పాత రచనలు – కొత్త పరిచయాలు

మామూలు విషయాలు అతి మామూలుగా రాయడం రావిశాస్త్రి పద్ధతి. ”కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం” అని శ్రీశ్రీ చెప్పారు. రావిశాస్త్రి దాన్ని అక్షరాలా పాటించి చూపించారు. అవే పేర్లతో కథలు రాసి మెప్పించారు. అంతకన్నా ఆశ్చర్యం కలిగించే విషయం సారా మీద కథలు రాయడం. సారా ఎంత నిషా ఎక్కిస్తుందో తెలియదు కానీ రావిశాస్త్రి ఆరుసారా కథలు మాత్రం బాగా మత్తెక్కిస్తాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతపు ప్రజల జీవన విధానాలు, మానవ మనస్తత్వాలు ప్రధానంగా చిత్రిస్తూ సాగిన ఈ కథలు మనకు తెలియని ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. మనతోనే ఉంటూ, మనలాగే బ్రతుకుతూన్న పేదవారి జీవితాలు ఎలా ఉంటాయో, వారిలో ఎంత విషాదం దాగి ఉందో,పేదరికం వల్ల వారి మధ్య ఉండే మానవసంబంధాలు ఎలా ఉంటాయో కళ్ళకుకట్టినట్టు చూపిస్తాయి.సమాజం తన చుట్టూ తాను అల్లుకున్న నీతిపొర పేదరికం ముందు ఎలా విడిపోతుందో అనుభవం కలిగిస్తాయి. సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు, వారి జీవన విధానాలు, సమాజంలో దిగజారిపోతున్నవిలువలు అందుకు అంతర్గతంగా సమాజంలోనే దాగిఉన్న కారణాలు వీటన్నిటినీ అత్యంత ప్రతిభావంతంగా చిత్రించారు రావిశాస్త్రి.

 

“రచయిత ప్రతివాడు తాను వ్రాస్తున్నది ఏమంచికి హాని కలిగిస్తుందో, ఏ చెడ్డకు ఉపకారం చేస్తుందో అని ఆలోచించవలసిన అవసరం వుందని నేను తలుస్తాను,మంచికిహాని ,చెడ్డకు సహాయమూ చెయ్యకూడదని నేను భావిస్తాను” అని అంటారు రావిశాస్త్రి. అందుకు తగ్గట్టుగానే ఆయన తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారనిపిస్తుంది.స్వతహాగా ఆయన లాయరు కావడం కూడా దీనికి మరింత దోహదపడిందని అనిపిస్తుంది. ఆయన జీవితంలో అతి దగ్గరగా చూసిన సత్యాలనే తన కథలుగా మలుచుకున్నారు. రక్షించవలసిన పోలీసు వ్యవస్థ అవినీతి రుచి మరిగి భక్షించడం మొదలు పెడితే వారి అక్రమార్జన కోసం మొదట బలయ్యేది పేదలే, అసహాయులే అని తన కథల ద్వారా నిరూపించారు.

                                   “ఇవి వాస్తవికతకు నివాళి. వీటిలో కథనం ఉంది. కవిత్వం ఉంది. డ్రామా ఉంది. జీవితాన్ని నిశితంగా పరిశీలించడం ఉంది. ఆ చూసిన దానిమీద వ్యాఖ్యానించినట్టుగా కనిపించని వ్యాఖ్యానం ఉంది”. ఇదీ ఆరు సారాకథలు గురించి శ్రీశ్రీ రాసిన ముందు మాట. ఇది అక్షర సత్యం. ఈ కథలను చదివిన వారికి ఎవరికైనా అనుభూతమయ్యే నిజం. ఆరు కథలూ ఆరు ఆణి ముత్యాలే అయినప్పటికీ అన్నిటిలోకి ప్రత్యేకంగా ఆకట్టుకునే కథ మాత్రం ‘మాయ’. అందులోని ‘ముత్యాలమ్మ’, ‘మూర్తి’తో చేసే ప్రసంగం కళ్ళంట నీళ్ళను తెప్పించక మానదు.

