పాఠకుడి ప్రయాణం: కీర్తన 

పుస్తకాలతో మన ప్రయాణం ఎన్నో అనుభూతులను, ఆలోచనలను అందిస్తుంది. ప్రతి పాఠకుడి ఓ విభిన్నమైన ప్రయాణం. కొందరికి చిన్నతనంలోనే పుస్తకాలతో స్నేహం కుదిరితే, మరికొందరికి యుక్తవయసులో ఈ ప్రపంచం పరిచయమవుతుంది. ఈ ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, ఇష్టాయిష్టాలు, పుస్తకాలు వారిపై చూపించే ప్రభావం – ఇవన్నీ ఆసక్తికరమైన అంశాలే. అలాంటి ఒక యువ పాఠకురాలితో, ఆమె పఠనానుభవాలు, ఆలోచనల గురించి జరిపిన సంభాషణ ఇది. ఆమె పేరు కీర్తన, TCS లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.

  • నమస్కారం! కీర్తన గారు. పాఠకురాలిగా మీ  ప్రయాణం గురించి తెలుసుకోవాలని ఉంది. అసలు పుస్తకాలు చదవడం అనే ఆసక్తి మీకు ఎప్పుడు, ఎలా మొదలైంది? సాధారణంగా పాఠశాల నుండే పుస్తకాలంటే ఒకరకమైన విసుగు చాల మందికి అలవడుతుంది, దాన్ని దాటి ఈ సాహిత్య ప్రపంచంలో పుస్తకాలకి ఎలా వచ్చారు?

కీర్తన: నేను ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం మెల్లగా మొదలుపెట్టాను. నిజం చెప్పాలంటే, అప్పట్లో అదో రకమైన “ఎస్కేప్” (escape from reality)లా అనిపించేది. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు, అందులోని కథ, పాత్రలు, వాతావరణం – వీటన్నింటినీ మనసులో ఊహించుకోగలుగుతాం. ఆ కథా ప్రపంచంలోకి మనమే వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఆ అనుభూతి నాకు బాగా నచ్చింది. ఒక సినిమా చూసినట్లే, ఇదొక వినోదాత్మకమైన అనుభవంగా అనిపించింది.

  •  మీ పఠనానుభవంలో మీ ఇష్టాలు ఎలా మారుతూ వచ్చాయి? మొదట్లో ఎలాంటి పుస్తకాలు ఎక్కువగా చదివేవారు? ఇప్పుడు వేటిపై ఆసక్తి చూపిస్తున్నారు?

కీర్తన: మొదట్లో రొమాంటిక్ కామెడీ (rom-com’s) నవలలు ఎక్కువగా చదివేదాన్ని. ఆ తర్వాత క్రమంగా థ్రిల్లర్స్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, ట్రెజర్ హంట్ వంటి మిస్టరీ కథలపై ఆసక్తి పెరిగింది. అయితే, ఇప్పటికీ సులభంగా మనల్ని మనం రిలేట్ చేసుకోగలిగే కథలు, ప్రేమకథలు అంటే ఇష్టమే. ఈ మధ్య కాలంలో కవిత్వంపై కూడా ఆసక్తి పెరుగుతోంది, అలాంటి పుస్తకాలు కూడా చదవాలనుకుంటున్నాను.

  •  మీ చదివే అలవాట్లు ఎలా ఉంటాయి? అంటే, ఎప్పుడు సమయం దొరుకుతుంది, ఎలా చదువుతారు?

కీర్తన: నేను ఎక్కువగా ఒంటరిగానే చదువుతాను. సమయం దొరికినప్పుడల్లా చదువుతాను, కానీ ఉదయం పూట ప్రశాంతంగా, మంచి మూడ్‌తో చదవడం నాకు బాగా నచ్చుతుంది. కొన్నిసార్లు బోర్‌గా అనిపించినప్పుడు మూడ్ మార్చుకోవడానికి కూడా పుస్తకం పట్టుకుంటాను.

  • మీ కుటుంబంలో ఇంకెవరికైనా పుస్తకాలు చదివే అలవాటు ఉందా? ఈ అలవాటు మీకు చిన్నప్పటి నుంచే వచ్చిందా?

కీర్తన: మా కుటుంబంలో ఎవరికీ పుస్తకాలు చదివే అలవాటు లేదు. నా వరకే ఈ అలవాటు మొదలైంది. చిన్నప్పుడు అలాంటి ఫౌండేషన్ ఏమీ పడలేదు.

  •  పఠన ప్రయాణంలో చాలా మందికి ‘రీడింగ్ స్లంప్’ అంటే చదవాలనిపించని దశ ఎదురవుతుంది. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? దాన్ని ఎలా అధిగమించారు?

కీర్తన: బీటెక్ చదివే రోజుల్లో అలాంటి బ్రేక్ వచ్చింది. ఆ సమయంలో చదవడం బాగా తగ్గింది. అయితే, నేను రాయడం (ఇంగ్లీష్‌లో బ్లాగ్స్) మొదలుపెట్టిన తర్వాత, ఇతరులు ఎలా రాస్తున్నారో తెలుసుకోవాలనే ఆసక్తితో మళ్ళీ పుస్తకాలు చదవడం ప్రారంభించాను. వేరే వాళ్ల రచనలు చదివితే. నా రాతలకు కూడా సహాయపడుతుందనిపించింది. అప్పటి నుంచి పెద్దగా బ్రేక్స్ రాలేదు.

  •  కొత్త పుస్తకాల గురించి ఎలా తెలుసుకుంటారు? ఎవరైనా సూచిస్తారా?

కీర్తన: నా స్నేహితుల్లో పుస్తకాలు చదివే వాళ్ళు పెద్దగా లేరు. ఎక్కువగా సోషల్ మీడియా, ఆన్‌లైన్ పుస్తక పఠన సమూహాల (book reading communities) ద్వారానే కొత్త పుస్తకాల గురించి తెలుసుకుంటాను. అక్కడ పరిచయమైన వాళ్ళు ఇచ్చే సలహాలు, రికమెండేషన్స్ ఆధారంగా పుస్తకాలు ఎంచుకుంటాను.

  •  ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగింది. ఇ-బుక్స్, ఆడియో బుక్స్ వచ్చాయి. ఇవి మీ పఠనా అలవాట్లను ఎలా ప్రభావితం చేశాయి?

కీర్తన: నిజానికి, టెక్నాలజీ నన్ను అంతగా ప్రభావితం చేయలేదు. మొదట్లో ఇతరులు ఫోన్లలో, కిండిల్‌లో ఎక్కువ పుస్తకాలు చదువుతున్నారని చూసి, వాళ్ళలా వేగంగా, ఎక్కువ చదివేయాలని కొంచెం ఒత్తిడికి గురయ్యాను. ఏదో FOMO లా.  కానీ, తర్వాత నెమ్మదిగా, ప్రతి అంశాన్ని ఆస్వాదిస్తూ చదవడమే నాకు సరిపోతుందని అర్థమైంది. వేగంగా చదివితే కథలోని ఆత్మను, పాత్రల లోతులను పూర్తిగా గ్రహించలేమని నా అభిప్రాయం. ఇప్పటికీ నాకు ఆన్‌స్క్రీన్ చదవడం అంతగా అలవాటు కాలేదు; భౌతిక పుస్తకాలనే ఇష్టపడతాను.

  • ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు, “అరె, ఈ పాత్ర నా జీవితంలో ఎక్కడో చూసినట్లుందే” లేదా “ఈ సంఘటన నన్ను బాగా కదిలించింది” అనిపించిన సందర్భాలున్నాయా?

