తెలుగు కలెక్టివ్ – ఇష్టా గోష్ఠి

(తేదీ: మార్చి 23న “పున్నాగ పూలు” పుస్తకంపైన జరిగిన ఇష్టా గోష్ఠి కార్యక్రమానికి వచ్చిన ఒక పాఠకుడు తన అభిప్రాయాన్ని మాతో లేఖ రూపంలో పంచుకున్నారు, అదే మీరు ఇప్పుడు చదవబోతున్నది.)   

ఇలాంటి కార్యక్రమం ఒకటి జరుగుతుంది అని తెలిసినప్పటి నుండి ఒక్కసారైనా వెళ్దాం అనే ఆలోచన మొదలైంది. అయితే అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది.

ఈ సారి విషయం “పున్నాగ పూలు” పుస్తకం గురించి. కానీ నేను ఇంకా చదవనేలేదు. వెళ్ళొచ్చా లేదో అనే అనుమానంతో ముందుగానే ఆదిత్యగారిని అడిగితే రావొచ్చు అండి అన్నారు . సంతోషం…

వెళ్తున్నా కానీ ఏదో చిన్న సంశయం… పుస్తకం చదవలేదు. అంతకుమించి జీవితంలో ఇప్పటి వరకూ ఇటువంటి కార్యక్రమాలకు హాజరు కాలేదు కూడా. అక్కడ ఏం చేయాలో, ఏం జరుగుతుందో, ఒక వేళ మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడాలో తెలియని అయోమయం…. అసలే పరిచయాలు కూడా లేవు.

అవే ఆలోచనలలో కొంచెం బెరుకుగానే 500CC ఫుడీస్ క్లబ్’లో అడుగుపెట్టా. ఇంస్టాగ్రామ్ పేజీ వల్ల ఆదిత్య గారిని గుర్తుపట్టా… ఏదో ఊహించుకుంటూ వెళ్ళిన నాకు, ఒక సరికొత్త అనుభూతిని మిగిల్చింది అక్కడి సంభాషణ.

ముందుగా ఆదిత్య గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఆయన వేసిన ముందడగు, ఆయనకు సాహిత్యం పై ఉన్న అభిమానం తెలుగు పాఠకులకు ముఖ్యంగా ఈ తరానికి తెలుగు పుస్తకాన్ని దగ్గర చేసేందుకు ఆయన కృషి అభినందనీయం. ఆయన, ఆయన పనిని నాకు చేరువ చేసినందుకు ‘కననమాలి’గారికి కూడా అభినందనలు. ఈ రోజు ఆయనను కూడా కలుస్తా అనుకున్నా కానీ రాలేదు ఆయన.

ఆయన కలిస్తే మరొక్కసారి స్వయంగా వైతరణి ఒడ్డున జ్ఞాపకాలను పంచుకుందామనుకున్నా… అంతేకాదు నృకేసరిలో నన్ను అలరించని విషయాలు కూడా చర్చిద్దామనుకున్నా.. కుదరర్లేదు.

ఇక విషయానికొస్తే … ఇష్టాగోష్టి.. పరిచయం లేని వ్యక్తులు, దానికి తోడు, పుస్తకం చదవకుండా వచ్చి ఎలా ఉండగలను అనుకున్నా … కానీ అక్కడి వాతావరణం, కలిసిన మనుషులు నా అనుమానాలను తేల్చిపడేసారు. ముఖ్యంగా ఆదిత్యగారు, ఆయనను చూడగానే ఒక తెలియని తెలిసినతనం నన్ను ‘కంఫర్ట్ జోన్ లో పెట్టింది. తర్వాత సాయి గారి మహీ… మహీ.. మాటలు మరింత సౌకర్యవంతంగా మార్చాయి నా మనసును.

కొద్ది సేపట్లోనే మాటలు మొదలయ్యాయి.. పరిచయాలు చేసుకునే సమయం వచ్చింది. అసలు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని ఆలోచనలో ఉన్న నాకు… పుస్తకం ఎలా పరిచయం అయింది అని చెప్పమంటే.. చిన్నప్పుడు తాతయ్య చెప్పిన కథలు, ఆయన కొన్న చందమాను, బాలమిత్ర పుస్తకాలు, ఆయన సేకరించిన సంకలనాలు, ఆడియో కథల కాసెట్లు అన్నీ ఒక మెరుపులా మెదిలాయి. వాటితో పాటు చిన్న మామయ్య ఇంట్లో రాత్రి బడులకోసం ఇచ్చిన కథలు పుస్తకాలు, ఇంజనీరింగ్ లో పరిచయమైన ఇంగ్లీషు పుస్తకాలు వాటన్నింటి గురించి చెప్తామనుకున్నా..

ఎప్పటిలానే సగం మాత్రమే గొంతుదాటి వచ్చాయి. తరువాత “పున్నాగపూలు” పుస్తక రచయిత “జలంధర” గారి గురించి, ఆవిడ పాత రచనల గురించి, పున్నాగపూలు సీరియల్ గా వచ్చినప్పుడు పాఠకుల స్పందన గురించి, ఆమెను స్వయంగా కలిసిన దండిగారు చెప్పారు.

“పున్నాగపూలు” అందులో పాత్రలు గురించి ముందుగా చదివిన వారంతా చెబుతుంటే… ఎక్కడో మనసు అడుగుల్లో దాగి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయనిపించింది. అంతకు మించి ఆ సంభాషణలు, దృక్పథాలు నా మనసుకు సమీపంగా ఉన్నాయనిపించింది, రాధ గురించి మొదలై … రామకృష్ణ గురించి మాట్లాడుతున్నారు.. నాకు నేనే కనిపించా… పుస్తకం చదవకుండా వింటున్నపుడే ఒక సామీప్యత కలిగింది అనిపించింది. సమయం చూసుకుని చదవాలనిపించింది. అందరి మాటల్లో పాత్రలు,వాటి వ్యక్తిత్వాలు నాకు ఎదురైన మనుషుల్లో, వాళ్ళ జీవితాలలో జరిగిన సంఘటనలను గుర్తు చేసాయి.

తర్వాత, దండిగారు ఉదాసీనత గురించి చెప్పిన అనుభవాలు, వాటిపై చుట్టూ ఉన్న వారి దృక్పథాల గురించి మాట్లాడుకున్నాం.. ఇంకా ఎక్కువ విన్న పదం ప్రేమరాహిత్యం… ఇది ఎంతటి ప్రభావాన్ని చూపిస్తుంది ముందుతరం నుండి ఇప్పటివరకూ అన్న సంభాషణ చాలా అర్థవంతంగా జరిగిందనిపించింది.

ఆదిత్యగారు తీసుకొచ్చిన విషయం” మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే… అసలైన ప్రేమ గురించి తెలియనంత వరకూ… చాలా ఆసక్తికరంగా మొదలైన చర్చ, తరువాత ప్రస్తుత సమాజంలో ప్రేమకు చోటు తక్కువైపోయిందనీ, అర్థాలు మారిపోయాయని, అది ఒక అవసరంగా మారిందని చర్చ జరిగింది.

తర్వాత, ప్రస్తుతం చదువుతున్న పుస్తకాల గురించి చెప్పమంటే… ఈ మధ్యే పూర్తి చేసిన ‘మరో మహాత్మ’ గురించి చాలా చెబుదామనుకున్న.. మళ్లీ మామూలే, సగం మింగేసి సగం చెప్పా. ఈ ప్రక్రియలో చాలా పుస్తకాల గురించి విన్నా.. అదే కాకుండా, పుస్తకం ఎలా చదువుతున్నారు… ఎలా ఆయా కథలను, పాత్రలను దగ్గర చేసుకుంటున్నారు… ఆయా పాత్రలకు సరైన ముగింపి లేదు అనిపిస్తే, అలా ఎలా చేస్తారు రచయితలు అన్న ప్రశ్నలు కూడా విన్నాను…

చాలా హాయిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక అర్థవంతమైన సంభాషణల్లో, అదీ సుదీర్ఘంగా నేను కూడా భాగమయ్యానని… ఇందుకు కారణభూతులైన ఆదిత్య గారికి మరొక్కసారి ధన్యవాదాలు. ఇంకో అబ్బాయి…. సాహిత్యంపై కృషి చేసి అనువాదాల పై పనిచేస్తున్నారని, పుస్తకాల పై లోతైన చర్చలకు సంసిద్ధమైన సహ పాఠకులను కలిసి నందుకు చాలా సంతోషపడ్డాను

ఇంకా ఇంకా చదవాల్సిన కథలెన్నో ఉన్నాయి. ఆయా పుస్తకాల గురించి తెలుసుకున్నా…. ఇటువంటి చర్చా వేదికలు మళ్ళీ మళ్ళీ జరగాలని… నాకు మళ్ళీ మళ్ళీ అవకాశం రావాలని బలంగా కోరుకుంటూ….

మరొక్కసారి … తెలుగు కలెక్టివ్ కు… నమస్కారాలు …

ఇట్లు,       
సహ పాఠకుడు,
రమేష్ నాయుడు.

error: Content is protected !!