అభినిర్యాణం పై ఇష్టా-గోష్ఠి
అభినిర్యాణం పై ఇష్టా-గోష్ఠి
( ఏప్రిల్ 27 న జరిగిన మా ‘మీట్ & గ్రీట్ ప్రవర్ష్’ కార్యక్రమానికి వచ్చిన ఒక పాఠకుడి పరిశీలనలే, ఈ నెల ఇష్టా గోష్ఠి)
ఈ నెలలో కూడా తప్పనిసరిగా ఇష్టా గోష్టికి వెళ్లాలని నిర్ణయించుకొని డ్యూటీ అడ్జస్ట్ చేసుకున్నా. అంతకుముందే చదివేసి పక్కింటి వాసుకి ఇచ్చిన నవల, ‘అభి నిర్యాణం’ తిరిగి తీసుకొని డ్యూటీకి బయలుదేరా. ఇంకా రెండు రోజులు సమయం ఉంది కదా మరోసారి నవల తిరిగేద్దామని పైపైన చదవడం మొదలుపెట్టా. అంతకుముందే చదివి ఉండటం వలన ఏ పేజీ తిప్పినా కథాగమనం సులభంగానే గుర్తుకు వచ్చింది.
ఇష్టాగోష్టిలో రచయిత ప్రవర్ష్ను ఏ ఏ విషయాలు అడగాలో ఒక పేపర్ మీద రాసుకున్నా కూడా. ఆదివారం ఉదయం డ్యూటీ పూర్తి చేసి, ఇంటికి వచ్చే దారిలో ‘మేల్తలపులు’ – ఆదిత్య గారు మరియు ప్రవర్ష్ గారి సంభాషణ విన్నా. “అభి నిర్యాణం” చదివినప్పటి నుండి ప్రవర్ష్ గారికి లేఖ రాద్దాం అనుకున్నా ,ఆ సంభాషణ మరియు మధ్యాహ్నం ఎలాగో కలుస్తున్నామని ఉత్సాహం నన్ను మరింత ప్రోత్సహించింది. ఇంటికి వచ్చి కాసేపు నిద్రపోయి, లేచిన వెంటనే ఎప్పుడో పోస్ట్ ఆఫీస్ నుండి తెచ్చిన ఇన్లాండ్ కవర్ ఒకటి అందుకొని రాయడం మొదలుపెట్టా. చాలా రాద్దామనుకున్నా కానీ , స్థలాభావం వలన కొంచెం సంక్షిప్తంగానే పూర్తి చేసి కలిసినప్పుడు సుదీర్ఘంగా చర్చిద్దామని నిర్ణయించుకున్నా.
పూర్తయ్యేసరికి రెండు అయింది, టైం చూసుకొని ఆదరా బాదరగానే బయలుదేరా. సరిగ్గా గడియారం మూడో గంట కొట్టేసరికి 500cc ఫుడీస్ క్లబ్ ముందున్నా. అదే సమయానికి ప్రవర్ష్ ఎదురయ్యారు. మేల్తలపులు వల్ల మనిషిని చూడగానే గుర్తుపట్టి, పలకరించి మీ గురించే వచ్చా అన్నా పరిచయ కార్యక్రమాలు పూర్తికాకుండానే. ఆయన ముఖంలో చిన్న ప్రశ్నార్థకం. అది అర్థమవగానే మీ నవల చదివానని నీతో మాట్లాడదామని వచ్చా అని చెప్పి ఆయనతో కలిసి లోపలికి వెళ్ళా. వెళ్లేసరికే ఆదిత్య గారు, సాయి గారు ఇంకా కొంతమంది వచ్చి ఉన్నారు. పలకరింపులు పూర్తవగానే నేను రాసిన ఉత్తరం వచ్చే ప్రవర్ష్ గారికి ఇచ్చేశా. లెటర్ అంచున వేసిన నాగబంధం బొమ్మ చూసి ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా తెరుస్తానని చెప్పారు.
