చారిత్రాత్మక నవల – అంశుమతి
చారిత్రాత్మక నవల – అంశుమతి

అనగనగనగా నేటి ఏలూరు నగరానికి దగ్గరలో ఉన్న (పెదవేగి) వేంగీ మహానగరం రాజధానిగా మంచన భట్టారకదేవుడనే రాజు ఆంధ్ర సామ్రాజ్యాన్ని ఏలేవాడు. అతనికి ఒక్కగానొక్క కూతురు. ఆమె పేరు అంశుమతి. ఒకసారి గోవూరులో ఉన్న గోపాద క్షేత్రంలోని గోదావరీ నదిలో మంగళస్నానం చేసేందుకు రాకుమారి వచ్చింది. ఆమె చేత మంగళస్నానం శాస్త్రోక్తంగా చేయించేందుకు అక్కడ రాజపురోహితుడు కూడా ఉన్నాడు. అతను ఎలాంటి లోటూ లేకుండా అన్ని మంత్రాలను చదువుతూ మంగళస్నానాన్ని రాకుమారి చేత పూర్తి చేయించాడు. ఆమెతో పాటుగా ఆమె చెలికత్తె మాధవీలత కూడా మంగళస్నానం చేసింది.
స్నానమయ్యాక బట్టలు మార్చుకునేందుకు విశేష ఏర్పాట్లతో ఒక శిబిరం నది గట్టు మీద రాకుమారి కోసం ఏర్పాటు చేసి ఉంది. అందరు దేవతలకు అర్ఘ్యం వదిలి, స్నానం ముగించుకున్న రాకుమారి ఆ శిబిరములోకి వెళ్ళి అందమైన బట్టలు వేసుకున్నది. ఆమె బయటకు రాగానే ఆమెతో వచ్చిన చెలికత్తెలు ఆమెను పొగుడుతూ జయధ్వానాలు చేసారు. అక్కడికొచ్చిన పండితులకు తగిన సంభావనలు ఇచ్చి వారందరి ఆశీర్వాదాలు తీసుకుని రాకుమారి ఒక ప్రత్యేక రథంలో గోవూరు సమీపంలో ఆమె కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక భవనానికి వెళ్ళింది.
రాకుమారి అంశుమతికి పద్దెనిమిదేళ్ళు, నిండు యౌవనంలో ఉంది. ఆమె చాలా అందంగా ఉంటుందని, ఆమెకు మించిన అందగత్తె ఈ ప్రపంచంలోనే లేదని జనం అనుకుంటూ ఉంటారు. ఆమె అందం గురించి విన్న పక్క రాజ్యాల రాజులు, రాకుమారులు ఆమెను తమ అర్ధాంగిగా చేసుకోవాలని శ్రీ మంచన భట్టారక మహారాజుకు ఉత్తరాలు, రాయబారాలు పంపేవారు. కానీ వారి పెళ్ళి ప్రతిపాదనలను రాకుమారి ఎందుకో తిరస్కరించేది.
రాకుమారి అంశుమతి జాతకంలో ఏదో దోషం ఉందని రాజపురోహితుడు, జ్యోతిష్కుడు నారసింహభట్టు పండితులు చెప్పాడు. ఆ దోషం పోవాలంటే రాకుమారి అంశుమతి చేత గోవూరు గోపాద క్షేత్రంలో గోదావరి నదీస్నానం చేయాలని పండితుడు చెప్పాడు. ఉత్తమ బ్రాహ్మణుల చేత గ్రహదోష నివారణార్ధం పండితుల చేత జపాలు చేయించి, వారికి దానాలివ్వాలని కూడా చెప్పాడు.
“ఆ దోషం గ్రహచారము వలన కలిగింది. ఆ దోషం వలన ఆంధ్ర రాజ్యానికే ముప్పు కలగవచ్చు. గ్రహశాంతి చేయిస్తే ఆ ఉపద్రవాన్ని అరికట్టవచ్చు” అని రాజగురువు చెప్పాడు.
“ఒకవేళ ఈ దోషము తీరిపోతే అమ్మాయి జాతకం ఎలా మారుతుంది గురుదేవా?”
“రాజకుమారి జాతకం ఉత్కృష్టమైనది. ఆమెకు మహారాజు భర్తగా లభిస్తాడు. ఆమెకు పుట్టే కొడుకు మీ కులానికే పేరు తెచ్చే మహారాజు అవుతాడు. సామ్రాజ్యాధిపతి అవుతాడు.”
రాజగురువే గోవూరులో రాజకుమారిచేత గోదావరీ స్నాన వ్రతం చేయించేందుకు ఏర్పాట్లు చేసాడు. ఈ మంగళస్నానాల వ్రతం నలభై రోజులపాటు జరగాల్సి ఉంది.
సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు. వారు చేసిన తప్పు వలన కపిల మహర్షి శాపానికి గురై భస్మం అయ్యారు. వారిని శాప విముక్తులను చేసేందుకు మరియు భూమిని పవిత్రం చేసేందుకు భగీరథుడు హిమాలయాల్లో తపస్సు చేసాడు. ఆకాశగంగను మెప్పించి భూమిపైకి తెచ్చే ప్రయత్నం చేసాడు. కానీ గంగ ఉధృతికి ప్రపంచం నాశనమయ్యే అవకాశం ఉంది. ఆమె ఉధృత ఒరవడిని ఆపగలిగిందెవరో? అని ఊహించిన భగీరథుడు మళ్ళీ ఘోర తపస్సు చేసాడు. ఈసారి శివుడ్ని మెప్పించాడు. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మహేశ్వరుడు తన తల మీద ఉన్న జడల ముడిని విప్పి భూమి వైపుకు బాగా ఎక్కువ వేగంగా వస్తున్న గంగా ప్రవాహాన్ని తన జడలలో చుట్టేసాడు. ఆ పవిత్రమైన నదిలోని ఒక పాయను మాత్రం పరమేశ్వరుడు భూమిని పవిత్రం చేసేందుకు వదిలాడట. గంగను తన తలపై నిలిపాడు కనుక ఆ రోజు నుండి శివుడ్ని మనం గంగాధరుడని కూడా పిలుచుకుంటాం. భగీరథుడి తపస్సు వలన గంగా నది భూమిపైకి వచ్చింది కనుక ఆ నదిని మనం భాగీరథి అని కూడా పిలుస్తాం.
ఉత్తరభారతదేశంలో గంగ ఈ విధంగా అవతరించింది. ఈ గంగావతరణం జరిగిన కొన్ని యుగాల తర్వాత పరమశివుడు దక్షిణం వైపుగా వచ్చి మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో త్ర్యంబకేశ్వరుడిగా వెలిసాడు. ఆ రోజుల్లో నేటి తెలుగు ప్రాంతాలు దండకారణ్యంలో భాగంగా ఉండేవి. ఈ దండకారణ్యంలో ఆ రోజుల్లో ఇవాళ్టి గోవూరు ప్రాంతంలో గౌతమ మహర్షి ఒక ఆశ్రమం కట్టుకొని తపస్సు చేస్తూ ఉన్నాడట. ఆ ఆశ్రమంలో మాత్రమే గౌతమ మహర్షి మహిమ వలన నిత్యం వర్షం పడుతూ చుట్టు పక్కల పంటలు సమృద్ధిగా పండేవట. ఆ ప్రాంతంలో నివసించే తెలుగువారు ఈ విషయాన్ని గమనించి తమ ఆవును ఒకదాన్ని గౌతమ మహర్షి ఆశ్రమంలో మేపేవారట. ఏ రోజుకారోజు ఆ ఆవు పండిన వరిచేనును తినేయటం మొదలుపెట్టడంతో గౌతముడికి ఆగ్రహం వచ్చింది. ఆ ఆవును తరిమేసేందుకు గౌతముడు ఆ ఆవు వైపుకు ఒక దర్భ పుల్లను విసిరాడు. గౌతముడి తపస్సుకున్న మహిమ వలన ఆ పుల్ల ఆ ఆవుకు మారణాయుధంలా మారింది. ఆ ఆవు చనిపోయి నేల మీద పడిపోయింది.
గౌతమ మహర్షికి అలా గోహత్య చేసిన మహా పాపం అంటుకుంది. ఆ పాపాన్ని నాశనం చేసుకునేందుకు ఆ గొప్ప ఋషి చాలా దీక్షతో తపస్సు చేసాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. గౌతముడు తన సమస్యను తెలుపగా బ్రహ్మ అందుకు సమాధానంగా త్ర్యంబకేశ్వరంలో కొలువై ఉన్న పరమశివుడ్ని వేడుకొని అతని జటలో ఉన్న గంగ మరొక పాయను తీసుకురమ్మన్నాడు. గౌతముడు ఆ త్రినేత్రుడిని వేడి గంగను బ్రహ్మ చెప్పిన విధంగా తెచ్చాడు. గౌతముడి గోహత్యా పాపాన్ని నాశనం చేసింది గనుక ఆ గంగ లోని పాయకు గోదావరి నది అని, గౌతముడు తెచ్చాడు కాబట్టి గౌతమి నది అని ఆ దివ్య నదికి ఆ ప్రసిద్ధమైన పేర్లు వచ్చాయి. గౌతముడు దర్భ విసరగా గోవు చనిపోయిన ప్రదేశం గోపాద క్షేత్రమయింది. గౌతముడి ఆశ్రమమున్న ఆ ఊరు మొదట మునిపల్లెగా ఆ తర్వాత గోవూరుగా అయింది.
రాకుమారి అంశుమతి చేస్తున్న గోదావరి నదీస్నాన వ్రతం ఎలాంటి అడ్డంకి లేకుండా సాగిపోతూ ఉంది. ఆ సాయంత్రం ఒక్కటే రాకుమారి విడిది ఉన్న భవనానికి ఆనుకొని ఉన్న తోటలో నడుస్తూ ఉంది. అది వసంతఋతువు, వసంతదేవుడు ప్రకృతిలో ప్రవేశించాడు. పూవులన్నీ పూసి తమ సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. ఆ వసంతఋతువు అందాన్ని తనివితీరా అనుభవిస్తూ రాకుమారి తన చెలికత్తె మాధవీలతను తన దగ్గరకు పిలిచింది. రాకుమారి మాటల్లో ఉన్న సంతోషాన్ని, తొందరపాటును గమనించిన మాధవీలత రాకుమారి దగ్గరకి పరుగున వస్తూ, “ఏం రాకుమారి! ఏదో వింతను చూసినట్టున్నారే! ఏమా విశేషం” అని అనింది.
“మాధవీ! ఈ మల్లెచెట్టుకు మొగ్గలు వచ్చాయి. ఆ గున్నమామిడి చెట్టుకు లేత పూలు పూసాయి. చూశావా, వాయుదేవుడు ఈ సువాసనలన్నిటినీ మన దగ్గరకు మోసుకు వస్తున్నాడు, చూశావా?” అని పరవశంలో అంది రాకుమారి.
“రాకుమారీ! ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒకే వసంతదేవుడు వస్తాడా, లేదా ఒక్కో సంవత్సరానికి ఒక్కొక్క వసంతదేవుడు చొప్పున అనేక వసంతదేవుడులున్నారా?”
“అయ్యో వెఱ్ఱిదానా! వసంతుడు ఎప్పుడూ యవ్వనంగా ఉంటాడు. ఎప్పుడూ అతని లీలను ఈ పూల సుగంధాలతో మనకు చూపిస్తూ ఉంటాడు. రోజూ ఉదయంపూట సూర్యోదయంతో ఉదయించి, ముప్ఫై ఘడియలు (నేటి 24 నిమిషాలు అప్పటి ఒక ఘడియ) ఆకాశంలో తూర్పు నుంచి పడమర వైపుకు ప్రయాణించి, సాయంకాలం అస్తమించే సూర్యభగవానుడు ఒకడా, లేక రోజుకొక సూర్యభగవానుడు చొప్పున చాలా మంది సూర్యభగవానులున్నారా?”
“సూర్యభగవానుడు ఒకడే ఉన్నాడని అంటాను.”
“ఈ కొత్తదనాన్ని ఆలోచించినందుకే దివ్య కవులయిన కాళిదాసు మొదలగువారు వారి వారి గీతామృత ధారల్లో మాధవదేవుని పలు రకాలుగా కీర్తించారు.”
“అది సరే ఈ తోటను ప్రియురాలిగా స్వీకరించి ఇక్కడకి వసంతదేవుడి రూపంలో మాధవుడు పెళ్ళాడటానికి వచ్చాడు. మరి మా రాజకుమారిని…”
“ఛీ! మూర్ఖురాలా! ఆ మాటలాపు.”
“క్షమించు రాకుమారి. మాధవదేవుడు రావటం వలనే కదా ఈ చెట్లకు పూలు పూశాయి. అది చెప్పబోయే తొందరలో కాస్త నోరు జారాను.”,
ఆ మాటలు విన్న రాకుమారి కాస్త కోపం నటిస్తూ మాధవిపైకి తన సిగబంతి పూవును విసిరింది. మాధవి కిలకిల నవ్వుతూ ఆ పూలతోటలో ఎక్కడికో మాయమైపోయింది.
* * *
ఒక మేలుజాతి గుర్రాన్నెక్కి ఒక కుర్రవాడు బాగా వేగంగా వేంగీ నగరానికి పశ్చిమంగా ఇరవై ఆమడల (~320 కిమీ. దూరం) దూరంలో ఉన్న “మధ్యదుర్గం” అనే ఊరు దాటి వస్తున్నాడు. ఆ గుర్రం మేలుజాతి పర్షియా గుర్రం. తెల్లని రంగులో దృఢంగా ఉంది. ఎంత మహాబలిశాలికైనా లొంగనిదిగా కనిపిస్తోంది. అదేంటో గానీ ఆ కుర్రాడికి మాత్రం ఆ గుర్రం చాలా అనువుగా ప్రవర్తిస్తోంది. అతని మనసుకు అనుగుణంగా ఆ గుర్రం నడుచుకుంటుందా అని చూసేవారికి అనిపించవచ్చు. గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ఆ కుర్రవాడు మధ్యదుర్గానికి పదిగోరుతముల/ పదిక్రోశుల దూరం (ఇరవై మైళ్ళు లేదా 32 కిమీ.) నుంచి ప్రయాణం చేసి వచ్చాడు. కొండలు, లోయలు, నదులు, నదులు మొదలయ్యే స్థానాలు, కొండదొనలు (కొండమీద ఉండే లోతైన నీటిగుంట), కొలనులతో నిండిన ఆ ప్రదేశము దట్టమైన అడవుల మధ్య ఉంది.

ఆ కుర్రవాడు ఒక బాలకుడిలా కనిపిస్తున్నాడు. అతను ఆగిన ప్రాంతము ఒక రహదారికి పక్కన ఉన్న సువిశాల కొండ కింది ప్రాంతం. ఆ విశాలమైన ప్రదేశంలో ఒక పెద్ద సైన్యం తమ శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఆ బాలకుడు చేరుకొని, ఆగే సరికి, ఇద్దరు సైనికులు పరిగెత్తుకుంటూ అతని దగ్గరకు వచ్చి చేతులు జోడించి, వంగి అతనికి నమస్కారం చేసారు. ఆ ఇద్దరు సైనికులలో ఒకడు గుర్రం కళ్ళెమును పట్టుకున్నాడు. రెండో సైనికుడు గౌరవసూచకంగా తన కత్తిని ఒర నుంచి తీసి, పిడిని పట్టి నమస్కార సూచకంగా కత్తిని నిలిపి విగ్రహంలా అలా నిలుచుండిపోయాడు. ఆ బాలకుడు గుర్రంపై నుండి ఒక్క దుముకుతో ఛంగుమని గెంతి ఆ శిబిరం లోపలికి సరసరా నడుచుకుంటూ వెళ్ళాడు. శిబిరం చుట్టూరా చక్కగా శుభ్రంగా ఉంది. ఈ బాలకుడు గబగబా నడుచుకుంటూ వెళుతుంటే, దారిపొడుగునా సైన్యంలోని మహావీరులందరూ బొమ్మల్లా నిలుచొని వీరనమస్కారాలు చేస్తున్నారు.
ఇంతలో ఆ శిబిరానికి నాయకుడైన సేనాధిపతి వేగంగా ఆ బాలకుడికి ఎదురొచ్చి వీరనమస్కారం చేసాడు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఆ బాలకుడు శిబిరం మధ్యలో ఉన్న బంగారు గుడారం (టెంట్) వైపుకు నడిచాడు. ఆ బాలకుడి వెనకాలే సేనాధిపతి బాలకుడి పట్ల గౌరవ భక్తి భావాలతో చిరునవ్వు నవ్వుతూ అనుసరించాడు. బాలకుడు ఆ గుడారంలోకి ప్రవేశించబోతుండగా, అక్కడి వందిమాగధులు,
“జయ! జయ!
ఉత్తమ చాళుక్యా!
జయ! జయ!
కదంబమహారాజ గర్వాపహరణ!
జయ! జయ!
బిరుదాంక భీమ!
జయ! జయ!
రాష్ట్రకూట గోవిందరాజ గర్వాపహరణ!
జయ! జయ!
త్రిమహారాష్ట్రక ప్రభూ!
జయ! జయ!
విషమసిద్ధి దివ్య బిరుదాంకా!
జయ! జయ!
విష్ణువర్ధన మహారాజా!” అని జయధ్వానాలు పలికారు.
ఈ విధంగా బాలకుడిగా కనిపించిన విష్ణువర్ధన మహారాజు, సేనాధిపతి – పట్టవర్ధన వంశంలో గొప్పవాడైన కాలకంపనుడు ఆ గుడారం లోపలికి వెళ్ళారు. విష్ణువర్ధన మహారాజు బంగారు సింహాసనంపై కూర్చొని, “కాలకంపన ప్రభూ! మీరు కూడా మీ ఆసనంలో కూర్చోండి” అని గౌరవం ఉట్టిపడే మాటలతో సేనాధిపతికి పీఠము చూపించాడు.
విష్ణువర్ధనుడు సత్యాశ్రయ మహారాజుకు చిన్న తమ్ముడు. సత్యాశ్రయ మహారాజుకు రాజపరమేశ్వర, సర్వసిద్ధి బిరుదాంక, సత్యాశ్రయ శ్రీపృథ్వీవల్లభవాతాపినగర చక్రవర్తి అని బిరుదులు. అన్నగారి కన్నా విష్ణువర్ధనుడు ఎనిమిది సంవత్సరాలు చిన్నవాడు. ఇవాళ్టికి అతని వయస్సు ఇరవై ఎనిమిది సంవత్సరాలు. కానీ అతను కనిపించడానికి బాలకుడిలా ఉన్నాడు. ఆతను నాలుగడుగుల పదకొండు అంగుళాల పొడవున్నాడు. వాతాపి నగర చాళుక్య చక్రవర్తులందరూ ఆరడుగుల పొడవువారు. చాళుక్య రాజపుత్రులలో ఇలా పొట్టివాడు ఎప్పుడూ పుట్టలేదని ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఆ నాలుగడుగుల పదకొండంగుళాల పొడవుకు తగ్గట్టు అతని తల, కాళ్ళూ, చేతులూ చిన్నగానే కనిపిస్తాయి. అందువలన విష్ణువర్ధనుడు బాలకుడిలా కనిపిస్తాడు. ఇతని పూర్వీకులలో విష్ణువర్ధనుడు అనే పేరున్నవారు ఉన్నారు. వాతాపి చక్రవర్తుల మూలపురుషుడే విష్ణువర్ధనుడు. అందువలన కాబోలు ఇతనిని కుజ్జ విష్ణువర్ధనుడు (పొట్టి విష్ణువర్ధనుడు) అని జనం పిలుచుకుంటారు.
అతని శరీరం లేత బంగారు రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. అతని నూనుగు మీసాలు అతను పదహారేళ్ళ బాలకుడేమో అని అనిపించేలా చేస్తాయి. అయితే, విష్ణువర్ధనుడి శరీరం చాలా దృఢమైనది. జనం అతనిది ఉక్కుశరీరమని అంటారు. ఇంతేసి లావైన ఇనుప చువ్వలను అతను సర్వసాధారణంగా వంచేస్తాడట. అతని శరీరాన్ని చూసి ఇట్టే ఓడించేద్దామని అతనితో ముష్టియుద్ధాల్లో, మల్లయుద్ధాల్లో తలపడి మూడు నిమిషాల్లో ఓడిపోవటమే కాక, ఎక్కడ తమ ప్రాణాలను ఈ పొట్టివాడు తీస్తాడో అని భయపడి, ‘బ్రతుకుజీవుడా!’ అని విష్ణువర్ధనుడికి దాసోహమంటారట.
అతని బాణప్రయోగాలు, ఆతని కత్తివేట్లు మెరుపుకన్నా వేగంగా ఉంటాయి, రాముడు, విష్ణుమూర్తి వదిలిన బాణాలంత తీవ్రంగా ఉంటాయి. విష్ణువర్ధనుడికి భయమంటే ఏంటో తెలీదు. ‘నేను ఓడిపోతాను’ అన్న సందేహం అతనికసలు ఎప్పుడూ లేదు. సైన్యాన్ని నడపడంలో, వ్యూహములు పన్నటంలో, శత్రు సైన్యాలను ఓడించడంలో కుబ్జ విష్ణువర్ధనుడు ప్రజ్ఞావంతుడైన సేనాపతి. తన బలముకన్నా శత్రువు సైన్యమెంత అధికంగా ఉన్నా యుద్ధ నిర్వహణలో శత్రువు తనకన్నా ఎప్పుడైనా తక్కువే అన్న నమ్మకం ఉండటం వలనే విష్ణువర్ధనుడు మేకలమంద మీద పడే సింహంలాగా ప్రళయ ప్రభంజనమై శత్రువులపై విరుచుకొని పడతాడు.
కాలకంపనుడు : మహాప్రభూ! సార్వభౌములైన మీ చిన్నన్నయ్యగారైన సత్యాశ్రయ శ్రీ జయసింహ మహారాజును సురాష్ట్ర, కుకర, ఆనర్త, అనుప- అపరాత దేశములకు మహారాజుగా చేసి పట్టము కట్టారు. మీరు కుంతల దేశమును జయించారు. అశ్మకదేశాన్ని అణచివేశారు. రాష్ట్రకూటులను పాదాక్రాంతులుగా చేసారు. వనవాసి దేశమునకు మీరు ప్రతినిధులై ఉన్నారు. మరి, అడుగడుగునా అడ్డుతగులు ఈ పూర్వ సముద్రతీర రాజ్యములకు బుద్ధి చెప్పమని ఇప్పుడెందుకు మీ చిన్నన్నయ్య మిమ్మల్ని పంపారో నాకు అర్థమవడం లేదు మహాప్రభూ!
విష్ణువర్ధనుడు : సేనాధిపతీ! అన్నగారు దివ్య ప్రతిభావంతులు, వారి హృదయము తెలుసుకోవటం దేవగురువు బృహస్పతికైనా సాధ్యం కాదు. రాజ్యములు సుస్థిరములై ప్రజలు రామరాజ్యమును అనుభవించాలని ఎప్పుడూ ఆయన కోరుకుంటాడు.
కాల : మహాప్రభూ! నాకు సార్వభౌముల హృదయం ఇప్పుడు కొంచెం అర్ధమైంది. చిన్న చిన్న రాజ్యములు దురాశ వల్లనో, గర్వము వల్లనో ఎప్పుడూ తమలో తాము యుద్ధములు చేసుకుంటూ ఉంటారు. అందువల్ల ప్రజలకు నష్టములు కలుగుతాయి. సార్వభౌములకు అది ఇష్టము లేదు. ఈ తూర్పు తీర ప్రదేశములలో శాంతి అడుగంటిపోయిందని చక్రవర్తి అయిదేళ్ల క్రితమే జైత్రయాత్ర చేసారు కదా!
విష్ణు : ఎవరి రాజ్యములు వారు సుఖముగా పరిపాలన చేసుకుంటూ ఉంటే ఈ అశాంతి పీడకలలా మన దేశమును ఆవరించి ఉండేది కాదు కదా.
కాల : చిత్తం.
విష్ణు : అన్నగారు పిష్టపురానికి (పిఠాపురానికి) వెళ్ళి తిరిగి ఆ నగరాన్ని ఆక్రమించమన్నారు.
కాల : మహాప్రభూ! మీకొక మనవి చేయాలని ఉంది కానీ ధైర్యము చాలక ఊరుకున్నాను. మనం మధ్యదుర్గము దగ్గరే గోదావరీనదీ మధ్యలో ఉన్న పట్టిస ద్వీపమునకు (పట్టిసం) వెళ్ళు రహదారి వెంబడి వెళ్ళాల్సింది కదా!
విష్ణు : సేనాధిపతీ! మీరు కొంచెం ఓపికపట్టండి. నాకు అన్నయ్య ఆజ్ఞ ఇచ్చేప్పటికి పిష్టపురము లోనే ఉన్న మన రాజప్రతినిధి పృథ్వీధృవ రాజేంద్రవర్మ పల్లవ సైన్యములతో తలపడుటకు కృష్ణానదీ తీరంలో ధనకటక నగరానికి వెళ్ళాడని, మధ్యదుర్గము దగ్గరే మనకొక వేగు వచ్చింది కదా!
కాల : అవును మహాప్రభూ! ఏ యుద్ధమైనా సరే మీరు ముందుచూపుతో ఆలోచించే యుద్ధవిధానం నిర్ణయిస్తారు.
విష్ణు : కాలకంపన ప్రభూ! నా చిన్నప్పటి నుండిమీరే గురువులై సంగ్రామ విద్య నాకు నేర్పించారు. కంటికి రెప్పలా నన్ను కాపాడారు. మా నాన్న శ్రీసత్యాశ్రయ కీర్తివర్మ వల్లభ చక్రవర్తులు మహేశ్వర సన్నిధానము చేరుకునే నాటికి మేము ముగ్గురం అన్నదమ్ములం చిన్నవాళ్ళమవటం వలన మా చిన్నాన్న శ్రీ మంగలేశ చక్రవర్తి మాపై ప్రయోగించిన కుట్ర నుండి మమ్మల్ని రక్షించి కన్నతండ్రిలాగా కాపాడారు!
విష్ణువర్ధనుడి మాటలు వింటున్న కాలకంపన ప్రభువు కన్నులు చెమర్చాయి.
(తర్వాతి కథ, వచ్చే సంచికలో…)








