‘ప్ర’ముఖా – ముఖి : అనువాదకుడు ,రంగనాథ రామచంద్ర రావు గారితో

 

  •  నమస్కారం రామచంద్రరావు గారు, ముందుగా మీ రచనా జీవితం గురించి తెలుసుకునే ముందు, మీ గురించి మీ మాటల్లో ఓ చిన్ని పరిచయం?

రంగనాథ రామచంద్రరావు: నమస్కారం. మాది సాధారణమైన మధ్య తరగతి కుటుంబం. సుమారు 80 ఏళ్ళ క్రితం కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ కుటుంబం మాది. నాన్న బతుకుతెరువు కోసం సొంత నేలను వదిలి అనేక చోట్ల తిరిగి చివరికి మంత్రాలయానికి దగ్గర్లోని ఆదోనిలో స్థిరపడ్డారు. నేను ఏప్రిల్ 28, 1953లో ఆదోనిలోనే పుట్టాను. నా ప్రాథమిక విద్య స్థానిక మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. తర్వాత మున్సిపల్ హైస్కూల్లో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకున్నాను. తర్వాత ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బి.ఎస్.సి (ఎం.పి.సి.) చేశాను. డిగ్రీ తర్వాత మైసూరు రీజినల్ కాలేజిలో బి.యిడి చేశాను. ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్య ద్వార ఎం.ఎ. (ఆంగ్లం) చేశాను.మొదట్లో కొన్ని పాఠశాలల్లో అన్ ఎయిడెడ్ పోస్ట్లలో పనిచేసినా 1985 ఆదోని నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా చేరి 2011లో పదవీ విరమణ చేశాను. అప్పటి నుంచి హైదరాబాద్­లో స్థిరపడ్డాను.అనేక ప్రాంతాలు తిరగడం వల్ల, నాన్నగారు ఏ ప్రాంతానికి వెళితే ఆ భాషను నేర్చుకునేవారు. ఆ భాషను అత్యంత సహజంగా మాట్లాడేవారు. అమ్మ చాలా చక్కగా పాడేది. బహుశా నాకు సంగీతం పట్ల ఇష్టం కలగడానికి అది కారణం కావచ్చు. నా అర్ధాంగి వడుగూరి లక్ష్మీకుమారి సాహిత్యం పట్ల అభిరుచి కలిగిన మనిషి. ఆమె సుమారు 8 పుస్తకాలను తెలుగు నుంచి కన్నడలోకి అనువదించింది. కన్నడ నుంచి తెలుగుకు, తెలుగు నుంచి కన్నడకు అనువదించగలదు. మా పెద్దమ్మాయి ఆంగ్లంలో నవలలు రాస్తూ సాహిత్య కృషి చేస్తూవుంది. చిన్నమ్మాయి సంగీతంలో కృషి చేస్తూవుంది. చక్కగా పొడుతుంది. ఫ్లూట్ వాయిస్తుంది.

రచనల వివరాలు: 25 అనువాద నవలలు, 21 అనువాద కథా సంకలనాలు, 3 సొంత కథా సంపుటాలు, 2 సొంత నవలలు, సాహిత్య అకాడెమీ కోసం చేసిన 9 అనువాదాలు, 5 సంచార జీవుల ఆత్మకథలు, ఒక జీవిత చరిత్ర, 4 కవితా సంపుటాలు (3 కవితా సంకలనాలు తెలుగు నుంచి కన్నడకు. ఒక కవితా సంకలనం ఇంగ్లీషు నుంచి తెలుగులోకి) ఒక కథా సంకలనం తెలుగు నుంచి కన్నడకు, బాలల కోసం రాసిన 12 పుస్తకాలు వెలువడ్డాయి.

 

  • తెలుగులో ఈ అనువాద సాహిత్యం ప్రస్తావన ఎప్పుడు వచ్చినా, మీ పేరు మేము తప్పక వింటుంటాము. అయితే అనువాద సాహిత్యంతో మీ పరిచయం ఎలా జరిగింది? అపై మీరెప్పుడు, ఏ కారణం వల్ల అనువాదం చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు?

