అమెరికా… ఈ పేరు వినగానే మనకి ఎన్నో విషయాలు గుర్తువస్తాయి.. విలాసమైన జీవితం, డాలర్లలో వచ్చే జీతం, స్వేచ్ఛ, గొప్ప ఉద్యోగ అవకాశాలు.. ఇలా ఎన్నో విషయాలు.. వీటితో పాటు ఒంటరితనం, వివక్ష వంటివి కూడా ఉన్నాయి.. అయినా కూడా ఎంతో మంది అమెరికా వెళ్ళడానికి సిద్దపడుతున్నారు. ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ, అక్కడే ఎంతో మంది జీవనం సాగిస్తున్నారు. అమెరికలోని జీవితాన్ని, అక్కడికి వెళ్లిన వాళ్ళు పడే కష్టాలను కథాంశంగా తీసుకొని సతీష్ చెముడు గారు ‘నేను ఎక్కడ ఉన్నాను?’ అనే నవల రాశారు.

సరిత, ఆశ లు మధ్య తరగతి కుటుంబానికి చెందిన అక్కాచెల్లెల్లు. తమ చుట్టూ ఉన్న పరిస్థుతుల కారణంగా ఇద్దరూ అమెరికా వెళ్ళాలి అని అనుకుంటారు. అలా అమెరికా వెళ్లిన ఈ ఇద్దరు, ఎలాంటి కష్టాలు పడ్డారు.? తమ కూతుర్లు వేరే దేశం వెళ్లిపోవడం వలన, ఇండియాలో ఉండిపోయిన తల్లితండ్రులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.? అమెరికా వెళ్ళినవాళ్ళు ఇండియా తిరిగి వస్తారా..? వంటి విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదవాల్సిందే.
ఇటువంటి కథాంశంతో కథలు చాలానే వచ్చాయి కానీ, ఒక పూర్తి నవల ఇంత వరకు నేను చదవలేదు.. ఇలాంటి ఒక సమకాలీన అంశాన్ని తన కథగా ఎంచుకున్నందుకు సతీష్ గారిని మెచ్చుకోవాలి. అలానే అమెరికా వెళ్లిన తర్వాత వాళ్ళు పడే కష్ఠాలు, కాలేజీలో assignments, పార్ట్ టైం జాబ్ చేస్తూ తమ ఖర్చులు చూసుకోవడం, ఉద్యోగవేట, fake experience తో ఉద్యోగంలో ఉండే ఒత్తిడులు, ఇలా ఎన్నో అంశాలను తమ కథలో చూపించారు.
అమెరికా వెళ్లడం మంచిదనో, లేదా వెళ్లకపోవడమే మంచిది అని తన అభిప్రాయం చెప్పకుండా, కేవలం ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను మనకి తెలిపే ప్రయత్నం చెయ్యడం చాలా బాగా నచ్చింది.
అక్కడక్కడా అచ్చుతప్పులు, పాత్రల మధ్య సంభాషలను మరింత బాగా రాసివుంటే, ఈ నవల మరింత అద్భుతంగా ఉండేది.
ఎవరి సహాయం లేకుండా, తనకు ఉన్న అతి కొద్దీ వనరులతో ఇంత మంచి కథాంశంతో పుస్తకం తీసుకొని వచ్చిన సతీష్ గారికి అభినందనలు.
దూర దేశాలకు చదువు, ఉద్యోగ ప్రయత్నాల కోసం వెళ్తున్న ప్రతి ఒక్కరు ఈ పుస్తకం తప్పకుండ చదవాలి.
ఈ పుస్తకం కోసం @ గారినిసంప్రదించండి.








