగే ధైర్యం మాత్రం ఎప్పుడూ వీడకండి.. అప్పుడప్పుడు చీకటిలోకి వెళ్ళడం సహజమే, కాకపోతే ఉదయం వచ్చే వెలుతురు కోసం మనం ఆగిపోకుండా ఏదైనా దీపం సహాయంతో ఆ వెలుతురుని మనమే సృష్టించుకోవాలి అని. పిల్లల నవ్వుల్లో నాకు ఓ కొత్త జీవితం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ల చిన్న గెలుపు అయినా సరే నాలో ఓ ఓడిపోయిన కల సంపూర్ణం అయినట్టు ఏదో సంతృప్తిని కలిగిస్తుంది. ఇలా అనుకుంటూ ఉండగా వెనక నుండి మా వారి పిలుపు వినిపించింది. “నీకిష్టమని మార్కెట్ నుండి జిలేబి తీస్కొచ్చాను తినూ,” అంటూ. ఈయనింతే ఆలోచనలతో సతమతమవుతూ ఉన్న ప్రతిసారీ అదేంటో భలే వస్తారు. ఎంతకాలం చీకటి కనిపించినా, చివరికి వెలుతురు తనదైన టైమింగ్‌తో తప్పకుండా వస్తుంది…అదే టైమింగ్‌లో నాకో కొత్త పుట మొదలయ్యింది.