కొద్ది సమయంలోనే ‘అభి నిర్యాణం’ పై చర్చ మొదలైంది. సమూహంగా మొదలైన చర్చలో ఎక్కువగా అంతకుముందు ఆయనతో మాట్లాడి ఉండటం వలన కొత్తగా వచ్చిన నాలాంటి ఒకరిద్దరికి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఉత్తరంలో రాసిన మరియు రాయనివి అన్నీ ఆయనను అడగడం మొదలుపెట్టా. నా వరకు వస్తే అభి, రాయ్ ల ప్రయాణంలో నాకు వచ్చిన సందేహాలని ఆయన ముందు పెట్టేసా . సమాంతరంగా రెండు కథలను నడిపించడం ఎలా అనే రచన ప్రక్రియ గురించి కూడా అడిగాను. ఆయన అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెబుతూనే ఉన్నారు. ఈ సంభాషణల మధ్యలోనే ‘బాహుదా బతుకు కథలు’ రచయిత సుదర్శన్ గారు , కవనమాలి గారు వచ్చారు. సుదర్శన్ గారి వాక్చాతుర్యంతో చర్చలో మరింత జోష్ వచ్చింది. కవనమాలి గారి ప్రశ్నలు కథాగమనం మరియు రచయిత అంతర్లీనంగా చెప్పదలచిన విషయాల వైపు మళ్ళింది.
అభి తిరువనంతపురం ప్రయాణంలో జరిగినన్ని మలుపులు ప్రవర్ష్ గారి రచన ప్రక్రియలో కూడా ఉన్నాయనిపించింది. ఒక కథ వెనుక నాలుగేళ్ల ప్రయాణం తక్కువ సమయం కాదు కదా . ఎంత ఓర్పు సహనం ఉండాలి. ఆ ప్రయాణం, అందులో కష్టనష్టాలు, తనకు సాయం చేసిన తన మిత్రులు కుటుంబ సభ్యుల గురించి ఆయన చెప్పారు చాలా సంతోషం అనిపించింది. రాయ్ పేరుతో నిజంగానే ఓ విదేశస్థుడు తిరువనంతపురంలో ఉండేవారని ఆయన తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది .తన నవల వల్ల తన నాన్నగారి పాత మిత్రులు కలవడం ఇలా చాలా విషయాలు మాట్లాడారు.
ఈరోజు మొత్తంలో మర్చిపోలేని ఇంకో విషయం రెండు రోజులుగా ఇంస్టాగ్రామ్ లో ఆదిత్య గారు ఊరిస్తూ వచ్చిన ‘అజంత’ ఆన్లైన్ సంచిక కాస్త ముద్రించి తీసుకొచ్చి ప్రవర్ష్ గారిచే ఆవిష్కరణ చేయించారు. నేను గతంలో రాసిన ఇష్టాగోష్టి అభిప్రాయం అందులో ప్రచురించడం వలన నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.’అరచేయంత పుస్తకం – అందరికీ అందుబాటులో- అజంత -తెలుగు సాహిత్యం’ ఇదీ నా లైన్. మొదటి సంచిక పరిమిత సంఖ్యలో ముద్రించినా, త్వరలో అందరికీ అందుబాటులో తీసుకొస్తారని ఆదిత్య గారు చెప్పారు. ఆయన మరియు తెలుగు కలెక్టివ్ టీంకు మరొకసారి ధన్యవాదాలు. తెలుగు సాహిత్యంలో ఉన్న రచనా ప్రక్రియలు అన్నింటినీ సమ్మిళితం చేసి రూపొందించారు. తప్పకుండా సాహితీ ప్రియులకు చక్కనైన బహుమతి ‘అజంత’ అవుతుందని నా ప్రగాఢ విశ్వాసం.
ఆఖరున ఈ చర్చలో మళ్లీ మళ్లీ వినిపించిన పుస్తకం “అంతర్ముఖం” ఎలా అయినా చదవాలి. మళ్లీ మరో ఇష్టా గోష్టి లో తప్పకుండా పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ……
మీ సహ పాఠకుడు,
రమేష్ నాయుడు పతివాడ








