పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
చిన్ని చిన్ని సంతోషాలు

“అమ్మా! నేను పుట్టినరోజు చేసుకోను,” అని మా ఏకైక అబ్బాయి చెప్పగానే నేను అవాక్కయ్యాను.
వాడు పుట్టి పదిహేను సంవత్సరాలు రేపటితో నిండబోతున్నాయి. ప్రతి సంవత్సరం వాడు వాడి పుట్టినరోజును చాల సంబరంగా చేసుకుంటాడు. వాడికి ఇష్టమైన వంటకాలు, పిండివంటలు చేసిపెట్టమని ముందు రోజే అడుగుతాడు. ఆ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, వాళ్ళ నాన్న తీసుకొచ్చిన కొత్త బట్టలు వేసుకొని, దేవుడికి దండం పెట్టుకొని, ఇష్టమైన టిఫిన్ తిని, సెలవు రోజైతే స్నేహితులతో షికార్లకి, సినిమాలకి వెళ్తాడు. లేదా స్కూల్ ఉన్నరోజైతే తన క్లాసులో అందరికి మిఠాయిలు పంచి, సాయంకాలం అందరిని ఇంటికి పిలిచి, కేకు కట్ చేసి, పడుకునే ముందు వచ్చిన బహుమతులు చూసుకొని, రోజంతా చేసినవన్ని నాకు చెప్పి, ఆనందంగా పడుకొని నిద్రపోతాడు.
ఈ సంవత్సరం కూడా అలానే చేస్తాడని అనుకున్నాను. వాడికి ఇష్టమైన పిండివంటలు కూడా వాడు అడగకముందే తయారుచేసాను. రాత్రి తొమ్మిది గంటలప్పుడు, వాడికి భోజనం వడ్డిస్తుంటే, తింటూ, పుట్టినరోజు చేసుకోనని చెప్పాడు.
“చేసుకోవా! ఎందుకు? ఏమైంది?”
“ఏం కాలేదు. నాకే చేసుకోవాలని లేదు. అందుకే చేసుకోను. అంతే. అంతకు మించి స్పెషల్ రీసన్స్ ఏమీ లేవు,” అని మాములుగా చెప్పాడు.
సహజంగా, ఒక వయసొచ్చాక పుట్టినరోజు చేసుకోవాలనే ఆసక్తిపోతుంది. ఏం చేసుకుంటాంలే అని అనిపిస్తుంది. నేను కూడా నా చిన్నప్పుడు పుట్టినరోజంటే సంబరపడిపోయేదాన్ని. తర్వాత మానేశా. అలానే వీడికి పదిహేనేళ్ళకే ఆసక్తిపోయినట్టుంది. వాడికే ఆసక్తి లేనప్పుడు నేను మాత్రం బలవంతపెట్టడం ఎందుకా అని అనిపించింది.
“సరే. నీ పుట్టినరోజు. నీ ఇష్టం,” అని చెప్పి ఊరుకున్నాను.
వాడు కూడా ‘సరే’ అన్నట్టుగా తల ఊపి, భోజనం తినేసి, తన గదిలోకి వెళ్ళిపోయాడు.
ఎందుకో వాడి ప్రవర్తనలో నాకు కొంచెం తేడా కనిపించింది. రోజూ భోజనం చేస్తూ నాకు ఏదో ఒకటి చెప్పేవాడు. సినిమాల గురించో, స్కూల్లో జరిగిన సంఘటనల గురించో, స్నేహితుల గురించో, ఏదో ఒక లోకాభిరామాయణం మాట్లాడుకునే వాళ్ళం. అందుకే వాడు భోజనం చేసేటప్పుడు పక్కనే కూర్చుంటాను. రోజు మొత్తంలో నాకు బాగా ఇష్టమైన నిమిషాలవి. ఈ రోజు ఏ అంశం గురించి మాట్లాడుతాడో అని ఆసక్తిగా ఎదురుచూసాను. వాడు మాత్రం నిశ్శబ్దంగా తినేసి లేచి వెళ్ళిపోయాడు.
మావారు ఆఫీసు నుండి రాగానే, ఇద్దరం కూర్చోని భోజనం చేస్తూ, పుట్టినరోజు విషయం గురించి, నాకు అనిపించిన దాని గురించి ఆయనతో చెప్పాను.
“స్కూల్లో అలసిపోయుంటాడు. నిద్రొస్తుంటుంది అందుకే త్వరగా తినేసి వెళ్లి పడుకోనుంటాడు. పుట్టిన రోజు వెనుక కూడా ఏదో కారణం ఉంటుంది. రేపు ఉదయం కనుక్కుందాంలే!” అని మావారు అన్నారు.
