పురస్కార సాహిత్యం – పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
పురస్కార సాహిత్య పరిచయం: పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా
-కవనమాలి
పురస్కారం అనేది నా దృష్టిలో పుస్తకానికి ఇచ్చే గౌరవం, రచయితకి ఇచ్చే ప్రోత్సాహం. అలా తెలుగు సాహిత్యంలో అందించే పురస్కారాలలో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారాలు కాస్త ప్రత్యేకమైనవనే చెప్పొచ్చు. 1955 నుండి ప్రతీ సంవత్సరం భారతీయ భాషల్లో ప్రతీ భాషలో ఒక ఉత్తమ రచనని ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. అలా మన తెలుగులో కూడా ఎన్నో పుస్తకాలకి ఈ పురస్కారం వచ్చినా, అందులో ఎన్ని ఇప్పటితరం వారికి తెలుసు అనే ప్రశ్న వచ్చింది. ఆ పుస్తకాల గురించి, పురస్కారం వచ్చేలా చేసిన ఆ ప్రత్యేక అంశాలు ఏమిటి అనే వాటి గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచనతో మొదలుపెట్టినదే ఈ పురస్కార సాహిత్య పరిచయాలు.
ఇక ఈ నెల మనం మాట్లాడుకోబోయే పుస్తకం గురించి చూస్తే, తన ప్రయాణం ఏ మేరకు ఎంత వరకూ ఎలా సాగినా, అందులో గెలుపు ఓటములు ఎలా ఉన్నా నా వరకూ త్రిపురనేని గోపీచంద్ గారు ఒక సత్యాన్వేషి అనిపిస్తుంది. ఆ అన్వేషణ వల్లనే హేతువాదం (Rationalism), నాస్తికవాదం (atheism), మానవతావాదం (humanism), ఆధ్యాత్మికవాదం(spiritualism) ఇలా ప్రతీ వాదాన్ని పలకరించి పరిశోధించి తన అనుభవం మేరకు అవగాహన పొందారు. ఆ అవగాహనే ఆయన రచనల్లో పాత్రలుగా, సంభాషణలుగా, చర్చాంశాలుగా మారాయనిపిస్తుంది. అందుకు ఒకానొక ఉదాహరణ ఈ “పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా” నవల.

కథ గురించి పూర్తిగా మాట్లాడి, మీలో ఈ నవల చదవాలనుకుంటున్న వారి పఠనానుభవాన్ని పాడుచేసే ప్రయత్నం నేను చేయదలుచుకోలేదు కాబట్టి క్లుప్తంగా ఈ నవలలో నేను గమనించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతూ మీకు ఈ నవలని పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను.
నవలలో కేశవమూర్తి ఒక మధ్యతరగతి సంఘజీవి. వరంగల్’లో టీచర్ ఉద్యోగి. పైగా రచయిత, అయితే అతను ఏ సిద్ధాంతానికి, ఏ రాజకీయ పార్టీకి వత్తాసు పలకని రచయిత. అతను ఓ కొత్త నవలను ప్రారంభిస్తాడు. అతను చెబుతుంటే, తన భార్య సుజాత రాస్తుంటుంది. ఇదిగోండి ఇలా మొదలవుతుంది ఈ “పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా” నవల. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కథలో కేశవమూర్తి రాస్తున్న నవల ముగింపుతోనే “పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా” నవల కూడా ముగుస్తుంది.
అసలు ఎవరీ పరమేశ్వరశాస్త్రి అంటే, ఆయన సుజాత పెంపుడు తండ్రి. ధవళేశ్వరంలో ఉంటారు. బ్రహ్మచారిగా జీవితాన్ని సాగిస్తున్న శాస్త్రిగారు, ఆశ్రమంలో సుజాతని చూసి చిన్నప్పుడే తన ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్దచేస్తాడు. అలాంటి పరమేశ్వరశాస్త్రి గారిపై సుజాతకి ఎంతో కృతజ్ఞతా భావం ఉన్నా, పెళ్లి విషయంలో ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా కేశవమూర్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో తండ్రికి దూరం అవుతుంది. ఆయన జ్ఞాపకంగానే కొడుకుకి పరమేశ్వర్ అని పేరు పెట్టుకుంది. అయితే, కొన్నేళ్ల తరువాత ఆయనకి ఆరోగ్యం బాలేదు అని ఉత్తరం రావడంతో తండ్రిని చూడటానికి వెళ్తుంది. వెళ్ళాక అక్కడ జరిగిన పరిస్థితులు ఏమిటి? పరమేశ్వరశాస్త్రి తన ఆస్తిని అంతా ఎవరికీ రాసివ్వాలని అనుకున్నాడు ? కథకి కీలకం అయిన ఆ వీలునామాలో ఏముంది? సినిమాల్లో రచనా అవకాశం వచ్చి, కేశవమూర్తి చెన్నై వెళ్ళాక అక్కడ ఎదురైన వ్యక్తులు ఎవరు, వారి వల్ల కేశవమూర్తి సుజాతల దాంపత్యజీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ నవల చదవాల్సిందే.
ఇందులో ముఖ్యపాత్రలు అన్నీ తమ తమ కథలని తామే చెబుతుంటాయి. ఈ విషయం గురించే ప్రస్తావిస్తూ గోపీచంద్ గారు “ఫలానా వ్యక్తికి ఇలా జరిగింది అని మరొకవ్యక్తి అయిన కథకుడు చెప్పినదానికంటే, అనుభవించిన వ్యక్తే నాకిలా జరిగింది అని చెప్పడం సమంజసంగాను, సహజంగాను ఉంటుంది” అని రాశారు.
ముఖ్యంగా ఈ నవలలోని పాత్రలని మనం తరచూ మన చుట్టూ సమాజంలో ఎక్కడో ఒక చోట చూసినట్టే అనిపిస్తుంది. అలాంటి పాత్రలని, పరిస్థితులని సృష్టించాలంటే రచయితకి మనుషుల మనస్తత్వాల మీద, సంఘంలోని పరిస్థితుల పట్ల ఎంతో పరిశీలన, అవగాహన అవసరం.
ఈ నవలలో కథ, కథనం వీటి కంటే కూడా ముఖ్యంగా మాట్లాడుకోవలసింది, పాత్రల మనస్తత్వాల గురించి. ఈ నవలలో మనో విశ్లేషణ ఎన్నో కోణాల్లో జరుగుతుంది.
కేశవమూర్తి పాత్రని గమనిస్తే నమ్మతరం కాని అమాయకత్వం, తనకి ద్రోహం చేసిన వారి పట్ల కూడా మంచితనం చూపించడం, కథలో వీలుకలిగినప్పుడల్లా తన మంచితనాన్ని, అమాయకత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. ఇక సుజాత, చదువరి, తనని పెంచిన తండ్రిపై ఎంతో కృతజ్ఞత ఉంటుంది. కులం, కట్నం లాంటి ఏ చర్చ లేకుండా తనని తననిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న కేశవమూర్తి అంటే ఎంతో అభిమానం ఉంటుంది. కానీ ఎంతో అన్యోన్యత కలిగిన ఈ కేశవమూర్తి, సుజాతల మధ్య ఒక ఆకాశరామన్న ఉత్తరం ఎంత దూరం పెంచగలదో ఈ కథనంలో గమనించవచ్చు.
ఈ నవలలో విలన్స్, అదేనండి ప్రతినాయకులు, కేశవమూర్తికి ఎంతో దెగ్గర స్నేహితులే అనిపిస్తుంది. సీమంతం, శారద్వతుడు, కృష్ణమూర్తి, రాధారమణ ఇలా వీరందరికీ కేశవమూర్తి అంటే ఒక్కో కారణం చేత అసూయ. సీమంతం, తాను కేశవమూర్తి స్థాయికి ఎదగలేనని అర్థం చేసుకొని, కేశవమూర్తినే తన స్థాయికి దిగజార్చాలి అని ప్రయత్నాలు చేస్తాడు. శారద్వతుడు, తనలో లేని క్రియేటివిటీ, కేశవమూర్తిలో చూసి అసూయతో తీవ్ర విమర్శ చేస్తాడు. ఇక రాధారమణ, ఆధారాలతో పని లేని ఒక పుకారుని నిజం అని ముద్రించి కేశవమూర్తిని చాలా ఇబ్బందులు పడేలాచేస్తాడు. వీళ్లందరి గురించి వింటుంటే, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి మనస్తత్వాలు మీకు మీ చుట్టూ కుటుంబాల్లో సమాజంలో చూసినట్టే అనిపిస్తుంది కదా. అదే గోపీచంద్ గారి రచనా ప్రత్యేకత.
అలాగే ఈ నవలలో ముఖ్యపాత్ర కేశవమూర్తి గారి భావాలు అనేకం రచయిత గోపీచంద్ గారివే అనిపిస్తుంది. గోపీచంద్ గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే, తొలిరోజుల్లో తండ్రి త్రిపురనేని రామస్వామి గారి ప్రభావంతో హేతువాదం, అటునుండి నాస్తికవాదం, ఆపై ఎం.ఎన్.రాయ్ గారి ప్రభావంతో మనవాతావాదం, చివరలో అరవిందో గారి ఆలోచనల్లో ఆధ్యాత్మికవాదం వైపు అడుగులేసిన గోపీచంద్ గారి ప్రయాణం, అనుభవాలు కేశవమూర్తి వ్య్తకిత్వంలో ఈ నవలలో స్పష్టంగా మనకు కనిపిస్తాయి.
1950 ల్లో సమాజంలోని పరిస్థితులని, మనుషుల మనస్తత్వాలని, క్రియేటివ్ రైటింగ్ ఫీల్డ్ లోని పోటీ తత్వం ఇలా ఎన్నింటినో ఎంతో కొత్తగా కథకి అనుగుణంగా రాసిన విధానం నాకు బాగా నచ్చింది. ఇలా ఎన్నో అంశాలని తనలో భాగం చేసుకొని, ఎంతో ముఖ్యమైన మనస్తత్వ, తాత్విక, ఆధ్యాత్మిక విశ్లేషణలతో సాగిన ఈ పండిత పరమేశ్వర శాస్త్రి నవలకు 1963 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆ పురస్కారం లభించిన తొలి తెలుగు నవల కూడా ఈ పుస్తకమే.
అటు విమర్శ పరంగా చూస్తే, ఈ నవలని ఎందరో ఆదరించినా, కొందరు విమర్శలో ప్రస్తావించిన అంశాలు కూడా ముఖ్యమైనవే. ఈ నవలలో కొన్ని చోట్ల కొన్ని సుదీర్ఘమైన సంభాషణల వల్ల, తాత్విక చర్చలో భాగంగా రాసిన కొన్ని అంశాలు ప్రచారాత్మకంగా ఉండటం వల్ల పాఠకుడికి కొన్ని సార్లు నవల ప్రభోదాత్మక గ్రంథంలా అనిపించే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా ఈ నవల ముగింపు కాస్త నాటకీయంగా, హడావిడిగా ముగించినట్టు అనిపించిందని పలువురి పాఠకుల అభిప్రాయం. అలాగే అసమర్థుడి జీవయాత్ర అంకితంలో “ఎందుకు” అనే ప్రశ్న వేయడం నేర్పించిన నాన్నకి అని చెప్పిన గోపీచంద్ గారు తన ప్రయాణంలో తాత్వికతలో మరీ లోతుకు వెళ్ళిపోయి ఆ ప్రశ్నించడం మానేసారేమో అనే విమర్శ కూడా జరిగింది.
ఇలా ఈ పుస్తకం గురించి ఇంకా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోగలిగినా, మీరు ఈ పుస్తకం చదివి మీ అభిప్రాయం చెబితే మరింత బాగుంటుందని ఈ పరిచయాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.








