చరిత్రను ఎప్పుడూ కూడా అధికార పక్షం నుంచే చూస్తాం అందరం కూడా… పురాణాల్లో మహాభారత యుద్ధమైన ,రెండు ప్రపంచ యుద్ధలైనా, చివరకి మన దేశ స్వాతంత్ర ఉద్యమమైనా.. ఈ రకమైన కోణంలో చూడటం వల్ల మనం ఎన్నో ముఖ్యమైన ఘటనలను మార్చే ప్రమాదం ఉంది.. కొన్ని సార్లు మర్చిపోయే అవకాశం కూడా ఉంది.. ఇలాంటి సంఘటనలు మన స్వాతంత్ర పోరాట సమయంలో కూడా జరిగింది.
ప్రపంచ చరిత్రలో 1940 – 1950 వరకు ఉన్న దశాబ్ద కాలంలో చాలా మార్పులు జరిగాయి. రెండవ ప్రపంచ యుద్ధం, హిల్టర్ మరణం, బ్రిటిష్ సామ్రాజ్య పతనం, జపాన్ మీద అణుబాంబు ప్రయోగం, భారతదేశ స్వాతంత్రం, విభజన, గాంధీ హత్య, బోసు ప్రమాదం, తెలంగాణ సాయుధ పోరాటం, బెంగాల్ లో కరువు, బర్మా నుంచి భారతీయుల వలస… ఇలా ఎన్నో సంఘటనలు కేవలం పదేళ్ల వ్యవధిలో జరిగాయి.
వీటన్నిటి గురించి రికార్డు చెయ్యాలి అనే ఉద్దేశంతో వచ్చిన నవల ఉణుదుర్తి సుధాకర్ గారు రాసిన ‘చెదిరిన పాదముద్రలు.’

కళింగ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ‘రాంబాబు’ ఉన్నత ఉద్యోగ అవకాశాల కోసం బర్మా లోని రంగూన్ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఒక బ్రిటిష్ అధికారి దగ్గర డ్రైవర్ గా ఉద్యోగంలో చేరుతాడు. అలా బర్మాలో ఉంటున్న రాంబాబు తర్వాతి రోజుల్లో భారతదేశం ఎందుకు రావాల్సి వచ్చింది. వస్తే ఎలా వచ్చాడు..? వచ్చినప్పుడు భారత దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి..!? చివరికి రాంబాబు ఏం అయ్యాడు వంటివి తెలుసుకోవాలి అంటే ఈ నవల చదవాల్సిందే.
ముందే చెప్పినట్టు ఈ నవల ద్వారా రచయిత మనకి తెలియాని ఎన్నో చారిత్రాత్మకమైన విషయాల గురించి ప్రస్తావించారు.
జపాన్ వాళ్ళ దాడి వల్ల బర్మా నుంచి భారతీయుల వలస, ఆ వలసలో వాళ్ళు ఎదురుకున్న సవాళ్లు, బెంగాల్లో కరువు, భారత నౌకాదళ తిరుగుబాటు వంటి ఎన్నో సంఘటనలు, రాంబాబు జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొని వచ్చాయో ఈ నవల ద్వారా తెలుసుకోవచ్చు.
కేవలం రాజకీయ మార్పుల గురించి మాత్రమే కాకుండా, సైద్ధాంతిక మార్పులు గురించి కూడా చర్చించారు. భారతదేశంలో పెరుగుతున్న కమ్యునిజం, సోషలిస్టు ఆలోచనల గురించి, రష్యా, చైనా కమ్యూనిస్ట్ ఆలోచనల గురించి.. ఇలా ప్రతి ఒక్క అంశం మీద పాత్రల ద్వారా మనకి తెలిసేలా చేశారు.
నాయుడు పాత్ర మనకి చాలారోజులు పాటు గుర్తుండిపోతుంది.
ఒక దశాబ్దాన్ని రచనా కాలంగా తీసుకున్న నవల.. కేవలం 160 పేజీల్లోనే ముగించడం అంతగా నచ్చలేదు. ఆ పది సంవత్సరాల్లో జరిగిన అంశాలను కేవలం పరిచయం చేసినట్టు ఉంది కానీ, మరిన్ని పాత్రలు add చేసి రాసి ఉంటే బాగుండేది అని అనిపించింది.
అలానే 168 పేజీలు ఉన్న ఈ పుస్తకం అది కూడా ATA వారి ప్రచురణ సహకారంతో వస్తున్న పుస్తకానికి అంత ధర (300/-) పెట్టడం కాస్తా ఎక్కువ అనిపించింది. ధర గురించి ఏమైనా ఆలోచిస్తే బాగుంటుంది..
చారిత్రిక నవలలు ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. ముఖ్యంగా బర్మా లో తెలుగు వాళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా చదవాలి.
చివరిగా…
‘ఆలోచిస్తే ప్రజాస్వామ్య వాదులు, చర్చిస్తే సోషలిస్టు వాదులు, ఆచరిస్తే కమ్యూనిస్టులు’ అని నాయడు అంటే…
‘ యుద్దకాలంనాటి మన చర్చలు గుర్తుచేసుకుంటూ, మరో యుద్ధం రాకూడదని కోరుకుంటూ..’ అని మిల్లర్ అన్నా..
ఈ నవల ఎంతో మంది ‘చెదిరిన పాద ముద్రల’కు అంకితం.
ఈ పుస్తకం telugubooks.inలో దొరుకుతుంది
లింక్ : https://www.telugubooks.in/te/products/chedarina-paadamudralu








