బాల సాహిత్యం : పొట్టి పిచ్చుక

పొట్టి పిచ్చుక

నగా అనగా ఓ ఊర్లో ఒక పొట్టి పిచిక వుండేది. అదేం చేసిందీ, ఊరల్లా తిరిగి ఉలవగింజ, చేనల్లా తిరిగి శనగ గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లాంటివి ఎన్నో గింజలు పోగు చేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టిచేసుకుంది. చేసుకుని, చింతచెట్టు మీద కూర్చుని, ఆ పిచిక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ, ఎగరేసుకుంటూ, తింటూ ఉంటే, చీమతలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది.

అప్పుడా పిచిక ఏం చేసిందీ వడ్రంగి దగ్గరకి వెళ్లి, “వడ్రంగీ!, వడ్రంగీ!, అతి కష్టపడి కొండంత రొట్టెచే సుకుని తింటూంటే, చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్. చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్,” అంది.

వడ్రంగి “చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా?’ అని పకపక నవ్వాడు.

అప్పుడా పిచిక కెంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గిరకి వెళ్లి, “రాజుగారూ, రాజుగారూ! అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూంటే, చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది.  తీసిపెట్ట అని అడిగితే వడ్రంగి తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా!.” అంది. రాజు కూడా నవ్వి, “ఇంత చిన్నపనికి వడ్రంగిని దండించాలా? దండించను పో” అన్నాడు రాజు.

‘అమ్మా!!, వీడి పని ఇలా వుందా!’ అని ఆ పిచిక వెంటనే లేళ్ల దగ్గిరకి వెళ్లి జరిగింది చెప్పి, “చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు. రాజుకు తన తోట అంటే ఎంతో ఇష్టం. అది పాడుచెయ్యండి లేళ్లూ!” అంది. “ఈ చీమతలకాయంత రొట్టిముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా? చాలు చాలు పో.” అన్నాయి లేళ్లు. 

“అమ్మ! వీటమ్మ కడుపు కాలా! ఈ వెధవ లేళ్ళకు ఇంత తెగులా!” అని ఆ పిచిక ఏంచేసిందీ, బోయ వాడి దగ్గిరికి వెళ్లి, 

‘బోయాడూ! బోయాడూ, చీమ తలకాయంత కొట్టి ముక్క చెట్టుతొర్రలో పడిపోయింది. తియ్యమంటే వడ్రంగి తీశాడు కాడు. వడ్రంగిని దండించమంటే రాజలా చెయ్యలేదు. రాజు పూలతోట పాడుచెయ్య మంటే లేళ్లు పాడుచెయ్య లేదు. లేళ్ల కాళ్లు విరకొట్టు బోయాడూ:” అంది. ఇదంతా విని బోయ వాడు, “ఈపాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్ల కాళ్లను విరక్కొట్టనా? బాగానేవుంది. వెళ్లు వెళ్లు,” అని పంపేశాడు.

దాంతో పిచిక్కి కోపమెక్కువై ఎలక దగ్గరకు వెళ్లి, ‘ఓయ్, ఎలకా: ఎలకా! ఓ సహాయం చేసి పెట్టాలి. చీమ తలకాయంత రొట్టి ముక్క చింతచెట్టుతొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీశాడు కాడు. వాడ్ని దండించమంటే రాజలా చేశేడుకాదు. రాజు గారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్లలా చేశా యికాదు, లేళ్ల కాళ్లు విర క్కొట్టమంటే బోయ విర క్కొట్టేడుకాదు. బోయ చెప్పులు కొరికి పాడుచెయ్యి ఎలకా:” అంది.ఎలికెకూడా “నా వల్ల కాదు పొ”మ్మని అంది.

“అమ్మ దొంగమొహమా, నీకెంత గర్వమే! అని పిల్లి దగ్గిరకి వెళ్ళి, “పిల్లి బావా! పిల్లి బావా,చీమ తలకాయంత రొట్టిముక్క చెట్టుతొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగితీసేడుకాడు. వడ్రం గిని దండించమంటే రాజలా చెయ్యలేదు. రాజు పూల తోట చెరుపమంటే లేళ్లలా చెయ్యలేదు. లేళ్ల కాళ్ళు విరొక్కొట్టమంటే బోయ నిరకొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికిందికాదు. ఎలుకను వేటాడు పిల్లీ ” అంది. “నా కిప్పుడు చాలా పనులున్నాయ్, ఇదే పనా ఏమిటి?” అని పిల్లి వెళ్ళి పోయింది.

‘దేని మొహం మండ: ఉండు దీని పని పడతాను, ‘అనితిన్నగా అవ్వ దగ్గిరకెళ్లి, ‘అవ్వా, అవ్వా, చీమ తలకాయంత రొట్టి ముక్త చెట్టుతొర్రలో పడితే వడ్రంగి తీసేడుకాదు. రాజు వడ్రంగిని దండించాడు కాదు, రాజు గారి పూల తోటను లేళ్లు పాడుచెయ్య లేదు. లేళ్ల కాళ్లు బోయ విరక్కొట్ట లేదు. ఎలక బోయ చెప్పులు కొరకలేదు. పిల్లికి చెపితే అది ఎలకను వేటాడాలేదు, పిల్లి మీద వేడి వేడి పాలొయ్యి అవ్వా,” అంది, ‘చీమ తలకాయంత రొట్టి ముక్క కోసం పిల్లిమీద పాలోస్తానూ? చాలుదాల్లే,’ అని అవ్వ కసిరి పొమ్మంది.

