పుస్తక పరిచయం : రెండు గుండెల చప్పుడు
రెండు గుండెల చప్పుడు – యండమూరి వీరేంద్రనాథ్ స్వేచ్ఛ అంటే ఏమిటి? మనకు నచ్చినట్టు జీవించడమా? మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకునే హక్కు కలిగి ఉండటమా?
అప్పుడే వేడెక్కుతున్న ఫాల్గుణమానపు మధ్యాహ్నపు యెండలోంచి తెరచి వున్న వాకిలి గుమ్మంలోంచి ఫ్యాన్ తిరుగుతున్న హాల్లోకి వుత్సాహపు గాలిలా వస్తూ, “మమ్మీ… వుద్యోగం వచ్చేసిందోచ్ !!,” అంటూ తన మెడ చుట్టూ చేతులేసి తనని చుట్టేసిన కూతురిని విడిపించుకొంటూ, “నా మెడ… అబ్బా… వుండవే… యేం వుద్యోగమో యేమో… నా ప్రాణం మీదకొచ్చింది. యేయ్… ఆగు,” అంటూ నందన నుంచి తనను తాను విడిపించుకొంటూ,
‘హా’ అంటూ నోటితో గాలి పీల్చుకొంటూ,
“యేంటా గోల… కుదురుగా చెప్ప లేవ్,” అంది మాధవి.
“యేంటి కుదురుగా చెప్పేది, యిమోషన్స్ లెస్ గై… ఆ… మమ్మీ వుద్యోగం వచ్చింది అంటూ కాళ్ళకి దండం పెట్టాలా…. వోల్డ్ పిక్చర్లోలా… వోల్డ్ మమ్మీ..” అని నాలుక బయట పెట్టి నవ్వుతూ వెక్కిరించి అటూ యిటూ చూసి టి.వి. చానల్ మారుస్తూ క్షణంలో సుడిగాలిలా తిరిగి తల్లిని చుట్టేసి,
“యూ నో… నేనిప్పుడు వుద్యోగస్థురాల్ని.” అని గట్టిగా అంటుంటే,
“నందూ… రా… రా… ముందీ హారతి తీసుకో…” అంటూ వంటింట్లోంచి హారతి పళ్ళంతో హాల్లోకి వస్తూ ఫ్యాన్ ఆపి, “రా… రా…” అన్నారు వైదేహి.
“హాయ్ గ్రానీ,” అంటూ హారతిని వొద్దికగా కళ్ళకి అడ్డుకొంటూ అత్యంత భక్తిశ్రద్ధలతో కళ్ళు మూసుకొని మెల్లగా తెరిచింది నందన.
“నీకు యింటర్వ్యూ వుందని వుదయమే పూజ చేసిండా, హారతిచ్చి పంపిందా. నువ్వు వెళ్ళినప్పట్నుంచి అమ్మమ్మ దేవుడి ముందే కూర్చుని లలితా సహస్రనామాలు చదువుతూనే వుంది.” అంది మాధవి..
“ప్రసాదం తీసుకో.” అన్నారు వైదేహి. ప్రసాదం పళ్ళెం దేవుడి దగ్గర తిరిగి పెట్టేస్తూ,
“అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చి యిలా దేవుడి దగ్గర పెట్టు.” అన్నారామె.
“అర్డర్ యేదీ.” అడిగింది మాధవి.
“ఆర్డర్ యింకా యివ్వలేదు. యిస్తారు.” అంది నందన.
