పుస్తక పరిచయం – కొత్త కథ 2024

ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త పుస్తకాలు వస్తుంటాయి . వాటిల్లో మన అభిమాన రచయిత పుస్తకం ఉంటే చదవడానికి మనం ఎంతో ఉత్సాహం చూపిస్తాము. కానీ, రచయితతో సంబంధం లేకుండా, ప్రతి సంవత్సరం వచ్చే పుస్తకాల్లో నేను ఎక్కువగా ఎదురుచూసేది మాత్రం “కొత్త కథ” కోసమే. ఎందుకంటే ఒకే పుస్తకంలో దాదాపు 15 మంది రచయితల కథలు చదివే అవకాశం ఉండటమే కాకుండా, కథాంశంలు అన్ని కూడా సమకాలీన అంశాల మీదనే ఉంటాయి. ఖదీర్ బాబు గారు ప్రతీ సంవత్సరం “రైటర్స్ మీట్” పేరుతో రెండు రోజుల వర్క్ షాప్ లాంటిది నిర్వహించి, అందులో పాల్గొన్న వాళ్ళు రాసే కథలను ఒక సంకలనంగా తీసుకువస్తారు. అలా ఈ సంవత్సరం వచ్చిన పుస్తకమే “కొత్త కథ 2024”. 

 

Kotha Katha 2024 – TeluguBooks.in (Navodaya Book House)

 

ఈ సంవత్సర సంకలనంలో మొత్తం 19 కథలు ఉన్నాయి. అన్నీ కూడా సమకాలీన కథాంశాలే. కేవలం కథలు మాత్రమే కాకుండా, కథలు రాసే ప్రక్రియ లో కూడా కొత్తదనం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యాసలో రాసిన కథలు కొన్ని అయితే, తమ అస్తిత్వాల గురించి కథలు మరికొన్ని. 

ప్రేమకి వయసుతో సంబంధం లేదు అని హుమాయూన్ సంఘీర్ గారు రాసిన ‘దినార్ గాయం’ కథ చెప్తే, అదే ప్రేమ, కొన్ని రోజులు ఉన్న కూడా అద్భుతంగా ఉంటుంది అని ఝాన్సీ పాపుదేశి గారి ‘వానపూల చెలిమి’ కథ చెప్తుంది. 

నగర జీవితంలో  శ్రీఊహ గారు ‘బర్కత్’, గాజోజు నాగభూషణం గారు ‘గంగ’ ద్వారా దిగువ మధ్య తరగతి స్త్రీలు పడే కష్టాలు చూపిస్తే, రుబీనా గారు రాసిన ‘వన్ పర్సన్ కంపెనీ’ లో ఆర్థిక స్వతంత్రం ఉన్నా కూడా స్త్రీలు మీద జరిగే అణిచివేత గురించి చూపించారు. 

తమలోని లైంగిక మార్పుల గురించి పూడూరి రాజిరెడ్డి గారు రాసిన ‘ప్రాకృతికం’తో, చిలుకూరు రామఉమామహేశ్వర శర్మ గారు ‘తాలీ’ ద్వారా పరిచయం చేశారు.

మనం మర్చిపోతున్న ఎన్నో విషయాల గురించి సాయి వంశీ గారు ‘కుందెన’ కథలో చెప్తే, నేటి వైవాహిక జీవితంలోని ఒప్పందాల గురించి ప్రత్యూష గారి ‘జంటగది’లో చూడచ్చు. 

నేటి దేశంలోని పరిస్థితుల గురించి ఉణుదుర్తి సుధాకర్ గారు ‘కలుషిత గీతం’ కథలో రాస్తే, దేశ సరిహద్దుల్లో ఉండే సైనికుల కుటుంబాల గురించి అజహర్ గారు ‘అదృశ సైనికులు’ లో చూపిస్తారు.  

ఒక చిన్న సంఘటన ఆధారంతో ఒక కుటుంబ జీవితం మొత్తం ఎండపల్లి భారతి గారు ‘బతుకున్న వాసాలు’ చెప్తే, షేక్స్పియర్ రాసిన ‘మక్‌బెత్’ను ఏకప్రత్రాభినయం చేసే అవకాశం వచ్చిన ఒక నటుడి కథగా ఇండ్ల చంద్రశేఖర్ గారు ‘మేజిక్ ఇఫ్’ రాశారు.

ఇలా ప్రతి కథా కూడా చదువుతునప్పుడు మంచి అనుభూతిని ఇస్తూనే, కొన్ని ఆలోచింపచేస్తాయి, మరిన్ని గతంలోకి తీసుకొని వెళ్తాయి.

ఈ పుస్తకంలోని కొన్ని కథలు గురించైనా మాట్లాడుకోవాలి. చర్చించుకోవాలి.

ఈ పుస్తకం Amazon లో దొరుకుతుంది.

పుస్తకం ధర : 195/-

 

లింక్ : https://amzn.to/42ZNbuB

Leave a Reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading