కొత్త కథ : నిరీక్షణ

నిరీక్షణ

– స్రవంతి

 

చాలా రోజుల తర్వాత మళ్లీ నీల వంటింట్లో నుండి సరిగమలు వినిపిస్తున్నాయి. అవును, నీల ఇల్లు మూగబోయి బహుశా ఆరు నెలలు అవుతోంది. వాళ్లిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకటిగా లేరు. భర్త దగ్గరి నుండి వచ్చిన ఒక మెసేజ్‌తో మళ్లీ ఆ ఇంట్లో కొత్త ఆశల చిగుళ్లు చిగురించాయి. ఇన్నాళ్ళ నీల మనోవేదన! ఆ ఒక్క మెసేజ్‌తో పోయినట్టు అనిపించింది. తనలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మధ్యాహ్నం నీల ఫోన్ మోగింది. ఆఫీసు పనుల్లో బిజీగా ఉన్న ఆమె ఫోన్ వైపు చూడలేదు. ఫోన్ మళ్లీ మోగింది. ఆమె భర్త దగ్గర నుంచి కాల్. చూసే సరికి, అప్పటికే కాల్ కట్ అయిపోయింది. వాళ్లిద్దరి మధ్య సంభాషణలన్నీ మెసేజ్‌లలోనే నడుస్తున్నాయి. ‘కాల్ చేశాడంటే ఏదో అత్యవసర పరిస్థితి అయ్యుంటుంది.’ అని తిరిగి కాల్ చేసే లోపు వాట్సాప్‌లో ఓ మెసేజ్–“ఈ రోజు ఇంటికి త్వరగా వచ్చేస్తున్నా. ఇంట్లో ఉంటావా? ఈ రోజు ఏదైనా స్పెషల్ చేస్తావా! అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకుని నీతో సమయం గడపాలని ఉంది నాకు.”

భర్త తనతో మాట్లాడి ఆరు నెలలు గడిచాయి. ఒకే ఇంట్లో ఉంటున్నా ఇద్దరూ అపరిచితుల్లా–ఎవరి పని వాళ్లది. అతను ఇంట్లో భోజనం మానేశాడు. పొద్దున్నే ఆఫీసుకు బయలుదేరి, ఏ అర్ధరాత్రో మద్యం వాసనతో తిరిగి వస్తాడు. అదేంటో ఆశ్చర్యం–ఈ రోజు త్వరగా వస్తాను అన్నాడు. నీల అతనిలో మార్పును నమ్మలేకపోయింది.ఎన్నాళ్లుగానో ఈ క్షణం కోసం ఎదురుచూస్తోంది.

అతని కాల్ వచ్చిన క్షణం నుంచి నీలకు కాళ్లు ఆగలేదు. గుండెలో తెలియని ఉత్సాహం. వర్క్ ఫ్రం హోం చేసే నీల ఆఫీసుకు ఫోన్ చేసి ఈ రోజు హాఫ్–డే లీవ్ పెట్టేసింది.

గడియారం వైపు మాటిమాటికి చూస్తూ వంట సిద్ధం చేస్తుంది. ఉల్లిపాయలు కోస్తూ కళ్లలో నీళ్లు తుడుచుకుంటే, ఆ కన్నీటి వెనక తన కళ్లు మిణుగురుల్లా మెరిసాయి–కానీ కంటి కింద నల్లటి వలయాలు ఎన్నో నిద్రలేని రాత్రుల కథ చెప్పాయి.ఉప్పు, కారం సరిపోయాయా?  అని ఆలోచిస్తూ, అతనికి ఉప్పు తక్కువే ఇష్టమని గుర్తు. కూర కాస్త గరిటెతో తీసి అరచేతిలో వేసుకుని రుచి చూసింది. ప్రేమను బోలెడంత కలిపి వండింది. వంటలన్నీ కమ్మగా కుదిరాయి. ఘుమఘుమలు ఇల్లంతా చేరాయి. ‘ఇంత ఇష్టంగా వండే భార్యను వదిలేసి, ఎంత మూర్ఖుడైతే ఇన్నాళ్లు బయట తిండికి అలవాటు పడ్డాడు?’ అని నీల మనసులో అనుకుంది. ఆ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా అనిపించక మానదు.

