పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
అంశుమతి మొదటి భాగం కోసం ఇక్కడ చదవండి : https://telugucollective.com/ajantha/ajantha-2/amsumati-navala-1/
అంశుమతి శుక్రవారం రోజున దోషాలు పోగొట్టేందుకు చేయాల్సిన మంగళస్నానం పూర్తి చేసుకుంది. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి, అన్ని రకాల నగలు పెట్టుకుని గోమాతా దేవాలయానికి బయలుదేరింది. ఆమె వెంట ఆమెకు ఇష్టమైన స్నేహితురాళ్ళైన చెలికత్తెలు ఉన్నారు. ఆమె వెళుతున్న దారంతా ఆమె చుట్టూ ఆమె సఖులు, వారి చుట్టూ శస్త్రధారులైన వీర స్త్రీలున్నారు. వారి చుట్టూ సకల ఆయుధాలతో కాపలా కాసే అంగరక్షక వీరులున్నారు. విడిది భవనం నుండి కొంత దూరంలో ఉన్న గుడికి చేరుకుని రాకుమారి అంశుమతి గోమాతాదేవికి దేవాలయంలో మొదటగా పదహారు విధాల షోడశోపచార పూజ చేసింది. ఆ పైన గోమాతా దేవత 108 పేర్లను ఉచ్చరిస్తూ, పూలు వేస్తూ అష్టోత్తర శతనామ పూజ, అర్చన పూర్తి చేసుకుంది.
విష్ణుకుండినులకు గోమాత అయిన ఆవు కులదైవము. విష్ణుకుండినుల వంశంలో పుట్టిన మహారాజులు, మహారాణులు, రాజకుమారులు, రాజకుమారిలు అందరూ తప్పనిసరిగా గోవూరు పుణ్యక్షేత్రంలో వెలసిన గోమాతా దేవాలయంలో పూజలు చేస్తారు. తొలి విష్ణుకుండిన చక్రవర్తి అయిన మాధవవర్మ మహారాజు గోమాతకు పూజ చేసి ఆ గోమాతా దేవాలయాన్ని గోవూరు క్షేత్రంలో కట్టించాడు. ఆ దేవాలయము కట్టడానికి వెనుక ఒక కారణం ఉంది. మాధవవర్మ చక్రవర్తి పల్లవులను ఓడించి, తిరుగు ప్రయాణంలో కృష్ణాతీరంలో ఉన్న అనేక ఉత్తమ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన విజయవాడలోని మల్లీశ్వరస్వామిని పూజించటానికి తన మొత్తం కుటుంబంతో వచ్చి, విజయవాడలోనే నెల రోజుల పాటు ఉన్నాడు. ఈ నెల రోజులూ ఆ విజయవాడ నగరంలో, చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే ప్రజలు ఆ రాజు రాకను, అతను ఉన్న అన్ని రోజులను పండగలా జరుపుకున్నారు. వివిధ రకాల ఉత్సవాలు చేసారు.
ఎక్కడ చూసినా ఏదో ఒక ఉత్సవ ప్రభ కనిపించేది. కొన్ని చోట్ల వీధినాటకాలు ఆడుతుంటే, కొన్ని చోట్ల తోలుబొమ్మలాటలు, కొన్ని చోట్ల పుణ్యకథా కాలక్షేపాలు. మహారాజు ఈ ఉత్సవాలుకు వస్తున్న అందరు ప్రజలకు వసతి ఏర్పాట్లు చేస్తూ, తినడానికి పంచభక్ష్య పరమాన్నాలు ఏర్పాటు చేసాడు. ఆ నెలరోజుల పాటు విజయవాడ నగరంలో, చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో ఏ ఇంట్లో చూసినా వీధి గుమ్మాలకు తోరణాలు కట్టి, ఇంటి ముందు ముగ్గులు వేసి ఉన్నాయి. ప్రతి దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. దేవాలయాలున్న వీధుల్లో దేవుళ్ళ ఊరేగింపులు జరుగుతున్నాయి. దేవాలయాల్లో, జైనాలయాల్లో, బౌద్ధ సంఘారామాలలో దేవతలకు, యోగులకు, సాధువులకు, జైన తీర్థంకరులకు, బౌద్ధ భిక్షకులకు పూజలు, అర్చనలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. ఆ రోజుల్లో ఊరికి బయట అన్ని దిక్కుల్లో మద్యం అమ్మే పానశాలలు ఉండేవి. ఆ పానశాలల్లో రాజు విడిది చేసిన నెల రోజులూ వివిధ రకాలలో, వివిధ రంగులలో, వివిధ రుచులలో రక రకాల మద్యాలను తయారు చేసారు అక్కడి అమ్మకందార్లు. ఆ పానశాలలకు సేనాధికాతులు, రాజబంధువులు, రాజసభ్యులు వచ్చి మద్యం సేవించటంతో, వారికి వినోదాన్నందించటానికి నర్తకీమణులు, సంగీత విద్వాంసులు ఆ పానశాలల్లో నృత్యాలు, సంగీత కచ్చేరీలు చేసారు. కాలం చాలా ఆనందంగా సాగిపోతూ ఉంది.
