పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
మనది కాని సందర్భంలోకి మనని స్వాగతించి,
మనదే అనిపించేంతలా ఓ అనుభూతిని మన మనసులోకి ప్రవహించేలా చేసి,
మనని మనకి కొత్తగా, అత్యంత దెగ్గరగా పరిచయం చేసే కవిత్వం
చాలా అరుదుగా మన దోసిట్లోకి వస్తుందని నేను నమ్ముతుంటాను.
ఆశారాజు గారి కవిత్వం చాలావరకూ నా దృష్టిలో ఆ కోవకి చెందిందే.
కవిత్వం అనగానే మనకి అర్థంకానిదేదో అనుకునే భావన కొందరిది. నిజానికి కవిత్వం కానిదేది!? అని అనిపించేలా ఉంటాయి ఆశారాజు గారి కవితలు, కాదు కాదు మాటలు. అవును, మాటలే. మాటలని పోగేసి కొందరు కవిత్వం అంటారు అయితే, కవిత్వాన్ని మాటల్లో పొందుపరచడం కొందరికే అలవాటు.
కాలంతో, సంఘంతో, మనతో మనం యుద్ధం చేసి అలసిపోయిన నువ్వూ నేనూ ముఖాముఖి కూర్చుని సేదతీరుతూ మాట్లాడుకునే కబుర్లు కవిత్వమైతే ఎలా ఉంటుంది?
ఏదో పనిలో మునిగిపోయిన మనసుని గాలం వేసి పైకి లాగి కాస్త ఊపిరినందించే ప్రేమ తాలూకూ ఊహ పదాలలో దొర్లితే ఎలా ఉంటుంది?
రాయని ఉత్తరం అనే శీర్షికతో ఆశారాజు గారు రాసిన ఈ ఉత్తరం ఎన్నిసార్లు చదివినా, ఇది చేరాల్సిన చిరునామాకి నిజంగా చేరి ఉంటే, వాళ్ళు కూడా నాలాగే మాటల్లో పట్టలేని అనుభూతిని రుచి చూసి ఉండొచ్చు అనిపిస్తుంది.

“నాకు కవిత్వం రాయడం ఇష్టం ఉండదు
నేను దాచుకుని తిరిగే అన్ని గాయాలను
అది బయట పెడుతుంది”
ఆశారాజు గారు ఒకానొక కవితలో రాసిన ఈ మాటలే ఈ రాయని ఉత్తరం కవిత నేపథ్యం.
“సర్దుకోవడంలో మరిచిపోయావో / పనికిరానివని వదిలేశావో
నీ వస్తువులు కొన్ని నా దగ్గరే వుండిపోయాయి
ఇటువైపు వచ్చినపుడు వాటిని తీసుకెళ్లు!”
రాయని ఉత్తరం కవితలోని ఈ మొదటి వాక్యాలలో ‘సర్దుకోవడం’ అనే మాట ఆమె వెళ్లిపోయిందని చెబితే, ‘వదిలేసావో’ అనే మాట చెప్పలేని బాధని చూపాలని ప్రయత్నించింది.
కవిత అంతా జ్ఞాపకాల పోత.
కలిసి గడిపిన నిమిషాలు, స్థలాలు, కన్నులలో చెరగకుండా ముద్రేసుకున్న దృశ్యాలు, స్పర్శలు అన్నీ నేనింకా మరచిపోలేదు అని చెబుతూనే అవన్నీ ఇప్పుడు నావి కావు, కాబట్టి వచ్చి తీసుకెళ్ళు అనే అభ్యర్థనా పత్రం ఈ కవిత.
ప్రేమించడం ఒక అసంకల్పిత చర్య. ఆది అంతం తెలుసుకోకుండా మొదలుపెట్టే ప్రయాణం. కారణం ఒక్కటే, కలిసి బ్రతకడం. అయితే కలిసి చేసిన ఆ ప్రయాణంలో మాములుగా అనిపించిన ప్రతీది, ఒంటరిగా నడవడం మొదలుపెట్టాక విలువైనవిగా మారిపోతుంటాయి. ఆశారాజు గారి వ్యక్తీకరణల్లో మనం ఆ విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటాము.
“నేను ఎటు కదిలినా
మూటలు కట్టిన నీ వస్తువులే అడ్డుపడి దొర్లుతున్నాయి
నిలుచోలేను కూర్చోలేను!”
విడిపోవడం సులువే కానీ మరచిపోవడం దాదాపు అసాధ్యమే. ఆ సత్యానికి కవిత్వ సూచనే ఆ ‘నిలుచోలేను’, ‘కూర్చోలేను’ పదాలు. కవితలో ప్రతి రెండు మాటలకి ఒకసారి, మిగిలిపోయినవి తీసుకెళ్ళమని అడుగుతూనే, అలాగైనా ఓసారి ఇటు రా అని కోరడం కనిపిస్తుంది.
“ఆలస్యం చేయకుండా వచ్చి
మూలమూలల వెతికి వెతికి
వదిలేసిన వస్తువులన్నీ తీసుకెళ్లు
కనీసం మరణించడానికైనా
నాకు కొంచెం ఖాళీస్థలం దొరుకుతుంది”
కవితలోని ఈ చివరి వాక్యాలు చెప్పేది ఒకటి అయితే, చెప్పకుండానే అర్థమయ్యేలా చేసింది ఏమిటంటే అతని జీవితంలో ప్రతీ చోట ఆమెనే నిండిపోయింది, అందులో తనకి కూడా చోటు లేదు అనిపించేంతలా ప్రేమ తననుండి తనని వెలివేసిందనే వేదన.
అప్పటిదాకా నచ్చిన కవితకి, నేను అభిమానిగా మారింది ఈ ఆఖరి వాక్యం వల్లే.
సహజత్వం, సౌమ్యత ఆశారాజు గారి సంతకం.