పాటపై నా మాట: ఉప్పొంగెలే గోదావరీ

వేటూరిగారికి నదుల పేర్లని ప్రస్తావిస్తూ రాయాల్సివచ్చినా, నదుల ప్రస్థానం గురించి రాసే అవకాశం వచ్చినా ఆయన కలం చిరకాలం నిలిచిపోయే పాటనొకటి సృష్టించే పనిలో పడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే “చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పొంగు నీ ప్రేమ.. నా ప్రేమ” అంటూ నీటితో ప్రేమ బంధుత్వం చేసుకున్నారు వేటూరిగారు. ముందుగా ఆయన నదుల పేర్లని ప్రస్తావిస్తూ రాసిన పాటలు కొన్ని గుర్తు చేసుకుందాం. 

ఆయన “వయ్యారి గోదారమ్మ వొళ్ళంతా ఎందుకమ్మా కలవరం” అంటూ మనసుకి గిలిగింతలు పెట్టగలరు. “కంచి పోతావా కృష్ణమ్మా.. ఆ కంచి వార్తలేవో చెప్పమ్మా” అంటూ ప్రేమగా ఆటపట్టించగలరు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’లో కలయే నిజమైనది పాటలో “యమునకొకే సంగమమే, కడలినది కలవనిది” అంటూ ప్రకృతి కథనాన్ని జీవితానికి ఆపాదించి మైమరిపించగలరు. శుభసంకల్పంలో “చినుకులన్నీ కలిసి చిత్రకావేరి, చివరికా కావేరి కడలి దేవేరి” అంటూ హృదయంలో తడి పుట్టించగలరు. “నర్మదా నది తీరంలో నవమన్మథా అనుకుంటా” అంటూ ప్రేయసితో పాడించగలరు. “శృంగారం వాగైనది.. ఆ వాగే వైఘైనది” అంటూ మధురమధురతర మీనాక్షి పాటలో విశ్వనాథవారి ఏకవీర కథని చెప్పగలరు. రాఘవేంద్ర చిత్రంలో మంత్రాలయాన్ని పరిచయం చేస్తూ “నీ తుంగభద్ర మా పాపాలే కడుగంగా” అంటూ తుంగలో మనసుని పుణ్యస్నానాలు చేయించగలరు. “హరి పాదం అడుగున గంగ .. కలి పాపం తను కడగంగా ..” మనల్ని బద్రీనాథ్ కూడా తీసుకెళ్తారు. ఇలా ఒకటా రెండా.. సందర్భం దొరికిన ప్రతీసారి శ్రోతలకి నదుల అలల శబ్దాలని అందంగా తన పదాలలో దాచి వినిపించారు.

ఇక నదుల ప్రస్థానం గురించి, గొప్పదనం గురించి రాయాల్సి వచ్చిన సందర్భాలు చూస్తే ఇక్కడ కూడా ఎన్నో పాటలు ఉన్నా, రెండు పాటలు ప్రత్యేకం. ఒకటి గంగోత్రి చిత్రంలో “జీవనవాహిని పావని..” అంటూ మొదలుపెట్టి “గల గల గల గంగోత్రి. హిమగిరి జని హరి పుత్రి” అంటూ గంగానదిని మన మనసులలోకి ప్రవహించేలాచేసారు. ఇక రెండవది, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాట.. గోదావరి చిత్రంలో “ఉప్పొంగెలే గోదావరి, ఊగిందిలే చేలో వరి” అనే పాట. అసలే గోదావరి అంటే ఎంతో మమకారం వేటూరిగారికి. చిత్రం పేరు గోదావరి, కథ నడిచేది గోదావరిపై, పాట రాయాల్సింది గోదావరిపై, ఇంకేముంది చెప్పండి. అందుకే ఇది నా వరకూ ఈ పాట గోదావరికి ఆయన రాసిన ప్రేమలేఖ. ఇప్పుడా ఆ ప్రేమలేఖని చదువుదాం, మాట్లాడుకుందాం, విందాం, ఆనందిద్దాం.

 

పల్లవి:

ఉప్పొంగెలే గోదావరీ..ఊగిందిలే చేలోవరి

భూదారిలో నీలాంబరీ.. మా సీమకే చీనాంబరి..

వెదలు తీర్చు మా దేవేరి.. వేదమంటి మా గోదారి..

శబరి కలిసిన గోదారీ.. రామ చరితకే పూదారి

వేసై చాప తోసై నావ బార్సై వాలుగా..

చుక్కానే చూపుగా..

