మనకి ఎన్నో విధాలుగా ప్రేమ లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి, భార్య నుంచి, పిల్లల నుంచి ఇలా ఎన్నో రకాలుగా ఉంటుంది. కానీ మనిషి మనతో లేకపోయినా మనకి గుర్తుండిపోయేది మాత్రం తొలి ప్రేమ. తెలియని అమాయకత్వం, అర్దం కాని ఆరాటం, చిలిపి సంఘటనలు , సరదా అలకలు ఇలా ఎన్నో మధురానుభూతులను అందిస్తుంది. ఈ తొలిప్రేమ అనుభవం కొంత మందికి కాలేజీలో అయితే, కొంత మందికి ఉద్యోగంలో లభిస్తుంది. మరికొంత మందికి పెళ్ళిలో కూడా లభిస్తుంది. అలా ఒక యువకుడి మొదటి ఉద్యోగంలో ఏర్పడిన తొలిప్రేమ విషయాలనే తన కథాంశంగా మొహమ్మద్ గౌస్ గారు ‘826 కి.మీ.’ అనే నవల రాశారు.

ఒక పెద్ద MNC కంపెనీలో ఉద్యోగం సంపాదించిన హరి, ట్రైనింగ్ కోసం మైసూరు వెళ్తాడు. అక్కడ అనుకోకుండా మధు అనే మరో ట్రైనీ ఇంజనీర్ పరిచయం అవుతుంది. అలా జరిగిన పరిచయం కాస్త, స్నేహంగా మరి, స్నేహం నుంచి ప్రేమగా మారిందా!? లేదా అనేది ముఖ్య కథ.
పేరులో చెప్పినట్టే ఇది ఒక ప్రేమ కథ. స్నేహం నుంచి ప్రేమగా మారడం గురించి చెప్పే కథ. స్నేహంలో ఉండే దగ్గరితనం, ప్రణయంలో ఉండే బేరుకుతనం, ప్రేమ తెలియపరచడానికి చేసే ప్రయత్నం, ప్రేమ దక్కదేమో అనే దిగులు .. ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ను ఈ నవలలో ఆవిష్కరించారు.
ఇది మన తొలి ప్రేమను గుర్తు చేసే ప్రేమ కథ. అయితే ప్రధాన పాత్ర హరి, ఒక ఉద్యోగం, బాధ్యత ఉన్న వ్యక్తి అవ్వడం చేత, సాధారణంగా మనం అనుకొనే అల్లరి చేష్టలు కాకుండా మనం కోరుకొనే సరదాలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకం నిండా.
కేవలం రెండే పాత్రలతో కథ మొత్తం నడిపించారు రచయిత గౌస్. చదువుతున్నంత సేపూ హరి మీద జలి కలిగిస్తూనే, మధు మీద తెలియని కోపం కూడా వస్తుంది.
ఒక బంధంలో మన భాగస్వామికి మనం ఇవ్వాల్సిన గౌరవం గురించి గాని, ఒక బంధం నిలబడడానికి చేసే ప్రయత్నంలో గాని, ఈ తరం వాళ్ళకి హరి పాత్ర ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.
ముందే చెప్పినట్టు ఇది సాధారణ ప్రేమ కథ.. ఎన్నో కథల్లో ఉండే సన్నివేశాలే మళ్ళీ జరుగుతున్నట్టు ఉన్నా, గౌస్(హరి) మాటల్లో చదవడం కొత్తగా ఉంది.. ముఖ్యంగా కథలో ప్రయాణించిన ప్రదేశాల్లో మనం కూడా ఉన్నప్పుడు.
మరోసారి మనం ప్రేమలో పడ్డ రోజుల్లోకి వెళ్ళాలి అనుకొనే వాళ్ళు, నాకూ ఒక ప్రేమ కథ ఉంటే బాగుండేది అనుకొనే వాళ్ళు, ఈ పుస్తకం తప్పకుండా చదవండి.
ఈ పుస్తకం అమెజాన్ లో ఉంది.
లింక్ : https://amzn.to/4iVM0TG








