పుస్తక పరిచయం : యామం
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. అలానే నగరాలు అంటే ఎత్తైన భవనాలు, వెడల్పైన రహదారులు మాత్రమే కాదు. ఆ రహదారుల
మన జీవితంలో పుస్తకాలు కేవలం కాగితాల సమూహం కాదు, అవి మన ఆలోచనలకు, ఆశలకు, అస్తిత్వానికి ప్రతిరూపాలు. అలాంటి ఒక పాఠకుడి అంతరంగ ప్రయాణాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.
మీరు పుస్తకాలు చదవడం ఎప్పుడు మొదలుపెట్టారు? అది మీ జీవితాన్ని ఎలా మార్చింది?
ఈశ్వర్: పదో ఏట సరదాగా మొదలైన నా పఠన ప్రయాణం, పదిహేనో ఏట ఆగిపోయింది. బీటెక్ తర్వాత ఉద్యోగ పోరాటంలో తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, మళ్ళీ పుస్తకాన్నే ఆశ్రయించాను. ఆ పుస్తకాలే నాకు నేను ఎవరో గుర్తుచేశాయి, నా వేదనకు స్నేహితుడిగా నిలిచాయి. అప్పటినుండి పుస్తకాలు నా జీవితంలో వెలుగుగా మారి, నేటికీ నా శ్వాసగా కొనసాగుతున్నాయి.
పుస్తకాలు చదవడానికి మీకు ప్రేరణ ఎలా కలిగింది?
ఈశ్వర్: మా బాబాయ్ చెప్పే కథలు వింటున్నప్పుడు, పదాలు కేవలం వినిపించడం కాదు, నా కళ్ళ ముందు కనిపించేవి. ఆ తర్వాత ఆయన లైబ్రరీలో దొరికిన “చందమామ కథలు” చదివాక, పుస్తకాల్లో ఓ కొత్త ప్రపంచం ఉందని అర్థమైంది. “కొన్ని ప్రపంచాలు మన చేతుల్లో పుటలుగా పుడతాయి” అన్న సత్యం తెలిశాక, పుస్తకాలలో నన్ను నేను కనుగొనాలన్న ఆశతో నా ప్రయాణం మొదలైంది.
మొదట్లో ఎలాంటి పుస్తకాలు ఇష్టపడేవారు? ఇప్పుడు మీ అభిరుచులు ఎలా మారాయి?
ఈశ్వర్: ప్రారంభంలో సాహస, గూఢచారి కథల్లోని ఉత్కంఠ నాకు బాగా నచ్చేది. అది నాకో ఆటవిడుపు. కానీ జీవితానుభవాలు నన్ను మార్చాయి. ఇప్పుడు మానసిక లోతులు, ఆత్మకథలు, జీవిత చరిత్రలు, మనసును తడిమే నవలలు నన్ను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు చదవడం కేవలం ఆనందం కాదు, నా మనసును అద్దంలో చూసుకోవడం లాగ అయిపొయింది.
మీరు ఎక్కువగా ఏ రకాల పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు?
ఈశ్వర్: నన్ను నేను అర్థం చేసుకోవాలనే తపనే నన్ను చదివిస్తుంది. అందుకే మానవ స్వభావం, వ్యక్తుల అంతరంగాలను ఆవిష్కరించే కథలు, నవలలు ఎక్కువగా ఇష్టపడతాను. ప్రేరణ కోసం జీవిత చరిత్రలు, ఆత్మవిశ్లేషణ కోసం జ్ఞాన పుస్తకాలు కూడా చదువుతాను. నేను చదివేది “రచనలని” కాదు, “మనుషులని.”
మిమ్మల్ని జీవితాంతం ప్రభావితం చేసిన పుస్తకం ఏది?
ఈశ్వర్: డాక్టర్ వి.ఆర్. రాసాని గారు రాసిన “స్వప్నజీవి”. ఆ పుస్తకం నా జీవితం మీద నాకున్న దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది. “మనిషి శరీరంతో బతుకుతాడు కానీ, కలలతో జీవిస్తాడు” అన్న సత్యం అందులోనే తెలిసింది. జీవితం శాశ్వతం కాదని, నిశ్శబ్దం వెనుక ఉన్న అర్థాన్ని వెతకాలని ఆ పుస్తకం నాకు నేర్పింది.
మీకు ఇష్టమైన పుస్తక పాత్ర ఏది? ఎందుకు?
ఈశ్వర్: స్వప్నజీవి” లోని కథానాయకుడే. ఆ పాత్రలో నన్ను నేను చూసుకున్నాను. అతని కలలు, అంతర్మథనం, జీవితంపై అతనికున్న ప్రశ్నలు నాలోనే ప్రతిధ్వనించాయి. తనను తాను అర్థం చేసుకోవడమే నిజమైన స్వేచ్ఛ అని ఆ పాత్ర ద్వారా తెలుసుకున్నాను. అందుకే ఆ పాత్ర నాలో ఎప్పటికీ నిలిచిపోయింది.
పుస్తకాలు చదివేటప్పుడు మీకున్న ప్రత్యేక అలవాట్లు ఏమిటి?
ఈశ్వర్: సూర్యకిరణాలు పడే సోఫాలో కూర్చుని చదవడం మొదలుపెడతాను. పుస్తకం తెరిచే ముందు, చివరి పేజీని ఓసారి చూస్తాను. “ఇది చదివాక నేను మారతానా?” అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. చదివేటప్పుడు ముఖ్యమైన వాక్యాలను హైలైట్ చేస్తాను. పుస్తకం ముగించాక, ఒక్క నిమిషం మౌనంగా ఉండి, ఆ అనుభవానికి, రచయితకు, పాత్రలకు కృతజ్ఞతలు తెలుపుతాను.
కొత్త పుస్తకాలను ఎలా ఎంచుకుంటారు?
ఈశ్వర్: పుస్తకం పేరు, కవర్ కన్నా, దానిలోని భాష, వాక్యాలలోని భావం, రచయిత లేవనెత్తే ప్రశ్న నాకెక్కువ ముఖ్యం. కొన్నిసార్లు టైటిల్, లేదా ఒకే ఒక్క వాక్యం నన్ను ఆకర్షిస్తే చాలు, చదవకుండా ఉండలేను. అంతిమంగా, నేను పుస్తకాన్ని ఎంచుకోను, పుస్తకమే నన్ను ఎంచుకుంటుంది.
మీకు ఇష్టమైన రచయితలు ఎవరు? వారి రచనలు ఎందుకు ఇష్టం?
మీ హృదయాన్ని తాకిన కొన్ని వాక్యాలు పంచుకోగలరా?
ఇటీవల చదివిన ఆసక్తికరమైన పుస్తకం ఏది?
ఈశ్వర్: “జిగిరి”, రచయిత పెద్దింటి అశోక్ కుమార్. పెంపుడు జంతువుకు, మనిషికి మధ్య ఉండే ప్రేమ, విశ్వాసాన్ని హృద్యంగా చిత్రించిన నవల ఇది. మనిషిలోని క్రూరత్వాన్ని, మానవత్వం చచ్చిపోయిన తీరును కళ్ళకు కడుతుంది. ఇది కేవలం జంతువు కథ కాదు, మనిషిలోని మృగాన్ని అద్దంలో చూపిన ప్రతిబింబం.
పుస్తకాలు చదవడం మీకు ప్యాషనా? అలవాటా?
ఈశ్వర్: మొదట ప్యాషన్‌గా ఉండేది. కొత్త ప్రపంచాలను పరిచయం చేసింది. కానీ ఇప్పుడు అది నా శ్వాస. పుస్తకం లేకుండా రోజు గడవదు. ఇది నా జీవన విధానం.
తెలుగు పుస్తకాల ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మీ ప్రయాణం ఎలా మొదలైంది?
ఈశ్వర్: నేను చదివిన అద్భుతమైన పుస్తకాలను అందరితో పంచుకోవాలనే తపనతో ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న చిన్న సమీక్షలు పెట్టడం మొదలుపెట్టాను. నెమ్మదిగా పాఠకులతో కనెక్ట్ అయ్యాను. రచయితలతో కలిసి పనిచేయడం, లైవ్ సెషన్లు, గివ్‌అవేలతో నా ప్రయాణం కొనసాగుతోంది.
ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మీకు గుర్తుండిపోయిన సంఘటన ఏది?
ఈశ్వర్: వెంకట్ సిద్దారెడ్డి గారు “కథా ఉత్సవం”కి ఆహ్వానించి, ఖదీర్ బాబు గారు నన్ను స్టేజి మీదకు పిలిచిన క్షణం మర్చిపోలేను. ఒక మాట ఎవరినైనా ప్రభావితం చేయగలదన్న నమ్మకం ఆ రోజు బలపడింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నందుకు గర్వపడ్డాను.
రాబోయే 5 ఏళ్లలో తెలుగు సాహిత్యంలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు?
ఈశ్వర్: ఆధునిక జీవనశైలిలోని ఒంటరితనం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై కథలు రావాలి. మహిళల దృక్కోణాలు, ఆధునిక గ్రామీణ జీవితం, సైన్స్ ఫిక్షన్ వంటి విభిన్న కథాంశాలు రావాలి. వాస్తవ సంఘటనల ఆధారంగా, ధైర్యంగా ఉండే రచనలకు ప్రాధాన్యత పెరగాలి.