బ్రతుకుతెరువు ఎదురీతేగా.. “ఉప్పొంగెలే గోదావరీ”

 

వేటూరి పాటకి పల్లవి ప్రాణం. అందుకే పల్లవితోనే మనని గోదావరి ఒడ్డుకి తీసుకెళ్లిపోయారు. గోదావరి గంభీరంగా ఉప్పొంగుతుంటే, ఆ అలలు పంపిన గాలులకు సమాధానమిస్తూ పచ్చని వరిపైరు ఊగడం మనకి కలమెత్తి చూపిస్తారు. నీలాల నింగి నీటి అద్దంలో ముఖం చూసుకొని మురిసిపోతుందా అని గుర్తుచేస్తూ గోదావరిని నేలపై నీలాంబరిని చేసారు. ఎన్నో మలుపులు తిరుగుతూ, అడవులని, కొండలని, పొలాలను తాకుతూ దాటుతూ వెళ్లే గోదావరి పచ్చని సీమ కట్టిన చీరలా ఉందని అనడం అతిశయోక్తి కాదుగా. తన నీటితో ఎందరి కష్టాలనో, ఆకలినో తీసుస్తున్న గోదావరి, రామకథని ముందుకు నడిపిన శబరీ కలిసిన గోదావరి ఇది. దీనిపై ప్రయాణం, జీవితంలో ప్రయాణం రెండూ ఎదురీతలే.

 

చరణం 1:

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం..

వేసే అట్లు వేయంగానె లాభసాటి బేరం..

ఇళ్ళే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం

ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం..

ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ..

నది ఊరేగింపులో.. పడవమీద రాగా.. 

ప్రభువు తాను కాగా..      “ఉప్పొంగెలే గోదావరీ”

 

కవిత్వం అనగానే అదేదో జీవితానికి అందనంత దూరంగా ఉండే పదార్థం అని కొందరు అన్నా, వేటూరి గారు తన పాటలో జీవితాన్ని, చుట్టూ పరిస్థితులని, అందులోని అందాన్ని కవితాత్మకంగా మన ముందుంచడానికి ప్రయత్నించారు. అందుకే కథలో భాగంగా సాగె సన్నివేశాలైన పడవపై చిలక జోస్యం, ఆలుమగల అలకలు, అక్కడ జరిగే అట్ల వ్యాపారం ఇలా అన్నీ మనకి తెరపై సహజంగా కనిపిస్తూనే, పాటలో హృద్యంగా వినిపిస్తాయి. ఇక ఆ చివరి మాటలు ఉంటాయి చూడండి అసలు.. నాకైతే, రాజ్యాన్ని వదిలి వనవాసానికి బయలుదేరిన రాముడిని, నది దాటించే సమయంలో గుహుడి మనసులోని మాటలు బహుశా ఇవేనేమో అనిపిస్తుంది..ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ..నది ఊరేగింపులో.. పడవమీద రాగా.. ప్రభువు తాను కాగా..

 

చరణం 2:

గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు..

లంకానాధుడింటా ఆగనంటు పండు కొరుకు..

చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకీ..

సందేహాల మబ్బే పట్టె చూసే కంటికీ..

లోకం కాని లోకం లోన ఏకాంతాల వలపు..

అల పాపికొండలా.. నలుపు కడగలేక..

నవ్వు తనకు రాగా..     “ఉప్పొంగెలే గోదావరీ“

 

ముందు చెప్పినట్టుగానే తెరపై చిత్రాన్ని, పాటలో పదంగా మార్చి మనసుకందించే పనిలో ఉన్న వేటూరి గారు గోదావరి జిల్లాల్లో పండే మిర్చి పంట ఎరుపుని గోదారమ్మ కుంకుమబొట్టుగా ఊహించారు. సీతారాముల ప్రేమ కథ, గోదావరి వేదిక, మరి రావణుడి ప్రస్తావన లేకపోతే ఎలా అనుకున్నారేమో ఆయన వేషం ధరించి దర్శనమిచ్చారు పండ్లు కొరుకుతూ.. ఒకవైపు ఇలా గోదావరిని, పరిసరాల్ని వర్ణిస్తూనే కథలో నాయకి, నాయకుల మధ్య సాగె చూపులని, పుట్టే సందేహాల్ని కూడా భలే వర్ణించారు. చివరగా గలగలమనే గోదారమ్మ నవ్వుని ప్రస్తావిస్తూ, అందుకు కారణం ఆవిడ పాపికొండల నలుపు కడగాలి అని ప్రయత్నించి కడగలేకపోవడమే అనడం ఎంత చమత్కారమో కదా..

మీరు ఇంకొకటి గమనించారా! ఈ చిత్రం తొలి సన్నివేశాల్లో, అడవి బాపిరాజు గారు గోదావరిపై రాసిన “ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగసింది గోదావరి” అనే గేయాన్ని కూడా ఎంతో అందంగా వినసొంపుగా బ్యాక్’గ్రౌండ్’లో ప్లే చేసారు.

ఇందులో చాలా వరకూ మీరూ ఊహించినవే అయినా, వేటూరిగారి అభిమానిగా ఏదేదో చెప్పేయాలనే కుతూహలం నాది. సరే మరి! ఇంత చెప్పాక ఈ పాటని మరోసారి వినాలనిపిస్తుంది. వీలుంటే మీరూ ఓసారి వినేయండి మరి.

error: Content is protected !!