నవ్యాక్షరం: ‘అవ్యక్త ప్రేమ’ కథ

రాత్రి పదకొండు దాటింది.ట్రైన్ లో నిద్ర పోవడానికి చాలా కష్టపడుతున్నాడు రాహుల్. ట్రైన్ మొత్తం కిక్కిరిసి ఉంది. స్లీపర్ క్లాస్ లో టికెట్ లేకుండా కూడా ప్రయాణించవచ్చు అని, తన చుట్టూ ఉన్న జనాన్ని చూసేదాకా తెలియలేదు తనకి. పొద్దున్న నుండి నాన్న తో తిట్లు తింటున్నాడు. దానికి తోడు జనం, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కి, కొంచం చోటు దొరికిన అది సీట్, నేల అని సంబంధం లేకుండా కూర్చుంటున్నారు. మరి కొందరు అయితే ఉయ్యాల కట్టుకొని మరి వేలాడుతున్నారు. చాలా విసుగ్గా ఉన్నాడు రాహుల్. అసలు అన్నీ అనుకున్నట్టు జరిగితే, పొద్దున్నే ఫ్లైట్ ఎక్కి పాటికి ముంబాయి చేరుకునేవాడు.

రాహుల్ వాళ్ళది లేడీస్ ఎంపోరియం బిజినెస్. డిగ్రీ పూర్తి అయ్యి మూడేళ్లు అయినా, ఉద్యోగం దొరకక రాహుల్ తమ షాప్­నే చూసుకునేవాడు. కానీ రాహుల్ వాళ్ళ నాన్నకి, రాహుల్­ని మంచి ఉద్యోగిగా చూడాలి అని కోరిక. రాహుల్ షాప్­లో ఉండటం వాళ్ళ నాన్నకి అంత నచ్చేది కాదు. బాధ, కోపం మనసులో ఉంచుకొని ప్రతీ పనికి రాహుల్­ని తిట్టేవాడు. మొదట్లో రాహుల్­కి నాన్న ప్రవర్తన పట్ల కోపం వచ్చినా కాలక్రమేణా తప్పు లేకపోయినా తిట్లు తినడానికి అలవాటు పడ్డాడు రాహుల్.

(వారం రోజుల కిందట)

ముంబాయిలో షాప్­కి కావాల్సిన స్టాక్ తెచ్చుకుందాం అని ప్రణాళిక వేసుకుంటున్నారు రాహుల్ మరియు వాళ్ళ అమ్మ. కొనాల్సింది లేడీస్ స్టాక్ కావడం వల్ల కచ్చితంగా అమ్మ కూడా ముంబాయి రావాల్సిందే లేదంటే రాహుల్ ఒక్కడే వెళ్ళేవాడు. అయితే వెళ్ళేది ఇద్దరే కాబట్టి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేద్దాం అని చూస్తున్నాడు రాహుల్. అప్పుడే నాన్న వచ్చిఎలాగో ఇద్దరే వెళ్తున్నారుగా, నేను కూడా వస్తా, అలాగే బాబాయ్ వాళ్ళని కూడా రమ్మందాం. అందరం కలిసి ట్రిప్ కి వెళ్లినట్టు ఉంటుందిఅని సలహా ఇచ్చాడు నాన్న.

      రాహుల్­కి ఆలోచన నచ్చలేదు. ఎందుకంటే చుట్టాలు అందరు వస్తే అందులో ఎంజోయ్మెంట్ కన్నా, తన గురించే పదే పదే మాట్లాడి అవమానించడమే ఎక్కువ ఉంటది అని బాగా తెలుసు. వోద్దని సూటిగా చెప్పాడు. కొడుకు మాట నెగ్గకూడదు అనే పంతంతో తండ్రిలో పట్టుదల రెట్టింపు అయింది. తక్షణమే తన తమ్ముడికి కాల్ చేసి విషయం అంతా చెప్పి, ట్రిప్ కి రమ్మని ఒప్పించాడు తండ్రి. రాహుల్ కళ్ళు ఎర్రబడ్డాయి. దూసుకొస్తున్న ఆవేశాన్ని నియంత్రించుకుంటూ, “సరే అయితే మీరే వెళ్ళండి నేను రానుఅని చెప్పి తన గది లోకి వెళ్లిపోయాడు.

     తన బెడ్ పై పడుకొని ఫ్యాన్­ని చూస్తున్నాడు. తెలియకుండానే కన్నుల కోన నుండి నేల రాలాయి రెండు నీటి బొట్లు. వెంటనే గ్రహించి, తూడ్చేసుకునే లోపల మోగింది అతడి ఫోన్. బాబాయ్ నుండి కాల్ అనగానే విషయం మొత్తం అర్ధం అయింది రాహుల్­కి. గ్యాప్­లో నాన్న జరిగింది అంతా బాబాయ్­కి చెప్పి ఉంటాడు అని అర్ధం చేసుకోడానికి పెద్ద సమయమేమి  పట్టలేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తే, బాబాయ్,”మేము వస్తే ఎందుకు రా నీకు అంత ప్రాబ్లెమ్..”, అని మొదలు పెట్టి మధ్యలో కుటుంబ విలువలు, బంధుత్వ మాధుర్యాల , భారత దేశ నైతిక విలువలు, మధ్య తరగతి ఆప్యాయతల గురించి చెప్పి చివర్లో,”ఏది ఏమైనా నువ్వు కచ్చితంగా రావాల్సిందే లేదంటే  నాన్న బాధపడతాడు“, అని ముగించాడు బాబాయ్. రాహుల్­కి ఒక బలహీనత ఉంది. తండ్రిని బాధ పెట్టకుండా ఉండటానికి పని చేయడానికి అయినా సిద్ధపడతాడు రాహుల్

      తనను తాను ఒక అసమర్ధుడుగా రాహుల్ అనుకుంటూ, ప్రతి క్షణం కుమిలిపోతూనే ఉంటాడు. అందుకే కనీసం నాన్నని తన ప్రవర్తన ద్వారా అయినా బాధ పెట్టకుండా చూసుకోవాలి అని తాపత్రయం. చేసేది ఏం లేక సరే వస్తానని చెప్పి ఫోన్ పెట్టేసాడు రాహుల్. జరగబోయే అవమానాలకు, తిట్లకు, అన్నిటికి సిద్ధంగా ఉన్నాడు రాహుల్.

      ట్రిప్ ప్లానింగ్ మొదలు పెట్టిన దగ్గర నుండి ప్రతీ విషయంలో ఆభిప్రాయ భేదాలు వస్తున్నాయి తండ్రి కొడుకులకి. . సి క్లాస్ బుక్ చేసుకుందాం అని రాహుల్, అవసరం లేదు స్లీపర్ క్లాస్ చేయమని తండ్రి. హోటల్ ఆన్లైన్­లో బుక్ చేసుకుందాం అని తనయుడు, వెళ్లినాక చూసుకుందాం  అని తండ్రి, ఇలా ప్రతి విషయంలో విబేధించినప్పడికి చివరికి నాన్నదే పై చేయి అవుతుంది. తండ్రి చెప్పినట్టు గానే స్లీపర్ క్లాస్­కే  చేసాడు రాహుల్

      రాహుల్ మరియు బాబాయ్ వాళ్ళ కుటుంబం గంట ముందే స్టేషన్ కి చేరుకున్నారుట్రైన్ అరగంట లేట్ అని తెలిసింది. తన పని అయిపోయింది అనుకున్నాడు రాహుల్. మొదలు పెట్టాడు నాన్నట్రైన్ లేట్ అనే విషయం ముందే తెలుసుకోకుండా ఏం చేస్తున్నావ్ రా! ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూనే ఉంటావు, పనికొచ్చేవి కూడా చూడాలి,లేట్ అయింది కాబట్టి సరిపోయింది కాస్త ముందు వచ్చి ఉంటె ఏంటి మన పరిస్థితి…“. పక్కనే బాబాయ్ కూడా నాన్న­కి కంపెనీ ఇద్దాం అనుకున్నట్టు గొంతు కలిపాడు నాన్నతో. ఇది ఆరంభం మాత్రమే, ముందు ముందు ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి అని తెలిసిన రాహుల్, వీళ్ళతో వాదించి ఎలాంటి ఉపయోగం లేదు అని మౌనంగా ఉండిపోయాడు

         కాసేపటికి ట్రైన్ వచ్చింది. అందరు లోపలికి వెళ్లారు. లగేజ్ అంత సీట్­ కింద పెట్టి కూర్చున్నారు అందరు. బాబయ్ పిన్నిలకి ఒక కొడుకు. పేరు చింటూ. వాడు 8th క్లాస్ చదువుతున్నాడు. ప్రస్తుతం యూట్యూబ్ లో ఎదో సైన్స్ వీడియో చూస్తున్నాడు. అది గమనించిన రాహుల్­కి తర్వాత ఘట్టం ఏంటో అర్ధం అయింది. చింటూ గాడి గురించి గొప్పలు చెప్పడం మొదలు పెట్టారు పిన్ని బాబయ్­లు. ‘నాన్న ఊరుకుంటాడా! నా  విన్యాసాల గురించి వాళ్ళకి చెప్తాడు . వాళ్లేమో మా చింటూ గాడు క్లాస్ 1st అని చెప్తుంటే నాన్న ఏమో మన  10th , ఇంటర్ మర్క్స్ తో పాటు డిగ్రీ లో ఉన్న బాక్లాగ్స్ గురించి పూసా గుచ్చినట్టు చెప్తాడు వాళ్ళకి. ఇదంతా విని వాళ్ళు నన్ను చూసి నావ్వుకోవడం, చింటూ గాడి ఓవర్ ఆక్షన్ తట్టుకోలేము బాబు ఇప్పుడు’ అని మనసులో అనుకున్నాడు రాహుల్

      రాహుల్ మనసు లోని మాటలని విన్నట్టుగా రాహుల్ వైపు చూసాడు కానీ రాహుల్ ఆశ్చర్యానికి , “మా వాడు కూడా ఒకప్పుడు బాగా చదివే వాడు. కానీ, ఎం అయిందో వాడికి ఇలా అయిపోయాడు …” అంటూ ఎదో చెప్పబోతు తన లోని మాటలని బయటకి చెప్పలేకపోతున్నాడు నాన్న. గొంతు కాస్త చిన్నబోయింది. ఉద్వేగాన్ని  ఆపుకున్నాడు నాన్న. రాహుల్ కి ఏం అర్ధం అవ్వడం లేదు. నాన్న కి మంచి నీళ్లు ఇచ్చింది అమ్మ. నీళ్లు తాగి గొంతు సరి చేసుకున్నాక , “ చింటూ గాడిని చూసి అయినా నేర్చుకో …” అని మళ్ళీ మొదలు పెట్టాడు

      ఏంటో కొడుకులని తిట్టినంత సునాయాసంగా వారి పట్ల ఉన్న ప్రేమ ని మాటల ద్వారా వ్యక్తపరచలేరు   తండ్రులు . మరి వాళ్ళ ప్రేమ తిట్ల రూపంలోనో దెబ్బల ముసుగులోనే ఉంటుందేమో

    ట్రైన్ ఏదో స్టేషన్ దగ్గర ఆగింది. స్టేషనో తెలీదు కానీ ఒకటే సారి జన సంద్రం మొత్తం పోటెత్తుకుంటూ దాడి చేసినట్టు గా ట్రైన్ లోపలికి దూసుకొచ్చారు. ఎవరికీ టిక్కెట్లు లేవు కానీ ఎలాగైనా వెళ్లొచ్చు అనే పటిమ కనిపిస్తుంది వాళ్లలో. ఒక్కసారిగా సీట్లు అన్ని ఇరుకు అయిపోయాయి. రాహుల్ వాళ్ళ తండ్రి మళ్ళీ కూత అందుకున్నాడు , “ఇలా ఉంటుంది అని తెలిస్తే AC క్లాస్ బుక్ చేస్కునే వాళ్ళం కదా రా. అప్పుడే చెప్పాల్సిందిగా …” అని రాహుల్ మీద విరుచుకపడ్డాడు తండ్రి. రాహుల్ అప్పడి వరకు అణుచుకున్న ఆవేశాన్ని , అవమానాన్ని బద్దలు కొట్టి,నేను ముందు నుండి చెప్తూనే ఉన్న కానీ మీరే అర్ధం చేసుకోలేదు…” అని మారు మాట్లాడాడు. తను ఏది అయితే జరగకూడదు అని బయపడి అప్పడి వరకు జరిగిన అవమానాలను భరిస్తూ ఉన్నది అదే జరిగింది , నాన్న మీద అరవడం అది కూడా వేరే వాళ్ళ ముందు. నాన్న ఈగో హర్ట్ అయింది. పక్కనే చుట్టాలు కూడా ఉండటంతో తరువాత కొన్ని ఘడియల వరకు రాహుల్ కి ఉత్తమ బోధకులు అయినా బాబయ్, పిన్ని మరియు నాన్న, మధ్య మధ్యలో చింటూ గాడు కూడా  బోధన, Anger management , Discipline మీద క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఇదంతా అమ్మ సైలెంట్ గా చూస్తూ ఉంటుంది

********

   ఇదంతా గుర్తుతెచ్చుకుంటూ ఉండగా టైం 12 దాటింది . తన ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ తన కాలి దగ్గర ఎదో తాకడం గ్రహించి ఉలిక్కిపడి లేచి చూసాడు రాహుల్. తను పడుకున్నాక కాలి దగ్గర కొంచం చోటు ఉండటం చూసి అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఒక 40 ఏళ్ళ వ్యక్తి. రాహుల్ ని చూసి , ” మీరు పడుకోండి సాబ్ .నో ప్రాబ్లెమ్అని గుట్కా నిండిన నోటితో చెప్పాడు వాడు. కర్మ రా బాబు అనుకున్నాడు రాహుల్.

     మరుసటి రోజు ముంబాయి లో ట్రైన్ దిగారు అందరూ. టాక్సీ బుక్ చేసుకొని హోటల్­కి వెళ్లారు. హోటల్­లో రూమ్ తీసుకుంటున్నప్పుడు, ఆన్లైన్­లో ముందే బుక్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ లభిస్తుంది అని తెలుసుకున్న నాన్న, రాహుల్ పై మండిపడ్డాడు. రాహుల్ నోరు తెరవలేదు. 5 నిమిషాలతో పోయేదానికి ఎందుకు అరగంట క్లాస్ పీకించుకోవడం అనుకున్నాడు.

   అందరు తమ తమ గదులకు వెళ్లి ఫ్రెష్ అయ్యారు. టిఫిన్ రూమ్­కే వచ్చింది. తిన్నారు అందరు. భోజనం అయినాక అమ్మనాన్నలు స్టాక్ చూడటానికి వెళ్లారు. పిన్నిబాబాయ్­లు దగ్గర్లో ఉన్న గుడికి వెళ్లారు. రాహుల్, చింటూ మిగిలిపోయారు రూమ్­లో. హాయిగా  రెస్ట్ తీస్కోవచ్చు అని సంతోషపడ్డాడు రాహుల్. కానీనేను నిన్ను ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాను అన్నట్టు’ గా వచ్చాడు చింటూ గాడు. వాడిని బయటకు తీసుకెళ్ళమని అడిగాడు రాహుల్­ని. నీరసంగా ఉన్న రాహుల్ ఒప్పుకోలేదు . మొండివాడైన చింటూ వదలలేదు .  

       చేసేది ఏం లేక బయటకు తీసుకవెళ్లాడు వాడు అడిగింది కొనిచ్చాడు. ఇద్దరు బయట చిరుతిళ్ళు తిన్నారు. తిరిగి రూమ్­కి చేరుకున్నారు. రాహుల్­లో అలసట మరింత పెరిగింది. రాత్రంతా నిద్ర లేకపోవడం వలనో లేదా బయట తిండి తినడం వల్లనో తెలీదు కానీ, రాహుల్ ఆరోగ్యం దెబ్బతింది. పూర్తిగా అలిసిపోయి పడుకున్నాడు.

           సాయంత్రం రూమ్­లో బెడ్ మీద పడుకొని ఉన్న రాహుల్­ని చూసింది అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మ. రాహుల్ ఒళ్ళు బాగా కాలుతుంది, విపరీతమైన జ్వరం ఉంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఫుడ్ పాయిసన్ అయింది అని, కొన్ని రోజుల వరకు విశ్రాంతి అవసరం అని  డాక్టర్ చెప్పారు. మందులు తీస్కొని హోటల్ కి వెళ్లారు.

          పరిస్థితి లో  అక్కడ ఎక్కువ రోజులు స్టే చేయడం కష్టం అని భావించి, తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ట్రిప్ మొత్తం ప్లాప్ అవ్వడం వల్ల, అంత దీన స్థితి లో కూడా నాన్న చేత చివాట్లు పడ్డాడు రాహుల్.మధ్య తరగతి కుటుంబాలలో ఇది చాలా సాధారణమైన విషయం. దెబ్బ తాకించుకొని ఏడుస్తూ ఇంటికి వచ్చిన కొడుకుని, కొట్టి మళ్ళీ ఏడిపించి తర్వాత వైద్యం చేయడం ఆనవాయితీ.

        బాబాయ్ వాళ్ళని కొన్ని రోజులు ఊరు చూడమని చెప్పి అమ్మ నాన్న రాహుల్ తిరుగు ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. గత ప్రయాణ అనుభవాలు గుర్తుకొచ్చి ఈసారి AC కోచ్ బుక్ చేసుకున్నారు. మరుసటి రోజు ఉదయానే ఇంటి బాట పట్టారు. ట్రైన్ ఎక్కారు ముగ్గురు.

               ట్రైన్ ఎక్కగానే నిద్రపోయాడు రాహుల్ . అమ్మానాన్నలు ఎదో మాట్లాడుకుంటున్నారు. “పాపం వాడిని చుట్టాల ముందు కూడా తిట్టడం అవసరమా అంది.ఎంత బాధ పడిఉంటాడో ఏమో?” అంది అమ్మ నాన్నతోనాన్న రాహుల్ పడుకున్నాదు గమనించి , గొంతు చిన్నది చేసివాడిని తిట్టడం నాకేమైనా  ఇష్టమా? వాడు మనలా అవ్వకుండా బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలి అని ఆశపడ్డాను, అది తప్పా? ఇంకా ఎంత కాలం ఇలా షాప్­లో కూర్చుంటాడు? షాప్­ని మెయింటైన్ చేయడానికి ఎంత కష్టపడుతున్నామో నీకు తెలుసుగా, వాడు ఆలా కష్టపడకూడదు అనేగా నా తాపత్రయం అంతా. వాడు మంచి స్థాయిలో ఉంటే, నలుగురితో గర్వంగా చెప్పుద్దాం అనుకున్నా, కానీ వాడు కూడా నాలాగనే షాప్ లో కూర్చుంటే ఇక వాడు చదివిన చదువుకి అర్ధం ఎం ఉంది అసలు. ఈపాటికి వాటికి మంచి ఉద్యోగం ఉండి ఉంటే…” ఇంకా మాట్లాడలేకపోయాడు నాన్న, తన స్వరం నెమ్మదించింది. ఆవేదన అంతా దిగమింగుకుంటూ, లేచి మొహం కడుక్కుందాం అని వెళ్ళాడు. వెళ్తున్న దారి మొత్తం మసకమసకగా కనిపిస్తుంది. కన్నీళ్ళు కళ్ళను చుట్టుముట్టేయడం వల్లనేమో….

   ఇదంతా విన్నాడు రాహుల్. ఎం తోచలేదు తనక . నాన్నని ఎప్పుడు బలహీనంగా చూడలేదు. నాన్న అనగానే ధృడమైన ఆకారం, గంభీరమైన గొంతు , తరచుగా వచ్చే తిట్లు లక్షణాలు అని మెదిలేవి రాహుల్ మదిలో, అలాంటి నాన్న స్వరం మూగపోవడం 4 రోజుల్లో ఇది రెండో సారి చూడటం. ఏమి అంతు పట్టలేదు రాహుల్­కి. అంతర్మధనం మొదలు అయింది. తనతో తానే చాలా సేపు యుద్ధం చేశాడు. లోపల ఉన్న జ్వరంతోనే కాకుండా చాలా సేపు తన ఆలోచనలతో పోరాడి అస్తవ్యస్తం అయిపోయాడు. చివరగా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి అని ధృడంగా నిర్ణయించుకున్నాడు

(మూడు నెలల తరువాత)

      రాహుల్ సేల్స్ ఫీల్డ్­లో జాబ్ తెచ్చుకున్నాడు. జీతం నెలకి పాతిక వేలు. సేల్స్ జాబ్ అంటే మిగిలిన వాళ్ళకి చిన్న చూపు ఏమో కానీ రాహుల్­కి  మాత్రం ఇది చాలా పెద్ద విషయం. గత మూడు నెలలుగా ఎంతో కష్టపడ్డాడు జాబ్ కోసం. మొదటి 30  ఇంటర్వ్యూలో కనీసం సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోలేకపోయాడు. తన లోపాలని అర్ధం చేసుకొని, ఎంతో శ్రమించి కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నాడు

       తనకు జాబ్ వస్తేనే నాన్న సంతోషంగా ఉంటాడు అని భావించి, రాత్రిపగళ్ళు తెగ కష్టపడ్డాడు రాహుల్. ఈరోజు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాడు. జాబ్ తెచ్చుకున్నాడు. నాన్న కచ్చితంగా సంతోషిస్తాడు అని ఉత్సవాహంగా ఇంటికి వెళ్లి నాన్నతో తన ఆనందాన్ని పంచుకున్నాడు రాహుల్.

  “ఏం జాబ్ రా?అడిగాడు తండ్రి. “సేల్స్ ఎగ్జిక్యూటివ్ డాడీబదులిచ్చాడు రాహుల్

మరి అదేదో గవర్నమెంట్ జాబ్ అన్నట్టు ఎందుకురా అంత ఆనందం. మూర్తి అంకుల్ వాళ్ళ కొడుకు­కి ఫైనల్ ఇయర్­లో ఉండగానే 25LPA  ప్యాకేజీ వచ్చింది. మనమేమో నెలకి 25 వేలతో సంతోష పడుతున్నామ .” అన్నాడు నాన్న నిరుత్సాహంగా కనీసం రాహుల్ వంక చూడకుండా ఎదో న్యూస్పేపర్ చదువుతూ.

      గుండె పగిలింది రాహుల్­కి. మారు మాట్లాడలేకపోయాడు. కాసేపటి దాకా చీకటి అలుముకుంది తన చూపుని .బయట గేట్ వైపు గా నడుస్తున్నాడు . ప్రతి అడుగు భారంగా అనిపిస్తుంది .గురుత్వాకర్షణ శక్తి కొన్ని టన్నుల బలం తో రాహుల్ ని దాని వైపు గా లాగుతున్నట్టుంది. ఆకాశంలో కూడా నల్ల మేఘాలు అలుముకున్నాయి. వర్షం మొదలు అయింది. పైనుండి రాలుతున్న వర్షం రాహుల్ తో పాటు వాడి కన్నీళ్ళని కూడా తూడ్చే ప్రయత్నం చేశాయి.

పేపర్ పక్కన పెట్టి దిగాలు గా అలా పైకి చూస్తూ ఉండిపోయాడు నాన్న. బహుశా ఏదో వాక్యం ఆలోచింపచేసినట్టు ఉంది

         ‘ఎంత ప్రేమ ఉండి ఏమి లాభం వ్యక్తపరిచే శక్తి లేనప్పుడు. కనపడట్లేదు అని భగవంతుడినే నమ్మడం మానేశారు చాలా మంది. మరి పైకి చుపించలేని ప్రేమ ని ఉంది అని ఎలా నమ్మిస్తావ్ మిత్రమా?

 

రచయిత పరిచయం : 

Instagam : jovial__memes

One thought on “నవ్యాక్షరం: ‘అవ్యక్త ప్రేమ’ కథ

  1. “I love how you captured the emotions in this story. It’s really powerful.”
    _Ananthika

Leave a Reply to Vijay VijayCancel reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading