నవ్యాక్షరం – కథ : నేను నేనుగా లేనే…

నేను నేనుగా లేనే…

కవనమాలి

నేను నేనుగా లేనే..నిన్న మొన్నలా..లేని పోనీ ఊహల్లో.. ఎందుకో ఇలా..

అప్పటికే మ్రోగి మ్రోగి రెండు మిస్డ్ కాల్స్ అనే నోటిఫికేషన్ తర్వాత వస్తున్న మూడవ కాల్. అదేమీ తెలియని ప్రీతి స్నానం చేస్తుంది.ప్రీతి రూమ్మేట్ ఝాన్సీ తన ఫోన్ లో నెట్­ఫ్లిక్స్­లో ఫర్గాటెన్ అనే థ్రిల్లర్ సినిమా చూస్తుంది. ఫోన్ రింగ్ ఇర్రిటేట్ చేస్తుండటంతో లేచి ఫోన్ లిఫ్ట్ చేద్దాం అనుకునే లోపే కాల్ కట్ అయ్యింది.

“ప్రీతి.. ప్రీతి.. త్వరగా రావే.. మీవోడు కింద వెయిట్ చెయ్యలేక ఫోన్­ల మీద ఫోన్లు చేస్తున్నాడు. ఇంకాసేపు ఇలాగే వదిలేస్తే పైకే వచ్చేసేలా ఉన్నాడు.” అంటూ డోర్ డబ డబమని కంటిన్యూగా కొట్టేసింది.

“అబ్బా.. రాక్షసి. ఆగవే!” అంటూ తల తుడుచుకుంటూ బయటికి వచ్చిన ప్రీతి, ఝాన్సీ చేతిలోని ఫోన్ లాక్కుని మాధవ్­కి కాల్ చేసింది.

“ప్రీతి.. వాట్ ఇస్ దిస్.. ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా.. కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయకపోతే ఎలా!?”

“సారీ రా కన్నా!.. ఇదిగో వచ్చేస్తున్నా.. ఒక్క టెన్ మినిట్స్..” అంటూ చివర్లో క్షమాపణగా ఒక ముద్దుతో ఫోన్ కాల్ ముగించింది.

ఝాన్సీ, “ఏంటే.. ఒక పక్క కాల్­లో రొమాంటిక్ గా ముద్దు ఇస్తూ, పైకి మాత్రం టెన్షన్­తో చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటి సంగతి.” అడిగింది.

ప్రీతి, కబోర్డ్‌లోంచి రెండు డ్రెస్‌లు తీసి, అందులో ఏది వేసుకోవాలి అనే కన్ఫ్యూజన్‌లో ఉంది. ఝాన్సీ మళ్ళీ అడగటంతో ఈ లోకంలోకి వచ్చిన ప్రీతి “నాకు మాధవ్ అంటే యిష్టమేనే.. కానీ వాళ్ళ అమ్మ అంటేనే భయం. ఈ రోజు మొదటిసారిగా వాళ్ళని కలవడం అంటే ఎంత హ్యాపీగా వుందో అంతే టెన్షన్‌గా ఉంది. వాళ్ళ అమ్మ చాలా స్ట్రిక్ట్‌ రా. మర్యాదల్లో కానీ పనుల్లో కానీ ఆమెకి నచ్చనిది ఏం జరిగినా అది ఎంత చిన్నదయినా ఆమె భద్రకాళి అవుతుంది అని మాధవ్ చెప్పేవాడు.” అంటూ, ముందున్న రెండు డ్రెస్‌ల వైపు చూస్తూ ఉండిపోయింది. నిజానికి తాను ఆ రోజు ఎలా జరగబోతుందో అనే ఆలోచనలో ప్రస్తుతం నుండి జోన్ అవుట్ అయిందని ఝాన్సీ గమనించింది.

“అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇప్పటికే నువ్వు ఫోన్ లో చాలాసార్లు మాట్లాడావు కదా. ఇంకేం భయం. అయినా నీతో ఇదేనే ప్రాబ్లెమ్. ఉన్నవి లేనివి అన్నీ ఉహించుకొని, అసలేమీ జరగకముందే ఏదో జరిగిపోతుంది అని భయపడి ఛస్తావ్.” అంటూ మంచంపై ఉన్న వైట్ డ్రెస్ తీసి, “ఇదిగో ఇది వేసుకో.. నీకు ఈ డ్రెస్ చాలా బాగుంటుంది.” అంటూ భుజంపై వాలి, “మీవోడు నిన్నిలా చూసి నువ్వు కార్ ఎక్కగానే ఓ ముద్దు ఇచ్చేస్తాడు చూడు.” అంటూ ఆటపట్టించింది.

నుదుటున పట్టిన చెమటలపై చల్లగాలి వీచినట్టు,  మనసులోని ఆందోళనకి ఝాన్సీ కాస్త ఊరటనిచ్చింది.

***

ఝాన్సీకి భవిష్యత్తు చూడగల పవర్ ఏదో ఉందేమో అనిపించింది ప్రీతికి. సిగ్గుతో బుగ్గని తుడుచుకుంటూ “ఏంటి మాధవ్ ఇది..అసలే అవతల అమ్మ వాళ్లకి నేను నచ్చుతానో లేదో అని ఎంత భయపడుతున్నానో తెలుసా!.” అంది.

“ప్రీతి.. అసలు నీకు ఉండాల్సిన డౌట్ ఏ కాదు అది. నువ్వు ఎవరికైనా నచ్చేస్తావ్.. నాకైతే మరీ మరీను..” అంటూ ఆటపట్టిస్తూ కార్­ని తన ఫ్లాట్ వైపు కదిలించాడు.

“చూడు ప్రీతి.. ఇప్పుడు భయపడాల్సింది నువ్వు కాదు నేను..”

ప్రీతి అర్థంకానట్టు చూసింది.

“అమ్మ పైకి కాస్త స్ట్రిక్ట్­గా ఉంటుంది కానీ అలాగని ఆమెవి సీరియల్లో చూపించినట్టు లేడీ విలన్ కాదు. కాస్త నీతో సింక్ కుదిరిందనుకో, ఇక ఆ తరువాత మీరిద్దరూ ఒక టీమ్ అవుతారు. ఇక నాన్న అంటావా సైలెంట్ ఋషి. మాట్లాడితే శ్రమ అని ఆయన ఎప్పుడూ ఎవరిని ఇబ్బందిపెట్టరు. ఇక చూడు మీరంతా ఒక వైపు, నేనొక్కడినే ఒక వైపు. మరి నాకే కదా భయం..”

“ఇదిగో ఈ మాటలే.. ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ అన్నీ మర్చిపోయేలా చేస్తావ్. ఆఖరులో ఇదిగో నీ టాస్క్ అంటూ గుర్తుచేస్తావ్.” అంటూ మాధవ్ భుజం గిల్లింది.

మాటల్లో మాటల్లో అపార్ట్మెంట్ వద్దకి వచ్చేసారు.

లిఫ్ట్ ఆరవ ఫ్లోర్‌కి ఎగరాలని ఉత్సాహపడుతుంది.

“అయినా ఉన్నట్టుండి అమ్మానాన్న సిటీకి ఎందుకు వచ్చినట్టు?”

“తమ్ముడికి ఇక్కడే ఏదైనా మంచి కాలేజీ చూద్దాం అన్నారు. సరే ఒక నాలుగు రోజులు ఉన్నట్టు ఉంటుంది. పైగా మీకు కాబోయే కోడలిని కలిసినట్టు ఉంటుంది అని నేనే రమ్మన్నాను.”

“మరి అదేదో నాకు ముందే చెప్పొచ్చు కదా, నిన్న రాత్రి ఫోన్ చేసి ఇలా సడన్ ప్లాన్ అంటే ఎంత కష్టమో తెలుసా మా అమ్మాయిలకి.”

“అది అమ్మాయిలకి కష్టంరా. నీకెందుకు.”

“నిన్నూ..” అంటూ మాధవ్ మీదకి వెళ్లబోతుంటే, లిఫ్ట్ ఆరవ ఫ్లోర్‌కి వచ్చేసా అంటూ సౌండ్ చేసింది.

ఫ్లాట్ ముందు చెట్లు చూడటానికి చాలా బాగున్నాయి. మాధవ్ లాక్ తీసి లోనికి వెళుతుంటే, ప్రీతి ఏడడుగులకి ఇప్పుడే ప్రాక్టీస్ అన్నట్టు, అత్తారింటికి మొదటిసారిగా భర్తతో వచ్చినట్టు ఊహించుకుంటూ అతని అడుగులో అడుగేస్తూ లోనికి వెళ్ళింది.

***

హాల్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నా, ప్రీతి మాత్రం కంగారుగానే ఉంది. తనని, తన భయాన్ని అర్థం చేసుకున్నట్టు మాధవ్ మధ్యమధ్యలో తన వైపు చూస్తూ కళ్ళతోనే ధైర్యం చెప్పడానికి ప్రయత్నించాడు.

మాధవ్ అమ్మగారు అడిగిన ప్రశ్నలకి ప్రీతి తడబడుతూనే సమాధానం ఇచ్చింది. తానే టీ పెడతా అంటూ ప్రీతి కిచెన్‌లోకి వెళ్ళింది. మాధవ్ కూడా “అమ్మా.. తనకి షుగర్ టీ పొడి ఎక్కడున్నాయో చెప్పొస్తాను” అంటూ వెనకే కిచెన్‌లోకి వెళ్ళాడు.