మళ్లీ గడియారం వైపు చూసింది.సమయం సాయంత్రం 5:00 అయింది. ఈ రోజైనా తొందరగా వచ్చేస్తున్నాడా?  సమయం గడుస్తున్న కొద్దీ ఏదో తెలియని భయం. ఏదో ఆలోచిస్తూనే డైనింగ్ టేబుల్ మీద వంటలన్నీ అందంగా పేర్చింది. అస్తవ్యస్తంగా ఉన్న మంచాన్ని కూడా సర్దేసింది. బెడ్ పక్కన ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో తన ప్రతిబింబం కనిపించింది. పనులన్నీ చేసి అలసిపోయిన ముఖం, వంట మరకలు అంటుకున్న నైటీ. ‘ఇదేనా అతనికి నచ్చే రూపం?’ తనకు తానే నచ్చలేదు. అతనికి ప్రత్యేకంగా కనిపించాలి. అతనికి ఆమె చీర కట్టితే చాలా ఇష్టం. వెంటనే అల్మార తెరిచింది. ఏ చీర కట్టుకోవాలి? అని ఆలోచించింది. ఈ ఎండాకాలం వేడికి, మృదువుగా ఉండే సన్నటి కాటన్ చీర అయితే బాగుంటుంది. లేత రంగు చీర తీసుకుంది. తువ్వాళ్లు భుజానికి వేసుకుని, మరోసారి గడియారం వైపు చూసి స్నానం చేయడానికి బయలుదేరింది. మధ్యలో అతని ఆలోచన. అతను తనను దగ్గరకు తీసుకుని, చెంత నిలబెట్టుకుంటున్నట్లు అనిపించింది. సిగ్గుతో తన చెంపలు ఎరుపెక్కాయి.రోజూ విరహం తనను వెంటాడుతూనే ఉంది. కోరికలన్నీ మనసులో దాచుకుంది. కానీ ఇవాళ మాత్రం అవి బయటకు రావాలనుకున్నాయి. ‘ఈ రోజు త్వరగా వస్తాను!’ అన్నప్పుడు, ఆమె మనసులో ఆశలకు మళ్లీ రెక్కలొచ్చాయి.బొడ్డు కిందకు చీర కట్టింది. జడలో మల్లెలు చుట్టుకుంది. మళ్లీ అదే గడియారం వైపు చూస్తూ కూర్చుంది. సరసాలు కావాలని కాదు. అతని ఒడిలో ఒదిగిపోయి హాయిగా నిద్రించాలని మాత్రమే ఈ నిరీక్షణ.

********

పెళ్లై రెండేళ్లు గడిచాయి. భర్తను అర్థం చేసుకునే సుగుణవతిగా, ఈ ఇంటిని ఆలయంలా తీర్చిదిద్దింది. పెళ్లైన సంవత్సర కాలం ఒకరితో ఒకరు స్నేహితుల్లా ఆనందంగా గడిపారు. కానీ ఆ తర్వాత భర్త మాత్రం చెడు అలవాట్ల చెరలో చిక్కుకున్నాడు. చాన్నాళ్లుగా ఇదే వరస. ఆఫీస్ నుంచి నేరుగా స్నేహితులతో బార్‌కి వెళ్లడం, తాగడం, అక్కడే పడిపోవడం. తనతో తాగిన వాళ్లలో ఎవరో ఒకరు అతన్ని ఇంటి ముందు వదిలిపెట్టడం. తానే లోపలికి తీసుకెళ్లడం. అదే నిశ్శబ్ద నాటకం, అదే అసహ్యం.