    Ranganatha Ramachandra Rao in School Days
    Ranganatha Ramachandra Rao in School Days

రంగనాథ రామచంద్రరావు: నేను హైస్కూల్ 6వ తరగతిలో చేరినపుడు మాకు మా హిందీ మాస్టార్లు తరగతిలో హిందీ పాఠాలు బోధించటంతో పాటు ప్రత్యేకించి, విద్యార్థులను హైదరాబాద్ హిందీ సభ, మద్రాసు హిందీ ప్రచార్ సభ వారు నిర్వహించే ప్రాథమిక, మధ్యమిక లాంటి పరీక్షలు రాయటానికి ప్రోత్సహించేవారు. పైగా ఆ పరీక్షలకు కావలసిన పుస్తకాలను అందించి వాటిని ఖాళీ సమయంలో బోధించి పరీక్షలకు సిద్ధం చేసేవారు. ఈ సందర్భంగా మా అయ్యన్న సార్­ను, సాకరె విశ్వనాథ్ సార్­ను, వారి తమ్ముడు సాకరె ఈరన్న సార్­ను, అమరయ్య సారు­ను, తులసీబాయి మేడము­ను తలుచుకోవడం నా బాధ్యత. వారి పుణ్యమా అని స్కూలు విద్య పూర్తి అయ్యేలోపు విశారద మొదటి భాగం పూర్తయింది. విశారద చేస్తున్నప్పుడు మాకు ‘కథా కౌముది’ అనే కథల సంపుటి మా సిలబస్ లో ఉండేది. అందులోని ఒక కథ శ్రీగోవింద్ వల్లభ్ పంత్ గారి ‘మిలన్ ముహూర్త్’ అనే కథ. ఆ కథను తులసీబాయి మేడమ్ గారు చెప్పారు. ఆ కథ నన్ను ఎంత కదిలించింది అంటే ఆ రాత్రికి రాత్రే నేను తెలుగులో రాశాను, అంటే అనువదించాను. మరుసటి రోజు నేను సంకోచిస్తూనే హిందీ ప్రేమీ మండలి క్లాసులో తులసీబాయి మేడమ్­కి  చూపించాను. మేడమ్ నా తెలుగు అనువాదాన్ని చదివి, ఆ విశారద క్లాసులో పిల్లలందరి ముందు నా చేతనే చదివించింది. కథ పూర్తయిన తర్వాత పిల్లలతో పాటు మేడమ్ చప్పట్లు కొట్టి నన్ను అభినందించారు. అదే నా మొదటి అనువాదం, నాకు దొరికిన మొదటి అభినందన. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. స్కూల్లో నేను అరవ తరగతిలో చేరినప్పటి నుంచి, మా సీనియర్, మా ఇంటి పక్కన ఉండే అన్నతో రోజూ సాయంత్రం మా ఊరి బ్రాంచ్ లైబ్రేరీకి వెళ్ళేవాడిని. అక్కడ ఎన్నో పుస్తకాలు పిల్లల కథల పుస్తకాలతోపాటు అనేక పుస్తకాలు చదివాను. బహుశా హైస్కూల్ విద్య అయిపోయేలోపు బొల్లిముంత శివరామకృష్ణ, గద్దెలింగయ్య, రెంటాల గోపాల కృష్ణ ఇలాంటి ఎందరో గొప్ప అనువాదకుల రచనలు కూడా చదవడం జరిగింది. అనువాద రచనల పట్ల అప్పుడే నాలో అభిమానం అంకురించి వుండాలి. ‘మిలన్ ముహూర్త్’ అనువాదంతో ప్రారంభమైన నా అనువాదాలు జయశంకర్ ప్రసాద్, ప్రేమ్­చంద్ , సుభద్రా కుమారీ చౌహాన్, సూర్యకాంత్ త్రిపాఠీ నిరాలా మొదలైనవారి రచనలు అనువదించడం తో ముందుకు సాగాయి.కాలేజిలో చేరిన తర్వాత మా హిందీ లెక్చరర్ శ్రీఅనంత్ కమలానాథ్ పంకజ్ గారు అనువాదాలను ప్రోత్సహించారు. కాలేజిలో ఉండగానే ఆయన రాసిన కథలే పది దాకా అనువదించాను. ఆ తర్వాత బి.యిడి చేయడానికి మైసూరు రీజినల్ కాలేజిలో కాలు పెట్టాక శ్రీకృష్ణ ఆలనహళ్ళి, శ్రీఈశ్వరచంద్ర, శ్రీ కుం వీరభద్రప్ప. ఇలాంటి ప్రసిద్ధ కన్నడ రచయిలతో, వారి రచనలతో పరిచయాలు నన్ను సీరియస్­గా అనువాదాల వైపు, అందులోనూ కన్నడ అనువాదాలవైపు మరలించాయి.

