పలకరిస్తే పద్యం – చాటువులు

తెలుగు పద్యాలా!, ఆమ్మో !! అవన్నీ పెద్ద పెద్ద పుస్తకాల్లో, పండితులకే తప్ప మనకు అర్థం కావు అనుకుంటున్నారా? అస్సలు కాదండి. మన సాహిత్యంలో బోలెడంత సరదాల్ని నవ్వుల్నీ పంచె సాధనాలు. ఈ రోజు మనం అలాంటి ఓ చిలిపి పద్యాన్ని. అదే ‘చాటువు’.

అసలు చాటువు అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే, ఇది ఒక రకమైన తెలుగు ట్వీట్ లాంటిది. కవి యొక్క తెలివిని, సమయస్ఫూర్తిని, హాస్యాన్ని చూపించే చిన్న పద్యం అన్నమాట. సభల్లో రాజులనూ, ప్రజలనూ నవ్వించడానికి అప్పటికప్పుడు చెప్పినవే ఈ చాటువులు.

సరే, మరి ఈ రోజు మనం నేర్చుకోబోయే చాటువు ఇదే:

“శివుడద్రిని శయనించుట

రవిచంద్రులు మింటనుంట రాజీవాక్షుం

డవిరళముగ శేషునిపై

బవళించుట నల్లి బాధ పడలేక సుమీ!”

 

పద్యం వినడానికి ఎంతో గంభీరంగా మొదలైంది కదూ? కానీ దీని వెనుక ఉన్న అసలు కథే వేరు. పద్యాన్ని మెల్లగా విడదీసి చూద్దాం.

కవి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. మొదటిది, “శివుడద్రిని శయనించుట“… అంటే, పరమశివుడు మెత్తటి పరుపులు, పాన్పులు వదిలేసి కఠినంగా, చల్లగా ఉండే ఆ కైలాస పర్వతం మీద ఎందుకు పడుకున్నాడు?

రెండోది, “రవిచంద్రులు మింటనుంట“… సూర్యచంద్రులు భూమి మీదకు రాకుండా ఎప్పుడూ ఆకాశంలోనే ఎందుకు ఉండిపోయారు?

మూడోది, “రాజీవాక్షుండవిరళముగ శేషునిపై బవళించుట“… అంటే, పద్మాల వంటి కన్నులున్న విష్ణుమూర్తి ఎప్పుడూ ఆ పాలసముద్రంలో పాము మీదనే ఎందుకు పడుకున్నాడు?

వీటన్నిటికీ మనకు తెలిసిన ఆధ్యాత్మిక, పౌరాణిక కారణాలు చాలా ఉన్నాయి. శివుడికి హిమాలయాలంటే ఇష్టమని, విష్ణువు యోగ నిద్రలో ఉంటాడని మనం చదువుకున్నాం. కానీ ఈ పద్యం చెప్పిన కవి వీటన్నిటినీ పక్కనపెట్టి, చివరి లైన్‌లో ఒకేఒక్క సమాధానంతో మనల్ని ఆశ్చర్యపరిచి నవ్విస్తారు. ఆ చివరి లైన్ ఏంటంటే…

“...నల్లి బాధ పడలేక సుమీ!“

చూశారా! మొత్తం కథ ఎలా మారిపోయిందో! ఆ ముగ్గురు దేవుళ్ళు అన్ని కష్టమైన చోట్ల ఉండటానికి కారణం… భూమ్మీద పరుపుల్లో ఉండే నల్లుల బాధను భరించలేకనే అట! శివుడు కొండ మీదకు, విష్ణువు సముద్రంలోకి, సూర్యచంద్రులు ఆకాశంలోకి వెళ్ళిపోవడానికి అసలు కారణం ఈ చిన్న నల్లులే అని కవి చమత్కరించారు. 

ప్రపంచాన్ని పాలించే దేవుళ్ళను కూడా ఒక సామాన్యమైన నల్లి ఎంత ఇబ్బంది పెట్టిందో అని చెప్పడం ద్వారా, కవి వారి గొప్పతనాన్ని తగ్గించలేదు. బదులుగా, మనలాంటి ఒక సాధారణ సమస్యతో వారిని ముడిపెట్టి మనకు మరింత దగ్గర చేశారు. ఇదే చాటువుల గొప్పతనం.

చూసారుగా కష్టమైన పద్యాలు కాదు, ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకని ఇకపై పద్యం అనగానే భయపడకండి. ఇలాంటి ఎన్నో సరదా ముత్యాలు మన తెలుగు సాహిత్యంలో దాగి ఉన్నాయి. వాటిని వెతికి చదివితే భలేగా ఉంటుంది.

మరో పద్యంతో వచ్చే సంచికలో కలుద్దాం! అంతవరకు సెలవు.

 

ప్రతిపదార్థము (విపులంగా)

  • శివుడు = ఈశ్వరుడు, త్రిలోకనాథుడు;
  • అద్రిని = పర్వతముపై (ఇక్కడ కైలాస పర్వతము అని భావము);
  • శయనించుట = పవళించుట, నిద్రించుట;
  • రవిచంద్రులు = సూర్యుడు మరియు చంద్రుడు;
  • మింటన్ = ఆకాశమునందు, గగనవీధిలో;
  • ఉంట = నివసించుట, ఉండుట;
  • రాజీవ-అక్షుండు = రాజీవము (పద్మము) వంటి అక్షులు (నేత్రములు) కలవాడు, అనగా శ్రీమహావిష్ణువు;
  • అవిరళముగ = నిరంతరాయముగా, ఎడతెగక;
  • శేషునిపై = సర్పరాజైన ఆదిశేషుని మీద;
  • పవళించుట = శయనించుట;
  • నల్లి బాధ = మత్కుణముల (నల్లుల) వలన కలిగెడి పీడను, వేదనను;
  • పడలేక = సహింపలేక, భరింపలేక;
  • సుమీ! = సుమా! (ఇది ఒక అవధారణార్థకము, అనగా నిశ్చయముగా అని తెలుసుకొనుము).

 

error: Content is protected !!