ఈ నెల సీరియల్ : మహి – కుప్పిలి పద్మ – రెండో భాగం
ఇప్పటి వరకు జరిగిన కథ:
ఉద్యోగం సంపాదించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చిన నందన, తన ఆనందాన్ని తల్లి మాధవి, అమ్మమ్మ వైదేహిలతో పంచుకుంటుంది. పదివేల జీతంతో అంతర్జాతీయ కాల్ సెంటర్లో ఉద్యోగం రావడంతో ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది, ముఖ్యంగా మనవరాలి కోసం పూజలు చేసిన వైదేహి ఆనందానికి అవధుల్లేవు. అయితే, ఆ సంతోషంతో పాటే నందన వెంటనే టూ-వీలర్, సెల్ ఫోన్ కొనమని తల్లిని అడగడం, అందుకు తల్లి మాధవి ఆర్థిక పరిస్థితులు, అవసరాల దృష్ట్యా నిరాకరించడం కనిపిస్తుంది. అమ్మమ్మ టికెట్ క్యాన్సిల్ చేసే పని విషయంలో తల్లితో బేరాలాడి, చివరికి స్నేహితుడు విక్రమ్‌కు కాస్త గొప్పలు చెప్పి సహాయం కోరడం ద్వారా తన పని నెగ్గించుకుంటుంది. తాతగారితో ఫోన్ సంభాషణ, షిరిడీ ప్రయాణ ప్రణాళిక వంటి కుటుంబ విషయాల మధ్య, నందన యువ సహజమైన ఉత్సాహం, కోరికలు, వాటిని సాధించుకోవడానికి ఆమె వేసే ఎత్తుగడలు ప్రధానంగా కనిపిస్తాయి. చివరికి, కథానాయకి మహి ప్రవేశంతో అధ్యాయం ముగుస్తుంది.
తరువాత …
ఆకుపచ్చ సల్వార్ పై తెల్లని దారంతో అద్దాలు కుట్టిన తెల్లని టాప్. యెర్రంచున్న ఆకుపచ్చ ఖాదీ చున్నీ.
విల్లులా తీర్చిదిద్ది వున్న నల్లని కనుబొమ్మల నడుమ చిన్ని చుక్కంత నల్లని స్టిక్కర్. కాటుకతో మిలమిల మెరుస్తున్న కళ్ళల్లో యెండనపడి వచ్చిన రవ్వంత అలసట.
మంచినీళ్ళు తీసుకొని తాగుతూ, “యేంటీ యింకా యిలానే వున్నావ్. రెడీ అవ్వు టైమ్ అవుతోందిగా,” అంది మహి తల్లితో.
“యివాళ వెళ్ళటం లేదు. నందూ టికెట్ కాన్సిల్ చేయటానికి వెళ్ళింది. నందూకి వుద్యోగం వచ్చింది. కాల్ సెంటర్లో జాబ్. పదివేలు జీతం. వుద్యోగం వస్తే షిర్డీ వెళ్ళాలనుకొన్నాం. మీ నాన్నగారు ఫోన్ చేస్తే షిర్డీ నుంచి వచ్చాక పంపిస్తానని చెప్పింది. పిచ్చిపిల్లకి నేనంటే యెంత అభిమానం అనుకున్నావ్. స్టేషన్కి వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్ కారులో. వాళ్ళకి మూడు కార్లు వున్నాయంట. మనింట్లో యెవరికి మొదలే యింత జీతంతో వుద్యోగాలు రాలేదు కదా. చాలా తెలివైంది. అప్పుడు మాధవికి వుద్యోగం వచ్చినప్పుడు కాసిన్ని కష్టాలు గట్టెక్కినట్టే అనుకొన్నాం. ఆ తర్వాత మీ వొక్కొక్కరికీ వుద్యోగాలు వస్తుంటే దేవుడు నే రోజూ చేసే పూజలకి మెచ్చే అందరికీ యేదో వొక దారి చూపాడనుకొని మరింతగా పూజలు చేసేదాన్ని. దేవుడు యిప్పుడు కూడా నా మొర ఆలకించే నందూకి అంత మంచి వుద్యోగం యిచ్చుంటాడు. యిందా యీ కాఫీ తాగు,” అంటూ వేడివేడి ఘుమఘుమలాడే కాఫీగ్లాసు అందిస్తూ.
“అప్పుడు వుద్యోగాలు రాగానే బాకీలు తీర్చటం, సరుకులు తెచ్చుకోవటం, యిల్లు కాస్త చక్కగా గడుస్తుంది. యింత పెద్ద సంసారాన్ని యీదొచ్చులే అనుకొనేదాన్ని. అంతా యిలానే అనుకొనేవాళ్ళం. యిప్పుడు నందూకి వుద్యోగం రాగానే చూశావా అలాంటి కష్టాలు లేవు. యెంచక్కా బండి కావాలంటుంది. సెల్ఫోన్ కావాలంటుంది. బండి, సెల్ ఫోన్ కావాలంటుంది. బండి, సెల్ఫోన్ లేకపోతే పరువు తక్కువంట. కారు లేదంటే లోకువగా చూస్తారంట. కారుందని చెప్పాలంట. యేమైనా నందూ మనం చూస్తుండ గానే కారు, సెల్ఫోన్, అపార్ట్మెంట్ కొనేస్తుంది. లక్షాధికారి అయిపోతుంది. యిదంతా అప్పట్లో అయ్యేదా… యిప్పుడు చూడు. యెంత త్వరగా అయిపోతున్నారో లక్షాధికార్లు, కోటీశ్వర్లు. యిదంతా చూస్తుంటే నిజంగానే భారత్ వెలిగిపోతుందన్నట్టే.” అన్నారు వైదేహిగారు.
కాఫీ తాగుతూ, తెల్లబోయి వింటున్న మహికి కాఫీ పాలమారింది.
“యెవరో తలచుకొంటున్నట్టున్నారు. కాసిన్ని మంచి నీళ్ళు తాగు.” అన్నారు వైదేహి.
మహి తల్లి వైపు చూసింది. పాలమారటంతో కళ్ళల్లోకి వుబికిన నీళ్ళతో చూపు స్పష్టంగా ఆనటం లేదు. విశాలమైన నుదిటిపై గుండ్రని పెద్ద కుంకుమ బొట్టు, మెరుస్తోన్న ముక్కుపుడక కాస్త కనిపిస్తున్నాయి. అమాయకమైన కళ్ళు. మహికి తల్లి అమాయకంగా కనిపించిన సందర్భాలు కొన్ని వున్నాయి. ఆమె అంతరంగంలో నిగూఢంగా వున్న ఆ అమాయకపు ఛాయచిత్రాల సరసకి యీరోజు మరొక చిత్రం చేరింది.
“వెళతా,” అంటూ మంచం మీద నుంచి లేచింది మహి. వైదేహిగారు యింకొంచెం సేపు కూర్చోమని బలవంతం చేసారు. మహికి వెళ్ళిపోవాలని వుంది. కానీ ఆమెని కాదనలేక కూర్చుంది.
“యిప్పుడు అన్ని వస్తువులకి అడ్వర్టైజ్మెంట్లే, బంగారానికి, వజ్రాలకి కూడా. వజ్రాల నగలని కొత్తకొత్త డిజైన్స్లో తయారుచేసి అమ్ముతున్నారని పెద్దపెద్ద బోర్డు, చిన్ని వుంగరం యెంతుంటుందంటావ్,” అడిగారు వైదేహి.
“ఐడియా లేదమ్మా.” అంది మహి.
“యెంత బంగారం వుండేది నా దగ్గర. అంతా కర్పూరంలా కరిగిపోయిం దనుకో. మీ అమ్మమ్మ వడ్డాణంతో సహా నా పెళ్ళికి అన్ని నగలూ చేయించింది. యిప్పుడు యీ నానుతాడు తప్ప యింకేం లేకుండా అయిపోయాయి.” అన్నారు వైదేహి.
మహి తల్లి మెడవైపు, చేతుల వైపు చూసింది. మెడలో పాత నానుతాడు. చేతుల నిండా మట్టిగాజులున్నాయి. వంగపువ్వు రంగు నేత చీర, అదే రంగు జాకెట్టు, తెలుపు నలుపు కలగలిసిన తలస్నానపు మెరుపుతో వున్న జుట్టుకి జారుముడి.
చాలా నగలతో వున్న అమ్మ ఫోటోలు ఆల్బమ్మ్ లో వున్నాయి. మెల్లమెల్లగా ఆ నగలు తరుగుతూ రావటం మహికి బానే గుర్తుంది. యెవరికి యే అవసరం వచ్చినా అమ్మ నగలు బయటికి నడవటం మహికి తెలుసు. వైదేహిగారు నగల విషయం ప్రత్యేకంగా మహితో మాట్లాడటం యిదే మొదటిసారి. యింట్లో యింకెవరితోనైనా ఆవిడ యీ విషయాలు మాట్లా డారా లేదా అనే ఆలోచనలేం మహికి రాలేదు. యిప్పుడెందుకు మాట్లాడు తున్నారని మహి ఆలోచిస్తుండగా తూనీగలా పరిగెత్తుతూ యింట్లోకి వచ్చింది. నందన,
“అమ్మమ్మ… రారా త్వరగా. విక్రమ్ గుడి దగ్గర డ్రాప్ చేస్తానన్నాడు.” హడావిడిగా అంది.
“అతనేడి?” అడిగారు వైదేహి.
“కింద కారులో వున్నాడు.”
“పైకి రమ్మను.”
“అయ్యో అమ్మమ్మ… పైకి వస్తే యింకేమైనా వుందా? మన యిల్లేం బాగోదు. చాలా బిల్డప్‌లు ఇచ్చాను. మన బండారం బయటపడిపోద్ది,” అంటుండగా. మహిని గమనించి, “హాయ్ పిన్నీ.” అంది నందన.
మహి చూపులు గదిలో తిరిగాయి.
మంచానికి వో పక్కగా రెండు గ్రే కలర్ యినుప బీరువాలు. మరో గోడవైపు డ్రెస్సింగ్ టేబుల్. గోడకున్న కప్ బోర్డులో చెల్లాచెదురుగా పుస్తకాలు, న్యూస్ పేపర్స్. కిటికీలకి కాస్త కిందుగా జారుతోన్న పూలపూల నైలాన్ కర్టెన్స్. పైన తిరుగుతోన్న ఫ్యాన్. టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఆరేడేళ్ళ క్రితం కట్టింది. మరో గది మాధవిది. ఆ గదిలో కూడా రెండు యినుప బీరువాలు, మంచం, కూలర్, కుట్టుమిషన్ వున్నాయి. హాల్లో పెద్ద డైనింగ్ టేబుల్. అరడజను ప్లాస్టిక్ కుర్చీలు, పెద్ద కూలర్. ఫ్రిజ్, టి.వి., గాజు సామాను పెట్టుకొనే బీరువా, రంగురంగుల కర్టెన్స్. యింట్ల యే గోడ మీద పెద్దగా ఖాళీ వుండదు.
దేవుళ్ళ పటాలు, క్యాలెండర్స్ నిండిపోయి వుంటాయి. దాదాపు అవన్నీ బట్టల దుకాణం వాళ్ళిచ్చినవే. మొజాయిక్ ఫ్లోరింగ్ లేత గులాబిరంగు గోడలు. వంటగది నిండా స్టీల్, గాజు సామాను. నెలకి సరిపడా వెచ్చాలు. వో పక్క పూజా మందిరం.
యింట్లో అన్ని సామాన్లూ వున్నాయి. కాస్త ఆర్గనైజ్ చేస్తే నీట్ గా వుంటుంది. కానీ అంత ఆసక్తి, వోపిక యింట్లో యెవరికీ లేవు.
“మన యింటికేం పెద్దగా వుంది. సామానంతా వున్నాయి.” అన్నారు వైదేహి.
“మార్బుల్ ఫ్లోరింగ్, నున్నగా మెరిసే గోడలు, యేసీ, హోం థియేటర్ యిలా అన్నీ వున్నాయేంటీ. రారా త్వరగా,” అంటూ అద్దంలో చూసుకొని జుట్టు సరిచేసుకొని ముఖానికి కాస్త ఫౌండేషన్ క్రీమ్ రాసుకొంటూ, “మమ్మీ, యింకా నిద్రపోతుందా.” అడిగింది నందన.
“యేం తల్లీ కాన్సిల్ చేసుకొచ్చావా?” అంటూ టీ కప్పులున్న ట్రేతో గదిలోకి వచ్చింది మాధవి.
“మమ్మీ… వాటర్,” అంది.
“పోయి తీసుకో.”
“యెండలో కష్టపడి వచ్చాను. ఆ మాత్రం యివ్వలేవా?” దబాయింపుగా అడిగింది నందన.
“నోరు పెట్టుకొని బతికేస్తున్నావ్,” అంటూ నీళ్ళు తెచ్చి యిచ్చింది మాధవి.
మహి చిరునవ్వుతో వాళ్ళిద్దర్నీ చూస్తోంది.
“వుద్యోగం వచ్చింది. యింకా ఆర్డర్ యివ్వలేదు.” చెప్పింది మాధవి మహితో.
“కంగ్రాట్స్,” అంది మహి.
“థ్యాంక్స్ పిన్నీ.” అంది నందన.
మెరూన్ అంచున్న బంతిపువ్వు రంగున్న వెంకటగిరి చీర కట్టుకొచ్చారు. వైదేహి.
“పద వెళదాం. మాధవీ రావా?” అడిగారు.
“మీరు వెళ్ళి రండి. వాళ్ళ నాన్న వచ్చాక పక్క వీధిలో గుడికి వెళ్ళాస్తాం.” అంది మాధవి.
“యేయ్… యెవరా విక్రమ్ ?! యింతకు ముందెప్పుడూ చెప్పలేదుగా.” అడిగింది మాధవి.
“యీ యింటర్వ్యూకి లావణ్యని వచ్చిందని చెప్పాను కదా. తనని రోజూ దింపేవాడు. అలా పరిచయం. యెం.బి.యే. చేశాడు. స్టేట్స్ వెళ్ళిపోతాడంట. అక్కడ యెం.యెస్. చూస్తాడంట. ప్రస్తుతం పనేం లేదు. యింట్లో బాగా పాకెట్మనీ యిస్తారు. చేతిలో కారుంది. యిదిగో యిలా టైమ్ కి లిఫ్ట్ యిస్తుంటాడు.” అంది నందన.
“మంచి డ్రైవర్ వుద్యోగమన్నమాట.” అంది మాధవి.
“నే వెళతా.” అని తల్లికి, నందనకి చెప్పి మహి బయటికి వచ్చింది.
సప్తమి చంద్రుని లేత వెలుగు బాల్కనీలో నిండిపోయింది.
“బయట లైట్ వెయ్యి, అంది మాధవి.
నందన వేసింది.
లేత వెన్నెల వెలుగు మాయమైపోయింది. అలా లైట్ వేయకుండా వుండాల్సిందే అనుకొంది మహి.
“పిన్నీ వొక్క నిమిషం. మేం వెళ్ళిపోయాక వెళ్ళు. కింద విక్రమ్ వున్నాడు.” అంది నందన.
“అతనుంటే తనెళ్ళడానికేం.” అడిగారు వైదేహి,
“యిప్పుడు యిలా వెళ్ళింది యెవరని విక్రమ్ అడిగితే?” అంది నందన.
“అపార్ట్ మెంట్ యెవరో నొకరు వెళుతూనే వుంటారు కదా! నిన్ను యెందుకు అడుగుతాడు.” అడిగింది మాధవి.
“అడిగినా పిన్ని అని చెప్పొచ్చుగా.” అన్నారు వైదేహి.
“అలా చెపితే యేం చేస్తారు? పెళ్ళయిందా? యిలా అన్నీ అడుగుతారు కదా! యేం చెబుతాం. మనం వెళ్ళిపోయాక వెళితే ఆ టాపిక్కే రాదు కదా.” అంది నందన.
నందన మాటలకి మహి యేమనుకుంటుందోనని కాస్త కంగారుపడుతూ మహి వైపు చూసింది మాధవి.
మహి తలెత్తి పల్చగా పరుచుకొన్న తారల నడుమ వెలుగుతోన్న ఫాల్గుణ సప్తమీ చంద్రుణ్ణి చూస్తోంది.
‘యీ క్రిక్కిరిసిన జనావాసాల నడుమ యీ అర్ధచంద్రుని వెన్నెల నేలపై కనిపించనే కనిపించదు. అనుకొంది మహి.
నందన మాటలు మహి విందేమోననే చిన్న సందేహం మాధవిలో, విన లేదేమో అనుకొందో క్షణం. వినీ యేం మాట్లాడలేదేమోననుకొంది మరో క్షణం. నందన బండీ, సెల్ఫోన్ కావాలంటుంది. మహిని డబ్బులు అడగాలసుకొంటే నందన చప్పున నోరు జారింది. మహిని కాసేపుంచి ఆ మాట యీ మాట మాట్లాడి మంచి కబుర్లు చెప్పి ఆరోజుకి సంభాషణని పూర్తి చేస్తే బాగుంటుందనుకొంది మాధవి, మహిని యెలా ఆపాలనుకొంటుంటే ‘హలో.’ అంటూ భాస్కర్ వచ్చాడు.
నల్ల ప్యాంట్, యిన్ చేసిన మెరూన్ కలర్ చొక్కా నల్ల షూస్, వో చేతికి బంగారు బ్రేస్లేట్, చేతివేళ్ళకి రాళ్ళ వుంగరం, బంగారు రంగు చెయిన్ వాచ్ వో చేతిలో లెదర్ బ్యాగ్, మరో చేతిలో తెల్ల కవర్ ఆయాసాన్ని ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ, “వెళ్ళిపోతున్నావా? రారా… వేడివేడి మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చా. రా, తిని మాంచి అల్లం చాయ్ తాగి వెళుదువు.” అన్నాడు భాస్కర్.
“చాలా సేపయిందొచ్చి, యిప్పుడు మళ్ళీ టీనా… పనుంది వెళతాను.” అంది మహి.
“పర్లేదు. కాసేపుండు. భాస్కర్ వాళ్ళ ఆఫీసు దగ్గర్లో బండి మీద వేస్తారు. బజ్జీలు, బాగుటాయి రా.” అంది మాధవి.
“మిరపకాయ బజ్జీలు తినను కదా.” అంది మహి.
మిరపకాయ చుట్టూ వున్న పిండిని తిని మిరపకాయ వదిలేస్తుంది మహి. అంత మాత్రానికి మిరపకాయ బజ్జి తినటం యెందుకు, మిరపకాయ తింటేనే మజా అనేవారంతా.
“అంత కారంగా వుండవ్, వొక్కసారి రుచి చూసావంటే వదలవు. సాయం కాలం నాలుగు గంటల నుంచి యేడు వరకు బండి పెడతాడు. బస్… యేడైతే వొక్క బజ్జి కూడా యివ్వడు. కిటకిటలాడుతుందక్కడ. మిరపకాయ చీల్చి అందులో పెట్టే చింతపండు ముద్ద… వుఫ్… తలచుకొంటేనే చూడు నోట్లోకి నీళ్ళెలా వస్తున్నాయో.” భాస్కర్కి యెలాగైనే వాటి రుచిని మహికి చూపించాలని వుంది. యింకా తిననంటే భాస్కర్ ఆ మిరపకాయలని యెక్క డ్నుంచి తెస్తారో, ఆ సెనగపిండి యెక్కడ ఆడించారో, యిలా వాటిపై గంటలు గంటలు వుపన్యసిస్తాడేమోననిపించి మహి చెప్పులు విప్పి యింట్లోకి వచ్చింది.
“అత్తయ్యని స్టేషన్కి యెవరు డ్రాప్ చేశారు,” అడిగాడు భాస్కర్.
“అమ్మ వెళ్ళలేదు. నందనకి వుద్యోగం వచ్చింది. షిర్డీ వెళ్ళొచ్చాక వస్తుందని నాన్నగారికి చెప్పాం.” అంది మాధవి.
“పుద్యోగం వచ్చిందని తెలియగానే పోన్ చేయొచ్చుగా, స్వీట్స్ తెచ్చేవాడిని,” అన్నాడు భాస్కర్.
“స్వీట్స్ కాదు, నందూకి బండి, సెల్ఫోన్ కావాలంట.” అంది మాధవి.
“సెల్ఫాన్ యెందుకు? అయినా జీతం వస్తుందిగా కొనుక్కోమను.” అన్నాడు భాస్కర్.
“టీ పెట్టు.” అంది మాధవి,
భాస్కర్ టీ చేసి కప్పుల్లో పోసి తీసుకొచ్చాడు.
“కప్పులు బాగున్నాయా,” మహిని అడిగాడు భాస్కర్.
కప్పుల వైపు చూసింది. ముదురు నీలంరంగుపై బంగారురంగులో లతలు ధగధగా మెరుస్తున్నాయి. తన యింటికి కప్పులు కొనాల్సి వస్తే యీ కప్పులు ఆమె ఛాయిస్ కాదు. కాని, అతను యిష్టపడి కొనుక్కొన్నవి నచ్చలేదని చెప్పాలనిపించలేదామెక్.
“బాగున్నాయి.” అంది. టీ సిప్ చేసింది.
“టీ బాగుంది. థ్యాంక్స్.” చెప్పింది మహి.
“నందూకు బండి, సెల్ఫోన్ కావాలంట. యేం చేద్దాం?” అడిగింది మాధవి.
“నా దగ్గర అన్ని డబ్బులు యిప్పుడెక్కడున్నాయి. వాళ్ళ పిన్నమ్మ కొని పెడుతుందిలే. వొక్కర్తీ ఆ జీతమంతా యేం చేసుకుంటుంది. యేం మహీ నందూకి కొనవా?” నవ్వుతూ అడిగాడు భాస్కర్.
భాస్కర్ వైపు మెచ్చుకోలుగా చూసింది మాధవి. యీ టాపిక్ ని భాస్కర్ యింత సింపుల్ అడిగేస్తాడని మాధవి వూహించలేదు. యిద్దరూ మహి వైపు ఆత్రంగా చూస్తున్నారు.
యిప్పుడే వుద్యోగం వచ్చిన నందూకి అన్ని అమర్చి పంపాలని మాధవి, భాస్కర్ అనుకొంటున్నారు. అవన్నీ కావాలని నందూకి వుంది. వాటి అవసరం యెంత? అవి కొనే తాహతు వుందా? యివేం ఆలోచించటం లేదు. యెలాగోలా వాటిని సమకూర్చుకోవాలనుకుంటున్నారు. యివ్వాలని అడుగుతున్నారు. యిన్నేళ్ళలో తను మాధవికి డబ్బులు యిచ్చింది. యెలాంటి ఖర్చులకి యిచ్చింది. మాధవి ఆ విషయాలపై ఆలోచించదేమో. ఆలోచిస్తే తెలిసుండేది. పిల్లల స్కూల్ ఫీజులకి, పుస్తకాలకి, ఆసుపత్రి ఖర్చులకి, యెక్స్కర్షన్స్ కి వెళుతున్నప్పుడు, పుట్టినరోజులకి, బట్టలకి, కంప్యూటర్ కావాలన్నప్పుడు, యిలాంటి వాటికి తను యిస్తూనే వుంది. డిగ్రీలో వున్నప్పుడే సెల్ కావాలని నందూ పేచీ పెట్టింది. తను యివ్వలేదు. చదువుకొనే పిల్లలకి సెల్ఫోన్ అవసరం యేం వుంటుంది అనే ఆలోచన మాధవికి రాదు. అందరూ వాడుతున్నారు. మనకీ కావాలనుకొంటారు. కానీ అది నిజంగా అవసరమా అనే యోచనే వుండదు.
“హాయ్ పిన్నీ! నేనీరోజు మూడు సిక్స్లు కొట్టాను.” చమటతో తడిసిపోయి నలిగిపోయిన బట్టలు, చేతిలో క్రికెట్ కిట్తో లోపలికి వచ్చిన కార్తీక్ చెప్పాడు.
“యెప్పుడూ ఆటే. చెల్లాయిని చూడు, యెంచక్కా వుద్యోగం తెచ్చుకొంది. పొ, పోయి ఆ గుడ్డలు మార్చుకురా.” అంది మాధవి.
“ఆఁ… వాడు యిండియన్ టీంకి లీడర్ అయినప్పుడు నా కొడుకు, నా కొడుకు అని చెపుతావులే.” అన్నాడు భాస్కర్.
“ఆఁ… మీ తండ్రీకొడుకులిద్దరూ ఆ కలలు కనాలి.” నవ్వుతూ అంది మాధవి.
కార్తీక్ చిన్నబుచ్చుకొని లోపలికి వెళ్ళిపోతోంటే, “అటుపక్క టీమ్ లో యెవరూ సిక్స్ కొట్టలేదా.” అడిగింది మహి.
“సిక్స్”… వొక్క ఫోర్ కూడా కొట్టలేదు పిన్నీ.” హుషారుగా చెప్పాడు కార్తీక్.
“రోజూ వుదయం ప్రాక్టీసికి వెళుతున్నావా?” అడిగింది మహి.
“రోజూ, వొక్కరోజు కూడా మానకుండా.” అన్నాడు కార్తీక్.
“ఆటకైతే రెడీ, ట్యూషన్కి వెళ్ళమంటే వెళ్ళేవాడే కాదు. అత్తెసరు మార్కులు. యిరవై యేళ్ళు దాటాయి. యింకా తన ముద్దుల కొడుక్కి యిండియన్ టీంలోకి పిలిచి బ్యాట్ యిస్తారని అనుకొంటుంటాడీ భాస్కర్.” నవ్వుతూ వెక్కిరింతగా అంది మాధవి.
కార్తీక్ ముఖంలో నవ్వు మాయమైంది. ముఖం ముడుచుకొని యింట్లోకి వెళ్ళిపోయాడు.
“యెందుకు వాడినంటావ్. యీ యింట్లో అందరికంటే వాడే యెక్కువ సంపాదిస్తాడు చూస్తుండు.” అన్నాడు భాస్కర్.
“వాడి గోలకేం కానీ, గుడికి వెళ్ళాలి రెడీకా.” అంది మాధవి.
“మహీ… ఆ… గుళ్ళకి రాదు కదా.” అన్నాడు భాస్కర్.
వాళ్ళు గుడికి వెళ్ళటానికి రెడీ అవుతుంటే మహి యింటికి బయలుదేరింది.








