పాత రచనలు – కొత్త పరిచయం – తిలక్ కవిత్వం

ఆర్తి అంటే ?……….. బాధా, దు:ఖమా, ఆర్ధ్రతా……….ఏమో సరిగ్గా చెప్పలేము. వీటన్నింటి అర్ధం ఒక్కటేనేమో. కానీ ఆర్తి అనే పదానికి ఒక ప్రత్యేక భావం ఉందని నాకనిపిస్తుంది. ఆర్తిలో ఒక శక్తి ఉంటుంది. హృదయాలను కదిలించే తీవ్రత ఉంటుంది. భాషలో ఇమడలేని భావం. పదాలకు అందని అనుభూతి. మనసుకు మాత్రమే తట్టే ఒక భావన. సరిగ్గా ఇటువంటి భావమే తిలక్ కవిత్వంలో మనకు గోచరిస్తుంది. అభ్యుదయ కవిత్వంలో ఓ మెరుపు దేవరకొండ బాలగంగాధర తిలక్. అభ్యుదయంలో భావాన్నీ….భావంలో అభ్యుదయాన్ని కలగలిపి అద్భుతమైన కవిత్వాన్ని అందించిన తిలక్ ఒక విశిష్ట కవి. అందుకే

‘నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయాపారావతారాలు
నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు
నా అక్షరాలలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’

 

అంటూ తన కవిత్వం పరమార్ధాన్ని చెప్పుకున్నారు భావకవుల్లో అభ్యదయ కవీ, అభ్యదయ కవుల్లో భావ కవీ అయిన తిలక్.

నా కవిత్వం కాదొక తత్వం…. మరి కాదు మీరనే మనస్తత్వం………కాదు ధనికవాదం, సామ్యవాదం…….కాదయ్యా అయోమయం, జరామయం అని చెప్పుకున్న తిలక్ కవిత్వంలో అన్ని కోణాలను స్పృశించారు. హాయి, మాధుర్యం, నైరాశ్యం, దు:ఖం, ఉద్వేగం, వేదన, భయం ఇలా అన్ని కోణాలను స్పశిస్తూ తన కవిత్వాన్ని పరిపుష్టం చేశారు తిలక్. వచనకవిత్వానికి జిగిబిగి కూర్చినవారు బాలగంగాధర తిలక్. మంచి మంచి పదాలతో అందంగా కవిత్వాన్ని అల్లడం తిలక్ ప్రత్యేకత. మనసు హత్తుకునే శైలి ఈయనది. ఎటువంటి వారి హృదయాన్నైనా కదలించగల శక్తి ఈయన కవిత్వం సొంతం.కవిత్వంలో తిలక్ ప్రయోగించి ఒడుపులు ఆనాటి సంప్రదాయవాదుల చేత సైతం శభాష్ అనిపించుకున్నాయి.

తిలక్ అనుభూతివాది…. అంతకు మించి మానవతావాది. ఈయన కవితలలో మానవతావాదం ఉట్టిపడుతూ ఉంటుంది.అందుకే కుందుర్తి అంటారు…”అభ్యదయ కవితా యుగపు ప్రధాన లక్షణమైన అంతర్జాతీయ భావనా, సంకుచితమైన జాతిమతాల సరిహద్దులను చెరిపివేసి, అకుంఠిత మానవీయ పతాకను ఎగురవేసే తత్వమూ గల అభ్యదయ కవి కంఠం” తిలక్ ది అని.

తిలక్ కవితలలో ఓ మంచి కవిత తపాలా బంట్రోతు. తపాలా శాఖ వార్షికోత్సవం సందర్భంగా రాసిన కవిత ఇది. తపాలా బంట్రోతు(పోస్ట్ మాన్)……. ఇంటికీ ఇంటికీ తిరుగుతూ ఉత్తరాలు పంచే ఉద్యోగం. ఇతని మీద కవిత్వం. కొంచెం కష్టమే…. ఇతని గురించి ఆలోచించే వారు కూడా అరుదుగా ఉంటారు. అసలేముందీ ఇతనిలో రాయడానికీ. ఇది అందరికీ అనిపించే విషయం. కానీ తిలక్ తపాల బంట్రోతు మీద కవిత్వం రాసారు. అదీ అద్భుతంగా……అత్యంత అందంగా. చదివే వారిని కదిలించేలా.

పోస్ట్ మాన్ మీద ఊహలు రానేరావు అంటూనే………అతని మీద కవిత్వం రాస్తే డబ్బులు, పేరు రావంటూనే….. తపాలాబంట్రోతును వర్ణిస్తారు తిలక్. పోస్ట్ మాన్ అతని గురించి ఎదురు చేసే వారి భావాలను కళ్ళకు కట్టేలా వర్ణించారు. ఉత్తరాలను అందించే వారికి తపాలా బంట్రోతు రాజుతో సమానమని అంటూనే……

‘కొందరికి పరిచయమైన నవ్వు
కొందరికి తలపంకించిన నవ్వు
కొన్ని వైపులకి చూడనే చూడవు
అందరికీ నువు ఆప్తబంధువువి
అందరికీ నువు వార్త నందిస్తావు
కానీ నీ కథనం మాత్రం నీటిలోనే మథనం
అవుతూంటుంది.
ఇన్ని ఇళ్ళు తిరిగినా
నీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపలేదు
ఇన్ని కళ్ళు పిలిచినా
ఒక్క నయనం నీ కోటుదాటి లోపలకు చూడదు
ఉత్తరం యిచ్చి నిర్లిప్తుడిలాగ వెళ్ళిపోయే నిన్ను చూసినపుడు
తీరం వదిలి సముద్రంలోకి పోతున్న ఏకాకి నౌక చప్పుడు..’

అంటూ దుర్భాగ్యమైన తపాలా బంట్రోతు జీవితాన్ని వర్ణిస్తారు.కాలాలు మారినా పోస్ట్ మాన్ జీవితం మారడం లేదంటూ సునిశితంగా విమర్శిస్తారు.తిలక్ కవిత్వంలో కనిపించే అనుభూతులన్నీ ఒక్క తపాలా బంట్రోతు కవిత్వంలోనే మనకు అనుభూతినిస్తాయి.

అంతేకాదు పోస్ట్ మాన్ గురించే కాక అతని గురించి ఎదురు చూసే వాళ్ళ గురించి కూడా తిలక్ అందంగా, హృద్యంగా వర్ణిస్తారు. ప్రియుని ఉత్తరం గురించి ఎదురు చూసే అమ్మాయి చూపులు తుమ్మెద బారులట, ఆమె కోర్కెల గజ్జెలు వీధి వీధంతా ధ్వనిస్తాయట. ఎంత చక్కని ఊహో కదా. ఆలా రాస్తుంటే ఒక కిటికీ….దాని ముందు ఓ చక్కని చుక్క… ఆమె ఎదురు చూపులు అన్నీ మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. అప్పుడు వచ్చే పోస్ట్ మాన్ వంక ఆమె చూసే చూపులు…ఉత్తరం రాలేదని అతను నవ్వే చిన్న నవ్వు అన్నీ మనకు అనుభూతిలోకి వస్తాయి.

‘అమ్మాయీ
పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి
పళ్ళేరంలో పెట్టి ప్రాణనాథుడి కందించాలనే
నీ ఆశ నాకు అర్ధమయింది
అందుకే చూపులు తుమ్మెద బారులు కట్టి
నీ కోర్కెలు గజ్జెలవలె ఘలంఘలించి
వీధి వీధినంతా మేల్కొలుపుతున్నాయి
వీధివీధినంతా కలయజూస్తున్నాయి
అడుగో పోస్ట్ మాన్
ఒక్క ఉదుటున వీధిలోకి నువ్వు
అతని మొహం మీద లేదని చెప్పడానికి బదులు చిరునవ్వు
వెళ్ళిపోతున్న తపాలా బంట్రోతు వెనుక
విచ్చిన రెండు కల్హార సరస్సులు.’

కల్హార సరస్సులు…….ఎంత అందమైన వాక్యమో కదా….. ఆమె కళ్ళు కలువలు అయితే , కలకంఠ కన్నీరు ఒలికితే అవి కల్హార సరస్సులు కాక మరేమవుతాయి.

ఇంకా అస్సాంలో సైనికుడిగా పనిచేసే కొడుకు ఉత్తరం గురించి ఎదురు చూసే ముసలి అవ్వకి తొందరగా ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వమంటారు తిలక్.కొడగట్టిపోతున్న ఆమె జీవితానికి వెలుగు నిమ్మంటారు. ముడతలు పడిన మొహం మీద ఆనందాన్ని చూడమంటారు.

‘వగచే తల్లికి
చేరువచురువౌతున్న నువ్వొక ఊరట
దగ్గర దగ్గరవుతున్న మిత్రుని లేఖ కోసం
నిలిచిన తురుణిడికి నీ రాక ఒక బాసట
వర్తకుడికి నర్తకుడికి ఖైదులో దొంగకి హంతకుడికి
ఉద్యోగశప్తుడైన నవీన యక్షునికి
మనిషికి రాక్షసునికి
నువ్వు
దూరాల దారాల్ని విచిత్రంగా
ఒకే నిముషము
అనే కంచె చుట్టూ త్రిప్పగల నేర్పరవి….. కూర్పరవి’

నిజమే కదా…… ఒక్క తపాలా బంట్రోతు చుట్టూ ఎన్ని జీవితాలు పరిభ్రమిస్తాయో కదా. అతని మేజిక్ సంచీలోని శుభాశుభాల కోసం ఎంత పరితపిస్తాయో కదా. ఆధునికి వైజ్ఞానిక యుగంలో ఉత్తరాల ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోతోంది.అయినప్పటికీ ఇప్పటికీ ఇలా ఉత్తరాల కోసం ఎదురు చూసే వాళ్ళు….. ఎంతో మంది ఉన్నారు. ఉత్తరాలు రాసుకోవడంలో ఉండే ఆనందం…… వాటి కోసం ఎదురు చూడడంలో ఉండే తపన, అవి అందాక ముఖంలో కనిపించే కోటి కాంతులు ఎప్పటీకి మరిచిపోలేము. ఎన్ని యుగాలు గడిచినా….. ఎంత అభివృద్ధి చెందినా అందులో ఉన్న ఆనందం ఇంకెందులోనూ రాదు, అవునంటారా…… అందుకే మనం కూడా ఒక్కసారి ఆ పాత రోజుల్ని తలుచుకుందాం.మన ఉత్తరాల కోసం కాళ్ళరగిపోయేలా తిరిగిన తపాల బంట్రోతులకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకుందాం.

error: Content is protected !!