 

  • మీరు పాఠకుడిగా ఒక పుస్తకం చదివినప్పటికీ, అదే పుస్తకాన్ని అనువాదం చేయాలి అనుకొని ఒక అనువాదకుడిగా చదివినప్పటికీ ఎలాంటి భేదం ఉంటుంది?

రంగ: పాఠకుడిగా, నా ఆనందం కోసమే చదివేవాడిని. ఆసక్తి కలిగించే వందల రచనలను చదివాను. కొన్ని రచనలు ఎంతగా కదిలిస్తాయంటే నిద్రపట్టనివ్వదు. అలాంటి రచనలు తెలుగు పాఠకులకు అందివ్వాలని అనిపిస్తుంది. ఈశ్వరచంద్రగారు రాసిన ‘మునితాయి’ అలాంటి ఓ కథ. చదివిన మూడు రోజుల వరకు జ్వరం. (అప్పుడు బహుశా 22-23 ఏళ్ళుండొచ్చు) అలాంటి కథలను, ప్రత్యేకమైన కథలను, ప్రత్యేకత ఉన్న నవలలను, తెలుగులోకి అనువదించాలనుకున్నప్పుడు దాన్ని అత్యంత సీరియస్ గా, సూక్ష్మంగా, పదే పదే చదువుతాను. కథను, కథలోని పాత్రలను, కథల శైలిని, ఆ శిల్పాన్ని జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నిస్తాను. పాఠకుడిగా ఆనందించటానికే చదువుతాను. రాను రాను సీరియస్ గా చదవటమే అలవాటైంది.

 

  • మీరు అనువదించిన మొట్టమొదటి పుస్తకం లేదా రచన ఏమిటి? అందుకు మీరు పొందిన స్పందన ఎలాంటిదో చెప్పగలరా? 

రంగ: హిందీ నుంచి చేసిన ‘బంధం’ అనే అనువాద కథ. 1972 సెప్టెంబర్ స్రవంతి’ మాసపత్రిక (దక్షిణ భారత్ హిందీ సభ  ప్రచురణ) మిత్రుల‌ ఉపాధ్యాల అభినందనలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయని చెప్పాలా?

 

  • అటు కన్నడ, ఇటు తెలుగులో రెండు భాషల్లో ఎంతో పట్టు ఉంటే తప్ప, ఇన్ని అనువాదాలు ఇంత బాగా చేయడం సాధ్యపడదు. మరి మీరు ఈ అనువాద ప్రక్రియలో ఎన్నో ఇబ్బందులు కూడా చూసుంటారు. ముఖ్యంగా భాషతో, సంస్కృతితో ముడిపడిన సామెతలని, జాతీయాలని అనువాదం చేయడంలో మీ సాధన ఎలా ఉంటుంది?

రంగ: ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఇబ్బందులు ఎలాంటివో  చెప్పడం కంటే ఇంకో కథను అనువాదం చేయటం సులభం. రెండు భాషలు తెలిసినప్పటికీ, అన్నీ తెలుసు అని నేను చెప్పుకోలేను. ఎంత తెలిసినా, ఇంకా ఎంతో ఉంటుంది. ఇక అనువాదం విషయానికి వస్తే, ప్రామాణికమైన భాషలోంచి అనువదించడం సులభమనే చెప్పాలి. అయితే మాండలికాలకు వచ్చినప్పుడు చాలా కష్టపడవలసి వస్తుంది. కర్ణాటకలో ఒక్కో ప్రాంతంలోని మాండలికం ఒక్కోలా ఉంటుంది. బళ్ళారి, ధారవాడ, ఉత్తర కర్ణాటక, ఇలా అనేక ప్రాంతాల మాండలికాలు చూడవచ్చు. రచయితల్లో నాకు తెలిసిన కుం. వీరభద్రప్పగారి మాండలికం ప్రత్యేకమైనది. కష్టమైనది. అలాగే దేవనూరు మహాదేవగారిది.. వారిది నంజనగూడు మాండలికం. అలాగే వైదేహి గారు కుందాపుర మాండలికం వాడుతారు. అయితే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. చదువుతూ చదువుతూ ఉంటే కొంత వరకు భాష అర్థమైపోతుంది. కొంత పదకోశాల వల్ల తెలుసుకోచ్చు. కొన్నిసార్లు మూల రచయితలు పుస్తకం వెనుక మాండలిక పదాలకు అర్థాలు ఇస్తున్నారు. నా వరకు నేను మరీ కొన్ని పదాలు అర్థం కాకపోతే మూలరచయితనే సంప్రదిస్తాను. అలా వారిని అడిగితే ఎంత సంతోపపడుతారో! చాలా ఆత్మీయంగా మాట్లాడి మా డౌట్లు తీరుస్తారు. అలాగే భాషతోకానీ, సంస్కృతుల, సామెతల విషయం వచ్చినపుడు విస్తృతమైన అధ్యయనం వల్ల తెలుస్తుంది. సామెతలను అనువాదం చేయకుండా దానికి సరిపోయే, అదే అర్థాన్ని ఇచ్చే సామెతలను తెలుగు నుంచి ఎన్నుకుంటే అనువాదం సరళంగా, సహజంగా ఉంటుంది.

