ఇష్ట కవిత్వం

కుందుర్తి – వచన కవితాతత్త్వం
‘పాతకాలం పద్యమైతే
వర్తమానం వచన గేయం’
వచన కవితను చేపట్టిన ఇతర కవులు దానిని ఒక ప్రయోగంగా మాత్రమే భావించిన సమయంలో దానిని ప్రజల అభ్యున్నతికి ఉపకరించే ప్రయోజనాత్మక కవితా ప్రక్రియగా గుర్తించిన గుండె పలికించిన ‘నాదమిది. వచన కవితకు తీవ్రమైన వ్యతిరేకత ఉన్న కాలంలో దానికి ప్రజామోదం కలిగించే బాధ్యతను స్వీకరించినవాడు ఆ ‘నాద’ కర్త కుందుర్తి.
కుందుర్తి సాహిత్య ప్రస్థానాన్ని పరిశీలిస్తే తొలి దశలో ఆయన కూడా పద్యకవిత్వాన్ని అభిమానించినవాడేనని తెలుస్తుంది. గుఱ్ఱం జాషువా, చిలకపూడి వేంకటేశ్వర్లు గార్ల శిష్యరికం తెలుగు కవిత్వం, సాహిత్యాల పట్ల కుందుర్తిలో ఆసక్తిని పెంచితే, విశ్వనాథ గారి శిష్యరికం ప్రాచీన సాహిత్యాధ్యయనం పట్ల అనురక్తిని పెంచింది. తన బంధువైన పోలూరి అంజనేయ ప్రసాద్ తో కలసి జంట కవిత్వం చెప్పటం, సౌప్తికం పేరుతో రెండు వందల పద్యాల ఖండికను రాసి గురువైన విశ్వనాథకు అంకితమివ్వటం తత్కాల తాత్కాలిక ప్రభావంతోనే. డిగ్రీ చదువుకునే రోజుల్లో కమ్యునిష్టు ఉద్యమ ప్రభావానికి లోనవ్వటం, మార్పును కోరుకునే సహజ స్వభావం కుందుర్తిని కొత్త తోవకు మళ్ళించాయి. నవ్యకళాపరిషత్ సభ్యుడుగా, నయాగరా కవిగా ప్రారంభించిన ఆధునిక సాహిత్య ప్రస్థానం ఆయనను వచన కవిత్వోద్యమ గమ్యానికి చేర్చింది. ఆయనకు ఆధునిక సాహిత్య చరిత్రలో వచన కవితా పితామహుడుగా శిఖరాయమానమైన కీర్తిని అందించింది.
వచన కవిత్వం అసలు కవిత్వమే కాదన్న ధోరణి కవి పండితులలో బలంగా ఉన్న కాలంలో, కుందుర్తి వచన కవిత్వాన్ని నిలబెట్టటానికి నిర్విరామ కృషి చేశాడు. వచన కవిత్వం గురించి ఎన్నో అమూల్యమైన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఎందరో యువకవుల పుస్తకాలకు రాసిన ముందుమాటలలో (ఇవే తరువాతి కాలంలో ‘కుందుర్తి పీఠికలు’ పుస్తకంగా వెలువడ్డాయి), వేరు వేరు సందర్భాలలో రాసిన వ్యాసాలలో (ఇవే తరువాతి కాలంలో ‘కుందుర్తి వ్యాసాలు’ పుస్తకంగా వెలువడ్డాయి), ‘నాలోని నాదాలు’ కవితా సంపుటిలో ఆయన అభిప్రాయాలను మనం గమనించవచ్చు.
