పుస్తకాలు ఎందుకు చదువుతావు అనే ప్రశ్న నన్ను ఎంతో మంది అడుగుతూనే ఉంటారు..!! నాకు తోచిన సమాధానం చెప్తూ ఉంటా కూడా.. కానీ కాస్త ఆలోచిస్తే, నేను నిజంగా పుస్తకాలు చదివేది కొత్త మనుషుల గురించి, కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం చదువుతున్నాను.. అలా అని ప్రతి పుస్తకంలో ఇలాంటి అంశాలు తప్పకుండా ఉండాలి అని గిరి తీసుకోలేదు. సర్లే ఇప్పుడు ఆ గొడవ ఎందుకు కానీ, నాకు కొత్త విషయాలు తెలుసుకోవడం ఇష్టం. వీటితో పాటు ప్రయాణాలు కూడా ఇష్టమే.. కొత్త ప్రదేశానికి వెళ్లి, అక్కడి భోజనం, వాతావరణం, చూడవలసిన ప్రదేశాలు చూడటం అంటే ఇష్టం…కానీ అన్నివేళలా ప్రయాణాలు చేయలేము.. అదే పుస్తకాల్లో అయితే కూర్చున్నా చోటే అన్నీ చూసి రావచ్చు.. ‘వనవాస‘ ద్వారా బెంగాల్ అడవులు గురించి తెలిస్తే, ‘లంకమల దారుల్లో ’ పుస్తకం వల్ల నల్లమల అడవుల అందాలు, ‘మున్నీటి గీతాలు’ లో సముద్రం గురించి తీసుకున్నా.. అయితే ఇంత వరకు ఎడారి గురించి, అక్కడి జీవితం గురించి.. పెద్దగా చదవలేదు.
మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దుబాయి, మస్కట్ దేశాలకు చాలా మంది ఉద్యోగం కోసం వలస వెళ్తూ ఉంటారు కూడా.. ‘నల్ల వంతెన’ కథల పుస్తకం లో ఉన్న కథలు చదివినప్పుడు పొట్టచేత పట్టుకొని వెళ్లిన వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి!?, అంత కష్టమైన జీవితం కోసం ఎందుకు అంతలా తరలి వెళ్తున్నారు అనే ప్రశ్నలు నాలో వచ్చేవి. కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశంలో చాలా మంది వలస వెళ్తున్నారు.. ఈ మధ్య యూట్యూబ్ వీడియోలు చూస్తే చాలా విషయాలు తెలుస్తున్నాయి కూడా.. కానీ వీళల్లో ఎక్కువ భాగం కేరళ రాష్ట్రం వాళ్ళు ఉంటున్నారు. అందుకు ఎన్నో చారిత్రాత్మక కారణాలు ఉండవచ్చు. వాళ్ళ జీవితాలు గురించి తెలుసుకొనే అవకాశం కోసం చూస్తున్న సమయంలో ‘The Goat Life’ అనే పేరుతో సినిమా వచ్చింది. ఆ సినిమా బెన్యామిన్ అనే మలయాళం రచయత రాసిన ‘అడు జీవితం’ అనే నవల ఆధారంగా తీసిన నవల అని తెలుసుకొని ఆ సినిమా చూశా.. నాకు చాలా బాగా నచ్చింది.. తర్వాత కొన్ని రోజులకు FB లో అన్వీక్షికి వాళ్ళు ఆ పుస్తకాన్ని అనువాదం చేస్తున్నాము అని చెప్పినప్పుడు చాలా ఆతృతగా పుస్తకం కోసం ఎదురు చూసి, ప్రీ ఆర్డర్ చేసి చదివిన పుస్తకమే ‘మేక బతుకు’. స్వర్ణ కిలారి గారు ఈ పుస్తకాన్ని అనువాదం చేశారు.

ఇది నిజ జీవితం ఆధారంగా రాసిన ఒక Survival థ్రిల్లర్ కథ. మెరుగైన కుటుంబ పరిస్థితుల కోసం కేరళకు చెందిన ‘ నజీర్ మొహమ్మద్’, గల్ఫ్ దేశాలకు వెళ్ళాలి అని అనుకుంటాడు. అలా వెళ్లిన నజీర్ ను గొర్రెల పెంపకం కోసం ఒక ఎడారి లాంటి ప్రదేశంలో వదిలేస్తారు. అక్కడి భాష రాక, తనకు ఆ పని చెయ్యడం ఇష్టం లేకపోయినా, దయనీయమైన జీవితాన్ని గడుపుతూ మేకలను సాకుతూ ఉంటాడు. అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నజీర్, చివరకు ఏమి అయ్యాడు..? అనేది ఈ నవలలోని ముఖ్య కథ.
ఈ నవల ద్వారా అరబ్ యుద్ధ సమయంలో వలస వచ్చిన ఎంతో మంది జీవన విధానం గురించి చెప్తూనే, బానిసల కన్నా దారుణంగా చూసే అరబ్ దేశ యాజమానుల దౌర్జన్యం గురించి కూడా చూపిస్తారు.
ఎడారి గురించి పెద్దగా తెలీదు నాకు.. ఇంగ్లీష్ లో వచ్చిన Alchemist పుస్తకం ఎడారి గురించి చెప్పినా.. అది చాలా తక్కువే.. కానీ ఈ నవల చదివాక ఎడారిలో ఉండే వాతావరణ పరిస్థితులు, అక్కడ జీవించే జంతువులు, ముఖ్యంగా నీరు లేకుండా ఎన్నో ఏళ్లు అక్కడే జీవితాలు గడిపే గొర్రెల కాపరుల గురించి ఎన్నో విషయాలు తెలిశాయి.
ఈ నవలలో కొన్ని అధ్యాయాలు చదివితే మనిషి నిస్సహాయతలో దేవుడు మీద కలిగే నమ్మకం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. ఆశ (అది దేవుడు మీదైనా, రేపటి మీదైనా) మనిషికి ఎంత అవసరమో కూడా అర్దం అవుతుంది.
ఈ నవలలోని ప్రతి పాత్ర మనతో పాటు చాలా రోజులు ప్రయాణం చేస్తాయి. నజీర్, హకీమ్, ఇబ్రహీం, నబీల్, పోచక్కరి రమణి ఇలా ప్రతి పాత్ర మనకు గుర్తుండిపోతాయి. ముఖ్యంగా ఇబ్రహీం మరియు హకీమ్ పాత్రలు చాలా ప్రభావం చూపుతాయి.
ఇక రచనా శైలి గురించి మాట్లాడుకుంటే కథ అంతా ఫస్ట్ పర్సన్ నెర్రేషన్ లో ఉండటం వలన కథకు, ఆ పాత్రలకు మరింత దగ్గర అవుతాము. ఇది ఒక అనువాద నవల అనే స్పృహ నాకు ఎక్కడ అనిపించలేదు. అనువాదం అంత చక్కగా ఉంది.
పుస్తకం మొదట్లో కొన్ని పదాలు అర్దం తెలియక మనం కష్టపడినా కూడా అది కూడా రచనా శైలి లో ఒక భాగమే అని నవల పూర్తిగా చదువుతున్నపుడు అర్థమైంది.
ఇంకో ముఖ్య ప్రశ్న అందరికీ ఉండేది. ముందు సినిమా చూడాలా..!? పుస్తకం చదవాలా!? అని.. నా అభిప్రాయంలో ఎలా చేసినా పర్లేదు. ఎందుకంటే పుస్తకానికి సినిమాకి పెద్దగా తేడా ఏమీ లేదు.. కానీ పుస్తకంలో నజీర్ తనలో తాను పడే అంతర్మధనం సినిమాలో మనకి కనిపించదు. అలానే ఎడారిలో ప్రయాణం గురించి సినిమాలో ఎక్కువ వివరణ ఉంటే.. పుస్తకంలో మేకలలో పాటు ఉన్న జీవితం గురించి వివరంగా ఉంటుంది.
జీవితంలో చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ సమయంలో తన ఉనికే ప్రశ్నార్థకమైన పరిస్థితిలో ఉన్న నజీర్ లాంటి వ్యక్తులు ఎలాంటి సాహసం చేశారో తెలుసుకోవడం చాలా అవసరం.
ఈ పుస్తకం అమెజాన్ లో అందుబాటులో ఉంది.
ధర : 225/-
లింక్ : https://amzn.to/3Sbapd8