 

  •  ఓ కొత్త రచన చేయడం వేరు, అప్పటికే ప్రచురితమై ఎంతో పేరొందిన రచనలని మరో భాషలోకి అనువాదం చేయడం వేరు. ముఖ్యంగా ఈ ప్రక్రియలో చాలాసార్లు మూల రచనలోని శైలిని అనువాద రచన అందుకోలేదు అనే మాట వింటుంటాం. మరి మీరు అనువాదం చేస్తున్నప్పుడు ఆ మూల రచనలోని శైలిని, పట్టుని కోల్పోకుండా ఎలా కాపాడుతారు?

రంగ: కొత్త రచన లేదా సొంత రచన చేయడం వేరు. అయితే ఒక భాష నుంచి మరో భాషలోకి ఒక కథను అనువాదాన్నో అనువదించటం కష్టం. కథానువాదం బాగుండాలి, భాష బాగుండాలి. చదివించే గుణం ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రముఖ కన్నడ రచయిత వివేక్ శానభాగ ఒకసారి నాతోమాట్లాడుతూ ‘భగవంతుడు అనువాదం చేసినా 100% చేయలేడు.’ అని అనటం నాకెంతో ఆనందం కలిగించింది. అలాగని నన్ను నా అనువాదాన్ని సమర్థించుకోవటం లేదు. నా వరకు నేను మూల రచనకు విధేయంగా, అనుగుణంగానే చేస్తాను. మూల రచనలో అనవసరంగా తీసెయ్యటం కానీ, లేనివి కలపటం కాని చేయను, మూల రచయిత శిల్పాన్ని, కథనం చెప్పే తీరును అనువాదంలో తీసుకుని రావటానికి ప్రయత్నిస్తాను. నేను సాహిత్య అకాడెమికి చేసిన అవధేశ్వరి నవలను కానీ, అంతఃపురం నవలను కానీ చదివితే రెండింటి శైలీ, శిల్పాలు ఎంత తేడా ఉన్నాయో గుర్తించొచ్చు. అలాగే ఎం.ఆర్. దత్తాత్రి గారి ‘తారాబాయి లేఖ’, ‘ఒక్కొక్క తలకు ఒక్కొక్క వెల’ రెండు నవలలు చదివితే మూల రచయిత రెండింటిలోనూ శైలి, శిల్పాలలో ఎంత వైవిధ్యం చూపాడో అర్ధమవుతుంది. అలాగే నా అనువాదం కూడా నేనూ అలాగే అనువదించానని అనుకుంటున్నాను.

 

  • ఒక పాఠకుడిగా మీరు ఎంతో ఇష్టంగా చదివిన, మీకు ఎప్పటికీ బాగా గుర్తుండిపోయిన రచన, రచయిత వివరాలు చెప్పగలరా?

రంగ: చిన్నప్పుడు బొల్లిముంత శివరామకృష్ణగారి శరత్ నవలానువాదం ‘శ్రీకాంత్’ కావచ్చు. ఈ రోజుకూ మరిచిపోలేదు. అది ఈనాటికి అనువాదం అని అనిపించలేదు.

 

  •  మీరు ఇప్పటికే ఎన్నో కన్నడ రచనలని తెలుగులోకి అనువదించారు. అయితే తెలుగు సాహిత్యంలోని ఏ రచనలను కన్నడలోకి అనువదిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఎందుకు?

