పుస్తకాలు చదవడం మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు ముందుగా మనం ప్రేమ కథల కోసమే చూస్తాము. చదవడానికి సులభంగా ఉండటమే కాకుండా, కథలో పాత్రలకు ఎక్కువగా రిలేట్ అవుతాము. అయితే ఈ ప్రేమ కథల్లో కూడా రెండు రకాలు ఎక్కువగా ఉంటాయి.. ప్రేమలో పడటం నుంచి ప్రేమలో ఉండే ఇబ్బందులు గురించి చెప్పే కథలైతే, మరికొన్ని ప్రేమ నుంచి పెళ్ళిగా మారేటప్పుడు ఉండే పరిస్థితుల గురించే చెప్పే కథలు. పైన చెప్పిన రెండో అంశాన్ని తన ముఖ్య కథాంశంగా తీసుకొని భవ్య శర్మ గారు ‘దట్ లాస్ట్ మెలోడీ’ అనే నవల రాశారు.

సారా ఒక TV జర్నలిస్టు. సారా బాయ్ ఫ్రెండ్ విష్ణు కూడా ఒక చిన్న పత్రికలో విలేఖరిగా పనిచేస్తూ ఉంటాడు. జీతం, పెళ్లి వంటి విషయాల మీద ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో సారాకి వృత్తిలో భాగంగా సత్య రాసిన ‘షోనా’ అనే పుస్తకం చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా పుస్తకం చదవడం మొదలుపెట్టిన సారా, ఆ పుస్తకంలోని కథను తన ప్రేమ జీవితానికి ఎలా అన్వయించుకుంది.!? చివరకి సారా, విష్ణుల ప్రేమ, పెళ్లిగా మారిందా? అనేది తెలుసుకోవడానికి ఈ పుస్తకం చదవాలి.
ఇది ఒక సాధారణ ప్రేమ కథ.. కానీ ప్రేమించి పెళ్లి చేసుకొనే వాళ్ళు ఎదుర్కొనే ఎన్నో అంశాల గురించి తెలియజేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రేమలో మారే ప్రాధాన్యతల గురించి, ఇలా మారడం వల్ల జరిగే పరిణామాలు గురించి అద్భుతంగా చూపించారు. షోనా అనే పుస్తకంలో ఉండే పాత్రలైనా ‘రిషి’, ‘సత్య’ లకి మరింత దగ్గర అవుతాము.
సాధారణ తెలుగు పుస్తకాల్లో ఉండే రొమాన్స్ మోతాదు కన్న ఈ పుస్తకం లో రొమాన్స్ మరింత ఎక్కువ ఉన్నట్టు అనిపించింది.
అక్కడక్కడ వాక్య నిర్మాణ లోపాలు, అచ్చుతప్పులు మినహాయిస్తే, ఒక మంచి ప్రేమ చదివిన అనుభూతి కలుగుతుంది.ముఖ్యంగా చివరి 30 పేజీల్లో ఉండే సంభాషణలు మనల్ని ప్రేమించిన వాళ్ళ గురించి ఆలోచించేలా చేస్తుంది.
తెలుగులో ప్రేమ కథలు కోసం చూస్తున్న వాళ్ళకి ఈ పుస్తకం ఒక మంచి ఎంపిక అవుతుంది.
ఈ పుస్తకం అమెజాన్ లో ఉంది.








