పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
పుస్తకం: తియ్యని చదువు
రచయిత: వేంపల్లె షరీఫ్
_

ఒక ఊళ్లో ఒక బుల్లి మేఘం ఉండేది. ఆ మేఘానికి ఓ బుల్లి స్నేహితుడు ఉండేవాడు. వాడి పేరు సుబ్బడు. నాలుగవ తరగతి చదువుతున్నాడు. ప్రతి రోజు ఆ మేఘం అతనింటి పెరట్లో దిగి అతనితో ఆడుకునేది. పాడుకునేది. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్లు. అప్పుడప్పుడు మేఘం తన కష్టాలు చెప్పుకుని బాధపడేది. సుబ్బడు స్కూల్లోని పాఠాలు మేఘానికి వినిపించేవాడు. మేఘం “భలే..భలే..” అని రెండు చేతులు టపాటపా కొడుతూ నవ్వేది. సుబ్బడి ఇంటి పెరడు ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండేది. ఊరంతా కరువు వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఉంటే సుబ్బడి పెరడు మాత్రం ఈస్ట్ మన్ కలర్ మెరిసిపోతూ ఉండేది.
సుబ్బడికి చెట్లంటే ప్రాణం. వాటిని పెంచడమంటే ఇష్టం. తోటి పిల్లలంతా స్కూలు వదలగానే హాయిగా ఆటల్లో మునిగిపోతారు. కానీ సుబ్బడు మాత్రం ఆడుకున్నంతసేపూ ఆడుకుని తర్వాత తోటపనికి దిగేవాడు. అది అతనికి ఎంతో ఆనందాన్నిచ్చేది.
మొక్కల మధ్య గడ్డి మొక్కలు తొలగించేవాడు సుబ్బడు. జాగ్రత్తగా ప్రతి మొక్కనూ చూసి నీళ్లు పోసేవాడు. ఆ వూర్లో నీళ్లు కరువైనా, దూరంలో ఉన్న కుంటకెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చి ఓపిగ్గా అన్ని చెట్లకూ సమానంగా పోసేవాడు. తాను అనుకున్న మోతాదుకు గ్లాసెడు నీళ్లు తక్కువైనా భరించలేకపోయేవాడు. మళ్లీ అదే పనిగా కుంటకెళ్లి నీళ్లు తెచ్చి తక్కువైన చెట్టుకు పోసి దానికి న్యాయం చేసేవాడు.
చిన్నతనంలోనే అతనిలో ఉన్న మంచితనం, మానవత్వం, సమానత్వం పైనున్న ఆ బుల్లి మేఘానికి నచ్చాయి. పైన మేఘాలన్నీ చెట్లున్న ప్రాంతానికి వలస పోతున్నాయి. ఆఊరి చుట్టుపక్కల ఎక్కడా కొండల్లో చెట్లు లేవు. ఆ ఊరివాళ్లు తమ స్వార్థం కోసం వాటిని నరికేశారు. అలాంటప్పుడు ఆ మేఘానికి బుద్ధిగా పెరట్లో చెట్లకు నీళ్లు పోస్తున్న సుబ్బడు కంటపడ్డాడు. సుబ్బణ్ని చూసి మేఘం మురిసిపోయింది. అతనితో స్నేహం చేయాలనుకుంది. మెల్లగా పెరట్లో చెట్లద్వారా కిందికి దిగింది. ఆ చెట్లే లేకుంటే మేఘానికి కిందకి దిగాలని ఉన్నా, సుబ్బడితో మాట్లాడాలని ఉన్నా దిగలేక పోయేది. ఆ చెట్లు మేఘాన్ని, సుబ్బడిని కలిపాయి. అవి ఒక నిచ్చెనలా పనిచేశాయి. అప్పట్నుంచి సుబ్బడు, మేఘం స్నేహితులయ్యారు.
మొదట మేఘం “ఓబ్బీ.. నీ పేరేంది?” అని అడిగింది (ఈ కథ జరిగింది కడపలో కాబట్టి అక్కడ ఇట్టనే మాట్లాడుతార్లే ! ).
“నా పేరు సుబ్బడు. అయితే ఏంది?” అని అన్నాడు సుబ్బడు.
“ఏమీ లేదూ.. నీకు చెట్టు, చేమా అంటే ఎందుకిట్టం కలిగింది?’ అని అడిగింది మేఘం.
“చెట్లు లేక వానలు రావడంలా. వానలు లేక పంటలు పండటం లా. పంటలు పండక రైతులంతా పస్తులుంటాండారు. కొంతమంది టవున్లకు వెళ్లిపోతాండారు. ఆడ హోటళ్లలో పనిజేచ్చాండారు. పిల్లోళ్లంతా ఆగమైపోతాండారు. ఇస్కూల్లో సారు జూత్తే ‘చెట్లు నాటండిరా.. నాయాళ్లారా.. మీ అమ్మానాయన బాగుపడతారు. వారు బాగు పడితే మీరు బాగుపడినట్టే గదరా..’ అనిచెప్పబట్టినాడు. ఎట్టజేయాల మేఘమన్నా. అందుకే చెట్లు పెంచుతాండా..” అన్నాడు సుబ్బడు అమాయకంగా.
సుబ్బడి మాటలు చిలుక పలుకుల్లా అనిపించి ఆ బులిమేఘానికి జాలిని, బాధని కలిగించాయి.
“మరి నాతో జట్టు కడతావా?” అని అడిగింది మేఘం.
“బలేవాడివే నువ్వు. అంతగా అడుగుతాంటే కాదంటానా, సెప్పు..” అని చెయ్యి కలిపాడు సుబ్బడు.
అలా ఇద్దరి స్నేహం కుదిరింది. సుబ్బడి కోసమైనా మేఘం మైళ్లకు మైళ్లు వెళ్లి నీళ్లు తీసుకొచ్చి పెరట్లో వర్షించేది. మరెక్కడా పడకుండా ఒక్క సుబ్బడి పెరట్లోనే వాన పడటం అందరినీ ఆశ్చర్యపరిచింది ఓ రోజు.
సుబ్బడు గలగలా నవ్వేశాడు.
“మేఘం నా నేస్తం… చెట్లను పెంచితే అది అందరికీ ఫ్రెండ్ అయితాది. అందరితో స్నేహం జేచ్చాది” అన్నాడు.
“అట్టనా” అని తలలు గీరుకుంటూ జనం అక్కడ్నుంచి కదిలారు. వాళ్లకు బుద్దిచ్చింది. కొండల్లో చెట్లను నరకడం మానేశారు. ఎవరైనా నరుకుతున్నా అడ్డుకున్నారు. చేతనైన కాడికి అందరూ చెట్లను నాటడం, పెంచడం మొదలు పెట్టారు. కొన్నేళ్లకు అవి పెరిగి పెద్దవయ్యాయి. పువ్వు చుట్టూ తుమ్మెదలాగా మేఘాలన్నీ ఆ చెట్లపై వాలాయి. హాయిగా ఆడుకున్నాయి. క్రమేనా వర్షించాయి. ఆ ఊర్లో కరువు దూదిపింజలా ఎగిరిపోయింది.
***