‘గ్రంథాలలో బంధించింది కాక/నాల్కల మీద నర్తించే భాషలో’ రాయటం పట్ల ఆయనకు మక్కువ. వచన కవిత అనేది కవిత్వ రూపమే కదా! కవిత్వంలో వస్తువు ప్రధానం. అది ఏ రూపంలో ఉన్నా రసవంతంగా ఉండటం ముఖ్యం. అప్పుడు వచన కవిత్వాన్ని ప్రచారం చేయటం ఎందుకు? అని ప్రశ్నించే వారికి మొదట ఆయన సమాధానం చెప్పవలసి వచ్చింది. తెలుగులో ఆధునిక కవిత్వం కవిత్వానికి నూతన రూపాన్వేషణతో (ముత్యాలసరాలు) ప్రారంభమైంది. అధునిక కవిత్వంలోని వస్తు నవ్యత రూప నవ్యతను కోరుకుంటుంది అన్న విషయాన్ని వారికి గుర్తు చేసి, అభ్యుదయ కవితా వస్తువును ప్రజలలోకి తీసుకొని వెళ్ళటానికి, ప్రజలలో భావవిప్లవం తీసుకొని రావటానికి వచన కవితా రూపం అవసరాన్ని తెలియజెప్పాడు.
ప్రాచీన కవితా సంప్రదాయాలను చక్కగా గ్రహించినవారే ఆధునిక కవిత్వం బాగా రాయగలరు అనే సాధారణ అభిప్రాయం ఉంది. కుందుర్తి ఈ అభిప్రాయంతో విభేదించాడు. ఆధునిక కవులు ఆధునిక సాహిత్యానికి శుభారంభం పలికిన గురజాడ, వచన కవితారంభకుడైన శ్రీశ్రీ తదితరుల కవితలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే చాలు అంటాడాయన. వీరిరువురి కవితలు అధ్యయనం చేయటంతోపాటు ఆంగ్లం సాయంతో ఇతర ప్రపంచ భాషలలోని సాహిత్య రీతులను అవగాహన చేసుకోవాలి. దానితో పాటు తెనుగు శబ్దాల సాధుత్వం, అర్ధ స్ఫురణ శక్తి, వ్యవహార భాషా ప్రయోగ నైపుణ్యం తెలియాలి. అప్పుడు చక్కని వచన కవిత్వం రాయవచ్చునంటాడు. అదే సమయంలో పూర్వ కావ్యాలు చదవకూడదనే నిషేధం ఏమీ లేదని, కవి అయిన వాడికి ఎంత చదివితే అంత మంచిదే నని స్పష్టం చేశాడు.
ఛందస్సు, అలంకారాలు, కావ్యభాష తదితరాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనవసరం లేదు. కాబట్టి వచన కవిత్వం రాయటం చాలా తేలిక అని భావించేవారు నాడూ ఉన్నారు. నేడూ ఉన్నారు. అటువంటివారికి అలంకారశాస్త్ర గ్రంథాల కంటె కష్టతరమైన లేక కనీసం దానితో సమానమైన సాధన ఏదో ఉంటేనే గాని వచనకవిత్వం రాణించదనే విషయం స్పష్టం చేశాడు. ఆయన దృష్టిలో ‘గొప్ప భావాన్ని సహజంగా, సరళంగా అందించిన వాడే గొప్ప కవి’. నిరాడంబరత, నిష్కల్మషత, అక్లిష్టత, స్పష్టత కలిగి సామాజిక ప్రయోజన సాధకమై ఉంటే అప్పుడు ఆ కవిత మహా కవిత్వ లక్షణాలను కలిగి ఉన్నట్టుగా అయన భావించాడు.
నిరాడంబరత అంటే నిరలంకారత కాదు. ‘జీవితానికి దగ్గరగా తెచ్చేముందు కవిత్వాన్ని చొక్కాలు విప్పించి తీసుకురావలసిన పని లేదు. అలంకారాలు, అందచందాలతో తీసుకురావచ్చు. తీసుకురావాలి కూడా. ఉక్కు కవచాలను, శిరస్త్రాణాలను తగిలించకుండా వుంటే చాలు’ అంటాడు. ఆయన దృష్టిలో సామాజిక ప్రయోజనం అనేది వచనగేయానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. ‘బాహ్య సౌందర్య చిహ్నమైన ఛందస్సును వదలి అంతస్సౌందర్య దర్శనం కొరకు చేసే అన్వేషణ వచనగేయం’. ‘వృద్ధురాలైన రీతిని వదలి పునర్ యౌవన నీతికై చేసే పెనుగులాట వచనగేయం’.
ఆధునిక కవిత్వంలో వర్ణనలు వర్ణనల కోసం కాదు. ఏదో ఒక ప్రయోజనమున్నప్పుడే వర్ణన ఉంటుంది. దానిని దృష్టిలో పెట్టుకొని ‘వర్ణనకు ప్రబంధం పుట్టిలైతే, అధునిక కావ్యం అత్తవారిల్లు. ఇక్కడ వర్ణన చెప్పినట్టు వినాల్సిందే గాని తోక నాడించటానికి వీల్లేదు’ అని వ్యాఖ్యానించాడు కుందుర్తి. వచనగేయం వ్యావహారిక భాషా ప్రయోగ సంపన్నమైతేనే తెలుగువారిని ఆకట్టుకోగలుగుతుందని కుందుర్తి భావించాడు. ‘కవిత్వం తెనుగు ప్రజల సంభాషణ స్థాయికి రావాలి. తెలుగు పలుకుబడి, తెనుగు నుడికారము అందులో పూర్తిగా ప్రవేశించాలి. తెనుగు ఇడియం పుష్కలంగా ఉండాలి… వ్రాసిన కవి మాట్లాడేటప్పుడు ఎంతగా అలంకారాలు సంభాషణలో ప్రవేశిస్తాయో అంతవరకే రాసిన కవితలో కూడా ప్రవేశించాలి. అప్పుడే కవిత రాణిస్తుంది’. తెలుగులో చొరబడిన సంస్కృత శబ్దాల నన్నింటిని వాడి వాటికి జీవం పోయటానికి ప్రయత్నించటం కంటె సజీవమైన వ్యావహారిక భాషా శబ్దాలను వాడటం మంచిదని ఆయన అభిప్రాయం. కవిత్వం మేధో క్రీడగా మిగిలిపోకూడదని ఆయన కోరుకున్నాడు. అందుకే ‘కవిత్వం బాగా చెడిన రూపం నాగబంధమైతే, బాగా బాగుపడిన రూపం వచనగేయం’ అని వ్యాఖ్యానించాడు. కవిత్వం సాధారణ ప్రజల సంభాషణ స్థాయికి రావాలి అని కుందుర్తి ప్రతిపాదించినప్పటికీ సాధారణ సంభాషణకు భిన్నమైన లయ కవిత్వానికి జీవమన్నవాస్తవం ఆయన హృదయాంతరాళంలో నిక్షిప్తమై ఉంది. అందువల్ల అంత్యప్రాసలను వదులుకోలేకపోయాడు.
తొలగబోతే జోలికి వచ్చి/ గుండెలో కాంక్షా జ్వాలలు గ్రుచ్చి (నాలోని నాదాలు-26)
పూల రాసుల్ని కాలితో తోసేసి/ కాలాన్ని విరడా పెట్టి సీసాలో మూసేసి (నాలోని నాదాలు-16)
ఇలా నువ్వు అగిపోతే కాలం నడిచే దెట్లా?/ చీకటి వెలుగు లేకుండా జీవితం గడిచేదెట్లా? (నాలోని నాదాలు-9)
ఆ విషయాన్ని కుందుర్తి కూడా గుర్తించాడు. వాస్తవాన్ని అంగీకరించాడు.
అంతటి విప్లవం తెచ్చి/ అంత్యప్రాసలకు లొంగానని/ విహంగం వెక్కిరించింది (నాలోని నాదాలు-26)
కవిత్వం ద్వారా సాధించవలసిందేమిటి? అనే విషయం మీద కుందుర్తికి స్పష్టమైన అవగాహన ఉంది. కవిత్వం సామాన్యుడి బాధల గాధల వెనుక దాగిన వాస్తవాలను వెలికితీయాలి. మంచి, చెడు తెలియజెప్పాలి. చీకటికి లొంగని, వెలుగు చూసి వెర్రిగా పొంగని స్థితప్రజ్ఞతను అలవరచాలి. ప్రతి హృదయంలో ప్రేమను వెలిగించాలి. అందమైన భవిష్యత్తును దర్శింపజేయాలి. జ్ఞాన లోచనం విచ్చుకునేలా చేయాలి. (నాలోని నాదాలు-10) ఇంతగా ప్రజలను అభ్యుదయ మార్గం పట్టించటం కవిత్వ లక్ష్యం కావాలని పోరాడిన కుందుర్తి తానే మరో సందర్భంలో కవిత్వ ప్రధాన ప్రయోజనం అనందమేనని అంగీకరించాడు.
ఆకలి కాని వనమూలిక అమ్మకానికి వచ్చింది/ అనందానికి మారు పేరు/కవిత్వం దాని పేరు (నాలోని 3-15)
వచన కవిత ఎలా ఉంటే నిలబడగలదో అలోచించి కుందుర్తి అనేక ప్రతిపాదనలు చేశాడు. వాటిలో కథాకావ్య సిద్ధాంతం ఒకటి. కవిత్వంలో కథాంశం లేనప్పుడు అవి కేవలం ప్రబోధ గేయాలు, వర్ణనాత్మక రచనలుగా మిగిలిపోవటం, రసపోషణకు అవకాశం లేకపోవటం జరుగుతుందని ఆయన భావించాడు. ‘నేటి వరకూ వచనగేయం కవితా ఖండికల రూపంలోనే కాలం గడుపుతున్నది. సంపూర్ణ కావ్య దృష్టి అలవరచుకోలేదు’ అనేది ఆయన పరిశీలన. ‘శ్రవ్యకావ్యం సమగ్రంగా ఉండాలంటే జీవితంలోని వివిధ సంఘటనల చిత్రణ, పాత్రల స్వభావ పరిశీలన ఉండాలి. అంటే నాటకీయత ఉండాలి. సామాన్య ప్రజల కథా వస్తువులను అలంబనగా తీసుకుంటే వచనగేయం చేయలేని పని అంటూ ఉండదు. పూర్వ ఛందస్సులను తోసిరాజన్నందుకు ప్రతిఫలంగా మహాకావ్యాలను సృష్టించవచ్చు. ఇది ఇప్పటికీ ప్రాసంగికత కలిగిన అభిప్రాయం. ఇప్పటికీ వచన కవిత్వం కవితా ఖండికల రూపంలోనే ఎక్కువగా వెలువడుతున్నది. అడపా దడపా దీర్ఘకవితలు వస్తున్నప్పటికీ సంపూర్ణ కావ్య దృష్టితో వెలువడటం లేదు.
“వేల పూలు వికసించనీయండి’ అన్నది కుందుర్తి నినాదం. కవిత్వం రాసేవాళ్ళను ప్రోత్సహించాలని, సాధనతో వారు మెరుస్తారని, శబ్ద సాధుత్వం లేదనో, రాసింది వచనంలా ఉందనో, మరొకటనో, మరొకటనో విమర్శించి వారిని నిరుత్సాహపరచటం న్యాయం కాదంటాడు.
కుందుర్తి యువ కవులకు కొన్ని సూచనలు కూడా చేశాడు. ‘వస్తువు ఏదైనా దానిని చెప్పే తీరులో కవి ప్రతిభ దాగి ఉంటుంది. కనుక రాసే క్రమంలో తమదైన ప్రత్యేకతను యువతరం కవులు చూపాలి. ఎవరికీ వారు రచనా శిల్పాన్ని గురించి ఆత్మ విమర్శ చేసుకోవాలి. తాను రాసే పంక్తుల్లో వచనత్వం తొంగి చూడకుండా ఉండటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆలోచించాలి’. మరీ పేలవంగా వుండి, యిది నినాదాల కవిత్వం అనిపించుకునేంత వాచ్యంగా వుండడమూ, కవి పండితులకు కూడా అర్ధం కానంత క్లిష్టంగా వుండడమూ,నూతనత్వం కోసం ఆంగ్ల శబ్దాడంబర ప్రదర్శనం- ఈ మూడు దోషాలను పరిహరించినప్పుడు మంచి వచన కవిత్వం వస్తుందంటారు కుందుర్తి.
వచన కవిత్వంలో పాదం విరుపు గురించి కుందుర్తి స్పష్టమైన అభిప్రాయాన్ని ప్రకటించాడు. ఈ విషయంలో పాఠకుల సౌకర్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని, పాదాంతం అర్థవంతంగా ఉంటే బాగుంటుందని అయన సూచన.
ప్రోన్ పోయిట్రీకి, పొయిటిక్ ప్రోస్ కి ఉన్న తేడాను గమనించటం అవసరం అన్నాడు కుందుర్తి. ‘ఇది కవిత్వమా, వచనమా అని తేల్చుకోవడం కేవలం అచ్చు వేసిన పద్ధతిపై మాత్రమే ఆధారపడి ఉండదు. కవిత్వంలోనూ, వచనంలోనూ వాక్య నిర్మాణ వైఖరులలో చాలా తేడాలు వుంటాయి. ‘వచ్చెనాతడు భీముని పగది’ అని వచనంలో రాసినవాడు ప్రారంభించడు. శక్తివంతంగానో, క్లుప్తంగానో, మరోకవిధంగానో చెప్పడానికి కవి వాక్య నిర్మాణంలో ఒకానొక వక్రతను ఆశ్రయిస్తాడు. వచన రచయితకు ఆ అవసరం ఉండదు’ అని స్పష్టంగా ఆ తేడాను వివరించాడు. వ్యాస కవిత్వం (Essaay Poetry) వంటి నూతన సృజనాత్మక ప్రక్రియలు ముందుకు వస్తున్న తరుణంలో కుందుర్తి అలోచనలు పునః స్మరణీయం.
సామాజిక అభ్యున్నతి సందేశంగా గల అభ్యుదయ కవిత్వానికి వస్తాశ్రయ మార్గమే సరైనదని ఆయన అభిప్రాయం. ‘శాస్త్రవేత్తకు సృష్టిలోని మూల సూత్రాలను గురించి పరిశీలించటం ఎంత అవసరమో రచయితకు మనస్తత్వ నిరూపణ అంత అవసరం’ అంటాడు కుందుర్తి, రచన చదివిన తరువాత పాఠకుని మీద ఏ విధమైన ప్రభావం చూపించగలిగింది. జీవితం మీద ఒక నిర్దిష్ట దృక్పథాన్ని అతనిలో ఎంతవరకు కలిగించగలిగింది. అనే దానిమీద ఆ రచన గొప్పతనం ఆధారపడి ఉంటుంది కనుక రచయితకు శాస్త్రీయమైన దృక్పథం ఉండాలి. అన్నది ఆయన అభిప్రాయం.
‘ఫ్రీ వర్స్ రచనా పద్దతి విజయవంతం కావాలంటే ప్రతి గేయానికి ఒక Central theme, Central Idea ఉండాలి’. ఊహ పుష్కలంగా ఉన్నప్పటికీ theme అంటూ ఉండకపోవటం, దాని వల్ల ఎక్కడికక్కడ పంక్తులు తీర్చిదిద్దినట్టు అందంగా ఉన్నపటికీ, గేయం మొత్తం చదివాక అసంతృప్తి కలగటం, Central Idea లేకపోవటం వల్ల ఒక్కోసారి గేయంలోని కొన్ని పంక్తులు మొత్తం గేయానికి ఎదురు తిరిగి మాట్లాడటం, ఐక్యత చెడిపోవటం తదితర అంశాలను వివరంగా చర్చించాడు కుందుర్తి.
స్వేఛ్ఛా ప్రకటనమనే ప్రయోజనాన్ని సాధించటం కోసం సంప్రదాయ ఛందస్సులను వదిలివేసినప్పటికీ ఛందస్సు యొక్క effects మరో రూపంలో సాధించబడుతున్నాయన్నది ఆయన అభిప్రాయం. ‘ఆధునిక వచన గేయాల్లోని విరుపూ, విసురూ, ధోరణి, పలుకుబడి అన్నీ ఇందుకే పుట్టినవి’ అంటాడు. ‘వరుసగా భావచిత్రాలు వర్షంలా కురిపించడం ఆధునిక వచన గేయానికి వద్దన్నా పోనీ లక్షణం. అదీ ఇందుకోసం పుట్టిందే. అ భావ పరంపరలో ఒక స్వతంత్ర లయాన్వితమైన ఛందో లక్షణం దాక్కొని ఉంది’ అని వచన కవిత్వంలో భావచిత్రాలు ఎక్కువగా ఉండటానికి గల కారణాలను విశ్లేషించాడు.
భావ సాంద్రతతో రాయగలిగిన శక్తి ఉండి కూడా (అందుకు ‘నగరంలో వాన’ మంచి ఉదాహరణ) ఉద్దేశపూర్వకంగా దానిని పక్కన పెట్టి. పాశ్చాత్య ప్రభావాన్ని పక్కకు తోసి ఒక భిన్నమైన శైలిని కుందుర్తి ఏర్పరచుకున్నాడు. అందుకు ఆయనలోని ప్రయోగశీల దృక్పథం, సమకాలీన సమస్యల అవగాహన దోహదకారులయ్యాయి. తాను నమ్మిన అభ్యుదయ భావాలను ప్రజలకు చేర్చటానికి వచన కవిత్వమే తగిన వాహిక అని నమ్మి వచన కవిత్వం ఒక ప్రయోగంగా మిగిలిపోకుండా, ఒక ప్రక్రియగా నిలబడటానికి అమరణాంతం కృషి చేశాడు.
నీతికి నిలిచిన వాణ్ణి కొత్త రీతిలో రసవాదం కొలిచిన వాణ్ణి (గుర్తుంచుకో)
కుందుర్తి ప్రతిపాదనలు, అభిప్రాయాలు నిశ్చల నిశ్చితాలు కాకపోవచ్చు. ఆ మాట కొస్తే ఈ ప్రపంచంలో ఏ అంశానికి సంబంధించి ఎవరు చేసే ప్రతిపాదనలు అయినా నిశ్చల నిశ్చితాలు కావు. కాల ప్రభావానికి లోనై ఎన్నో అభిప్రాయాలు మారిపోతుంటాయి. అయితే ఆ కాలంలో అ వ్యక్తి ఎంత నిజాయితీతో తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడనేది చాలా ముఖ్యం. కుందుర్తి ఎంత నిజాయితీగా ఒకానొక కవితారూపాన్ని, ఏదైతే అభ్యుదయ భావజాలాన్ని సహజసరళంగా సామాన్య మానవుడికి చేరువ చేయగలదని నమ్మాడో ఆ కవితారూపాన్ని నిలబెట్టటానికి తపించాడో. వచన కవిత్వ ప్రతిష్టాపనకు అవసరమైన ప్రతి ఒక్క అంశాన్ని ఎన్ని కోణాల నుంచి అలోచించి ఎంత విపులంగా చర్చించాడో గమనించినపుడు ఆశ్చర్యమేస్తుంది. ఈనాడు పుంఖానుపుంఖాలుగా వచన కవిత్వం రాస్తున్న యువ కవులు ఒక్క క్షణం ఆగి కుందుర్తి భావధారను అందుకొని, వారిదైన వివేచనను జోడించి ముందుకెళితే ఆయన కోరుకున్నట్టుగా పది కాలాల పాటు మనగలిగే కవిత్వం వస్తుందేమో! అలా జరగాలని అశిద్దాం.
డా. నల్లపనేని విజయలక్ష్మి
తెలుగు అధ్యాపకురాలు, ప్రభుత్వ మహిళా కళాశాల
(స్వయం ప్రతిపత్తి)
గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
9701667350
ఆధారగ్రంథాలు:
కుందుర్తి కృతులు-కుందుర్తి సన్మాన సంఘం, గుంటూరు- హైదరాబాద్ – 1975
కుందుర్తి వీఠికలు-స్పందన సాహితీ సమాఖ్య, మచిలీపట్నం- 1977
కుందుర్తి వ్యాసాలు-తెలుగు పరిశోధన ప్రచురణలు, హైదరాబాద్- 1987
కుందుర్తి కవితాదృక్పథం నాలోని నాదాలు- టి. లక్ష్మీనారాయణ-సిద్ధాంతగ్రంథం–1990
కుందుర్తి కవితా వైభవం- అద్దేపల్లి రామమోహనరావు, యువభారతి సాహితీ సాంస్కృతిక సంస్థ, సికిందరాబాద్-1980