మాధవవర్మ మహారాజు కొడుకు, యువరాజు అయిన దేవవర్మ చక్కటి నడవడిక కలిగిన వ్యక్తి. మంచి అలవాట్లున్నవాడు. ఎవరికీ ఏ హాని తలపెట్టని ధర్మాన్ని పాటించే నిఖార్సైన మనిషి. కానీ అతని తోటి బాలకుల ప్రోద్బలంతో పూజల్లో పాల్గొనకుండా అతనికి ఏర్పాటు చేసిన శిబిరంలోకి ఆ పానశాలల్లో దొరుకుతున్న వివిధ రకాల మద్యాలను తెప్పించుకొని తన మిత్రులతో కలిసి తాగుతూ కోలాహలంగా వినోదం చేసుకున్నాడు. తన మిత్రగణంతో పల్లవులపై తమ రాజ్యం సాధించిన విజయాన్ని ఉత్సవంగా జరుపుకుంటూ మత్తులో రాజ కుటుంబం మర్యాదలను మర్చిపోయి నాట్యాలాడాడు. అతని బుద్ధి కాస్తా రాజసం తగ్గిపోయి, అతను బజారు మనిషిలా ప్రవర్తించాడు.
ఒక రోజయితే యువరాజు దేవవర్మ మితిమీరి తాగేసాడు. ఆ మత్తులో అతనికి మంచి చెడు అన్నది గుర్తు రావట్లేదు. చుట్టు పక్కలున్న పరిసరాల స్పృహ అతనికి లేదు. అతని విహారం కోసం ఏర్పాటు చేసిన జంటగుర్రాల రథం ఎక్కి. రథ సారథిని దింపేసి అతనే రథాన్ని తోలుకుంటూ విజయవాడ ఊరంతా విహారం చేయసాగాడు. మత్తు వలన అతను వెళుతున్న వేగంపై అదుపు కోల్పోయాడు. అతనికి చుట్టూ ఉండే అంగరక్షకులు లేరు. రాజు లేదా యువరాజు ఇలా రథంలో వస్తున్నపుడు వీధి వెంట దారిన ఉన్న జనాన్ని పక్కకు తొలగించే గుర్రపు స్వారీ చేస్తూ రథానికి ముందుండి దారి చూపే భటులు లేరు. అప్పటికీ రథసారధి యువరాజుకు వెనుక నుండి, “యువరాజా జాగ్రత్త, యువరాజా జాగ్రత్తగా రథం నడపండి!” అని అరుస్తున్నా, అవేమి మత్తు వలన యువరాజుకు వినిపించలేదు.
దేవవర్మ మత్తులో గట్టిగా నవ్వుతూ, జనం ఉన్న వైపుకు రథాన్ని తోలాడు. జనం గట్టిగా అరుస్తూ పక్కకు తప్పుకున్నారు. రథాన్ని చూసి జనం భయపడ్డారు. ఇది చూసిన యువరాజు మరింత గట్టిగా నవ్వుతూ, గుర్రాలను కొరడాతో రెండు దెబ్బలు కొట్టాడు. ఆ రథానికి కట్టిన గుర్రాలు చాలా ఉత్తమమైనవి, మామూలుగా రథసారధి అదిలిస్తేనే వాటికి చిరాకు. అలాంటిది దెబ్బ తగిలే సరికి వాటికి కూడా కోపం వచ్చేసింది. కోపంలో అవి మరింత వేగంగా పరిగెట్టసాగాయి. ఆ వేగానికి యువరాజుకి మరింత ఉత్సాహం వచ్చింది. “ఇంకా ఎక్కువ వేగంగా పరిగెట్టండి, ఇంకా వేగంగా…” అని మత్తులో ఉన్న యువరాజు ఆ గుర్రాలకు అరుస్తూ చెబుతున్నాడు.
రాజకుమారుడి రథం వెళుతున్న దారిలో ముందు వైపు నుండి ఆవులమంద ఒకటి ఊరి బయట గడ్డి మేసి, సాయంత్రం అవటం వలన వాటి యజమాని ఇంటికి తిరిగి వస్తోంది. ఆ ఆవుల మందలో (ఆలమందలో) ఒంగోలు జాతికి చెందిన ఆవుల్లో పెద్దజాతి ఆవు ఒకటి తన దూడతో కలిసి వస్తోంది. ఆ ఆవుదూడ, ఆ కోడె తెల్లగా, బలిష్టంగా, చాలా అందంగా, కాళ్ళకు కట్టిన గజ్జెలు, మెడలో కట్టిన చిరుమువ్వలు శబ్దం చేస్తుంటే ఆ శబ్దానికి నాట్యమాడుతున్నట్టు ఎగురుతూ, గెంతుతూ తన తల్లి ఆవుతో కలిసి వెళుతోంది. కాసేపు తల్లి కాళ్ళ మధ్య నుండి దూరుతూ పరిగెడుతోంది. కాసేపు తల్లి ఆవును నడవనీయకుండా అడ్డంగా నిలబడిపోతోంది. మళ్ళీ పరిగెత్తి వెళ్ళి తల్లి వెనుక చేరి తల్లి ఆవుతో పాటుగా నడుస్తూ, దారికి ఇటూ అటూ గెంతుతూ ఆ కోడె తల్లితో నడుస్తూ ఉంది.
ఆ తల్లి ఆవు కామధేనువు వంశంలో పుట్టింది. తెల్లగా మెరిసిపోతూ, పెద్ద స్తనాలతో ఉంది. ఆ తల్లి ఆవు కన్నుల నుండి ప్రేమ కారిపోతోంది. మధ్య మధ్యలో తల్లి ఆవు తన ముట్టెతో (కాలి గోటితో) ఆ కోడెను పుణుకుతూ, నిమురుతూ మెల్లగా నడుస్తోంది. ఇంతలో ఎదురు నుంచి వస్తున్న యువరాజు రథం అక్కడ వీధిలో నడుస్తున్న ప్రజల్లో అల్లకల్లోలం సృష్టించింది. కొందరు పరుగులు పెడితే, కొందరు కింద పడిపోయి దారికి దూరంగా పొర్లి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ రథం ఆగకుండా వేగంగా వస్తోంది. రథానికి అడ్డంగా వచ్చిన ఏ వస్తువునైనా తొక్కి ముందుకు వెళిపోతోంది. ఆ వీధి వీధంతా అరుపులతో ఆక్రందనలతో నిండిపోయింది.
ఇటు చూసి అటు చూసే లోపు రథం వేగంగా వెళిపోయింది. వెయ్యి పిడుగులు పడినంత శబ్దం వచ్చింది. ఇటు చూస్తే “అంబా” అని అరుస్తూ ఆ కోడెదూడ నేల మీద పడి ఉంది. ఆ కోడె శరీరమంతా రక్తంతో నిండిపోయుంది. వీపు, పొట్ట తెగిపోయి మాంసం కండలు బయటకు పడి ఉన్నాయి. తల్లి ఆవు “అంబా” అని అరుస్తూ ఆ దూడ చుట్టూ ఏడుస్తూ తిరుగుతోంది. ఆ తల్లి ఆవు కళ్ళ నుండి కన్నీరు కారుతోంది. తన బిడ్డ శరీరం నుంచి కారుతున్న రక్తాన్ని ఆపే వృథా ప్రయత్నం చేస్తోంది ఆ తల్లి ఆవు. ముట్టెతో కోడెను నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆ కోడెను నడిపించడానికి ప్రయత్నిస్తోంది. ఆ కోడె నిలబడలేక గాయాల నొప్పితో నేలకు పడిపోతున్నది. ఆ తల్లి ఆవు కాసేపు అలా పడి ఉన్న దూడ వైపు నేలకేసి చూస్తోంది. రథం వెళ్ళిన దిక్కుకు తల ఎత్తి చూస్తోంది. మిగితా ఆవుల మంద వెళుతున్న వైపు చూస్తోంది. గాయాలతో పడి ఉన్న కోడె చుట్టూ చేరిన జనం గుంపు వైపు దీనంగా సహాయం కోరుతున్నట్లు చూస్తోంది. అప్పటిదాకా అంత ప్రేమగా, ఆడుతూ పాడుతూ సాగిపోతున్న ఆవు-దూడల జీవితంలో ఒక్కసారిగా ఉరుముల ప్రళయం వచ్చిపడినట్లు అయింది. “నా బిడ్డ ఇలా పడిపోయి ఉన్నాడెందుకు? నా బిడ్డని ఎవరైన లేపి ఎత్తి మళ్ళీ నడిపించండి!” అన్నట్లుగా ఆ ఆవు అన్ని వైపులా అందరినీ చూస్తూ దీనంగా అంబా అని అరుస్తూ ఉంది.

రక్తస్రావం వల్ల ఆ దూడ ఆకారంలో చిన్నగా అయిపోతూ ఉంది. విలవిలా కాళ్ళు తన్నుకుంటూ ఆ లేగదూడ ప్రాణాలు విడిచింది. కన్న కొడుకు కళ్ళ ముందే చనిపోవడంతో ఆ కోడె పక్కనే గట్టిగా అరుస్తూ ఆ తల్లి ఆవు కోడె శవం పక్కనే కూలపడిపోయింది.
ఆ రోజు ఉదయం పూట చేయాల్సిన పూజలన్నీ ముగించుకొని, భోజనం చేసి, ఒక గంట పాటు రాజు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తర్వాత మధ్యాహ్నం పూట విజయవాడలో అతను ఉంటున్న సామంత రాజు కోటలోని సభాభవనంలో శ్రీ విష్ణుకుండిన మాధవవర్మ మిగితా రాజులు, మంత్రులతో మంతనాలు చేస్తూ ఉన్నాడు. ఆ సభలో సామంత రాజులు, పక్క రాజ్యాల రాయబారులు, పందితులు అందరూ ఉన్నారు. మొదటగా కొందరు పండితులు వేద పారాయణ చేసారు, ఆపై ధర్మార్ధ విషయాల గురించి చెప్పే ధర్మం తెలిసిన శాస్త్రవేత్తలు రాజుకు ధర్మ – అధర్మ విషయాల మీద అవగాహన కలిగించే పద్యాలను పాడి వినిపించారు, ఆపై పురాణాలను చదివి చెప్పే పండితులు రాజుకు ఆ రోజుకు వినదగిన పురాణ కథలను చెప్పారు. ఆ తర్వాత ఉద్దండులైన కొందరు కవులు తాము రాసిన పద్యాలలో, కావ్యాలలో ఉత్తమమైనవి రాజు గారికి వినిపించారు. కోకిలకన్నా తీయని స్వరమున్న గాయకులు రాజు మనసును మెప్పించే సుమధురమైన పాటలు పాడారు. ఇలా సభ సాగుతూ ఉంది. మహామంత్రి రాజుకు ఏదో రాజకీయ విషయం గురించి చాలా తీక్ష్ణంగా ఏదో చెబుతున్నాడు.
అదే సమయంలో సభా ప్రాంగణానికి ఎదురుగా ఉన్న మండపం గుమ్మానికి కట్టిన ధర్మఘంట “ఖంగు”, “ఖంగు” మని మోగటం మొదలైంది. ఆ ధర్మఘంటను కట్టిన తాడు ధర్మస్తంభం మీద నుండి ప్రాకారం గోడ మీద నుండి, సభాభవనం పక్కగా వేలాడుతోంది. రాజభటులు గాని, రాజ్య ఉద్యోగులు కానీ, ఏదైనా అన్యాయం చేసినా, రాజ్యంలో ఏదైనా అవాంఛనీయమైన, ధర్మానికి ఆపద కలిగించే విషయం జరిగినా ఆ విషయాన్ని రాజుకి విన్నవించుకుని తమకు న్యాయం చేయమని రాజ్యంలోని పౌరులు ఎవరైనా ఆ ధర్మఘంటాన్ని మోగించవచ్చు. ఆ గంట మోగించేందుకు పగలు-రాత్రి తేడా లేదు. అన్యాయాన్ని చెప్పదలచుకున్న వారు ఏ సమయంలోనైనా ఆ గంటను మోగించవచ్చు. రాజు కొలువుదీరి ఉన్నా, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నా, గంట మోగిందంటే, వెంటనే వచ్చి జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని న్యాయం చేయాలి. రాజు లేకపోతే అతని స్థానంలో ధర్మాన్ని నిలబెట్టే రాజు ప్రతినిధి ఒకరు న్యాయం చేయాలి. అలాంటి ధర్మగంట వ్యవస్థను చాలా ప్రతిష్ఠాత్మకంగా మాధవవర్మ రాజు ఏర్పాటు చేసాడు. మాధవవర్మ కింద ఉన్న సామంతరాజులండరు కూడా ఈ ధర్మగంటను తమ తమ రాజ్యాల్లో ఏర్పాటు చేసేల మాధవవర్మ ఆజ్ఞ చేసి ఉన్నాడు. మాధవవర్మ మహారాజు ధర్మాన్ని పాటించడంలో అందరికన్నా ముందుంటాడు. ఎక్కడా అన్యాయం జరగకుండా చూసుకుంటాడు. ఈ రాజు లాగానే పూర్వపు రాజులందరూ మన భారతదేశంలో ధర్మాన్ని పాటిస్తూ రాజ్యం చేసేవారు.
మాధవవర్మ రాజు పాలనలో ఆ ధర్మగంట పెట్టినా, అది మోగించే పరిస్థితి రాకుండా రాజు, సామంతరాజులు, ఆ రాజుల కింద అధికారులు, సైనికులు న్యాయంగా తమ పనులు చేసుకునేవారు. అందువలన ధర్మగంట అవసరం ఏనాడూ రాలేదు. అలాంటిది ఇవాళ ఆ ధర్మగంట మోగుతోంది. ఆ ధర్మగంట శబ్దం సభంతా మారుమోగిపోయింది. అప్పటి దాకా వివిధ చర్చల్లో నిమగ్నమై ఉన్న రాజ సభంతా ఒక్కసారే నిశ్శబ్దమైపోయింది. మాధవవర్మ మహారాజు తన సింహాసనము నుంచి లేచి పరుగుపరుగున ధర్మగంట వైపుకు, రాజసభా మండపాన్ని వదిలి వేగంగా నడిచి వెళ్ళాడు. సభంతా కూడా లేచి రాజు వెనకాలే నడిచి ధర్మగంట వైపుకు వచ్చింది. “ధర్మాన్ని నిలబెట్టండి” అన్నట్లు గంట మోగుతూ ఉంది. అప్పటి దాకా తన రాజ్యంలో ఎలాంటి అన్యాయం జరగట్లేదన్న గర్వంతో తలెత్తి ఉన్న మహారాజు, తల దించి, ధర్మగంట ఉన్న గోపురము వైపుకు నడచాడు. మహారాజు వెనుక మహామంత్రి, అతని వెనుక సేనాపతులు, వారి వెనుక రాయబారులు, మహారాజుకు ఇటు వైపు, అటు వైపు పండితులు, వారికి ఇటువైపు, అటువైపు అంగరక్షకులు, అందరి వెనుక మిగితా సభలోని సభ్యులు అంతా వచ్చి నిలబడ్డారు.
మహారాజు గోపురము దాటి భవనపు గుమ్మం దగ్గరకు వచ్చాడు. గుమ్మం ఎదురుగా విశాలమైన మైదానంలో వేల సంఖ్యలో ప్రజలు వచ్చి నిలబడి రాజు వైపు దీనంగా చేతులెత్తి మొక్కి చూస్తున్నారు. జనంలో స్త్రీలు, పురుషులు, వృధ్ధులు, పిల్లలు, అందరి కళ్ళ నుంచి కన్నీరు కారుతోంది. అందరూ రాజుకు చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడి ఉన్నారు. ధర్మ గంటను మోగిస్తూ ఆ గంటకున్న తాడును లాగుతున్న ఉత్తమజాతి ఆవు ఒకటి అక్కడ నిలబడి ఉంది. ఆ ఆవు వెనకాలే రక్తంతో తడిచి ముద్దైన ఆవుదూడ శవాన్ని మోస్తున్న ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. మహారాజు ఆశ్చర్యంతో చూస్తూ జనాల వైపుకు తిరిగి ఇలా అన్నాడు, “ఏమిటిది? ఆశ్చర్యంగా ఉందే! ఆ ఆవు, ఆ గోమాత తాడును లాగుతోందా! ఆ ఆవుకు ఏం హాని జరిగింది? ఆ తాడును లాగాలని ఆ గోమాతకు ఎవరు నేర్పించారు?”

అప్పుడు జనంలో ఉన్న ఒక పెద్దమనిషి ముండుకు వచ్చి, “ఆ తాడును లాగమని ఆ ఆవుకు, ఆ గోమాతకు ఎవ్వరూ నేర్పలేదు మహారాజా. ఆ ఆవు ఇక్కడకు వస్తుందని మేమనుకోలేదు. ఆ కోడెదూడ రథం కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఆ కోడెకు తల్లైన ఆ ఆవు పడిన బాధ వర్ణనాతీతం. ఇంతలో ఆ ఆవు యజమాని వచ్చాడు. ఆ ఆవు ఉత్తమ ఒంగోలు జాతిదని మాకండరికీ చెప్పుకొని ఏడవసాగాడు. చాలా అరుదుగా ఒంగోలు జాతి గిత్తలు సుష్టుగా పుడతాయని, అలాంటి కోడెదూడ పుట్టడంతో తన ఇంట్లో వారంతా చాలా సంబరపడ్డారని, అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారని ఆ యజమాని మాకండరికీ చెప్పుకున్నాడు. ఆ యజమాని పడుతున్న బాధను మేము చూడలేకపోయాము. ఆ యజమాని చనిపోయిన దూడ శవాన్ని ఎత్తుకొని తన ఇంటికి వెళుతూ, ‘అమ్మా! నందినీ! రా అమ్మా, మన ఇంటికి వెళదాం’ అని పిలిచాడు. కానీ ఈ ఆవి అస్సలు కదలలేదు. కాసేపటికి కోత వైపుకు ఇక్కడికి నడుచుకుంటూ వచ్చింది.
“ముందు ఈ ఆవు నడిచింది, ఆ వెనుక దూడ శవాన్ని ఎత్తుకున్న యజమాని నడిచాడు. ఆ వెనుక అక్కడ ఈ ప్రమాదాన్ని చూడటానికి గుమిగూడిన జనం, మేమంతా నడిచి వెంట వచ్చాము. కోటగుమ్మం దాటి, లోపలి ద్వారాలు దాటి ఈ ఆవు ధర్మగంట తాడు కట్టి ఉన్న సభామండప గుమ్మం దగ్గరకు వచ్చి ఆ గంటకున్న తాడును లాగి గంట కొట్టడం ప్రారంభించింది. జరిగిన విషయం ఇది మహారాజా!” అని విన్నవించాడు.
మాహారాజుకు ఆశ్చర్యము కలిగింది. ఆ ఆశ్చర్యంతో కాసేపు మహారాజుకు నోటమాట రాలేదు. ఇంతలో మహారాజు కాస్త గంభీరంగా జనం వైపుకు తిరిగి, “ఇదే ధర్మ సభ! ఇక్కడ ధర్మం తప్పకుండా గెలుస్తుంది. అన్యాయం ఓడిపోతుంది. ధర్మాన్ని నిలబెట్టేందుకు రాజుగా నేను ఇక్కడ ఉన్నాను.” అని మహారాజు అన్నాడు.
“ధర్మమే గెలుస్తుంది! ధర్మం మాత్రమే గెలుస్తుంది! ధర్మమేవ జయతు!” అని మహారాజు పక్కన ఉన్న పండితులు పెద్ద స్థాయి గొంతుతో పలికారు. “ధర్మసంస్థాపనకు నడుం బిగించిన శ్రీ విష్ణుకుండిన మాధవవర్మ మహారాజా, మీకు జయం! ధర్మసంస్థాపనాదీక్షిత శ్రీవిష్ణుకుండిన మాధవవర్మ సార్వభౌమా, జయతు జయతు!” అని సభా సభ్యులందరూ మహారాజుకు జయవాక్యములు చేసారు.
“ధర్మమేవ జయతు, ధర్మమేవ జయతు” అని ప్రక్కనున్న పండితులు, దీప్తకంఠములతో పలికినారు. “ధర్మసంస్థాపనాదీక్షిత శ్రీవిష్ణుకుండిన మాధవ వర్మ సార్వభౌమా! జయతు జయతు!” అని సభ్యులందరు జయవాక్యముల నినదించిరి. న్యాయాధీశులు ముందుకు వచ్చి విచారణ ప్రారంభించారు. ఒక అరగంటలో విచారణ పూర్తయింది.
యువరాజు దేవవర్మ “దోషి” అని నిర్ధారించారు న్యాయాధీశులు. మహారాజు ధర్మాలు తెలిసిన పండితుల వైపు చూసాడు.
“యువరాజు దేవవర్మ చేసిన ఆ తప్పుకు మరణమే శిక్ష. ఈ ఆవు డెక్కలకు వాడి అంచులున్న ఇనుప డెక్కలను తగిలించి యువరాజును భూమిలో పాతిన మేకులకు కట్టి పడుకోబెట్టి, ఆవుతో మరణించే వరకు తొక్కించటమే అతనికి శిక్ష!” అని, పండితులు మనవి చేసి, “మీరు చాలా దయగల గుండె ఉన్నవారు! యువరాజు చేసిన మొదటి తప్పు ఇది. అతనికి మహారాజు వేరొక శిక్ష విధించి, ఈ ఆవు యజమానికి తగినంత పరిహారం ఇప్పించి రాజధర్మము చేయండి. రాజధర్మానికి మించిన పరమధర్మం అది అని మనవి చేయుచున్నాము” అని పండితులు మౌనము వహించారు.
“మహారాజా! యువ మహారాజుని క్షమించటమే పరమధర్మమని మేమందరం కూడా మీకు మనవి చేస్తున్నాం.” అని అక్కడ చేరిన ప్రజలందరు ఏక కంఠంతో అరిచి చెప్పారు.
మాధవవర్మ మహారాజు చలించలేదు. “రేపు పొద్దున్న విష్ణుకుండిన వంశంలో పుట్టినవాడైన దేవవర్మకు మరణశిక్ష నగరం బయట అమలు చేయబడుతుంది. ఇది మా ఆజ్ఞ! మహాదండనాయకులు మేము విధించిన ఈ శిక్ష దేవవర్మ తల్లిదండ్రులైన, మేము-మా భార్య సమక్షమున నిర్వహించాలని మేము ఆనతి నిస్తున్నాం” అని గంభీరంగా పలికాడు. శిక్ష అమలు గురించి చెప్పి తలవంచుకొని, వెనకకు తిరిగి, తిన్నగా ఏకాంత మందిరంలోకి వెళ్ళిపోయాడు.
విజయవాడ నగరమంతా ఆ వార్త పాకిపోయింది. ప్రజలు అట్టుడికిపోయారు.