ఇష్టా గోష్టి – లక్ష్మీ ప్రియాంక గారి ‘ఎంతెంత దూరం’

           కథలు చదవడాన్ని ఉద్యమంలా సాగిస్తున్న సాయి గారు పరిచయం చేసిన పుస్తకం “ఎంతెంత దూరం“…. నా చేతుల్లో చేరాక ఎంత దూరాలకు తీసుకెళ్తుందో అనే ఆలోచనతో  చదవడం మొదలుపెట్టా. కొన్ని కథలు మనసు లోతుల్లోకి, కొన్ని కథలు కంటికి కనిపించినా మనసుకు కనపడని దూరాల్లోకి, మరికొన్ని కథలు ఆశకు దగ్గరలోకి తీసుకెళ్లాయి. ఇన్ని దూరాలను దగ్గర చేసిన లక్ష్మీ ప్రియాంక గారితో నేటి ఇష్టా గోష్టి.

 

ఎప్పటిలాగే డ్యూటీ అడ్జస్ట్ చేసుకుని తమ్ముడు ,నేను కలిసి బయలుదేరాం. ఈసారి వేదిక మారింది . అరకు హిల్ కాఫీ –జూబ్లీహిల్స్. హైదరాబాద్ కాంక్రీట్ అరణ్యంలో ఒక విశాలమైన ప్రదేశం ,చుట్టూ చెట్లు మూలన అందంగా ఉన్న చిన్న కిచెన్, వెనుక ఒక ఆయుర్వేద వైద్యశాల చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. అక్కడ ఒక మామిడి చెట్టు కోసం పైన రేకులు కత్తిరించి ఖాళీగా ఉంచడం చూసి ముచ్చటేసింది. ఇక విషయానికొస్తే ఆదిత్య గారిచే పరిచయ కార్యక్రమం జరిగింది రచయిత లక్ష్మీ ప్రియాంక గారి గురించి. ఆమె పాటలు రాస్తారు, కథలూ రాస్తారు ,బొమ్మలు కూడా గీస్తారు ..బైక్ రైడర్ కూడా.. ఈ పుస్తకంలో బొమ్మలన్నీ ఆమె చేతి మాయలేనంట. బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం వినే ఉంటారు కదా ఈమెకు సరిపోతుందనిపించింది. మాటలు విన్నాక వాక్చాతుర్యం కూడా భలే అనిపించింది. ఆమె నేపథ్యం విన్నాక, ఇప్పుడు ఆమెను చూశాక ఆ ఎదుగుదల ఇంకా ముచ్చటేసింది.

పరిచయం అయ్యాక కథా చర్చలు మొదలయ్యాయి. ఒక్కొక్కరుగా ప్రశంసలు, ప్రశ్నల పరంపర కొనసాగించారు. కొన్ని ఆసక్తికరంగా కొన్ని ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. సమాధానాలు కూడా అందులో కొన్ని…. కథాంశాలన్నీ మానవ సంబంధాలు, వారి భావోద్వేగాలు మరియు ప్రేమ చుట్టూ అల్లుకుని ఉన్నాయి. అందులో చాలా మటుకు తన చుట్టూ జరిగిన కథలే అని రచయిత్రి చెప్పారు. కధలు ఎక్కడో పుట్టవు మన చుట్టూ ఉన్న జీవన గమనాలే అనేట్టు సంభాషణ కొనసాగింది. అన్ని కథల్లోనూ  కొన్ని వాక్యాలను కొంతమంది పాఠకులు ఉటంకించారు. అందులో కొన్ని మీకోసం

“ఆమె నడుస్తుంటే ప్రపంచం ముందుకు సాగుతున్నట్లే ఉంది కానీ కాలం మాత్రం వెనక తిరుగుతున్నట్టు అనిపించింది.”

“కొన్ని విషయాల్లో ఆడవాళ్లకు సంతోషపడటం దిగులుపడటం లాంటి హక్కులు ఉండవు.”

“ఒక విషాద సాయంత్రం వేళ ఆమె తల వాల్చుకోవడానికి ఒక నమ్మకమైన సాన్నిహిత్యం.”

“కారుతున్న కన్నీళ్లన్నీ విషాదంతోనే కాదు అని అర్థం చేసుకునే మనసు.”

“నవ్వు మొహంలోనూ విషాదాన్ని అర్థం చేసుకునే తెలివి.”

“ప్రేమంటే ఏంటనే ప్రశ్న మా గదిలోకి దూసుకొచ్చిన చల్ల గాలిలా చాలాసేపు మాతో ఉండబోతోంది అని అర్థమైంది.”

“శతాబ్దాలుగా మాపై కురిపించిన ద్వేషం తో కప్పబడి రహస్యంగా సాగుతున్న మా జీవితాలు ఇప్పుడే కొత్త వెలుగు చూస్తున్నాయి కానీ అది గుడ్డి దీపపు వెలుగే.”

“చీకటి అనే తెర వెనుక అన్నీ సమానమే నిద్రలో అందరూ ఒకటే.”

ఇవే కాదు ఇంకా చాలా ఆణిముత్యాలు ఉన్నాయి ,కొన్ని నిప్పు కణికలూ ఉన్నాయి. చదవండి కథలన్నీ …ఒకసారి.. ఆమె తీసుకెళ్లిన దూరం ..మనిషి అంతరాళం*
అహల్య,  రెక్వియం ఫర్ ఏ డ్రీమ్ లాంటి కథల్లో కథనం గురించి, అందులోనూ లైంగికత ఆధారంగా జరిగే వివక్ష, సమాజం అర్థం చేసుకోలేని తనం గురించి చర్చ జరిగింది. సమకాలీన రచయితల్లో చాలామంది కథా కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి రాస్తున్నారని ,కానీ ఈ “ఎంతెంత దూరం” కథలన్నీ ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉన్నాయని కవనమాలి గారి విశ్లేషణ బాగా అనిపించింది. సాయి గారు “అంత గొప్ప కథేం కాదు” కథతో తనకున్న స్వానుభవాన్ని చాలా చక్కగా చెప్పారు. అంతా సరళంగా సాగిపోతున్న చర్చలో ,హఠాత్తుగా నేటి తరం రచయితలు దళిత సాహిత్యం ,దళితులపై వివక్షపై కథలు ఎందుకు రాయట్లేదు అనే ప్రశ్న ఒక తెలియని అలజడిని సృష్టించిందనిపించింది నాకు.బహుశా ఆ రచయిత్రి మానస గారి గంభీరమైన కంఠం వలనేమో..! అయితే లక్ష్మీ ప్రియాంక గారి సమాధానం కూడా సబబే అనిపించింది. ఆయా కథలు, కథకులు అనుభవించిన జ్ఞాపకాలు, పెరిగిన వాతావరణం ప్రభావం చేత పుట్టుకొస్తాయి అని చెప్పారు. తన వరకు ఆ సాహిత్యం పై, ఆ వివక్షల గూర్చి క్షుణ్ణంగా అవగాహన లేదని చెప్పారు.
తాను ఒక ఔత్సాహిక రచయిత అని చెప్పుకున్న మరో వ్యక్తి ,ఇతర రచయితల పుస్తకాలు చదివితే తన రచనా శైలి దెబ్బతింటుందేమో అనే సందేహం వెలిబుచ్చగా…కథలు రాయాలంటే ఖచ్చితంగా వేరొక కథలు, సాహిత్యం విరివిగా చదవాలని అది రచనా  పఠిమ ను ఇంకాస్త పెంచుతుందని చర్చలో పాల్గొన్న ఓ పెద్దాయనతో పాటు రచయిత్రి కూడా ఖరా ఖండి గా చెప్పేశారు. నిజమే కదా…!

ముగింపు వేళలో ధన్యవాదాలు చెబుతూ ఆదిత్య గారు వర్షం పడకుండా ఉన్నందుకు వరుణ దేవుడికి ధన్యవాదాలు అన్నప్పుడు నవ్వులు జల్లులు పడ్డాయ్.

మళ్లీ కలుద్దాం…. మరో చక్కటి చర్చ తో…

error: Content is protected !!