హైటెక్ సిటీలో మెట్రో ఎక్కుతున్న ప్రతీసారి పక్కనే ఒక విశాలమైన ప్రదేశం, చుట్టూ చెట్లతో నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) కనిపిస్తుంది. అసలు ఈ కాలేజీలో ఎం చేస్తారు..? వాళ్ళు కూడా మన లాగే అసైన్మెంట్లు, ప్రాజెక్టులు అంటూ తిరిగుతారా..? లేదా సినిమాలల్లో చూపించే విధంగా చదువుతారా అనే కుతూహలం ఎప్పుడూ ఉండేది.
ఫ్యాషన్ ప్రపంచం అనగానే మనకి ముందుగా కనిపించేది వైవిధ్యమైన దుస్తులు ధరిస్తూ, రాంప్ మీద నడుస్తూ, తాము వేసుకున్న బట్టల అందాలు మాత్రమే కాకుండా, తమ అందాలను కూడా చూపించే మోడల్స్, మెడలో కెమెరాలు, చుట్టూ అసిస్టెంట్లతో బిజీగా ఉండే కెమెరామెన్స్. ఇంకా వినిపించే విషయాలు ఇక్కడ చెప్పేలా కూడా ఉండవు. అంత గందరగోళంగా ఉండే ప్రపంచం ఎలా ఉంటుంది అనే ప్రశ్న కూడా అందరిలో ఉంటుంది.
‘ప్రేమ! ఎంత విచిత్రమైన, గాఢమైన , అనుభవించినా అర్ధం కానీ, ఎంత పొందుకున్నా తృప్తి చందాలేని అనుభూతి.! ఇంతకీ ఏది ఆకర్షణ? ఏది ప్రేమ? ఏది కామం? ఏది మొహం?’ ఈ ప్రశ్నలు మన అందరిలో తప్పకుండ వచ్చే ఉంటాయి.
ఈ మూడు అంశాలను తన ప్రధాన కథాంశంగా అనుకోని అరవింద్ జాషువా గారు రాసిన పుస్తకమే ‘పేషన్’.

ఇది జారా, ఆదర్శ్ల కథ. ఏలూరు లాంటి ఒక చిన్న పట్నంలో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన ‘ఆదర్శ్’, హైదరాబాద్లోనే ఒక సాంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందినది ‘జారా’. వీరు ఇద్దరు ఫ్యాషన్ టెక్నాలజీ నేర్చుకోవాలి అని హైదరాబాద్ లో ఉన్న IIFT లో చేరుతారు. ఈ ఇద్దరి పరిచయం స్నేహంగా మరి, ఆ తర్వాత ప్రేమగా అభివృద్ధి చెందుతుంది. కాలేజీ వాతావరణంలో తమ ప్రేమ, ఫాషన్ ప్రపంచంలో వాళ్ళ మధ్య ఎలాంటి సమస్యలు తీసుకొని వచ్చింది? చివరికి తాము అనుకున్నట్టుగా దేశం గర్వించదగ్గ ఫ్యాషన్ డిజైనర్ అయ్యారా? అనేది ఈ పుస్తకంలో కథాంశం.
ఫ్యాషన్ రంగంలో ఉండే ఇబ్బందులు, కాలేజీ వాతావరణం, తెలుగు వాళ్ళు తక్కువ ఉండే చోటులో తమని తక్కవ చేసి చూడడం, అక్కడి లెక్చరర్స్ చేసే రాజకీయాలు వంటి ఎన్నో విషయాల గురించి ఈ నవలలో చూపించారు. ఫ్యాషన్ రంగం మీద ఉన్న అపోహలు అన్నీ తొలిగిపోవడమే కాకుండా, మనకి తెలియని ఎన్నో విషయాలు కూడా తెలుసుకోవచ్చు.
కాలేజీ వయసులో ఉండే ప్రేమలు, ప్రేమ పతాక స్థాయి కి చేరి, అది స్వాధీనత (possessiveness) గా మారడం, దానివల్ల ప్రేమలో వచ్చే ఇబ్బందులు గురించి చాలా అద్భుతంగా చూపించారు. జారా, ఆదర్శ్ ల పాత్రల చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళ ప్రోత్సహాం లేకుండా, తన ఫోకస్ కోల్పోకుండా ఉండే జారా, ఓటమి అంటే భయంతో గెలవడం కోసం ఎంత దూరమైనా వెళ్లే ఆదర్శ్. ఈ ఇద్దరి మధ్య జరిగే సంభాషలు చాలా ఆసక్తిగా ఉంటాయి.
First Person Narration లో ఉండే ఈ కథ కొన్ని చోట్ల నేరేటర్ third person గా మారడం వంటి చిన్న చిన్న ఇబ్బందులు తప్ప, చదువుతునప్పుడు నాకు ఎలాంటి ఆటంకం కలగలేదు.
త్వరలో సినిమాగా రాబోతున్న ఈ పుస్తకం, ఫ్యాషన్ ప్రపంచం గురించి, ప్రేమ గురించి తెలుసుకొవాలి అంటే తప్పకుండా చదవాలి.
చివరిగా ప్రేమ గురించి రచయిత చెప్తూ “తనని పొందడం కోసం నిన్ను నువ్వు పోగొట్టుకోవడమే ప్రేమ” అని అంటాడు.
ఈ పుస్తకము ఛాయ website లో దొరుకుతుంది. లేదా +91 8309128378 కి మెసేజ్ చేసి తీసుకొవచ్చు.
పుస్తకము ధర : 150/-








