పురస్కార సాహిత్య పరిచయం: జీవన సమరం

పురస్కార సాహిత్య పరిచయం: జీవన సమరం @ కవనమాలి

పురస్కారం అనేది నా దృష్టిలో పుస్తకానికి ఇచ్చే గౌరవం, రచయితకి ఇచ్చే ప్రోత్సాహం. అలా తెలుగు సాహిత్యంలో అందించే పురస్కారాలలో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారాలు కాస్త ప్రత్యేకమైనవనే చెప్పొచ్చు. 1955 నుండి ప్రతీ సంవత్సరం భారతీయ భాషల్లో ప్రతీ భాషలో ఒక ఉత్తమ రచనని ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. అలా మన తెలుగులో కూడా ఎన్నో పుస్తకాలకి ఈ పురస్కారం వచ్చినా, అందులో ఎన్ని ఇప్పటితరం వారికి తెలుసు అనే ప్రశ్న వచ్చింది. ఆ పుస్తకాల గురించి, పురస్కారం వచ్చేలా చేసిన ఆ ప్రత్యేక అంశాలు ఏమిటి అనే వాటి గురించి మనం మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచనతో మొదలుపెట్టినదే ఈ పురస్కార సాహిత్య పరిచయాలు.

ఇక ఈ నెల మనం మాట్లాడుకోబోయే పుస్తకం గురించి చూస్తే,  చాలాసార్లు మనం కళని ఆశ్రయించేది వాస్తవ ప్రపంచంలోంచి ఏ ఊహలలోకంలోకో తప్పించుకునే అవకాశం కోసమే. అందుకేనేమో మనం చదివే పుస్తకాలలో చాలావరకూ కల్పిత రచనలే ఉంటాయి. ఎంతసేపూ ప్రేమకథలు,నోస్టాల్జియా, యుద్దాలు, రాజులు కాకుండా అప్పుడప్పుడు నిజజీవితాల ఆధారంగా పుట్టే సామాన్యుల కథలను కూడా మనం చదవాలి. తెలుసుకోవాలి. అలాంటి పుస్తకమే రావూరి భరద్వాజగారు రాసిన ఈ జీవన సమరం. 

రచయిత చెప్పినట్టే ఇవి వ్యథార్థ జీవుల యధార్థ గాథలు. ఇన్నేళ్ల మన రోజూవారి జీవితాల్లో తాళంచెవులు, రుబ్బురోలులు, గొడుగులు, సవరాల జుట్టు, కుండలు ఇలా ఎన్నో వస్తువులని వాడుతూ ఉంటాము. కానీ వాటిని తయారుచేసే వ్యక్తుల జీవితాల గురించి మనకి ఎంత తెలుసు. అంతెందుకు! చిన్నప్పుడు ఎలుగుబంటిని ఆడించుకుంటూ వీధుల్లో తిరిగే వ్యక్తిని, వారం వారం సంతల్లో చిన్న చిన్న వస్తువులు అమ్మే ముసలివారిని, చిలకజోస్యం చెప్పేవారిని, దూదేకులవారిని, మన వీధుల్లో పాతబట్టలు తీసుకొని గిన్నెలు ఇచ్చేవారిని, పొట్టకూటికోసం రోడ్డు పక్క గాల్లో తీగలపై నడుస్తూ సాహసాలు చేసే సంచార జీవులని ఇదిగో ఇలాంటి వారి కథలను మనం తెలుసుకోవద్దా? అలాంటివారందరిని కలిసి మాట్లాడి భరద్వాజగారు ఈ కథలు రాసారు. 

ఇవి 52 వారాలపాటు ‘ఈనాడు’లో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి. వీటిని కొందరు వ్యాసాలు అని కూడా అనడం విన్నాను. పేరు ఏదైతేనేం, ఈ కథలు మనకు జీవితాన్ని అర్థమయ్యేలా చేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలోని మాములు వ్యక్తుల వైపు కాసేపు చూసేలా, వారి శ్రమని గమనించేలా మనల్ని ప్రేరేపిస్తాయి. కాసింత ఇబ్బందులనే జీవితాన్ని కుదిపేసే కష్టాలుగా భావించే మనకి, అసలు కష్టం అంటే ఏమిటో కొత్తకోణంలో చూపిస్తూ, వాటిని తట్టుకొని నిలబడి జీవితంతో ఎలా పోరాడాలో స్ఫూర్తిని ఇస్తాయి.

ఈ కథలనీ ఎంత సజీవంగా ఉంటాయో, వీటి శీర్షికలు కూడా అంతే ఆకర్షణీయంగా, అన్నమో రామచంద్ర!, తప్పెట్లోయ్ తాళాలోయ్, కేశోపనిషత్తు, ఛత్రపతి, ముందుగతి కానవే చిలకా ఇలా  కథాసారాన్ని చెప్పకనే చెబుతున్నట్టు మనలని పలకరిస్తాయి.

తెలుగు సాహితీ ప్రపంచంలో ఎంతో పేరు పొందిన పురిపాండ అప్పలస్వామిగారు ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ “ఒక్క భారతీయ భాషల్లోనే కాదు, నాకు తెలిసినంతవరకూ ఏ విదేశీ భాషల్లోనూ జీవనసమరం లాంటి సాహిత్యం రాలేదు” అన్నారు. ఇలా ఎందరో ప్రశంసల్ని పొందిన ఈ జీవన సమరం, తమ ఆలోచలనపై ఎంతో ప్రభావం చూపింది అంటూ చాలామంది తమ పఠనానుభూతిని పంచుకున్నారు కూడా, నేటికీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఈ పుస్తకం గొప్పతనం గురించి మాట్లాడటం వింటూనే ఉన్నాను.

అందరి అభిప్రాయాలూ సరే అసలు రచయిత రావూరి భరద్వాజ గారు ఈ పుస్తకం ఎందుకు రాసారు అని ఆలోచిస్తే, ఆయన తన జీవితం గురించి రాసుకున్న ఈ నాలుగు మాటలు నాకు గుర్తొచ్చాయి.

“నాకు ఆకలి తెలుసు, అవిద్యా తెలుసు. అవమానం తెలుసు. నిరుద్యోగం తెలుసు. అన్యాయం తెలుసు. అక్రమం తెలుసు. అధర్మం తెలుసు. వీటిని నేను పుష్కలంగా అనుభవించాను కాబట్టి, ఇవి లేని సమాజం కావాలని నేను కోరుకుంటున్నాను. నా బతుకూ, నా వంటి వారి బతుకులూ నా రచనలకు ముడిసరుకులు. ఆ జీవిత భాండాగారం నుండి చాలా ముడిపదార్థాన్ని కథలకూ, నవలలకూ నేను వస్తువుగా వాడుకున్నాను.”

ఆ మాటలకి సాక్ష్యమే ఈ జీవన సమరం రచన అనిపిస్తుంది. ఈ రచన ఆయనకి ఎంత ప్రత్యేకమో ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయన రాసిన పాకుడురాళ్ళు నవలకి జ్ఞానపీఠ్ పురస్కారం పొందిన సందర్భంలో మాట్లాడుతూ “పాకుడురాళ్ళకు జ్ఞానపీఠ్ రావడం సంతోషాన్ని ఇచ్చినా, జీవన సమరంను పరిశీలనకు తీసుకొని ఉంటే ఇంకా ఎక్కువ సంతోషించేవాడిని” అన్నారు ఆయన.

ఇలా ఈ పుస్తకం గురించి ఇంకా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోగలిగినా, మీరు ఈ పుస్తకం చదివి మీ అభిప్రాయం చెబితే మరింత బాగుంటుందని ఈ పరిచయాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను.

***

 

error: Content is protected !!