చేతుల తడిని చీరకొంగుతో తుడుచుకొంటూ,
“జీతం… నీ పెద్ద మనవరాలు యీరోజు నుంచి నీ ముద్దుల కూతుర్ని ‘అమ్మా.. సినిమాకి డబ్బులు, పార్లర్కి డబ్బులు, పార్టీకి డబ్బులు’ అని అడగక్కర్లేదు… యూ నో మామ్.” అని తిరిగి తల్లి మెడ చుట్టూ చేతులు వేసి తల్లి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి పై పెదవితో కింద పెదవిని నొక్కి పెట్టి, ఫ్… అంటూ, “పదివేలు,” అని కనుబొమలు యెగరేస్తూ,
“టెన్ థౌజెండ్… వొక్క నెలకి పదివేలు. యిలా నెలనెలా పదివేలొస్తాయి. యేడాది తిరిగేరికి లక్షా ఇరవై వేలు,” యెడమ చేయి బొటనవేలుని తల్లి ముఖం ముందు నుంచి పైకి ఆడిస్తూ, యెడమ కన్ను గీటుతూ,
“సో… యీ నందన యేడాదిలోగా లక్షాధికారన్న మాట.” అంటోన్న కూతురితో,
“అబ్బా… ఆగవే తల్లి… చాల్లే బడాయ్… యింతకి అపాయింట్మెంట్ ఆర్డర్ యేదీ,” అడిగింది మాధవి.
“చెప్పానుగా వస్తుంది. కొరియర్ వారు తెస్తారు. నెట్ వారు చూపిస్తారు. ఆకలి… త్వరత్వరగా తినటానికేమైనా పెట్టు.” అంది నందన.
“ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొచ్చి బాబాకి దండం పెట్టు. అన్నం పెడతా.” అంది మాధవి.
నందన మారు మాట్లాడకుండా తల్లి చెప్పిన పనిని భక్తిశ్రద్ధలతో చేసింది.
డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ, “అబ్బా అమ్మమ్మా ఫ్యాన్ వేయి. తీసేస్తావ్ కాని వేయవు.” అరిచింది నందన.
“యింతసేపు గుర్తు రాలేదు పిల్లకి,” స్విచ్ వేస్తూ అంది మాధవి.
నందన ఆ మాటల్ని పట్టించుకోకుండా, “ముందు టూ వీలర్ కొనుక్కోవాలి. ముందు కట్టాల్సింది, నువ్వు కడతావా మమ్మీ.” అని అడిగింది.
“నేనేం కట్టలేను బాబూ! నువ్వే కట్టుకో.” అంది మాధవి.
“నా దగ్గర యిపుడే యెక్కడుంటాయ్.” అంది నందన.
“రెండు మూడు నెలల తర్వాత కొనుక్కో.”
“రెండు మూడు నెలలా… అంతవరకు బస్సులో, ఆటోల్లో వెళ్ళాలా…. ఛ పరువు పోదూ. కాలేజీకే బండి లేకుండా వెళ్ళాలంటే చిరాగ్గా వుండేది. నువ్వు ముందు కట్టాల్సింది కట్టు. నెలనెలా ఇంస్టాల్మెంట్ నే కట్టుకుంటా.”
నందన బతిమాలుతోంది తల్లిని.
“డబ్బుల్లేవు. అయినా వెంటనే బండి మీద వెళ్ళాలా యేంటీ.”
“చూద్దాంలే… వంకాయ పెరుగుపచ్చడి నీకిష్టమని చేశా. యింకాస్త వేసుకో,” అన్నారు వైదేహి.
“మమ్మీ.. నీ కూతురు వుద్యోగస్థురాలైన సందర్భంగా సెల్ఫోన్ ప్రజెంట్ చేస్తావా,” గారంగా అడిగింది నందన.
“ఆ… నేనేం కొనివ్వను… అయినా సెల్ఫోన్ నీకెందుకే,” నవ్వుతూ అంది మాధవి.
“అది కూడా కొనివ్వలేవా… స్టూడెంట్స్ దగ్గరే వున్నాయి. వుద్యోగస్థురాలిని… సెల్ లేకపోతే యెంత నామోషీగా వుంటుంది.” అంది నందన,
“నేనేం కొనివ్వను… యిన్నాళ్ళ నుంచి నువ్వు అడిగినవన్నీ నేనిచ్చాగా. యిక నుంచి నువ్వే నాకేదొకటి కొనివ్వు,” అంది మాధవి.