ఆయన చెప్పింది నిజమే. వచ్చే సంవత్సరం పదవ తరగతని, ఇప్పటి నుండి ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారని మొన్నటి రోజున వాడు నాతో చెప్పినట్టు జ్ఞాపకం. బహుశా, అందువల్లే ఇలా ఉన్నాడేమో! ఉదయం లేవగానే పుట్టినరోజు ఉత్సాహం వచ్చి మామూలైపోతాడులే అని అనుకొని అక్కడితో ఆ విషయం వదిలేశాను.
ఉదయం లేచి వాడికి నచ్చిన వంటలు చేసి వాడి లంచ్ బాక్స్‍లో పెట్టాను. టిఫిన్ కూడా వాడికి ఇష్టమైన కట్టెపొంగలి చేసాను. మావారికి పొంగలి నచ్చదు. అందుకే ఉప్మా చేసాను.
వాడు గదిలో నుండి బయటికి రాగానే విష్ చెయ్యాలనుకున్నాను. మావారు టిఫిన్ తింటూ ఉండగ, వాడి గది తలుపు శబ్దమైంది. ఇద్దరం అటువైపు చూశాం. వాడు గదిలో నుండి బయటికొచ్చాడు. వాడిని చూడగానే ఇద్దరం ఆశ్చర్యపోయాం. తలస్నానం చెయ్యలేదు; జుట్టుకు నూనే పెట్టుకున్నాడు. కొత్త బట్టలు వేసుకోలేదు; స్కూల్ యునిఫారం వేసుకున్నాడు. దేవుడికి దండం పెట్టుకోలేదు; తల ఎత్తకుండా వచ్చి టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు.
“ఏంట్రా ఇలా తయారైయ్యావు?” అని ఆశ్చర్యంగా అడిగాను.
వాడు నన్ను పట్టించుకోకుండా, రెండు టిఫిన్లు చూసి, పొంగలి పక్కనపెట్టి, తన కంచంలో ఉప్మా వడ్డించుకుంటున్నాడు. అది చూసి నేను నివ్వెరపోయాను.
“అదేంటి ఉప్మా పెట్టుకుంటున్నావు? ఆ పొంగలి చేసింది నీ కోసమే..!” అని గట్టిగా అన్నాను.
“నాకొద్దు,” అని గంభీరంగా చెప్పి గబగబా ఉప్మా తినటం మొదలుపెట్టాడు. వాడి ప్రవర్తన చాల విచిత్రంగా ఉంది. మావారు కూడా ఆశ్చర్యపోతున్నారు. పొంగలి తినమని మళ్ళీ అడిగాను. వద్దన్నాడు. వాళ్ళ నాన్న కూడా ఆడిగాడు. అయినా వద్దన్నాడు. మావారివైపు చూసి, ఎందుకిలా చేస్తున్నాడో అడగమని సైగ చేసాను. సరే అని తిరిగి సైగ చేసారు.
“ఈ ఏడు నువ్వు పుట్టినరోజు చేసుకోనన్నావని మీ అమ్మ నాతో చెప్పింది. నిజమేనా?” అని శాంతంగా అడిగారు మావారు.
“అవును నాన్న. పుట్టినరోజు చేసుకోవడంలేదు,” తల ఎత్తకుండానే సమాధానం చెప్పాడు.
“ఎందుకని? ప్రతి సంవత్సరం చేసుకుంటావు కదా. ఈ సంవత్సరం ఏమైందని చేసుకోనంటున్నావు?”
“ఏంకాలేదు,”
“ఏంకానప్పుడు ఎందుకు చేసుకోవడం లేదు మరి,”
ఏం చెప్పాలో తెలియక వాడు తటపటాయిస్తున్నాడు.
“ఏం జరిగిందో నిజం చెప్పురా..!” అని మావారు ఆరా తీసారు.
“ఏం జరగలేదు నాన్నా! చేసుకోవాలని లేదని చెప్పా కదా. అదే కారణం. ఇంకేం లేదు. ఊరికే అడిగి విసిగించకండి,” అని చిరాకుగా చెప్పి లేచి వెళ్లి చేయికడిగేశాడు.
మేము ఇంకా ఏమైనా అడుగుతామనేమో త్వరత్వరగా వెళ్ళి షూస్ వేసుకొని, క్యారేజి తీసుకొని, వెళ్ళొస్తానని కూడా చెప్పకుండా హడావిడిగా బయటికి వెళ్ళిపోయాడు. మేమిద్దరం ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. అంతలో మెల్లగా తిరిగి లోపలి వచ్చాడు. వాడిలో కంగారు కనిపిస్తోంది. నుదిటిపై చెమటలు పడుతున్నాయి. మాటలు తడబడుతున్నాయి.
“నాన్నా! ఈ రోజు మీరు బండిలో వెళ్ళకండి. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకు ఏమిటి అని అడగొద్దు. ఈ ఒక్కరోజుకు ప్లీజ్,” అని తడబడుతూ చెప్పి మా ఇద్దరివైపు దీనంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు.
వాడు వెళ్ళిన తర్వాత, వాడి ప్రవర్తనకు కారణం ఎమైవుంటుందని మేము ఇద్దరం కూర్చోని ఆలోచించాం. జవాబు తెలియలేదు. సరే సాయంకాలం వచ్చాక కారణం ఏంటో వాడినే అడిగి తెలుసుకుందామని అనుకున్నాం. వాడు అడిగినట్టుగానే మావారు ఆఫీసుకి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లారు.
నేను ఇంట్లో పని పూర్తి చేసుకునేటప్పటికి సమయం పదకొండు. ఫోను మోగుతుంటే ఎవరా అని వెళ్ళి చూసాను. ఫోన్లో వాడి స్కూల్ టీచర్ పేరు చూడగానే నాలో కొంచెం భయం మొదలైంది.
“హలో మేడం,” అన్నాను కంగారుగా.
“అమ్మ నేను…” అని వాడి గొంతు వినగానే కొంచెం శాంతించాను.
“ఏమైందిరా? ఎందుకు కాల్ చేశావు?”
“ఏం కాలేదు. ఊరికే కాల్ చేశా,” అని నిదానంగా చెప్పాడు.
ఆ మాట వినగానే టక్కున కోపం వచ్చింది.
“ఏమైందిరా నీకు? ఎందుకు ఈ రోజిలా ప్రవర్తిస్తున్నావు?”
“అమ్మా బెల్ కొడుతున్నారు. ఉంటా,” అని వెంటనే కాల్ కట్ చేసాడు.
అప్పుడు నాకొచ్చిన కోపానికి వాడు పక్కనే ఉండుంటే పుట్టినరోజని కూడా చూడకుండా తిట్టుండే దాన్ని. వాడి ప్రవర్తన అంతలా చిరాకు తెప్పించింది.
మధ్యాహ్నం నేను భోంచేసేటప్పుడు మావారు ఫోన్ చేశారు. స్కూల్ నుండి వాడు కాల్ చేశాడని, ఆఫీసుకి క్యాబ్‍లోనే వెళ్ళరా లేదా అని ఆరా తీశాడని చెప్పారు. నాకు కూడా చేశాడని చెప్పాను. వాడి మాటల్లో ఆందోళన గమనించానని ఆయన చెప్పారు. అప్పటి నుండి నేను వాడి గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎంత ఆలోచించినా, అంతలా ఆందోళన పడాల్సినంత పెద్ద విషయం జరిగినట్టుగా నాకైతే జ్ఞాపకం రాలేదు.
సాయంకాలం వాడు స్కూల్ నుండి ఇంటికి తిరిగొచ్చే సమయమైంది. అనుకుంటుండగానే, వాడు, వాడిస్నేహితుడు ఇద్దరూ రావడం చూసాను. వాడి స్నేహితుడిని అడిగి స్కూల్లో ఏమైనా జరిగిందేమో తెలుసుకుందామని అనుకున్నాను.
ఇంటి దగ్గరికి రాగానే తన స్నేహితుడికి బాయ్ చెప్పి, నా వైపు చూడకుండా తల దించుకొని నేరుగా లోపలి వెళ్ళిపోయాడు. తన స్నేహితుడు నన్ను చూసి ఆగాడు. నేను పలకరించి, విషయం అడిగాను. స్కూల్లో అలాంటిదేమీ జరగలేదు అని చెప్తూ, ఉదయం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు తనపై అరిచాడని, ఆకలిలేదని మధ్యాహ్నం భోజనం చెయ్యలేదని, రోజంతా ముఖం ముడుచుకొని ఉన్నాడని, అప్పుడప్పుడు ఎందుకో కంగారుపడుతూ కనిపించాడని చెప్పాడు.
వాడి స్నేహితుడిని పంపించి, నేను నేరుగా వెళ్లి వాడి బాక్స్ తీసి చూసాను. ఎలా పెట్టిన అన్నం మొత్తం అలానే ఉంది. నాకు చిర్రెత్తుకొచ్చింది. బాక్స్ పక్కన పెట్టి, కోపంగా వాడి గదిలోకి వెళ్లాను.
వాడు మంచం మీద కూర్చోని, చేతిలో పుస్తకం పట్టుకొని, చుదువుకుంటున్నట్టుగా తలదించుకొని ఉన్నాడు. నేను వెళ్లి వాడి ముందు నిలబడుకున్నా, తల ఎత్తలేదు.
“రేయ్..” అని కోపంగా పిలిచాను.
నిదానంగా తల ఎత్తి చూసాడు.
“ఇప్పటికే నీ మీద పీకల్లోతు కోపం ఉంది. కాబట్టి ఎందుకిలా ఉన్నావో మర్యాదగా నిజం చెప్పు. పుట్టినరోజున నా చేత తన్నులు తినద్దు. చెప్పు,” అని నాకొస్తున్న కోపాన్ని అణచుకొని అడిగాను.
అయినా కూడా వాడు ఏమి చెప్పకుండా దిక్కులు చూస్తున్నాడు. నాకు కోపం కట్టలుతెంచుకుంది.
“చెప్పరా!…” అని గట్టిగా అరిచాను.
వాడు ఉలిక్కిపడ్డాడు. ఒక క్షణం నా వైపు చూసి మళ్ళీ తల కిందికి దించాడు. వాడి కళ్ళల్లో నీళ్ళు నేను గమనించాను. కన్నీళ్లను వాడు ఆపుకుంటున్నట్టు నాకు అర్థమవుతోంది. జాలి వేసి నేను కూడా నా కోపాన్ని అదుపు చేసుకున్నాను.
“నువ్వు దేని గురించో ఆందోళనపడుతున్నావని అర్థమవుతోంది. ఆదేంటో చెప్తేనే కదా ఎదైనా చెయ్యగలము. చెప్పకుండా నీలో నువ్వు బాధపడుతూ, తిండి తినకుండా, మాతో సరిగ్గా మాట్లాడకుండా, రోజంతా ఇలా దిగులుగా ఉంటే ఎలా? అసలు కారణం ఏంటో చెప్పు?”
వాడు తడబడుతూ, చెప్పడం మొదలుపెట్టాడు.
“నేను పుట్టినరోజు చేసుకోను అని చెప్పింది ఆసక్తి లేకో, ఇష్టం లేకో కాదు – భయపడి!”
“భయపడటం ఎందుకు?”
“నేను పుట్టినరోజు జరుపుకున్న ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక చెడు జరుగుతోంది. పోయిన సంవత్సరం నాన్న బండిలో వెళుతుండగా ఆక్సిడెంట్ జరిగింది. అంతకముందు సంవత్సరం వంటింట్లో నీ తలకు దెబ్బతగిలింది. అంతకముందు రెండు సంవత్సరాలు కూడా ఇలానే ప్రమాదాలు జరిగినట్టు నాకు గుర్తుంది. ఇవన్ని నేను పుట్టినరోజు జరుపుకోవడం వల్లనే జరిగాయేమో అనే భయం పట్టుకుంది. అందుకే ఈ సంవత్సరం పుట్టినరోజు చేసుకోకూడదని అనుకున్నాను. పుట్టినరోజున నేను చేసే పనులు, తినే తిండి, ఇలా ఏవీ కూడా చెయ్యకుండా ఉంటే ఇంట్లో చెడు జరగదేమో అని అనిపించింది. అందుకే ఇలా…”
“తిక్కలోడివారా నువ్వు? యాదృచ్చికంగా జరిగిన సంఘటనలను పట్టుకొని ఇదంతా చేస్తున్నావా? ఇంత ముర్ఖంగా ఆలోచించడం ఎప్పుడు మొదలుపెట్టావ్రా?”
“నేనూ ముందు అలానే అనుకున్నాను. కానీ, కొంచెం అలోచిస్తే భయం వేసింది. ఖచ్చితంగా నా పుట్టినరోజు నాడే ఇవన్ని జరగడం, అందులోను ప్రతీ సంవత్సరం ఏదో ఒకటి జరగడం ఇవ్వన్ని నాలో భయాన్ని పెంచాయి. ఈసారి కూడా ఏమైనా జరుగుతుందేమో అనే భయంపట్టుకుంది. ఆ భయంతోనే నాన్నను బండిమీద వెళ్లొద్దని చెప్పను. మధ్యలో ఏమైనా జరిగిందేమో అని నీకు, నాన్నకు స్కూల్ నుండి కాల్ చేశాను.”
వాడలా గొంతులో భయం, కంగారు నాకు స్పష్టంగా అర్థమైయాయి.
“అసలు ఇది భయపడాల్సిన విషయమే కాదు. నువ్వు మర్చిపోయిన విషయం ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్నట్టు నా తలకి దెబ్బ తగిలింది, నాన్నకు ఆక్సిడెంట్ అయిన ముందు సంవత్సరం కాదు. అంతకు ముందు సంవత్సరం. మధ్యలో సంవత్సరం నువ్వు పుట్టినరోజు జరుపుకున్నావు. చాలా సంతోషంగా, సంబరంగా, పండగలా జరుపుకున్నావు. అప్పుడు ఎవరికీ ఏమీ కాలేదు. ఆ రోజంతా సంతోషంగానే గడిచింది. ఆదివారం ఆరోజు. ఉదయాన్నే కొత్తబట్టలు వేసుకొని, నచ్చిన తిండితిని, నీ స్నేహితులతో కలిసి బయటికెళ్ళి సాయంకాలం వచ్చావు. రెండు సినిమాలకి వెళ్ళావు ఆ రోజు. సరిగ్గా గుర్తుతెచ్చుకో.”
బాగా గుర్తుచేసుకొని “గుర్తొచ్చింది,” అని నీరసంగా చెప్పాడు.
“ఇక మిగితా సంవత్సరాలు అంటావా? అవన్నీ కూడా ఖచ్చితంగా నీ పుట్టినరోజు నాడు కానీ, నువ్వు పుట్టినరోజు చేసుకోవడం వల్ల కానీ, జరిగినవి కానే కావు. యాదృచ్చికాలు అంతే!”
“నిజంగానామ్మా?” అని రుద్ధకంఠంతో అడిగాడు.
“ముమ్మాటికి. ఇప్పటికైనా నీ అనుమానం, ఆందోళన తీరాయా?”
తీరాయి అన్నట్టు తల ఊపాడు. వాడ్ని చూసి నాకు జాలి వేసింది. వెళ్లి నేను వాడి పక్కన కూర్చున్నాను. వాడి గడ్డం పట్టుకొని తల పైకెత్తాను.
“అంత భయం ఎందుకు నాన్న. సరే. నీకు ఒక విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకో. ఎలాంటి సందర్భంలోనైనా సరే, అర్థంలేని భయాలతో, అనుమానాలతో, జీవితంలో దొరికే ఏ చిన్న సంతోషాన్నీ దూరం చేసుకోవద్దు. ఎందుకంటే మనిషికి చిన్న చిన్న సంతోషాలు చాలా ముఖ్యం. ఉదాహరణకి, నువ్వు రోజు భోజనం చేసేటప్పుడు నాతో ఏదో ఒకటి మాట్లాడుతావు. మాట్లాడేది సోది అని తెలిసినా సరే, ఇద్దరం మాట్లాడతాం కదా! అదీ ఒక రకమైన సంతోషమే. మాట్లాడేది సోదేలే అని మానేస్తే, ఆ కొద్ది క్షణాల సంతోషం మనం కోల్పోతాంగా. నిన్నటిలాగ. నువ్వు పుట్టినరోజు చేసుకుంటావో లేదో అది పూర్తిగా నీ ఇష్టం. కానీ చేసుకోవడంలో నీకు సంతోషముంటే, ఆ సంతోషాన్ని వదులుకోవద్దు. సరేనా?”
“సరే అమ్మా!” అని ప్రశాంతంగా చెప్పాడు. వాడి ముఖంలో ఊరట కనిపించింది. అది చూసి నాలో కూడా కొంచెం ప్రశాంతత కలిగింది.
తల తిప్పి గడియారం వైపు చూసాను. సమయం ఆరు గంటలైంది. ఒక ఉపాయం తట్టింది.
“నీ పుట్టినరోజు పూర్తవడానికి ఇంకా ఆరు గంటలు ఉంది. ఏం చేస్తావు? పుట్టినరోజు చేసుకుంటావా? లేదా చేసుకోనంటావా?” అని అడిగాను.
వాడు ఒక్క క్షణం ఆలోచించి, తర్వాత నా వైపు చూసి నిండుగా నవ్వి “నేను పుట్టినరోజు చేసుకుంటాను అమ్మ,” అని చెప్పాడు.