“ఏమి తూలిపోతున్నావే! మామ్మా!” అని తిన్నగా తాతయ్య దగ్గిరకి వెళ్ళి, “చీమతలకాయంత రొట్టి ముక్క తొర్రలో పడిపోతే, వడ్రంగి తియ్యనన్నాడు. రాజు వడ్రంగిని దండించాడు కాదు. లేళ్లు రాజుగారి పూలతోట పాడుచేశాయి కాదు. లేళ్ల కాళ్ళు బోయ విరక్కొట్టలేదు. బోయ చెప్పులు ఎలక పీకలేదు. పిల్లి ఎలకని వేటాడలేదు  అవ్వ పిల్లి మీద వేడి పాలొయ్యలేదు. అవ్వను చితకొట్టు తాతా!” అంది. ‘ఆమ్మో, నేనలా చేస్తానా చెయ్యను పో,’ అన్నాడు తాత.

“ఓహో! నీకింత గర్వ మా, సరే!” అని ఆపిచికేం చేసిందీ, గబగబా అవుదగ్గిర కెళ్ళి, “ఆవు పిన్నీ, ఆవు పిన్నీ, చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడి పోతే వడ్రంగి తీసేడుకాడు, రాజు వడ్రంగిని దండించ లేదు. రాజు పూలతోట లేళ్లు పాడుచెయ్యలేదు. లేళ్ల కాళ్లు బోయవాడు విరకొట్టలేదు. బోయ చెప్పులు ఎలక కొరకలేదు. ఎలకను పిల్లి వేటాడలేదు. పిల్లి మీద అవ్వ వేడిపాలొయ్యలేదు. తాత అవ్వను చితక్కొట్ట లేదు. తాత, పాలుతియ్య డాని కొచ్చినపుడు ‘ఫెడీ’ మని తన్ను ఆవూ,” అంది. ‘అబ్బే, నే నలాచెయ్యను సుమా’ అంది ఆవు.

అప్పుడు పిచిక విచారిస్తూ, “పొద్దున్నే లేచిఎవరిమొహం చూశానో, ఎవళ్ళనడిగినా ఏమీ చెయ్యనంటున్నారు ఎలాగో” అని ఏడుస్తూ  కూర్చుంది. ఇంతట్లో ఓ ఈగ ఆ దారముట వెడుతూ “ఏం పిచికా ఏడుస్తున్నా” వంటే, పిచిక జరిగినదంతా చెప్పి ఉపకారము చేసి పెట్ట మంది. అప్పుడు ఈగి ఏం చేసిందీ, వెంటనే వెళ్లి ఆవు చెవులో దూరి నానా అల్లరి చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తన దెగ్గరికి పాలు పితకటానికి ఒచ్చిన తాతని తన్నింది. తాతికి కోపంవచ్చి ఆవును ఎందుకు కట్టేయలేదు అని అవ్వని తిట్టాడు. అవ్వకు వళ్లుమండి చూసుకోకుండా మరుగుతున్న పాలను విసిరికొట్టింది. అవి వెళ్లి పిల్లిమీద పడ్డాయి. పిల్లికి ఆరోజు పాలు లేక ఆకలికి ఎలక వెంటపడింది. ఎలక భరించలేక బోయవాడి అన్నం గిన్నెలో దూరింది. బోయవాడు అన్నంలో ఎలకని చూసి అన్నం మొత్తం పడేసాడు, ఇక జింకను వేటాడడం తిండికి అని లేళ్ల వెంట పడ్డాడు. లేళ్ళు బోయవాడు వెంట పడడంతో రాజుగారి తోటతలుపులు తన్నుకొని కాలు విరగ్గొట్టుకొని,  లోపలకి ఒచ్చి తోటలో మొక్కలన్నీ పాడు చేశాయి. రాజుగారి తోటకి తలుపులు సరిగా చేయించనందుకు వడ్రంగిని శిక్షించేడు. వడ్రంగి శిక్షలో భాగంగా చచ్చి నట్టు చెట్టును నరికి, తొర్ర తవ్వి కొత్త తలుపు చేసాడు. అప్పుడు, పొట్టి పిచుక గుర్తొచ్చి ఆ చీమ తలకాయంత రొట్టిముక్క, తీసి పిచికకి పెట్టేడు.  పిచిక మళ్లీ ఎగవేసుకుంటూ ఎగవేసుకుంటు ఆ రొట్టెముక్కను కమ్మగా తిన్నది.

Adopted from : చందమామ, జులై 1947. ఇందులో ఆఖరి పేరాగ్రాఫ్ మొత్తం ఈతరానికి తగ్గట్టు మార్పులు చేయబడ్డాయి.

error: Content is protected !!