                                   కథ పరంగా చూస్తే ముత్యాలమ్మ దొంగసారా అమ్మే వ్యక్తి. పోలీసులకు మామూలు ఇవ్వలేదన్న కారణంగా ఆమెపై దొంగసారా కేసు బనాయించబడుతుంది. ఆ తర్వాత మూర్తి అనే లాయరు ద్వారా బెయిలు పై విడిపింపబడుతంది.మూర్తే ఆమె కేసును కోర్టులో వాదించడానికి ఒప్పుకుంటాడు.కోర్టులో కేసు వాదించి నెగ్గుతాడు కూడా.అయితే దాని వెనుక మూర్తి ప్రయత్నం కన్నా ముత్యాలమ ప్రయత్నమే ఎక్కవ ఉంటుంది. అంటే ఏ పోలీసు అయితే ముత్యాలమ్మ మీద దొంగ కేసు పెట్టాడో, ఆ పోలీసుకే ముత్యాలమ్మ లంచం ఇచ్చి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పించుకుంటుంది. కేసు నుంచి బయట పడుతుంది. టూకీగా ఇదీ కథ. డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది అనడానికి ఈ కథ మంచి ఉదాహరణ. అంతే కాదు కోర్టులు, పోలీసులు ఇదంతా ఓ మాయాలోకం అంటారు రావిశాస్త్రి. అసలు విషయానికి వస్తే ముత్యాలమ్మపై పెట్టబడింది దొంగ కేసు. అంటే సారా అసలుకి దొరకలేదు. కానీ దొరికిందని కేసు పెట్టేరు. దొరకలేదని తిరిగి తేలకొట్టేశారు. అంతా కలిపి మాయ చేసేరు. కానీ ఆ మాయలో ముత్యాలమ్మ పడిన బాధ హృదయవిదారకం. ఆమె అనుభవించిన కష్టం అనంతం.

                                  కథ చాలా మామూలుదే అయి ఉండవచ్చు. కానీ కథనం అద్భుతం. రావిశాస్త్రి రాసిన తీరు నిజంగా మెప్పించక మానదు. అందులో ముత్యాలమ్మ చేత ఆయన చెప్పించే నిజాలు ఒప్పుకోకమానలేము. ఆ కాలంలోనే కాదు ఏ కాలంలో అయినా. కథలో రావిశాస్త్రి ముత్యాలమ్మ చేత ఇలా చెప్పిస్తారు.” పీడరుబాబూ సెప్తున్నాను. నువ్వేకాదు, ఈ బాబే కాదు, ఏ మనిసి మంచోడని ఒవురు చెప్పినా నాను నమ్మను, ఈ నోకం డబ్బు, యాపారం తప్ప మరేట్నేదు. పశువులు నోర్లేని సొమ్ములు, ఆటికి నీతుంది కాని మనకి నేదు. సదువు లేన్దాన్ని నాకూనేదు, సదువుకున్నోడివి నీకూనేదు. డబ్బు కోసరం నోకం నోకవంతా పడుచుకొంటోంది. డబ్బుకి నాను సారా అమ్మతున్నాను. డబ్బుకి, సదివిన సదువంతా నువ్వముముతున్నావు. డబ్బుకి పోలీసోళ్ళు నాయ్యేన్నమ్ముతున్నారు.మందు కోసరం పెద్దాసుపత్రి కెళ్తే అక్కడ మందులమ్ముతున్నారు, మంచాలమ్ముతున్నారు. లంజెలు రోడ్లంట, రిచ్చాలంట, కార్లంట తిరిగి ఒళ్ళమ్ముకుంటున్నారు. గుళ్లో కెళ్ళి, కొబ్బరికాయ సెక్కా, కాన్డబ్బూ ఇస్తే, ఆ దేవుడి దయే అమ్ముతున్నారు. అమ్మకం, అమ్మకం, అమ్మకం. అమ్మకం తప్ప మరేట్నేదీలోకంలో. నాను సుదువుకో నేదు కానీ , చూసిన సత్తెం మాత్తరం అది. తప్పయితే తప్పని చూపించి సెప్పు. ఇంటాను. ” మీరేమంటారు. దీన్ని తప్పని అంటారా. ప్రపంచం మొత్తం ఇలాగే ఉందా అంటే లేకపోవచ్చును. కానీ చాలా శాతం మట్టుకి జరుగుతోంది ఇదే. కాదంటారా. ఇటువంటివే నిజాలు రావిశాస్త్రి రచనల నిండా మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా ఆరు సారా కథల నిండా కనిపిస్తాయి.

                                      ఆఖరుగా ముఖ్యంగా చెప్పవలసింది మరొకటి ఉంది. అదే రావిశాస్త్రి భాష గురించి. గురజాడ,శ్రీపాద తర్వాత మాండలికాన్ని అత్యంత ఎక్కువగా వినియోగించి కథలు రాసింది ఈయనే. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం భాషల్లో ఉన్న సొగసు తెలుసుకోవాలంటే రావిశాస్త్రి రచనలు చదవవలసిందే. ప్రతీ ప్రాంతానికి ఆ ప్రాంతపు భాష ఆయువు పట్టులాంటిది.ఆ భాషలో ఉన్న మాధ్యుర్యం మరెక్కడా దొరకనిది.అటువంటి తీయదనమే రావిశాస్త్రి రచనల్లో మనకు దొరుకుతుంది.

– రచన : ఆలమూరు మనోజ్ఞ 

error: Content is protected !!