ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరోజు వస్తుంది. ఇప్పటివరకు మనకు ఎదురుకాని ఒక ప్రశ్నను పట్టుకొనివస్తుంది. ఆ ప్రశ్నతో పాటే రెండు దారులు కూడా వస్తాయి. ఎవ్వరిని బాధపెట్టకుండా సర్దుకుపోవాలా..? లేదా ఎవరి గురించి ఆలోచించకుండా మన దారిలో మనం వెళ్లిపోవాలా..? అని… ఈ రెండు దారుల్లో ఒకదాన్ని ఎంచుకోవడం లోనే మన జీవిత లక్ష్యాలు మారుతూ ఉంటాయి. తన జీవితం ఎదురైనా ఇలాంటి ప్రశ్నలకు ఒక కుర్రవాడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు.. ఆ తీసుకున్న నిర్ణయాలు వల్ల తన జీవితం ఎలా మారిందో తెలుసుకోవాలి అంటే దర్శన్ రాసిన “సీజన్ ఎండ్”అనే పుస్తకం చదవాల్సిందే.

జీవితంలో మనం గడిపిన క్షణాలు, కలిసిన మనిషులు, పొందిన ప్రతి అనుభూతికి ఒక expiry date ఉంటుంది అనే నమ్మే విజయ్, తన చదువు కోసం కేరళ వెళ్తాడు. అలా వెళ్తూ తన తండ్రి గదిలో ఉన్న ఒక అసంపూరిత నవల తన ప్రయాణంలో చదవడానికి తీసుకుంటాడు. అలా ఆ రైలు ప్రయాణం వల్ల కలిసిన మనిషులు, తన కాలేజీ జీవితంలో జరిగిన అనుభూతులకు విజయ్ ఎలా స్పందించాడు..? తాను చదువుదాం అని తీసుకొని వెళ్లిన నవల వల్ల తన జీవితంలో జరిగిన మార్పులు ఏంటి..? వాటిని తనకి ఉన్న ఆలోచన ధోరణితో ఎలా ఎదురుకున్నాడు వంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
ఈ నవల చదువుతున్నప్పుడు చాల వరకు కథ మనం ముందే ఊహించే విధంగా ఉన్నా కూడా చదువుతున్నంత సేపు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా కాలేజీ సన్నివేశాలు, విజయ్ తీసుకున్న నవలలోని సంగతులు చదువుతుంటే మనం మన కాలేజీ రోజులను తప్పకుండా గుర్తుతెచ్చుకుంటాం.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రచయితైనా దర్శన్ చేసే ప్రకృతి వర్ణనలు, అలానే మధ్య మధ్యలో వచ్చే కవితలు. ఆవి చదువుతున్నప్పుడు ఒక debut రైటర్ రాసిన మాటలు లాగా అసలు అనిపించవు.
ఈ నవల ఒక మంచి ప్రయత్నం అని చెప్పచ్చు . అక్కడక్కడ కొంచెం నాటకీయంగా అనిపించే సన్నివేశాలు, అంత వరకు నిదానంగా సాగుతున్న కథ, ముగింపులో కొంచెం గందరగోళాన్ని సృష్టించకుండా కాస్త నిడివి పెంచి రాస్తే కథ మరింత అందంగా ఉండేది.
మరికొంచెం పాత్రలను, పాత్రల క్లిష్టతను రాసినట్టయితే ఒక మంచి సినిమా కథ లేదా ఒక షార్ట్ ఫిలిం కి సరిపోయే కథగా ఉపయోగపడేది
కొత్తగా తెలుగు పుస్తకాలు చదవాలనుకునే వాళ్ళు ఈ పుస్తకంతో మొదలుపెట్టొచ్చు. ఒక కొత్త రచయత నుంచి వచ్చిన ఒక మంచి ప్రయత్నం అని కూడా చెప్పచ్చు.
పుస్తకం ధర : ₹150/-
పేజీలు : 130
Amazon Link : https://amzn.to/45dslY9