రంగ: ఇది కూడా కష్టమైన ప్రశ్నే. ఒకానొకప్పుడు తెలుగు సాహిత్యం, నవలలు, కథలు విపరీతంగా చదివేవాడిని. అనువాదాలు సీరియస్ గా మొదలు పెట్టినప్పటి నుంచి, నా దృష్టి అంతా కన్నడ నుంచి తెలుగులోకి చేయవలసిన రచనల మీదే ఉండిపోయింది. దాంతో కన్నడ రచనలే ఎక్కువగా చదవవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కన్నడ మిత్రుల, రచయితల సూచనలపై, కోరికపై రచనలు అనువదించటం మొదలుపెట్టాను. అయితే అవి నాకు నచ్చినవే సుమా! అయితే ప్రసిద్ధ కన్నడ రచయిత, అనువాదకులు శ్రీ వీరభద్రగారు అనేక రచనలు తెలుగు నుంచి కన్నడలో మంచి రచనలు చేశారు. ఆయన శరత్ నవలలను, విశ్వనాథ సత్యనారాయణగారి చిన్న కథలు, చలంగారి మైదానం, కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి అల్పజీవి, కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం అంపశయ్య నవీన్ గారి ‘కాలపురుషన హెజ్జె గురుతుగళు’ చేశారు. విజయశంకర్, వంశీ, ఎస్.డి. కుమార్ ఇలా ఎందరో కన్నడలోకి చేస్తున్న వారున్నారు.

 

  •  ఒక మంచి అనువాదానికి ముఖ్యమైన లక్షణాలు ఏమిటి? మీ దృష్టిలో పరిపూర్ణమైన అనువాదం అంటే ఏమిటి?

రంగ: మూల రచనకు విధేయంగా ఉండాలి. లేని విషయాలు చొప్పించకూడదు. ఉన్నవి తొలగించకూడదు. నేను ఎప్పుడూ చెబుతున్నట్టు అనువాదం కేవలం పదాలను మరో భాషలో తర్జుమా చేయడం కాదు. మూల భాషలోని శైలినీ, ఒదుగును, శిల్పాన్ని, భాషార్థాలను, మూల రచయితను మాటలతో కాక ఆత్మతో అనువదించాలని నమ్ముతాను.

 

  •  మీరు చేసిన ఇన్నిన్ని అనువాదాల్లో మీకు బాగా ప్రత్యేకమైనది ఏది అంటే ఏం చెప్తారు? ఎందుకు?

రంగ: ఇది కూడా క్లిష్టమైన ప్రశ్ననే. నేను అనువాదించినవన్నీ ఎంతో కొంత ప్రత్యేకమైన రచనలే. అయితే చెప్పాలి కాబట్టి కొన్నింటిని పేర్కొంటాను. ఓం ణమో, అవధేశ్వరి, అంతఃపురం, ఓం ణమో మూడు తరాల జైనుల కథ. నవలలో జైనుల సిద్ధాంతాలు, జైన ధర్మం గురించి లోతైన చింతన, ఆచరణ, తత్వాత ఘర్షణ, వైరుధ్యాలు, వైయక్తిత స్వాతంత్ర్యపు అనివార్యత- వీటన్నిటిని రచయిత విమర్శకు గురిచేస్తూ మనల్ని ఆలోచనలకు గురిచేస్తారు. ఈ నవలను చదివితే ఆయన తీసుకున్న ఇతివృత్తం కోసం ఎంత హెూమ్ వర్క్ చేశారో అర్థమవుతుంది. ప్రతి చాప్టర్ చివరలో రచయిత పాఠకుల ముందుకొచ్చి చర్చించడం ఆయన శైలి శిల్పాల్లో ఓ కొత్తదనాన్ని చూపించారు.

 

  • మీరు అనువాదం చేసే క్రమంలో, మూల రచయితతో మాట్లాడటం జరుగుతుందా? ఒకవేళ అలా జరిగి ఉంటే అప్పుడు మీ చర్చ ఏ విధంగా ఉంటుంది? అలాంటి సందర్భాలలో మీకు బాగా గుర్తుండిపోయిన అనుభవం ఏదైనా ఉందా?