కీర్తన: ఖచ్చితంగా ఉన్నాయి. ఉదాహరణకు, ఇటీవల “నల్లగొండ కథలు” అనే పుస్తకం చదివాను. అందులో వాళ్ళు వాడిన యాస, సంభాషణలు మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నట్లే అనిపించాయి. ఆ పాత్రలు, వాళ్ళ జీవనశైలి చాలా రిలేటబుల్‌గా అనిపించాయి. అలాగే “మస్టర్డ్” అనే కథల సంపుటిలో కూడా కొన్ని పాత్రలతో బాగా కనెక్ట్ అయ్యాను.

  •  మీరు ఒకేసారి ఒక పుస్తకమే చదువుతారా లేక అనేక పుస్తకాలను సమాంతరంగా చదువుతారా?

కీర్తన: నేను ఒకేసారి నాలుగైదు పుస్తకాలు చదువుతుంటాను. అలా చేయడం నాకు ఇబ్బందిగా అనిపించదు. ఉదాహరణకు, ఒకే సమయంలో ఒక నవల, ఒక కథల సంపుటి, మరో పుస్తకం చదువుతున్నా కూడా, ఆయా కథలను, పాత్రలను సమాంతరంగా ఊహించుకోగలుగుతాను. అది ఒక విభిన్నమైన అనుభూతినిస్తుంది. మూడు వేర్వేరు ప్రపంచాల్లో ఒకేసారి విహరిస్తున్నట్లుంటుంది.

  •  ఒకవేళ మిమ్మల్ని ఎవరూ లేని ఒక దీవికి పంపించి, మీతో పాటు కేవలం మూడు పుస్తకాలు మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతిస్తే, ఏ పుస్తకాలను ఎంచుకుంటారు? ఎందుకు?

కీర్తన: మూడు పుస్తకాలు అంటే కొంచెం కష్టమే (నవ్వుతూ). కానీ, తప్పనిసరిగా ఎంచుకోవాలంటే… మొదటిది, “కీర్తి కిరీటాలు”. అందులోని కొన్ని భాగాలు నాకు చాలా నచ్చాయి, వాటిని మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. రెండవది, “లెటర్స్ టు లవ్”. ఈ పుస్తకం నాకు చాలా ఇష్టం, ఇప్పటికే చాలాసార్లు చదివాను. ఇక మూడవ పుస్తకం విషయానికొస్తే, డాన్ బ్రౌన్ రాసిన “డిజిటల్ ఫోర్ట్రెస్”. అది మొదటిసారి చదివినప్పుడు చాలా ఉత్కంఠగా, వేగంగా చదివేశాను. మళ్ళీ ప్రశాంతంగా చదవాలని ఉంది. సాఫ్ట్‌వేర్ నేపథ్యం ఉండటం వల్ల కూడా కొంచెం ఆసక్తిగా అనిపించింది.

  •  ప్రస్తుతం మీ ‘చదవాల్సిన పుస్తకాల’ జాబితాలో ఎన్ని పుస్తకాలున్నాయి? తెలుగు పుస్తకాలు ఏ మేరకు చదువుతున్నారు?

కీర్తన: మొన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో దాదాపు ఓ 20-30 పుస్తకాలు కొన్నాను. అవన్నీ ఇంకా పూర్తి చేయాలి. ఎక్కువగా తెలుగు పుస్తకాలే ఉన్నాయి. తెలుగులో మరిన్ని జానర్లు (genres) చదవాలని ఉంది.

  •  తెలుగు పుస్తకాలు చదవడం మీ రచనా నైపుణ్యానికి ఎలా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు? తెలుగు మరియు ఇంగ్లీష్ సాహిత్యాల మధ్య మీరు గమనించిన ప్రధాన తేడాలు ఏమిటి?

