పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
మన దేశంలో దేవాలయాలకు, ప్రార్థన స్థలాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం ఉంటున్న ప్రదేశం నుంచి ఒక 2km వ్యాసార్థంతో (Radius) ఒక వృత్తం గీస్తే ఏదైనా ఒక గుడి కచ్చితంగా ఉంటుంది. ప్రతి గుడికి ఒక చిన్న చరిత్ర నుంచి, స్థలానికి బట్టి పురాణం కూడా ఉంటుంది. సాధారణంగా ఈ స్థల పురాణాలు ఆ గుడి కట్టడానికి ఉన్న వెనుక కథను మనకి తెలియచేసే ప్రయత్నం చేస్తే, మరికొన్ని ఆ ప్రాంతంలో ఉండే మార్మిక విషయాల ప్రస్తావన ఉంటుంది. కానీ వీటిల్లో మనం ఆ గుడిలో ఉండే నిధి గురించే ఎక్కువ ఆసక్తిను చూపిస్తాము. ఇక ఆ నిధి ఏదైనా రహస్య నేలమాళిగలో ఉండి, దాని చుట్టూ తెలియని మాంత్రిక బంధనం ఉంది అని చెప్పినప్పుడు మరింత శ్రద్ధ కనబరుస్తాము. ఇలాంటి ఆసక్తి కలిగించిన ఒకానొక దేవాలయమే తిరువనంతపురం లో ఉన్న ‘అనంత పద్మనాభ స్వామి దేవాలయం’. ఆ గుడి విశిష్ఠతను దాటి మరీ ఆ గుడిలో ఉండే సంపద గురించి జరిగిన చర్చ మనకి తెలిసే ఉంటుంది. ఈ అంశాన్నే తన కథాంశంగా తీసుకొని ప్రవర్ష్ గారు ‘అభినిర్యాణం’ అనే నవల రాశారు.

అభిమన్యు ఒక కాలేజీ విద్యార్థి. తన కాలేజీ ప్రాజెక్టు పని కోసం తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలో జరిగే ఒక అరుదైన ప్రకృతి దృశ్యాన్ని చూడటానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. అలా వెళ్లిన అభికి, అక్కడి నేల మాళిగల్లో ఉండే ఆరవ ద్వారం తెరవడానికి అవసరమయ్యే తాళం సంపాదించే మార్గం తెలుస్తుంది. అలా ఆ తాళాన్ని వెతికే ప్రయత్నంలో అభి చేసే ప్రయాణమే ‘అభినిర్యాణం’.
ఈ పుస్తకంలో ఉండే మరో ముఖ్య పాత్ర ‘రాయ్’. రాయ్, పోర్చుగల్ నుంచి భారతదేశం చూడానికి వచ్చిన ఒక చిత్రకారుడు. అలా దేశం మొత్తం తిరిగి ప్రాచీన భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకుంటాడు. ఆ విధంగా తెలుసుకుంటూ రాయ్ చేసే ప్రయాణం కూడా ఈ నవలలో మనం చూడచ్చు.
ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ నవల. అభి తన ప్రయాణంలో ఎదుర్కున్న ఎన్నో ఇబ్బందులను, వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాన్ని ఈ నవలలో ఎంతో అద్భుతంగా వర్ణించారు. ముఖ్యంగా పాములు, యాలి, వంటి జంతువులతో చేసే పోరాటాలు చాలా బాగుంటాయి.
ఈ నవల చరిత్ర ఆధారంగా రాసిన కాల్పనిక నవల. రాయ్ ప్రయాణం ద్వారా అప్పటి పరిస్థితుల గురించి చెప్తే, అభి పాత్ర ద్వారా ఇప్పుడు మారిన విషయాల గురించి ప్రస్తావిస్తారు. అందులో భాగంగా రచయిత పరిశోధన కోసం పడిన శ్రమ మనకి రచనలో కనిపిస్తుంది.
ఈ పుస్తకం నన్ను ఏకబిగిన చదివించింది. దాదాపు 250 పేజీలు ఉన్న నవల నాకు చదవడానికి కేవలం 4 గంటలు మాత్రమే పట్టింది. ఇంత త్వరగా ఒక పుస్తకాన్ని ముగించడం నాకు ఇదే తొలిసారి. ఎంతో ఉత్కంఠ కలిగించే నవల. చదువుతున్నంత సేపూ ఒక సినిమా చదువుతున్నామా అని అనిపిస్తుంది.
ఇక ముఖ్యంగా ఈ నవల కవర్ పేజీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కథకు సంభందించిన ఎన్నో విషయాలను కవర్ పేజీలో అంతర్లీనంగా పెట్టారు. ఇంత అద్భుతంగా కవర్ పేజీ కోసం పని చేసిన వారికి ప్రత్యేకంగా అభినందనలు.
అక్కడక్కడ ఉండే అచ్చుతప్పులూ, పుస్తకం లోపల బొమ్మలను చిత్రకారులతో కాకుండా AI తో వెయ్యించడం వంటి చిన్న విషయాలను పక్కన పెడితే.., కథ, కథనం, కథ ద్వారా చెప్పాలి అనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పిన విధానం నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి.
ఒక మంచి అడ్వెంచర్ థ్రిల్లర్ ఉన్న నవల కోసం చూస్తున్న వాళ్ళకీ, తెలుగులో మొదటి పుస్తకం చదవాలి అనుకొనే వాళ్ళకి ఈ పుస్తకం ఒక మంచి కాలక్షేపం.
ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది.
లింక్ : https://amzn.to/41Isepc