    Ranganatha Ramachandra Rao During Degree

రంగ: మూల రచనను బట్టి ఒక్కోసారి మూలరచయితతో మాట్లాడవలసి వస్తుంది. చాలామందితో మాట్లాడాను. చర్చ చేసేటంతగా నేనెప్పుడూ మాట్లడలేదు. అయితే ఇద్దరు రచయితలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఒకరు శ్రీకృష్ణ, ఆలనహళ్ళిగారు. ఆయన రాసిన మూడు నవలలు సినిమాలుగా తీశారు. ‘కాడు’ 1974 జాతీయ పురస్కారం పొందిన సినిమా, సినిమాగా తీసిన ఆ నవల తెలుగు అనువాదం ‘ఆంధ్రజ్యోతి’ వారపత్రికలో ‘అడవి’ పేరిట సీరియల్­గా వస్తోంది. దాని అనువాదకులు ‘శ్రీకంఠమూర్తి’ గారు. అలాంటి సమయంలో నేను బి.యిడి చేయడానికి మైసూరు రీజినల్ కాలేజిలో చేరాను. చేరి వారం పది రోజులైంది. ఒక రోజు మిత్రులతో నేను బృందావన్ గార్డెన్సు బస్సులో వెళుతున్నాను. మా ముందు వరుసలో కూర్చున్న ఉంగరాల జుట్టుతో ఎంతో హ్యాండ్ సమ్­గా ఉన్న వ్యక్తి వెనుతిరిగి ‘మీరు మాట్లాడుతున్న భాష ఏమిటి ?’ అని అడిగారు. నేను ‘తెలుగు’ అన్నాను. ‘మీరు తెలుగు పత్రికలు చదువుతారా?’ అన్నారు. ‘ఆ.. బాగా చదువుతాను” అన్నాను. ‘పత్రికలో ఏం చదువుతారు? ఏవి మీకు ఇంట్రెస్ట్?” అన్నారు. ‘నాకు కథలు, నవలలు చదవటమంటే, కథలు రాయటమంటే చాలా ఇష్టం’ అన్నాను. ‘ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో సీరియల్ నవల ఏదొస్తోంది?’ అని అడిగారు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాను. రీసెంట్­గా చదివిన ఆంధ్రజ్యోతి పత్రికను గబగబా మనసులో తిరిగేశాను. కొన్ని కథల పేరు చెప్పి చివరగా ‘అడవి’ అని కన్నడ అనువాద నవల సీరియల్­గా వస్తోందని చెప్పారు. ‘అది రాసింది నేనే’ అన్నారాయన. నా నోట మాట రాలేదు. నేను చాలా ఎగ్జయిట్ అయ్యాను. ఆ తర్వాత కొద్దిసేపు మా మధ్య మాటలు జరిగాయి. ఆయన తాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాగ్వేజస్ లో  ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పారు. అది మా కాలేజి ఉన్న మానస గంగోత్రిలోనే ఉందని చెప్పారు. నేను కన్నడ నుంచి, హిందీ నుంచి అనువాదాలు చేస్తానని తెలిసి ఆనందపడ్డారు. ఆ తర్వాత ఆయన్ను కలిసినపుడు నన్ను వారి ఇంటికి తీసుకెళ్లారు. వారి కథల సంకలనాలను, ‘మట్టిన హాడు’ కావ్యసంకలనాన్ని ఇచ్చారు. నేను ‘ఏదైనా ఒక కథ అనువాదం చేయొచ్చా?’ అని అడిగితే, వెంటనే ఒక పేపర్ తీసుకుని రెండు కథా సంపుటాలు, ఒక కవితా సంకలనానికి పర్మిషన్ లెటర్ రాసి ఇచ్చారు. నేను షాక్ అయ్యాను, అప్పుడు నేను 21-22 ఏళ్ళ కుర్రవాడిని. ఆయన కన్నడలో పెద్ద రచయిత. అలాంటి వ్యక్తి అనువాదంలో నా ఆసక్తి తెలిసి, నా శక్తి సామర్థ్యాలు ఏమిటో కూడా చూడకుండా నన్ను ప్రోత్సహిస్తూ, అనుమతి పత్రం రాసివ్వడం చూసి ఆయన మంచి మనస్సుకు, సరళ స్వభావానికి ఆశ్చర్యపోయాను. ఇది నేను మరిచిపోలేని సంఘటన, 16-7-76 ఆంద్రజ్యోతి, వారపత్రికలో నేను అనువదించిన శ్రీకృష్ణ, ఆలనహళ్ళిగారి ‘ఫీనిక్స్’ కథ తెలుగు అనువాదం ప్రచురితమైంది. బహుశా ఈ కథ పబ్లిష్ కావటానికి నెల ముందో నెల తర్వాతో నేను ఆయనతో చేసిన ఇంటర్వ్యూ ప్రచురితమైంది. ఆ కథ కాపీ కోసం నేను వేటపాలెం లైబ్రేరియన్ శ్రీమతి శ్రీవల్లీగారిని సంప్రదించగానే ఆమె ఆ సంవత్సరం ఆంధ్రజ్యోతిని వెతికి ఆ కతను పంపారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా ఈశ్వరచంద్ర అనే కన్నడ రచయితను మరిచిపోలేను. ఆయన కథ ‘మునితాయి’ని అనువదించాను. ఆ కథ మూడు రోజులు నన్ను నిద్రపోనివ్వలేదు. మరో కథ ‘ఎవరో వస్తారు’. ఆ రెండు కథలు నా భారతీయ కథా సంకలనాలలో ఉన్నాయి. అది అలా ఉంచితే, నేను వస్తానన్న సమయానికి అయన ఇంటికి వెళ్ళలేక కాస్త ఆలస్యంగా వెళ్ళాను. ఆయన ఏరోనాటికల్ ఇంజనీర్. నేను వెళ్ళగానే నవ్వుతూ ఆహ్వానించారు. నేను సారీ చెబుతుంటే ఆపి, ఒక మాట అన్నారు. అది ఈ రోజుకూ నేను మంత్రంలా తలుచుకుంటూ ఉంటాను. ఆయన అన్నదేమిటంటే- ‘రచయిత అన్నవాడికి సహృదయత ఉండాలి!’ అని. యాభై ఏళ్ళు గడిచాయి. ఆ మాట నేను ఇప్పటికీ తలుచుకుంటాను. ఆయనతో పరిచయం ఇప్పటికీ కొనసాగుతోంది.

