చిన్నపుడు ఖలేజా సినిమా చూసినప్పటి నుంచి నాలో ఒకటే ప్రశ్న ఉండేది.. ‘ఎందుకు పాళీ ప్రజలు దేవుడిని నమ్ముకున్నారూ, తమ సొంత ప్రయత్నం చెయ్యకుండా నిజాన్ని తెలుసుకోవడానికి?’ అని.. దీనికి సమాధానం నా వయసు పెరిగే కొద్దీ మారుతూనే వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా పతంజలి శాస్త్రి గారు రాసిన ‘దేవర కోటేశు’ నవల చదివాక మరోసారి మారింది.

కేవలం 118 పేజీల్లో ఒక gripping , Tight screenplay ఉన్న నవల చదవడం ఇదే మొదటి సారి..
కథ చాలా చిన్నదే:
గోదావరి జిల్లాలోని ఒక గ్రామం, వర్షాలు లేక పంటలు పండక , చెరువు ఎండిపోయి, ఆ గ్రామ ప్రజలు వర్షం కోసం ఏదైనా అద్భుతం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆ ఊర్లోనే పుట్టి పెరిగిన ఒక ఇరవై ఏళ్ల కోటేశు రెడ్డి జబ్బు చేసి చచ్చిపోతాడు. ఆ చావు తర్వాత, ఆ కోటేశు కాస్తా కోటేశు స్వామిగా మారడం, కోటేశు స్వామి దేవాలయం, పూజలు, పాటలు, తీర్థస్థలంగా ఆ గ్రామం మారడం ఇలా అన్నీ జరుగుతాయి.. ఇన్ని జరిగాక, మరి ఊర్లో వర్షం పడిందా అనేది తెలుసుకోవాలి అంటే పుస్తకం చదవాల్సిందే.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాత్రలు:
కేవలం 118 పేజీలు ఉండే ఈ నవలలో దాదాపు 10-12 పాత్రలు ఉంటాయి.. అన్నీ కూడా మనం దాదాపు ప్రస్తుతం చూసే పాత్రలే. తాము నమ్మిన విషయాన్ని ఆచరించడానికి, మిగతా వాళ్ళు కూడా అనుసరించేలా చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మిస్టిక్ పాత్ర అయిన ‘మూగది’ గురించి.. తన గతం తెలియకపోయినా, ఆ గ్రామంతో ప్రకృతికి ఉన్న అనుబంధానికి ప్రతికలా అనిపించింది. అలానే పెద్దమ్మ గారి పాత్ర కూడా.. తాము నమ్మినది అవాస్తమైనదైనా కూడా, ఆ విశ్వాసంలో వచ్చే ఆనందం, ప్రశాంతత ఈ పాత్ర ద్వారా చూడచ్చు.
సెటైర్:
ఈ నవలిక ఎప్పుడు రాసారో తెలీదు కానీ.. దేవుడు లేదా యుగ పురుషుడు అని అనుకొని వారి పేరు మీద దేవాలయాలు, పాటలు, మాలలు, పారాయణాలు రాసి వ్యాప్తి చేసే ఎంతో మంది మీద ఒక సెటైర్ లా ఈ పుస్తకం అనిపించింది. ముఖ్యంగా బడి పంతులు ద్వారా పాటలు రాయించడం, ఫోటోలు అమ్మడం వంటివి చదువుతున్నప్పుడు మనకి తప్పకుండా నవ్వు వస్తుంది.ఇలాంటి పుస్తకం ఇప్పుడు రాసే ప్రయత్నం చెయ్యగలరా అని కూడా అనిపిస్తుంది.
POV:
ఈ కథను, కథలోని పాత్రలను Bird View Angle లో చూసినప్పుడు మనకి ఇంత మూర్ఖంగా ఎలా ఉంటారు, మనుషుల్లోని మూఢత్వం ఇంత ఉందా అనే అనిపిస్తే.. కరోనా వంటి మహమారి వచ్చినప్పుడు మనం చేసిన పనులు ( అనందయ్య మందు, పతంజలి కరోనిల్ వంటివి) చూసినప్పుడు మనషి అద్భుతం జరగడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడతాడు అని ఆ పాత్రల కోణం లో ఆలోచిస్తే తెలుస్తుంది.
Magic Realism / వాస్తవికత:
Modern literature లో అది కూడా post Colonial లిటరేచర్ లో Magic realism ఒకటి. నమ్మశక్యం కాని విషయాన్ని, ఎంతో వివరంగా,realist గా చెప్పే విధానాన్ని Magic realism అంటారు అనుకుంటున్న… ‘దేవర కోటేశు’ చదువుతున్నప్పుడు నాకు అలానే అనిపించింది. కథ చివర్లో వచ్చే రాజకీయ ప్రకటనలు, రికార్డు డ్యాన్సులు కోసం వెంకశేషు, నాగార్జున అభిమానులు ఉండడం, ఘంటసాల పాటలు వినే కరణం, దేవుడు లీలలను పూర్తి నమ్మకంతో నమ్మే జనాలు.. ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఈ నవలలో…
గోదావరి జిల్లా యాసను, అక్కడి గ్రామీణ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని చాలా అద్భుతంగా చూపించారు ఈ నవలలో..
ముగింపు:
త్రివిక్రమ్ ‘అద్భుతం జరిగినప్పుడు ఎవ్వరూ గుర్తించారు.. జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు’ అని చెప్పినా.., ‘మన దేశంలో సైంటిస్టులు కన్న బాబాలే ఎక్కువ ఉంటారు’ అని చెప్పినా, మనిషి అద్భుతాన్ని కోరుకుంటాడు.. కానీ ఈ నవల చదివిన తర్వాత తెలుసుకున్న విషయం, మనిషి అద్భుతాల కోసం ఎదురుచూడటం కాదు.. మనం పని చేసుకుంటూ వెళ్తే చాలు.. అప్పుడు అదే అద్భుతాలు సృష్టిస్తుంది అని…
ప్రస్తుతం ఈ పుస్తకం అందుబాటులో ఉందో లేదో తెలీదు.. కానీ మీకు ఎప్పుడైనా ఈ పుస్తకం కనిపిస్తే తప్పకుండా తీసుకొని చదవండి.