“అదికాదు మ…” అని నందన అంటుండగా మాధవి సెల్ మోగింది.
మాధవి ఆత్రంగా నెంబర్ వైపు చూసి, “తాతగారు, మాట్లాడు,” అంది.
నందన సెల్ అందుకొని,
“హాయ్ తాతగారు… వచ్చేసింది. టెన్ థౌజెండ్, ఆ… యీరోజు అమ్మమ్మ రాదు. యీ వుద్యోగం వస్తే షిరిడి వస్తానని మొక్కుకున్నా. అమ్మమ్మని తీసుకెళతాం. యెనిమిది రౌండ్స్ యింటర్వ్యూ. యింటర్నేషనల్ కాల్ సెంటర్లో. డిగ్రీ యేదైనా ఫర్లేదు. యింగ్లీషు బాగా రావాలి. అమెరికన్స్ మాట్లాడ్డానికి కొద్దిగా ట్రైనింగ్ యిస్తారు. యేంటి… షిఫ్ట్స్… ఆ షిస్ట్స్ డ్యూటీస్ వుంటాయి. యిదిగోండి అమ్మమ్మకి యిస్తున్నాను,” అంది.
వైదేహగారు మాట్లాడిన తరువాత మాధవి మాట్లాడుతూ, “అన్నయ్యకి చెప్పండి.” అంది.
“మమ్మీ… మీ వదినకి చెప్పమని యెప్పుడూ చెప్పవేం.” అడిగింది నందన.
“వూ!… చాల్లే … నీకెందుకు పెద్ద విషయాలు. తిను త్వరగా, అమ్మమ్మ టెకెట్ కాన్సిల్ చేయాలి. షిర్డీకి కూడా టికెట్స్ తెచ్చుకోవాలి,” అంది మాధవి.
“వదిన… అంటే నీకు బి.పి. వచ్చేస్తుంది కదా! వదినా అనమంటావా, సెల్ కొంటావా,” అల్లరిగా నవ్వుతూ అడిగింది నందన,
“నాకేం బి.పి. రాదు. వందసార్లు అనుకో. సెల్ కొనిచ్చేదే లేదు. కావాలంటే నువ్వు కొనుక్కో.” అంది మాధవి.
“అదికాదు మమ్మీ, బండి లేకుండా ఆఫీసుకి వెళితే బాగుండదు. ఫోన్ లేకుండా అస్సలు బాగుండదు. ప్లీజ్ మమ్మీ… ప్లీజ్,” తల్లి గడ్డం పట్టుకుని బతిమాలేస్తున్న మనవరాలిని చూసి,
“పోనీలే మధూ కొనరాదా.” అన్నారు వైదేహి.
“లక్షలు గడించే వాడికిచ్చి నువ్వేమైనా పెళ్ళి చేశావా? మీ అల్లుడి జీతం యిప్పటికి పదివేలు లేదు. అంత పెద్ద కోరికలు నేనెక్కడ తీర్చగలను.” నవ్వుతూ అంటున్నా మాధవి స్వరంలో చిన్న విసురుంది.
“మా అమ్మానాన్నల కంటే నా జితమే యెక్కువ కదమ్మమ్మా,” కళ్ళలో గర్వం మెరుస్తుండగా అడిగింది నందన.
“యింకెన్నిసార్లు అడుగుతాన్. యింక ఆపు. త్వరగా తెములు. స్టేషన్కి వెళ్ళాలిగా ?!”
“నే వెళ్ళను మమ్మీ. ఆ యెండలో పడొచ్చానా. యెంత యెండా? అదేం టమ్మమ్మ అప్పుడే యింత యెండలు. వైజాగ్లో యింతుంటాయా,” అడిగింది నందన.
“యింతుండవ్. కాకపోతే తెగ వుక్క పోస్తుంటుంది.” అన్నారు వైదేహి.
“నువ్వెళ్ళకపోతే యెలా… యిప్పుడెవరున్నారు చెప్పు. నీర్సంగా వుందనేగా నేను లీవ్ పెట్టింది. వెళ్ళొచ్చేయ్.” అంది మాధవి.
ఫ్రిడ్జ్లోంచి గులాబ్జాం తీసుకొని తింటూ కాసేపు తల్లివైపు నిశ్శబ్దంగా చూసి వొక నిర్ణయానికొచ్చినట్టు ముఖం పెట్టి,
“సరే వెళతా. సెల్ కొనిస్తావా, లేదా బండికి డబ్బలు కడతావా?” అడిగింది నందన.
“అబ్బబ్బా… బుర్రలోకి యేం రాకూడదు. వచ్చిందా వో పట్టాన వదలవుగా. ముందెళ్ళి ఆ టికెట్ కాన్సిల్ చేయించు. అనవసరంగా వృధా అయిపోతుంది.” అంది మాధవి.
“మమ్మీ… యీ నందూ వొక ఆప్షన్ యిచ్చింది. వొప్పుకుంటే సరే. లేదా నీ యిష్టం. నే వెళ్ళి పడుకొంటున్నా.”
హాల్కి అనుకొని వున్న వో గదిలోకి వెళ్లింది. ఫ్యాన్ వేసింది. డ్రెసింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో తన ముఖాన్ని తేరిపార చూసుకొంది. ఐబ్రోస్పై చూపుడువేలితో నొకసారి రాసుకొంది. నాలుకతో కింద పెదవిని తడి చేసుకుంది. తను వేసుకొన్న లెమన్ యెల్లో కాటన్ చున్నీని తీసి తలుపు వెనకనున్న కొక్కానికి తగిలించింది. బీరువా తీసి నైటీ తీస్తుంటే మాధవి గదిలోకొచ్చింది. మంచంపై అడ్డంగా పడున్న టెడ్డీబేరిని తలగడ వైపుకి పెడుతూ,
“నందూ వెళ్ళి రారా,” బతిమాల్తున్నట్టు అడిగింది మాధవి.
“నైటీ కూడా తీసుకొన్నా. బాగా నిద్రొచ్చేస్తోంది. యింకెవరినైనా చూడు,” అంటూ డ్రెస్ మార్చుకొని మంచంపై అడ్డంగా వాలింది నందన.
“మొండి… అబ్బా…” యిప్పుడెవర్ని అడగాలా అని మాదవి అనుకొంటుండగా ఫోన్ మోగింది.
నందన కళ్ళు విప్పి లేవబోతుంటే మాధవి రిసీవర్ లిఫ్ట్ చేసింది. “వూఁ… వొక నిమిషం,” అని తనవైపే కళ్ళింత చేసుకొని చూస్తున్న నందనతో.
“నీకే, టెకెట్ కాన్సిల్ చేసుకొస్తానంటే యిస్తాను.” అంది మాధవి.
అంతవరకు తను పెట్టిన బేరానికి తల్లి వొప్పుకోకపోవడం అటుంచి యిప్పుడు తనే బేరం పెడుతుంటే నందనకి వొళ్ళు మండిపోయింది. ఆ ఫోన్ యెవరిదో. అడిగినా చెప్పదు. యిలా దొరికిపోయానేంటా అనుకొంటూ, అయినా వొకసారి అడుగుదాం అనుకొని,
“యెవరు.” అని అడిగింది.
“స్టేషన్కి వెళతావా లేదా,” తిరిగి అడిగింది మాధవి.
అటుపక్కనున్నది యెవరైనా సరే ఆ కాల్ మిస్ చేసుకోవటం నందనకి యిష్టం లేదు.
“సరే యివ్వు.” విసురుగా రిసీవర్ లాక్కుంది నందన.
“హలో…” అటుపక్కనున్న వాళ్ళ వాయిస్ వినగానే నందన ముఖంలో విసుగు, నిద్ర యెగిరిపోయాయి.
“హాయ్… విక్రమ్… యేం చేస్తున్నావ్. వచ్చేసింది. నేనా… యేం చేయడం లేదు. మా గ్రాండ్ మా వైజాగ్ వెళ్ళాలి. ఆ ట్రావెల్ యేజెంట్ సెకండ్ క్లాస్ టికెట్స్ తెచ్చాడు. సెకండ్ యేసీలో తప్ప మా గ్రాండ్ మా ట్రావెల్ చేయలేరు. అస్సలు అలవాటు లేదు. ఆ యేజెంట్ కి క్లాస్ తీసుకొన్నారింట్లో. యిప్పుడా టికెట్స్ కేన్సిల్ చేయడానికి యేజెంట్ రావటం లేదు. వెళ్ళి కాన్సిల్ చెయ్యాలి. కారు డాడీ దగ్గరుంది. యెలా వెళ్ళాలాని చూస్తున్నా… వో… రియల్లీ… టెన్ మినిట్స్…. చౌరస్తా నుంచి రైటికి తిరిగితే ఐస్క్రీమ్ పార్లర్ వుంటుంది. వచ్చేసెయ్ అక్కడికి. సీ… యూ బై…” అని రిసీవర్ పెట్టింది.మంచంపై కూర్చుని యీ సంభాషణ వింటున్న వైదేహిగారు నవ్వుతూ. “మీ ఫ్రెండా. ” అని అడిగారు.
“ఆ !”
“మనకి కారెక్కడుందే,” అడిగింది మాధవి.
“విక్రమ్ వాళ్ళకి మూడు కార్లున్నాయి. మనకి కనీసం వొక్కటన్నా లేకపోతే యెలా చెప్పు.” అంది నందన.
“యేసీ టికెట్స్… యెక్కడివి.” అడిగింది మాధవి.
త్వరత్వరగా డ్రెస్ ఛేంజ్ చేసుకొంటూ, “మై డియర్ మామ్, కాస్త షో చెయ్యాలి. లేకపోతే మనమంటే లెక్కుండదు.” అని నవ్వి,
“యేవీ ఆ టికెట్స్?! యేసీ కారు. యెండ ముఖాన పడక్కర్లేదు. ఆటో డబ్బులు కలిసొస్తాయి.” అంది.
“చూడు, యెంత తెలివైందో… యెక్కడికకక్కడ యెలా నెగ్గుకొస్తోందో. త్వరగా రామ్మా… నీకు వుద్యోగం వస్తే ఆంజనేయస్వామి గుడికి వస్తాననుకొన్నాను.” మురిసిపోతూ అన్నారు వైదేహి.
“అలానే.”
“నందూ…. ఆ విక్రమ్ నిన్ను తిరిగి యిక్కడ దింపటానికి వస్తాడు కదా. ఆ కారులోనే మనం గుడికి వెళ్లిపోవచ్చనంటానా,” అడిగారు వైదేహి కాస్త మెల్లగా.
“దానికే మతి లేదు. ఆ విక్రమ్ యెవరో యేంటో. మనకి పరిచయం లేదు. నువ్వేంటి గుడిక్కూడా లిఫ్ట్ అడుగుతావ్. సరిపోయారిద్దరూ.” రవ్వంత చికాకుతో అంది మాధవి.
“బై… వీలైతే ఆ కారులోనే వెళదాంలే అమ్మమ్మా.” అంటూ రయ్ మని వెళ్ళిపొయింది నందన.
“దీనికి చిన్నతనం యెప్పుడు పోతుందో.” అంటూ మరో బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది మాధవి. వైదేహిగారు టీవీ చూస్తూ అలూ చిప్స్ తింటుండగా గుమ్మం బయట చెప్పులు విడిచి లోపలికి వచ్చింది మహి.

రెండో భాగం త్వరలో …