 

  •  ఇటు పాఠకులుగా, అటు అనువాదకులుగా మీరు కన్నడ, తెలుగు భాషల్లో, సాహిత్యంలో గమనించిన వ్యత్యాసాలు, అలాగే సామ్యాలు ఏమిటి?

రంగ: ప్రపంచంలో ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాలు, ఎన్నో జాతులు, ఎన్నో భాషలు, ఎందరో మనుషులు- అయితే అందరి కన్నీళ్ళు, బాధలు, ఆనందాలు, భావోద్వేగాలు, కష్టాలు, ఈర్ష్యలు, కోపాలు, తాపాలు, ప్రేమలు, జీవితాలు దాదాపు ప్రపంచమంతటా ఒకటే. అది కన్నడలో అయినా, తెలుగులో అయినా అవే కన్నీళ్ళు. అవే స్పందనలు, వ్యత్యాసమంతా చెప్పే తీరులో చూపే దృశ్యాలలో.

 

  • అనువాద రంగంలోకి కొత్తగా వస్తున్న వారు ఏ ఏ విషయాలపై అవగాహన కలిగివుండాలి? ఒకవేళ మీరు వారికి సూచనలు ఇవ్వాలనుకుంటే ఏం చెబుతారు?

రంగ: నేను బి.యిడి చేస్తున్నప్పుడు మా సైకాలజి లెక్చరర్ శ్రీ దండపాణిగారు చెప్పిన ఒక మాట ఈ రోజుకూ గుర్తుంది. ఆయన ఓ సందర్భంలో ‘ది యంగర్ జనరేషన్ విల్ బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్ బట్ ఇన్ హెల్త్ మోర్ అండ్ మోర్ వీక్’ అని ఓ కోట్ చెప్పారు. అందువల్ల ఇప్పుడు వస్తున్న యంగర్ జనరేషన్ మనకంటే వంద రెట్లు బాగా ఆలోచించగలరు. అవగాహన చేసుకోగలరు. అర్థం చేసుకోగలరు. అద్భుతంగా రాయగలరు. భాషలో కొత్తదనాన్ని తీసుకుని రాగలరు. కాబట్టి వారికి నేను ఇవ్వవలసిన సూచనలు ఏవీ లేవు. ‘చదవండి చదవండి.. రాయండి రాయండి’ అనటం తప్పు.

 

  • మాకు కలిగిన ఓ చిన్న సందేహం ఏమిటంటే, ఇన్ని అనువాదాలు చేసిన మీరు డైరెక్ట్ రచన ఎప్పుడైనాదేసారా? చేస్తే వాటి గురించి, లేకపోతే ఎందుకు అటు ప్రయాణించలేదో చెప్పగలరా?