కీర్తన: తెలుగులో చదవడం ఖచ్చితంగా నా రచనకు ఉపయోగపడుతుంది. మన తెలుగులో ఎంతోమంది రచయితలు ఎన్నో శైలుల్లో రాస్తున్నారు. అవన్నీ చదవడం వల్ల, నేను ఎలా రాయాలనుకుంటున్నానో ఒక స్పష్టత వస్తుంది. ఇతరుల రచనల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.

ఇక తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యాల మధ్య తేడాలంటారా… ఇంగ్లీష్ పుస్తకాల్లో నాకు వర్ణనలు, వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించే తీరు బాగా నచ్చుతుంది. వాళ్ళు పాత్రల చుట్టూ ఉన్న పరిసరాలను, చిన్న చిన్న వివరాలను కూడా చాలా స్పష్టంగా వర్ణిస్తారు, అది మనల్ని కథలోకి మరింత లీనమయ్యేలా చేస్తుంది. తెలుగులో ఆ స్థాయి డీటెయిలింగ్ ఉన్న పుస్తకాలు నేను ఎక్కువగా చదవలేదేమో. అయితే, తెలుగు మన మాతృభాష కావడం వల్ల, పాత్రల భావోద్వేగాలకు, సంభాషణలకు మనం చాలా త్వరగా, బలంగా కనెక్ట్ అవుతాం. ఆ ఎమోషనల్ కనెక్షన్ తెలుగు రచనల్లో మరింత ప్రభావవంతంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇంగ్లీష్ కథనాల్లో ఒకే తరహా కథాంశాలు ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంటుంది తెలుగులో చాల కొత్త కొత్త కథాంశాలు కనిపిస్తున్నాయి నాకు. 

  •  మీరు ఇప్పటివరకు చదివిన పుస్తకాలలో, మీకు బాగా నచ్చిన కొందరు రచయితలు, వారి పుస్తకాలు (తెలుగు మరియు ఇంగ్లీష్)?

కీర్తన:

  • తెలుగులో:
    • కడలి సత్యనారాయణ గారు – “లెటర్స్ టు లవ్”
    • మల్లికార్జున్ గారు – “నల్లగొండ కథలు”
    • “కీర్తి కిరీటాలు” పుస్తకం కూడా చాలా నచ్చింది.
    • కవనమాలి గారు రాసిన – “వైతరణి నది ఒడ్డున” అని ఒక కథల సంపుటి, అది ఒకే సిట్టింగ్‌లో చదివేశాను, కథలంటే ఇలా ఉండాలి, ఇలానే రాయాలి అనిపించింది అనిపించింది.
  • ఇంగ్లీష్‌లో:
    • ఖలీద్ హుస్సేనీ – “అండ్ ది మౌంటైన్స్ ఎకోడ్” (And the Mountains Echoed). ఇది ఆఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో సాగే కథ, చాలా భావోద్వేగభరితంగా ఉంటుంది, నన్ను బాగా కదిలించింది.
  •  కొత్తగా తెలుగు పుస్తకాలు చదవడం ప్రారంభించే వారికి మీరిచ్చే సలహా ఏమిటి?

కీర్తన: నా సలహా ఒక్కటే- మీకోసం చదవండి. వేరేవాళ్లకు చూపించుకోవాలనో, గొప్పగా చెప్పుకోవాలనో చదవకండి. అలా చదివితే ప్రయోజనం ఉండదు. తెలుగు పుస్తకాలు చదవడం ఇష్టం లేకపోతే తప్పులేదు, అలాగే కేవలం ఇంగ్లీష్ పుస్తకాలే చదివినా ఫర్వాలేదు. బలవంతంగా, ఎవరో ఏదో అనుకుంటారనో తెలుగు పుస్తకాలు చదవొద్దు. మీకు నచ్చితేనే చదవండి, అప్పుడే ఆ ప్రయాణాన్ని ఆస్వాదించగలుగుతారు.

  •  మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి, మీ పఠనానుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

కీర్తన: ధన్యవాదాలు.

error: Content is protected !!