నవ్యాక్షరం-కవిత్వం :రంగుల పేర్లు తెలియని పిల్లవాడు

రంగుల పేర్లు తెలియని పిల్లవాడు

-దొంతం చరణ్

బాబూ.. చివరిసారిగా 

నూ చూసిన రంగేమిటి..?”

చూపు కోల్పోయిన పిల్లవాడిని

డాక్టర్ ఇలా అడిగినప్పుడు

రంగుల పేర్లు తెలియని పిల్లవాడు

లోకానికి చెప్పిన జవాబు:

“నేను చూసినవి అనేక రంగులు–

యుద్ధంలో

మంటల రంగు;

బాంబుల శబ్దాలకు

గర్భస్థ శిశువుల మరణపు రంగు 

చేతులు తెగిపోయిన పిల్లలు

ఎలా కౌగిలించుకోవాలని అడిగినప్పుడు 

జలజల రాలిన అమ్మల కన్నీళ్ల రంగు;

డిటెన్షన్ క్యాంపులో మరణించిన

నాన్నల ముద్దు కోసం

పిల్లల ఎదురుచూపుల రంగు 

భూమికి తల బాదుకొని

భూగర్భంతో సంభాషించే

తల్లుల దుఃఖపు రంగు;

కూలిపోయిన ఇంటిలో

బూడిద కుప్పలో

టెడ్డీ బేర్ కు తోడుగా కూర్చున్న 

నాన్నల ఒంటరితనాల రంగు.

నా చూపులు మంటలో చితికిపోయి

నక్షత్రాల మీదికి చేరిపోయాక కూడా

నాకింకా కనిపిస్తున్న రంగేమిటంటే..

యుద్ధానికి బయట

కొందరి మౌనాల రంగు”

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading