మొన్నీమధ్య నేను కవనమాలి మాట్లాడుకుంటూ నవలల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నేను ‘ఈ మధ్య నవలలు రావడం తగ్గిపోయాయి.. ఒక వేళ వచ్చినా 150 నుంచి 180 పేజీలు దాటడం లేదు.. కారణాలు ఏంటి.!?’ అని అడిగి, కారణాల గురించి మాట్లాడుకున్నాము.. మేము మాట్లాడుకున్న నాలుగు రోజుల తర్వాత ఆజు వాళ్ళు మధురాంతకం నరేంద్ర గారి ‘దాయాదుల తోట’ పుస్తకం 336 పేజీల నవల అంటూ విడుదల చేశారు. నేను ముందు ఆశ్చర్యపోయా.. 300కి పైగా పేజీలు ఉన్న పుస్తకమా అని.. కానీ నరేంద్ర గారి మనోధర్మపరాగం చదివిన అనుభవంతో ఈ పుస్తకం కూడా చదివేయచ్చు అని అనుకున్న తర్వాత రోజు, మల్లి అన్న మెసేజ్ చేసి ‘పుస్తకం పంపిస్తున్నా.. చదివి ఎలా ఉందో చెప్పు’ అన్నాడు. అలా వారం రోజుల క్రితం మొదలుపెట్టి ఈ రోజు ముగించిన పుస్తకమే ‘దాయాదుల తోట’ నవల.

నేను పుట్టింది నంద్యాల పక్కన ఉండే కొవేలకుంట్లలో. పెరిగింది విశాఖపట్నం. ప్రస్తుతం ఉంటుంది హైదరాబాద్ లో. నా సొంత ఊరు అడిగితే ఏమి చెప్పాలో ఇప్పటికీ నాకు తెలీదు. ఇదే విషయం మా నాన్నను అడిగితే తనకి కూడా ఇలాంటి అనుభవమే ఉంది అని చెప్తూ ‘ మన పూర్వీకులు అనంతపురం జిల్లా నుంచి వలస వచ్చి ప్రకాశం జిల్లా గిద్దలూరు పక్కన ఉండే రాజుపాలెం అనే చిన్న గ్రామంలో ఎన్నో తరాలగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటున్నారు ’ అని చెప్పాడు. ఇక్కడ నన్ను రెండు విషయాలు ఆశ్చర్యపరిచాయి. ఒకటి మేము వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళమైతే, ఇంకోటి మా వంశానికి ఇంత చరిత్ర ఉండటం. ఇలాంటి చరిత్రలు అందరికీ ఉంటాయి ఏమో తెలీదు కానీ, మధురాంతంకం నరేంద్ర గారు రాసిన ‘ దాయాదుల తోట’ అనే నవలలో మాత్రం ఉంది.
తిరుపతి దగ్గరలో ఉండే దాయాదుల తోట లేదా యానాదుల మిట్ట అని పిలిచే ‘ తపోవనం దిబ్బ ’ లో జాన్ సుభాష్ అనే వ్యక్తి ఫ్యాక్టరీ కట్టాలి అనుకుంటాడు. అయితే అక్కడ ఫ్యాక్టరీ కట్టకూడదు అని నిరసన చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ స్థలంలో చనిపోయి కనిపిస్తారు. అది తెలిసి పోలీసులు జాన్ సుభాష్ ను అరెస్టు చేస్తారు. ఇదే సమయానికి హర్షవర్థన్ అనే ముప్పై ఏళ్ల జాన్ సుభాష్ కొడుకు పెళ్లి కోసం అమెరికా నుంచి ఇండియా వస్తాడు. అలా వచ్చిన హర్ష, పేపర్లో వచ్చిన వార్త ఆధారంగా ఆ మరణించిన వాళ్ళ గురించి తెలుసుకోవడం మొదలు పెడతాడు. అన్వేషణ మొదలు పెట్టిన హర్ష చివరికి ఏమి తెలుసుకున్నాడు? ఆ ఇద్దరు వ్యక్తులకు, జాన్ కుటుంబానికి ఎలాంటి సంబంధం ఉంది? చివరకు తన అస్తిత్వాన్ని హర్ష తెలుసుకున్నాడా? వంటి విషయాలు తెలియాలి అంటే ఈ నవల చదవాల్సిందే.
ఇది 300 పైగా పేజీల ఉన్న పెద్ద నవల. ఒక కుటుంబం ఆధారంగా ఒక ప్రాంతపు మార్పులను ఈ నవల ద్వారా చెప్పే ప్రయత్నం చేసారు. ఈ కథ అంతా కూడా చిత్తూరు, తిరుపతి, మదనపల్లి, వంటి రాయలసీమ ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ నవల ద్వారా గత శతాబ్దం పాటు రాయలసీమ ప్రాంతంలో జరిగిన రాజకీయ , సాంఘిక పరిణామాలను ఈ నవల ద్వారా రచయిత ఆవిష్కరించారు. ముఖ్యంగా ఫాక్షన్ గొడవలు, మత మార్పిడులు, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు, కరువుల వల్ల మారిన జీవితాలు, నదుల మీద ఆనకట్టలు కట్టడం వల్ల ఏర్పడిన కరువులు, ఇలా అనేక అంశాల గురించి ఈ నవలలో పేర్కొంటారు.
ఈ నవలలో నాకు ఆసక్తి కలిగించిన అంశాలు ఎన్నో ఉన్నాయి.వాటిల్లో ముఖ్యంగా, మనం మర్చిపోయిన ‘నాడు’లైన తొండనాడు, మొరుసునాడు మొదలైన వాటి గురించి చెప్తూ, తెలుగు వాళ్ళ వ్యాప్తి ఎంత వరకు ఉందో కూడా చెప్పారు. అలానే పూర్వం పంట, నీళ్ళతో సస్యశ్యామలంగా ఉండే ఈ చిత్తూరు జిల్లా ప్రాంతం అంతా, స్వాతంత్రం తర్వాత ఆనకట్టలు, చెక్ డాంలు కట్టడం వల్ల నదీ ప్రవాహం ఆగిపోవడం వల్ల పంటలు ఎండిపోయి , కరువులు ఏర్పడిన విధానం గురించి కూడా చెప్పారు.
ఇక రచనా శైలి గురించి మాట్లాడుకుంటే, ఇందులో మొత్తం తొమ్మిది ముఖ్య పాత్రలు ఉంటాయి. పాత్రల అన్నీ కూడా తమ కథను తామే చెప్పుకుంటాయి. హర్ష కుటుంబంతో వాళ్లకు ఉండే పరిచయాన్ని కూడా ఆ పాత్రలే చెప్పుకుంటాయి. ఇలా పాత్రలే కథను చెప్పడం వల్ల రచయత(నారేటర్) వచ్చే అవకాశం చాలా తక్కువ ఉన్న కారణంగా ఏదైనా అంశం గురించి చెప్తున్నప్పుడు పాత్రలు తమ పరిధి దాటి వెళ్లే అవకాశం లేదు.
ఈ నవల నాకు మహాభారతం లాగ అనిపించింది. ఎందుకంటే శిల్పం పరంగా ఎన్నో చిన్న కథలు ఈ నవలలో మనకి కనిపిస్తాయి. అవి అన్నీ కూడా హారంలోని ముత్యాలు లాగా ఉంటే , హర్ష చేస్తున్న అస్తిత్వ అన్వేషణ ఆ ముత్యాలను కలిపే దారంలాగ ఉంది. అలానే మహాభారతం ఒక కోణం నుండి చూస్తే ఆస్తి కోసం యుద్ధం చేసిన దాయాదుల కథలాగ అనిపిస్తుంది. అలానే ఈ నవలలో వచ్చే ఎన్నో పాత్రల్లో ఉండే అంశాలు అన్నీ ఎక్కువగా దాయాదుల మధ్య ఉండే ఆస్తి గొడవలే కారణాలుగా కనిపిస్తాయి.
ఈ పుస్తకం అంతా త్వరగా చదివే పుస్తకం కాదు. ఎన్నో పాత్రలు, పాత్రల ఆలోచనలు అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నవల ముగింపు వెనుక ఉన్న అర్దం నేను సరిగ్గా పట్టుకోలేదు అనిపించింది.. బహుశా ఇప్పుడు నాకు కథ తెలిసిపోయింది కాబట్టి, మరో సారి చదివి ముగింపును అర్దం చేసుకోవాలి. అలానే చిత్తూరు యాసలో రాసిన నవల అవ్వడం వల్ల చదవడంలో కొంచెం ఇబ్బంది పడినా, ఒక 50 పేజీల తర్వాత భాష అలవాటు అయిపోయింది.
రాయలసీమ ప్రాంతపు జీవితాలను తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. లేదా ఒక పూర్తి తెలుగు నవల చదివిన అనుభూతి కావాలన్నా ఈ పుస్తకం చదవచ్చు.
ఈ పుస్తకం అమెజాన్ లో ఉంది. ధర : 275/-
లింక్ : https://amzn.to/3DHdMoh