మద్యం మత్తులో హాల్‌లో నేలపై లేదా సోఫాలో నిద్రపోతాడు. ఎన్నోసార్లు అతన్ని అడిగింది. ఏం సమస్య? నీకేదైనా బాధ ఉందా? ఆమె భర్తకు ఒక బాధ ఉండొచ్చని, తాను దాన్ని తీర్చగలనని నమ్మింది. కానీ అతను ఎప్పుడూ సమాధానం చెప్పేవాడు కాదు. ప్రశ్నిస్తే ఉదయాన్నే గొడవ. కొన్నాళ్లకి ఆమె అడగడమే మానేసింది. ప్రతిరోజూ తాగడానికి అతనికి ఏదో ఒక సాకు కావాలి. నిజానికి ముందు డబ్బులెక్కువై జల్సాల కోసం తాగేవాడు. ఇప్పుడు దానికి బానిసై, మానలేక వేర్వేరు కారణాలు చెప్పి తాగుతాడు. ఒక్కోసారి భార్య ప్రశ్నించడమే సాకుగా చెప్పి తాగేవాడు. అతని జీతం మొత్తం తాగిన మత్తులో స్నేహితులపైనే ఖర్చు చేసేవాడు. ఏనాటికైనా భర్త మారుతాడేమో అనే సహనంతో నీల తన జీతం డబ్బుతోనే ఇంటిని నడిపిస్తుంది. కానీ తన సహనాన్ని పరీక్షించేలా అతని చర్యలు ఉండేవి. ఒక్కోసారి బార్‌లో కూర్చుని బిల్లు కట్టడానికి డబ్బు లేదు అని నీలకు ఫోన్ చేస్తే, ఆ డబ్బు కూడా  తానే ఆన్‌లైన్‌లో పంపేది. భర్త మారుతాడేమో అని ఎదురుచూస్తున్న నీల ఒకనాడు తన సహనాన్ని కోల్పోయింది. ఆరోజు డబ్బు విషయంలో గొడవ కాస్త పెద్దదయ్యింది. మాట మాట పెరిగిపోయింది. ఆనాటి నుండి అతను ఆమెతో మాట్లాడం మానేశాడు. ఇంట్లో నిశ్శబ్దం అల్లుకుంది. తన తప్పులెక్కన ఎన్నో సార్లు క్షమాపణలు చెపుకుంది అయినా అతని కనికారానికి నోచుకోలేదు.

********

ఈ పరిస్థితి ఆమెకు అలవాటైపోయింది. ఈ రోజు ఫోన్ చేసి “త్వరగా వస్తాను” అనగానే నమ్మేసింది. అతను రాగానే అతని కౌగిట్లో ఒదిగిపోవాలని ఆశగా ఎదురుచూసింది.ఇంకా గడియారం వైపు చూడడం వ్యర్థమని అర్థం చేసుకుంది. ఆమె కళ్లు నీటితో నిండిపోయాయి. ఆ కన్నీళ్లను తుడుచుకుని, తానైనా తిని పడుకోవాలి అనుకుంది. డైనింగ్ టేబుల్ కుర్చీలో వెనక్కి వాలి కూర్చుంది.అతని కోసం ఇష్టంగా వండిన కూరలను తన చేతులతోనే తినిపించాలని అనుకుంది. కానీ, ఇప్పుడు ఏం చేయగలదు? అతనికే అదృష్టం లేదు అని మనసులో భావించింది. పళ్లెంలో అన్నం వడ్డించుకుంది. కూరలన్నీ ఘుమఘుమలాడుతున్నాయి. కానీ, ఎవరికోసం ఇంత ఇష్టంగా వండిందో, అతనే రాలేదు అనే బాధ ఆమెను కలచివేసింది.భర్తతో కలిసి తినాలనే ఆశ ఒకవైపు, అతనికి పెట్టకుండానే తినేస్తున్నాననే బాధ మరోవైపు. ఒక్క ముద్ద కూడా గొంతు దాటి లోపలికి వెళ్లలేదు. దుఃఖం ఊపిరిని నొక్కేస్తోంది. తిండి ఆమెకు సహించలేదు. అతనికోసం వడ్డించాలి అనుకుని తెచ్చిన అదే పళ్లెంతో, తన భోజనాన్ని మూసి, తినకుండా పక్కన పెట్టేసింది. చివరికి, చేతులు కడుక్కోడానికి వంటగదిలోకి వెళ్లిపోయింది. వండిన వంటలతోపాటు తన ఆశలు కూడా చల్లారిపోయాయి.

పోయిన ఏడాది ఎండాకాలం, పౌర్ణమి రాత్రి–మేడ మీద చల్లని గాలి సున్నితంగా వీస్తుండగా, వెన్నెల్లో మెత్తని పరుపుపై నీల అతని చుట్టూ చేతులు వేసి పడుకుంది. అతని ముఖంలోనే కళ్లు ఆపి చూస్తూ ఉంది. పక్కనే రేడియోలో ఏ.ఆర్. రహ్మాన్ సుమధుర పాటలు మీటుతున్నాయి. తన చేతితో అతని గడ్డం నిమురుతూ, “ఏవండీ, ఏదైనా జోలపాట పాడండి” అంది. అతను చిలిపి నవ్వు నవ్వి, “నేను పాడితే వచ్చే నిద్ర పారిపోతుంది కదా!” అన్నాడు. ఆమె నవ్వుతూ, “అందుకే పాడమన్నాను. నాకిప్పుడే పడుకోవాలని లేదు. కానీ ఈ క్షణం ఇలా చాలా బాగుంది. ఈ రాత్రంతా నిన్నే చూస్తూ, ఈ సమయాన్ని ఆస్వాదిస్తూ, ఏదో ఒకటి మాట్లాడుతూ…” అంటూ నీల మాటల్లో మునిగుండగా, అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు.ఆ దృశ్యాన్ని చూసి, పైనున్న చందమామ కూడా వాళ్ల ఏకాంతానికి ఆటంకం కలగకుండా మబ్బుల చాటున దాగిపోయింది. పక్కనే రేడియోలో రజనీకాంత్ శంకర్ పాట గుండెను తడమసాగింది–“అది ఏమిటో నా ఎద వరించింది, తీయగా పెదాలతో మదించి విడు, నీ మీసమే మురిసింది ముద్దుల బాకుల మరింతగా సుఖించి విడు…”

ఈ మధుర క్షణాలను తలుచుకొని నిద్రిస్తున్న నీల కళ్ల నుండి నీళ్లు ధారగా కారుతున్నాయి.

హఠాత్తుగా తలుపు గట్టిగా చప్పుడైంది. అప్పుడు సమయం అర్ధరాత్రి 1:30.  కలలో నుండి తేరుకొని టుక్కున లేచి, హాల్‌కి పరిగెత్తింది నీల. తలుపు తెరిచింది. గుప్పున మద్యం వాసన గుండెల్లోకి దూసుకొచ్చింది. మందు మత్తులో కళ్లు ఎర్రబడ్డ అతను, ఒక్క చోట నిలబడలేక తడబడుతూ, చేతిలోని బైక్ తాళాలు నీల చేతికి ఇచ్చి, ఆమెను తోసుకుంటూ తూలుతూ వెళ్లి సోఫాపై కూలబడ్డాడు. ఆమె భయం నిజమైంది–మళ్లీ తాగి వచ్చాడు. చేతిలో తాళాలు చూడగానే గుండె జల్లుమన్నది–ఇంతకీ బైక్‌కి తాళం సరిగా వేసాడా? ఈ మత్తులో ఎలా నడిపి ఇంటికొచ్చాడో అని ఆశ్చర్యంతో ఒక్క క్షణం స్తంభించిపోయింది. ముందు బైక్ చూద్దామని హ్యాండిల్ తిప్పింది. తాళం వేసే ఉంది, కానీ బండి ఒకవైపు లొట్టపోయి, గీతలతో నిండి ఉంది. ఏదో గుద్దేసిందా? లేక అతనే మత్తులో దేన్నో గుద్దాడా? తెలియదు. ఆ ఆలోచన ఆమెను భయంతో కట్టిపడేసింది.చెమటలు కక్కుతూ, అతనికి గాయాలైనాయా? అని గుండె దడుస్తూ లోపలికి పరిగెత్తింది. అతన్ని తడిమి చూసింది. ఎక్కడా గాయాలు లేవు. సోఫాపై అలాగే మత్తుగా నిద్రపోయాడు. ఆమె మనసు కాస్త కుదుటపడింది. లేపి అడగాలనుకుంది. కానీ అతను లేచే స్థితిలో లేడు. పోనీ ఉదయం అడిగితే ఏం చెప్పగలడు? అని చిరాకుతో కొంగుతో చెమట తుడుచుకుంది. లైట్లు ఆర్పబోయింది.ఆగింది. మత్తులో లేచి తూలితే కిందపడతాడేమో? అని హాల్ లైట్ అలాగే వదిలేసింది. పడకగదిలోకి నడిచింది.

పడకగదిలోకి అడుగులు వేస్తుంటే, జడలోని మల్లెలు ముళ్లులా గుచ్చుతున్నట్టు అనిపించింది. ప్రతి గుచ్చుకొన్న దానితో ఆమె ఆశలు కుంగిపోతూ, గుండెపై బరువై నొక్కుతున్నట్టు. లేత మురుదువైన చీర శరీరాన్ని గట్టిగా బిగించి, ఊపిరిని బంధించినట్టుగా, జడ బరువై భుజాలను క్రిందికి లాగుతూ, చెమటతో తడిసిన కాటుక కళ్లలో మంటను రగిలిస్తుంటే–మెడలోని పుస్తెలు కూడా గొంతును బిగుసుకుని, ఊపిరిని అడ్డుకుంటున్నట్టు అనిపించాయి. ఆమె గదిలోకి చేరి, ఒక్క క్షణం ఆగకుండా, అల్మారాలో మడతపెట్టి ఉన్న నైటీని తీసింది. చీరను జారవిడిచి, నైటీలోకి జారిపోయింది. ఆ స్వేచ్ఛలో శరీరం తేలికై, ఏదో బరువు దింపేసినంత హాయిగా అనిపించింది. జడను విప్పి, కొప్పు గట్టిగా కట్టింది. తాళిని మెడ నుండి తీసి, డ్రెస్సింగ్ టేబుల్ మీద జాగ్రత్తగా ఉంచింది–ఆ చిన్న చర్యలో ఒక భారం తొలగినట్టు, ఆమెలోని గందరగోళం కాస్త తగ్గినట్టు. ముఖం కడుక్కుంది–చల్లని నీటితో చెమటను, ఆ రోజు బాధను తుడిచేస్తూ–అప్పుడు ఆమెకు ఊపిరి తిరిగొచ్చినట్టు, గుండెలోని బిగుసుకుపోయిన ఏదో బరువు దింపేసినంత హాయిగా అనిపించింది.

ఆమె మనసు తేలికపడింది. ఎన్నో రోజులుగా గుండెను బరువెక్కించిన బాధ కాస్త తొలగినట్టు అనిపించింది. మళ్లీ హాల్‌లోకి నడిచి, మూతపెట్టిన కంచాన్ని తీసి, నిశ్శబ్దంగా తినడానికి కూర్చుంది. ఆమె భర్త అక్కడే, హాల్‌లో మద్యం మత్తులో సోఫాపై కూలబడి, గురకలు కొడుతూ ఉన్నాడు. ఆ సంగతి ఆమెకు గుర్తు లేదు. గుర్తున్నా, ఆ పరిస్థితిని తాను మార్చలేనని లోలోపల పూర్తిగా అర్థం చేసుకుంది. ఎన్నోసార్లు ప్రయత్నించింది–మాటలతో బుజ్జగించి, గొడవలతో ఎదురుతిరిగి, ప్రేమతో మళ్లించాలని చూసి–ప్రతి ప్రయత్నంలో ఓడిపోయి, అతన్ని మార్చలేననే సత్యాన్ని అంగీకరించింది . ఆ నిస్సహాయత ఆమెలో లోతుగా పాతుకుపోయిన క్షణాలవి..

తాను వండిన వంటను ఆస్వాదిస్తూ, కడుపు నిండా భోంచేసింది. భర్త వైపు జాలిగా చూసింది. జాలి పడడం తప్ప చేసేది ఏముంది? అని నిట్టూర్చింది. అతను మారాలంటే అది అతని చేతుల్లోనే ఉంది.ఆమె చేయగలిగిన ప్రతి ప్రయత్నం చేసి, ప్రతిసారీ ఓడిపోయిన ఆమె, ఇప్పుడు తన మనశ్శాంతిని ఎట్టి పరిస్థితిలోనూ కోల్పోనీయకూడదని, తన ఆత్మస్థైర్యాన్ని కాపాడుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంది.

గదిలోకి నడిచి, పక్క మీదకు చేరి, మళ్లీ దిండును చూసింది. అతని వాసన ఇంకా చెదరని ఆ గుడ్డలో ఆమె కన్నీళ్ల జ్ఞాపకాలు ఇమిడి ఉన్నయి. ఈసారి దాన్ని తీసి, ఒక్క క్షణం ఆగి, వణుకుతున్న చేతులతో తనకు దూరంగా జరిపింది–ఆ చర్యలో ఆమె గతం చెల్లాచెదురై, గుండెపై బరువు తొలగినట్టు అనిపించింది. నిద్రలేని రాత్రులు–అతని కోసం కళ్లు తెరిచి, గుండె దడతో ఎదురుచూసిన రాత్రులు, ఆ దిండునే అతనిగా భ్రమించి, గట్టిగా హత్తుకుని వెక్కిన రోజులు–కనుల ముందు మెరిసి, మాయమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ దిండు ఇచ్చే ధైర్యం ఆమె లోపల నుంచే ఉద్భవించినట్టు తోచింది. ఆ దిండును వీడిన చేతులతో, ఆమె స్వేచ్ఛను కౌగిలించుకుంది.ఆ గత బంధం ఆమెకు ఇక అనవసరమై, చీకటిలో కరిగిపోయింది. ఒక్కసారిగా ఆమెలో కొత్త మనిషి జన్మించినట్టు–ఎవరి కోసమో ఎదురుచూసే బంధీ బతుకు నుంచి విడిపోయింది. ఎందుకంటే నిరీక్షణలోనే అలసిపోయింది–ఆ అలసట ఆమెను ఇన్నాళ్లూ కుంగదీసింది. తన చేతిలో లేని జీవితాన్ని సరిచేయాలని ఆరాటపడి, ఇక తనలో తాను కుమిలిపోనీయకూడదని నిశ్చయించుకుంది. పక్క మీదకు చేరి, చల్లని దుప్పటిని కప్పుకుని, కళ్లు మూసింది–ఇన్నాళ్ల నిద్ర ఒక్కసారిగా ఆవహించి, ఆమెను సున్నితమైన మత్తులోకి జార్చింది.

కళ్లు తెరిచినప్పుడు, ఉదయ కిరణాలు గదిలోకి జొరబడ్డాయి. ఆమె ఒంటరితనం ఇక బాధ కాదు, ఒక స్వతంత్రరాలైపోయింది. సోఫాపై అతను ఇంకా మత్తులోనే ఉన్నాడు. కానీ ఆమె గుండెలో అతని స్థానం ఖాళీ అయిపోయింది. అతని వాసన, ఆ జ్ఞాపకాలు ఇక ఆమెను బంధించలేవు. తన చేతులతో కాఫీ కలుపుకుని, కిటికీ దగ్గర నిలబడి, చల్లని గాలిని పీల్చింది. ఇన్నాళ్లూ ఎదురుచూసిన జీవితం కాదు, తన కోసం బతికే జీవితం ఇప్పుడు ఆమెది. ఆ నిశ్శబ్దంలో, ఆమె మనసు మౌనంగా నవ్వింది. అతను మారకపోయినా, ఆమె మారిపోయింది.

error: Content is protected !!