ప్రీతి ఏదో అడుగుదామని అనుకుంటుండగానే మాధవ్ కిచెన్‌లోకి వచ్చి, వెనక్కి తిరిగి ఎవరూ అటు రావట్లేదు అని గమనించి, వెంటనే ప్రీతిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టాడు. ప్రీతికి షాక్‌లో గొంతు తడి ఆరిపోయింది.

“ఉమ్మా.. ఇది వన్ అఫ్ మై డ్రీమ్ తెలుసా ప్రీతి. చూడు నా కోసం, మన కోసం ఈ రోజు ఈ ఒక్కరోజు నీ అనుమానాలు భయాలు అన్నీ పక్కకి పెట్టు.. ఇది మనకి చాలా ముఖ్యమైన రోజు. అమ్మ నిన్ను చాలా గమనిస్తుంది.”

ఆ మాటకి ప్రీతి నిలువెల్లా వణికింది.

“సరే సరే.. నువ్వు ఇలా ఇబ్బందిపడటం నాకు కూడా ఇష్టం లేదు. లంచ్ అవ్వగానే ఏదో పని ఉందని నేనే నిన్ను డ్రాప్ చేస్తాను.” అంటూ డిసపాయింట్ అయిన ముఖంతో బయటికి వెళ్ళాడు.

***

లంచ్‌లో అందరూ నవ్వుతూ, కబుర్లతో భోజనము చేస్తున్నారు. ప్రీతి పక్కనే కూర్చున్నాడు మాధవ్. మాధవ్ అమ్మగారు ఒక్కో కూర గురించి చెబుతూ, ‘మాధవ్ ఇది వడ్డించు అమ్మాయికి.. ఏ అమ్మాయి ఈ కూర తింటావా? నీకు ఏ ఏ వంటలు బాగా వచ్చు? నాన్ వెజ్ వండుతావ్ కదా?’ ఇలా వరుస ప్రశ్నలు వేసింది.

మాధవ్ తమ్ముడు చాలా తక్కువ మాట్లాడాడు.

ప్రీతి ప్రతి ప్రశ్నకి ఏం సమాధానము చెప్పాలా అని ఆలోచించుకునేలోపే మరో ప్రశ్న రావడంతో సైలెంట్‌గా ఉండిపోయింది. తన బదులు ఆ ప్రశ్నలన్నింటికీ మాధవే సమాధానాలు ఇచ్చాడు.

చూస్తుండగానే సమయం గంటలు గడిచింది. మాధవ్ చెప్పినట్టుగానే, భోజనం తరువాత “అమ్మా.. ప్రీతికి అర్జెంట్‌గా ఆఫీస్ లాగిన్ అయ్యే ఇష్యూ వచ్చింది. ఇందాకే కాల్ వచ్చింది. నేను తనని హాస్టల్లో డ్రాప్ చేసి వస్తాను.” అని చెప్పాడు.

బయల్దేరే ముందు, మాధవ్ అమ్మానాన్నల కాళ్ళకి మొక్కాలని వంగాడు. ప్రీతి అలాగే నిలబడి చూస్తుంది. మాధవ్ తలెత్తి ప్రీతిని చూస్తూ మొక్కమంటూ సైగ చేసాడు. ప్రీతి తప్పు చేసినట్టు గిల్టీ ఫీల్ అవుతూ వంగి మాధవ్ అమ్మనాన్నల కాళ్లకి మొక్కింది.

కార్‌లో తిరిగి వస్తున్నంత సేపూ, మాధవ్ కాస్త అసంతృప్తిగానే ఉన్నాడు. ప్రీతి కూడా ఏమీ మాట్లాడలేకపోయింది. హాస్టల్ ముందు కార్ ఆగాక, మాధవ్ మామూలుగానే నవ్వుతూ ప్రీతి బుగ్గ గిల్లి “చూడు శ్రీమతి.. అమ్మకి నీ కంగారు అర్థం అయింది. నన్ను పక్కకి పిలిచి చెప్పింది. అమ్మాయికి నేనేమీ రాక్షసిని కాను, బాగా చూసుకుంటాను అని చెప్పు.” అని అన్నాడు.

***

రూమ్ డోర్ ధన్ ధన్ ధన్ మంటూ ఆగకుండా చప్పుడవుతూనే ఉంది. వాష్ రూమ్ నుండి ఝాన్సీ పరిగెత్తుకుని వచ్చి డోర్ తీసింది.

“ఏమైందే మెంటల్.. ఏంటా తొందర? ఎవడు చచ్చాడు? కాసేపు కూడా ఆగలేవా.”

ప్రీతి లోనికి వచ్చి డోర్ లాక్ చేసి, హ్యాండ్ బాగ్ దూరంగా విసిరేసింది. టేబులుపై ఉన్న వాటర్ జార్ తీసుకొని గడగడా సగం జార్ నీళ్లు తాగేసింది. ఒళ్ళంతా చెమటలు పడుతుంటే, దుప్పటి చుట్టూ కప్పుకొని వణుకుతూ మంచంపై కూలబడింది.

ప్రీతిని అలా చూసేసరికి, ఝాన్సీకి చాలా భయం వేసింది. పక్కనే కూర్చుని ఏమైంది, మీటింగ్ ఎలా జరిగింది, ఏమైనా అన్నారా అంటూ నెమ్మదిగా అడిగింది.

ప్రీతి ఉదయం హాస్టల్ నుండి బయలుదేరినప్పటినుండి, తిరిగి రూమ్‌కి వచ్చేదాకా జరిగిందంతా వివరముగా వణుకుతూ చెప్పింది.

“పిచ్చిదానా.. దీనికే ఇంత కంగారా.. అయినా ఆంటీ అర్థం చేసుకుంటారులే. ఎంత కాదన్నా ఆవిడ కూడా ఒకప్పుడు మనలా అమ్మాయే కదా. ఈ భయాలు అవీ తెలియవా ఏంటి?” అంది ధైర్యం చెబుతూ..

“అది కాదే!” అంటూ ప్రీతి కళ్ళనీళ్ళతో, ఝాన్సీవైపు చూసింది.

ఝాన్సీ ఏమిటన్నట్టు మరింత దెగ్గరికి జరిగింది ధైర్యంగా ఉండమంటూ..

“మేము ఉదయం ఇంటికి వెళ్లాం. హాల్లో వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు నేను మాధవ్ కూర్చుని మాట్లాడుకున్నాం, ఐదుగురం కలిసి భోజనం చేసాము.. అయితే..”

“అయితే..”

“ఆ ఇంట్లో ఉన్నది మాత్రం నేనూ, మాధవ్ మాత్రమేనే..!”

ఒక్క సెకన్ ఝాన్సీకి ఏమీ అర్థంకాలేదు. ఏదో పొరపాటుగా విన్నట్టు, మళ్ళీ చెప్పమంది.

“ఆ ఇంట్లో ఐదుగురం కూర్చుని మాట్లాడుకున్నాము. ఐదు గొంతులు వినపడ్డాయి. ఐదుగురం కూర్చుని భోజనం చేసాము. అందరం వడ్డించుకొని తిన్నాము. కానీ ఆ ఇంట్లో నా కళ్లకి కనిపించింది మాత్రం నేనూ, మాధవ్ మాత్రమే ఝాన్సీ..” అంటూ వణికిపోయింది ప్రీతి.

అప్పటిదాకా ప్రీతికి మాత్రమే సొంతమైన చెమటలు ఝాన్సీ నుదుటిని ఆక్రమించాయి. ప్రీతి ఒంటి వణుకు, ఝాన్సీకి పాకింది.

“అంటే.. అంటే..! ”

“నేను నేనుగా లేనే..నిన్నమొన్నలా.. లేనిపోని ఊహల్లో ఎందుకో ఇలా..”

ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడుతూ ఫోన్ మ్రోగింది. ఆగట్లేదు. మళ్ళీ మళ్ళీ మ్రోగింది.

ప్రీతికి జరిగిందంతా గుర్తొచ్చి పిచ్చిపట్టినట్టు చూస్తుండిపోయింది కదలకుండా. ఝాన్సీ ధైర్యం చేసి ఫోన్ లిఫ్ట్ చేసింది.

“ప్రీతి.. ప్రీతి.. ఇదిగో అమ్మ నీతో మాట్లాడుతుందంట.”

ఝాన్సీ వణుకుతూ ఫోన్ ప్రీతికి ఇవ్వబోతుంటే, చేయి జారి మంచంపై పడిపోయింది, పడిపోతున్నప్పుడు ఝాన్సీ వేలు టచ్ అయ్యి స్పీకర్ ఆన్ అయింది.

ఇద్దరూ ఫోన్ వైపు చూస్తున్నారు. అంతా నిశ్శబ్దం. కిటికీలోంచి వీస్తున్న చల్లగాలి కూడా వెన్నుని వణికిస్తుంది. ఇంతలో ఒక గొంతు వినిపించింది, ఫోన్ నుండి..

“ప్రీతి…………………………”

***

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading