కొత్త కథ : కప్పలోని బావులు – మెట్ల

కప్పలోని బావులు

– మెట్ల

రోడ్డు, మేకల మంద నడిచి వెళ్ళిన వాసన వస్తుంది. రాయడానికి ఇబ్బందిగా వుండే పదార్థాలు రోడ్డు మధ్యలోనూ రోడ్డుకి ఇరువైపులానూ జల్లబడి, ఆ టెరిటరీలో సువాసనపై ఆధిపత్యం కోసం యుద్ధం చేస్తున్నాయి. మనుషులవి రోడ్డు వారగా రెండు బార్ల దూరాల్లో ట్యాంకర్లలా మోహరించాయి. మేకలవి, గొర్రెలవి నాయకుడు లేని సేనల్లా రోడ్డు మీద చెల్లాచెదురుగా పడి వున్నాయి. బోణిగాడు, భద్రరావు ముక్కులు మూసుకుని మేకల్ని, వాటిని తోలుకెళ్లిన వాళ్ళని మాత్రం తిట్టుకుంటూ నడుస్తున్నారు. భద్దర్రావు మూడో క్లాసు, బోణి నాలుగు. అన్నదమ్ముల బిడ్డలు. వాళ్ళు ఆ దారిలో ఇదివరకు ఎప్పుడూ ఒంటరిగా వెళ్లలేదు. బోణిగాడికి వాళ్ళ తాత “రేయ్ బోణీ రోడ్డెర నడొద్దురోయ్ నిప్పులుంటాయ్” అన్న మాటలు గుర్తొచ్చాయి. భద్దర్రావుతో ఆ మాట చెప్పి రోడ్డు మధ్యలోనే తొక్కుడుబిళ్ళ ఆడుతున్నట్టు గెంతుతూ నడుస్తున్నారు. వాళ్ళ నడకలో హుషారు ఉట్టిపడుతోంది.
“రేయ్ బద్ధా!, పొద్దున్న అంజినేసామి బిళ్ళ పడిపోయిందన్నావ్ దొరికిందా?.”
“అదా! ఎండిదే కదా పర్లేదన్నాడు మా నాన్న, నానమ్మకి చెప్పొద్దన్నాడు.”
“రేయ్ బద్ధా, నానమ్మకి తెలిత్తే, కాళ్ళు ఇరగ్గొట్టేత్తాదిరా. జాగర్త!”
“ఎహే ఏం కాదు! నువ్వూరికే వర్రీ అవ్వకు.”
“మన దిబ్బ మీద ఆడుకుంటే వట్టమా ఇప్పుడు. ఫస్టు బేటింగు నువ్వే తీసుకో. ఈరో సెంటరు దాటి ఇటేపుకొస్తే నానమ్మ వూరుకోదురా బాబు. కాళ్ళు ఇదగ్గొట్టేత్తాది.”
“రోజూ మనిద్దరమే ఏం ఆడుకుంటాం రా బాబు. నీ బోలింగు అడి అడి సిరాకొచ్చేసింది నాకు.పెహాదు గాడు సూపరేత్తానని యికేట్లు ఇరిగిపోతాయని చెప్తున్నాడు మొన్న క్లాసులో. అడెంత మొగోడో చూద్దాం ఈరోజు.”
“ఆడొత్తి సోల్లు పకోడీ గాడ్రా బాబు అడికనలు చెయ్యి తిప్పడమే రాదు. ఇసిరి దొబ్బుతాడు. అడి మాటలిని నీకు దూలెక్కి నన్ను తీసుకొచ్చావ్.”
“నీకొచ్చేంట్రా పెద్ద… నువ్వు రానంటే బూతులు మాట్లాడుతున్నావని నానమ్మ కి చెప్పేత్తా.”
“చెప్పుకుంటే చెప్పుకో చెప్పిచ్చుకుని కొట్టుకో!!”
“నిజంగా చెప్పేత్తాను చూసుకో మరి.”
“అయినా తాతయ్యే, నానమ్మని బోల్డు బూతులు తిడతాడు. నాకు తాతయ్యే నేర్పించాడు. ఏం పర్లేదు చెప్పుకో”
“ఉరేయ్ మచ్చిపోయాను! తాతయ్యకి మజ్ఞానం టిపినికర్ర ఇచ్చిరావాలని చెప్పింది మాయమ్మ.
ఏవంటాదో ఇప్పుడు ఇంటికెళ్లాక.”
“అమ్మయ్య! సడైతే. ఇంటికెళ్లిపోదాం.”
“అల్రెడీ సగం పైనే వచ్చేశాం. ఏం పర్లేదు లే. ఓ పూట టీ తాగాపోతే తాతయ్యేమీ సచ్చిపోడు.”
“మీయ్యమ్మ ఊరుకుంటాదా మరి!?”
“ఆ… రెండు తిడతాది. నాన్నకి చెప్పి కొట్టమంటాది. అయినా మొన్న మా నాన్నని తాతయ్యకి టీ పొడుం తెమ్మంటే, ఇలాగే ఓ పూట టీ తాగాపోతే ఏమీ సచ్చిపోడని చెప్పి రెండ్రోజులుకి పట్టుకొచ్చాడు.”
“ఇంతకీ మనమొత్తనట్టు ఆ పెహాదు గాడికి చెప్పావా?”
“అడెక్కడికీ ఎల్లడంట ఆదోరాలు కూడా. ఈడి ఫ్రెండ్స్ అందరూ కూటంకి ఎల్లిపోతారు అంట. ఈళ్ళు ఎల్లరంట, అల్లమ్మానాన్నా కొయిటాలో వుంటారు. ఆళ్ళ తాతయ్య పంలోకెళ్లిపోతాడు. నానమ్మేమో ఇంట్లోనే వుంటాదంట. ఒంట్లో బాగోదేమో మరి. చెప్పలేదాడు.”
“మన నానమ్మ కూడా ఇంట్లోనే వుంటాది కదా. నానమ్మకేం దొమ్మ.”
“ఆళ్ళు పంలోకెళ్తారు చూళ్ళేదా ఎప్పుడూ. మనింటికి వత్తారు కదా సత్తెమ్మ, సూరమ్మ ఆళ్లు ఆళ్లే. మరిడమ్మ అని ఇంకొకత్తి కూడా వచ్చేదంట. దొంగదని చెప్పి మానిపించేసారంట.”
“మాయమ్మ నానమ్మని కూడా దొంగదని తిడతాది అప్పుడప్పుడు.”
తలా తోకా లేకుండా మాట్లాడతాడ్రా నువ్వు.”
“అది ఉత్తరంగా.”
“యిప్పావులే. అమ్మయ్య ఈరో సెంటరు కూడా దాటేశామ్. ఇంక పెహాదు గాడి ఇల్లు వచ్చేసినట్టే!!”
“ఒరేయ్ బద్ధా. దీనికి ఈరో సెంటరు అని ఎందుకంటార్రా?”
“సిరంజీవి ఇక్కడే ఈ చెట్టు కిందే పుట్టాడంట. అప్పుడు నుంచీ ఈరో సెంటరని పిలిచేత్తన్నారు.”
“నిజమా!! సిరంజీవిది మానూరా- సొల్లు చెప్పుకు!!”
“నిజం. నీమీదొట్టు. రోజూ రాత్రొచ్చి ఈ చెట్టు కింద పొడుకుని పొద్దున్నే మళ్ళీ ఈటీవీ లోకి ఎల్లిపోతాడు.”
“నమ్మేసాంలే. ఒట్టు తీసి గొట్టు మీద పెట్టేసి పెహాదు గాడి ఇల్లు ఎలా తెలుత్తాదో మనకి అది చెప్పు.”
“ఇంటి బయట నుయ్యి వుండి పక్కన పోతు బొబ్బాసికాయ చెట్టు వుంటాదంట.”
“అదిగో అదే అయితే!”
“బలే చూసేశావ్ రా! మియ్యమ్మ చీమలు పెట్టేత్తున్నట్టుంది నీకు…”
“పెహాదూ!! రేయ్ పెహాదూ!! వున్నావా. రేయ్ పెహాదూ..!”
“ఆడు ఇంట్లో లేనట్టున్నాడ్రా బద్ధా!! తలుపు కొట్టి చూడు.”
“తలుపు ధబ్, గొళ్ళెం గణ్. తలుపు రబ్. గొళ్ళెం గణ్.”
“ఎక్కడికీ ఎల్లడన్నావ్!? మరి ఆళ్ళ నాసమ్మ ఏమో పంలోకెళ్లాడు అంటంది. బోల్డు దూరం
నడిపించావ్. నడు ఇంక ఇంటికెళ్లిపోదాం. నువ్వు తాతయ్యకి టిపినికర్ర పట్టుకెళ్లు నేను చింత పిక్కలు నూరిపెట్టేత్తాను. వచ్చాక ఆడుకుందాం.”
“రేపు బళ్ళో చెప్తాం ఈడి పని. నదు నూతి లో కొన్ని నీళ్ళు తాగి ఎళ్లిపోదాం.”
“ఇంకేదో అడుగుతుందేంటి ఆళ్ళ నానమ్మ?”
“ఎవరి తాలూకా అని అడిగింది కాపోళ్లమని చెప్పి తాతయ్య పేరు చెప్పేను. అంతే. లెక్కల మేస్టారు గాడి లాగా అన్నీ కొచ్చిన్లే నీకు. ఆ చేద ఇలా ఇవ్వి, నీళ్ళు తోడతాను. బుడంకాయిగే!”
భద్దర్రావు చేదని చేత్తో పట్టుకుని తాడు పైకి లాగాడు. తాడు ముడి పట్టుకుని చేద నూతిలోకి వదిలాడు. చేద అడుగు భాగం కూడా నీటిని తాకలేదు. చెయ్యి చాచి నుయ్యిలోకి పెట్టాడు. చేద కొంచెం మునిగింది కానీ, ముట్టు పైకే తేలుతుంది. నీళ్ళు చేద లోపలికి వెళ్ళట్లేదు.
“ఇప్పుడు చూడు.”, అని భద్రరావు మడమ కొంచెం ఎత్తి బొటన వేలి మీద నిలబడ్డాడు. ఊపుగా చెయ్యి నూతి లోపలికి విసిరాడు. నూతి పళ్ళెం మీద నాచుకి ఆ బొటకణేలు సర్రున జారితే భద్దర్రావు డుబుక్కున నూతిలో పడి బుడుంగున మునిగాడు.
“భలే దూకావ్రా. సూపరో సూపరు. పైకొచ్చి మళ్లీ దూకు.. నువ్వేరా మానూరికి ఈరో” అంటూ పైన బోణి చప్పట్లు కొడుతూ గెంతులేస్తున్నాడు.
భద్దర్రావు ఏం చేసినా బోణికి ముచ్చటే. భద్దర్రావుకి వుండే ధైర్యం బోణికి వుండదు అందుకే భద్దర్రావు చేసేవి తానే చేసినట్టు మురిసిపోతాడు.
లోపల నుండి భద్దర్రావు ఇరిగిపోయిన నూతి వొడ లోకి చేతులు దూర్చి అది పట్టుకుని వేళ్ళాడుతూ “అమ్మోయి… బాబోయి” అంటున్నాడు. పెద్ద పెద్దగా కేకలేస్తున్నాడు. దెబ్బకి భయపడ్డ బోణి, పరిగెత్తుకెళ్ళి ప్రసాదు ఇంటి తలుపులు బాదడం మొదలు పెట్టాడు. వాళ్ళ నానమ్మ వచ్చి తలుపు తీసింది. నూతిలో నుండి కేకలు వినిపించేసరికి, వెంటనే తలుపుకి జారేసిన క్లచ్చు చంకలో పెట్టుకుని తన శక్తికి మించిన వేగంతో ఊరుకుతూ వెళ్ళింది. లోపల భద్దర్రావు నూతి వొరకు వేళ్ళాడుతూ కనిపించాడు. ‘ఏసేబు, సామూయేలు’ అంటూ కేకలేసింది. ఎవ్వరూ లేరు. ఎవ్వరూ పలకలేదు. చుట్టూ చూసింది ఏమీ లేవు. లోపల భద్దర్రావుకి ముక్కులోకి నీళ్ళు వెళ్లిపోతున్నాయి. బోణి నూతి పళ్ళెం మీద కూర్చుని ఏడుస్తున్నాడు. ఇంక వేరే దారేమీ కనిపించలేదు. ఆ క్లచ్చు పక్కకి విసిరేసి నూతికి మక్కెలు అన్చి రెప్పపాటులో వొంటి మీద చీర విప్పేసింది. లంగాకి ఉన్న చిల్లులు, హుక్సు ఊడిపోయిన కాజాలు పట్టించుకోలేదు. ఆ చీర వెంటనే లోపలికి వేసి శక్తినంతా కూడదీసుకుని పైకి లాగింది. భద్దర్రావు స్పృహలోనే వున్నాడు. సూతికి జారబెట్టి కూర్చోబెట్టింది. తమాయించుకున్నాడు. గబగబా చీరని తిరిగి చుట్టుకుంది. ఏమైందని అడిగితే ఏమీ చెప్పకుండా జజ్ఞుకుడుములా పడి వున్నారు ఇద్దరూ. రుమాలు తెస్తానని చెప్పి ఆవిడ లోపలికి వెళ్తే వీళ్ళు భయపడి అక్కడ నుండి జారుకున్నారు.
“రేయ్ బడ్డా ఏం చేద్దాం రా ఇప్పుడు. ఇంట్లో ఏమని చెప్తావ్”
“ఏం పర్లేదు ఇలా రంగా దిమ్మ మీద కొంచేపు నిలబడితే ఎండకి బట్టలు ఆరిపోతాయ్. ఇంట్లో సువ్వేం చెప్పకు నేనేం చెప్పను.”
అలాగే ఎండబెట్టుకుని ఇంటికి వెళ్లిపోయారు. భద్దర్రావు టిపిణీకర్ర పట్టుకుని పొలం వెళ్ళాడు. బోణి చింతపిక్కలు అరగదీశాడు. ఇద్దరూ ఆడుకున్నారు. ఆరింటికే భోజనాలు చేశారు. అమ్మయ్య ఎవరికి దొరకలేదు అనుకున్నారు. కొంచేపు రెడ్ రేంజరు నేనంటే నేనని కొట్టుకున్నారు. తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు దూరిపోయారు. బయట నుండి కిట్టతాత “సుభద్రమ్మో, సుభద్రమ్మా” అని ఎప్పుడు అరిచేలాగానే కేకలేసి పిలిచాడు.
“సుభద్రా ఎలా వుండే నీ మనవడికి, నజ్జు చేసే వుంటాది. జడుసుకుని వుంటాడు పాపం ఉప్పు కల్లు నాలుగు మిరపకాయలు దిగదూడ్చి పొయ్యిలో పడెయ్యండి.”
“ముక్కుపొడుం ఏమైనా పీల్చుకొచ్చావా కిట్టన్నయ్యా ఏం మాట్లాడతన్నావ్?”
“మన భద్దర్రావు మాలోళ్ల ఇంటి దగ్గర నుయ్యిలో పడిపోయాడంట కదా. సెంటర్లో చెప్పుకుంటుంటే యిని చూసెల్దామనొచ్చాను.”
“అవునా!!, మాకసలు చెప్పలేదన్నయ్యా. పిల్లోళ్లు ఇద్దరూ తినేసి కుక్కిన పేనుల్లా పడుకుండిపోయారు.
కూడాను. మాదచ్చోదులు. ఆళ్ళమ్మల పోలికలే ఇద్దరియ్యీని. ఎధవ సట్రాలు”
“భయపడుంటారు. పొద్దున్నే చూద్దుగానే, పడుకోండి ఇంక నేనొస్తాను.”
“ఆ తలతోనే మంచమెక్కేసాడా ఆడు. అడి పని నేను చెప్తాన్లే నువ్వెళ్ళిరా అన్నయ్యా.”
“ఆ మరిదమ్మని కేలేసి బియ్యం ఏమైనా ఇచ్చి పంపు. ఒంటి మీద చీర ఇప్పి మరీ, పైకి లాగిందంట మనోడ్ని” అంటూ వెళ్ళిపోయాడు.
నిద్ర మత్తులో వున్న భద్దర్రావుని ఒక రెక్క పట్టుకుని ఈడ్చుకొచ్చి పంపు దగ్గర నిలబెట్టింది.
“ఆళ్ళ నుయ్యిలో నీళ్ళు తాగొచ్చని ఎవరు చెప్పార్రా మీకు. అయినా ఈరో సెంటరు దాకా పనేంటి
నిక్కరు బెత్తాలు విప్పుతూ గదుముతుంది. భద్దర్రావు మత్తులోనే బిత్తరపోయి చూస్తున్నాడు.
“బళ్ళో పంతులుకి చెప్పాలి ముందు ఎవరికాళ్ళని కుచ్చోబెట్టాలని. ఏలెడంత లేరు ఈ ఎధవలకి పెండ్సు కావాలసొచ్చారు పెండ్సు!!.”
చొక్కా బెత్తాలు ఇప్పింది.
“అంజినేసామి బిళ్ళ ఏదిరా. నిన్నే అడుగుతుంటా!?”
“అడుకుంటుంటే పడిపోయింది.” ఏడుస్తూనే చెప్పాడు.
“దానంతట అదే ఎలా పడిపోద్దిరా మెళ్ళో వున్నది?”
బోరున ఏడుస్తున్నాడు భద్దర్రావు
“నిన్ను పైకి లాగినప్పుడు అదే దొబ్బేసి వుంటాది దొంగలంజ. రోకలితో ఒక కాలు ఇరగ్గొడితే
సరిపోలేదు దానికి. రేపు పిలిపించి రెండోదీ ఇరగ్గొడితే లైన్లోకొత్తాది. రేపు చెప్తాను దాని పని!” తల అంటేసింది.
“పో లోపలికి. మియ్యమ్మని మంచం మీద దుప్పటి మార్చి ఇల్లంతా పసుపు నీళ్ళు జల్లమను!!”

రచయిత గురించి :

నా పేరు మెట్ల. గోదావరి జిల్లాల్లో పుట్టి పెరిగాను. సొంతూరు లేదు. ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కూలీగా పనిచేస్తున్నా. ఈ మధ్యే “తిమ్మిరిబిళ్ళలు-తొడపాశాలు” అనే జువ్వల పుస్తకాన్ని శరత్తు, నేనూ కలిసి తీసుకొచ్చాం. ఆయ్!

error: Content is protected !!