రంగ: కాలేజిలో చదువుతున్నప్పటి నుంచి సొంతంగా కథలు కవితలు రాస్తూనే ఉన్నాను. కాలేజి మ్యాగజైన్ మొదలు వివిధ వారపత్రికల్లో నా కథలు, కవితలు అనువాదాలు ప్రచురితమయ్యాయి. కాలేజి మ్యాగజైన్లో, ఉజ్ఝల పత్రికలో, ప్రగతి వారపత్రికలో ప్రచురింబడిన చాలా కథలు అనువాదాలు పోగొట్టుకున్నా. దొరికిన కథలతో, మొదటి కథాసంకలనం “దింపుడు కళ్ళం” 2009లో, రెండో కథా సంపుటి “నేనున్నాగా….” 2012లో, మూడో కథా సంపుటి “మళ్ళీ సూర్యోదయం” 2015లో ప్రచురించాను. తర్వాత కూడా కొన్ని రాశాను. అయితే వివిధ పత్రికల్లో వచ్చిన వందలాది అనువాద కథలను పుస్తకరూపంలో తీసుకుని రావటంలో, పెరిగిన అనువాదాల పని ఒత్తిడిలో సొంత రచనలకు కొంత దూరమయ్యాను. అలాగే బాలసాహిత్యానికీ.

 

  • అనువాదాన్ని చాలామంది Thankless job అంటూ ఉంటారు. కానీ అలాంటి అనువాద ప్రక్రియలో మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కృషి చేశారు. మీ ఇన్నాళ్ల ఈ ప్రయాణాన్ని గురించి క్లుప్తంగా ఒకటి రెండు మాటల్లో చెప్పాలంటే ఏం చెబుతారు?

రంగ: లలిత కళలు ఏవైనా మనస్సుకు, ఆత్మకు సంతృప్తి కలిగించేవి. ఆ సంతృప్తి మాటల్లో చెప్పలేనిది. ఒక కథ అచ్చయితే కలిగే ఆనందం కోటి రూపాయలు ఇచ్చినా దొరకదు. అనువాదం థాంక్ లెస్ జాబ్ అనో, అనువాదకులను తక్కువగా చూస్తారనో, ఏవేవో మాటలు వింటూ ఉంటాం. అయితే నేను నాకు ఇష్టమైన పనిని చేసుకుంటూ పోయానే తప్ప ఏమీ ఆశించలేదు. కష్టపడితే దానికి ఫలితం ఉంటుందని నమ్ముతాను. నా శిష్యులకు అదే చెప్పేవాడిని.

 

  • మీరు ప్రస్తుతం చేస్తున్న అనువాదాలు గురించి ఏమైనా మా పాఠకులతో పంచుకోవాలని అనుకుంటున్నారా? 

రంగ: కన్నడ నుంచి మంచి సాహిత్యాన్ని, నాలుగు కాలాలపాటు నిలిచిపోయే కొన్ని క్లాసిక్స్­ను అనువదించి తెలుగు పాఠకులకు అందించాలని నా కోరిక, అనుకున్నవేమో చాలా! అయితే అనుకున్నవన్నీ చేయటానికి ఈ జీవితం చాలదేమో!:

ప్రస్తుతం – ఏనుగెక్కిన సంపద, తలారి, విద్యావంతురాలైన వేశ్య కథ, సమకాలీన కన్నడ కథలు-2 (17మంది రచయితల కథలతో), బి.టి. లలితా నాయక్ కథా సంకలనం, సల్మాన్­ఖాన్  డిఫికల్టీస్, శివుని దండోరా, రహదారి డేగ, సరహపాదుడు, అల్లమ ప్రభు వచనాలు ప్రచురణకు సిద్ధంగా ఉన్న అనువాదాలు.

అనువాదం చేస్తున్నవి బ్రిటీష్ బంగ్లా (శ్రీధర బనవాసి), మాకో ఏకాంతం (కావ్య కడమె), బంగారు దొడ్డి (మలెయూరు గురుస్వామి), బెనగరహళ్ళి రామణ్ణ కథలు, సావిన దశావతారగళు (కె. సత్యనారాయణ), వివేక్ శానభాగ గారి నవల.

 

 

టీం తెలుగు కలెక్టివ్ తరపున మీకు ధన్యవాదాలు రంగనాథ రామచంద్ర గారు. మరో ప్రముఖ సాహితీ వేత్తను పలకరించినప్పుడు ,  మళ్ళీ కలుసుకుందాం 

 

2 thoughts on “‘ప్ర’ముఖా – ముఖి : అనువాదకుడు ,రంగనాథ రామచంద్ర రావు గారితో

  1. రామచంద్రరావు గారూ, చాలా మంచి విషయాలు చెప్పారు. అభినందనలు.

Leave a Reply to Narahari Rao BapuramCancel reply

error: Content is protected !!

Discover more from Telugu Collective

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading